విశ్వ పుత్రిక తోరూ దత్ -2
ఎమిలీ బ్రాంటి కవిత్వం ,తొరూ కవిత్వం చదువుతుంటే మనలో రకరకాల అంచనాలు మొదలౌతాయి .ఆవూహలు తీర్మానాలు మనల్ని నిలవనివ్వవు కదిల్చి వేస్తాయి .బిరాన్జర్ రాసిన ‘’నా వ్యాపకం ‘’కవితను ఈమె అనువదించింది .నిజంగా అలాటిటి కవిత్వం రాసే సామర్ధ్యం తొరూ కు ఉంది –‘’అన్నిటా అతి తక్కువగా నిరసి౦పబడినదాన్ని –ఈ పెదాలనుండీ చీల్చుకోస్తున్న రోదన –దురంత పరితాపం వల్లనే బయట పడుతుంది –దీనికి ఉపశమనంగా భగవంతుడు చెబుతున్నాడు –‘’పాడు పిచ్చి తల్లీ !పరవశించిపాడు ‘’.బాధా, బుద్ధికి అందని దురదృష్టం చిక్కటి చీకటిలా ఆమె వెంట బడ్డాయి .కవికూడా తన ఆత్మీయతా ముద్ర చేత తనవైపుకు ఆకర్షించు కొంటూనే ఉంటాడు ‘’.
అద్భుతవ్యక్తి తోరూ ఎన్నో భాషల్ని వశం చేసుకొన్నది .మూడు భాషలపై మాస్టరీ సాధించి వాటిలోనే రచనలు చేసి సామర్ధ్యం నిరూపించింది .పదినెలలలో సంస్కృతం నేర్చి ,దాని అనువాదాలుకూడా చేసింది .ఒక స్నేహితురాలికి రాసిన ఉత్తరం లో భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని మధించాలని ఉందని రాసింది –‘’గొప్ప పేరు ప్రతిష్ట పొందిన రామాయణ భారతాలను వాటి మూల భాషలోనే చదవాలని ఉంది .మళ్ళీ కేంబ్రిడ్జ్ వెళ్ళే లోపు సంస్కృతాన్ని మదిస్తాను .అక్కడికి రావాలని యెంత తపన పడుతున్నానో తెలుసా నీకు ‘?అని రాసింది .బెంగాలీ బాగా మాట్లాడినా అందులో రాయటం పట్టుబడ లేదు ఆమెకు .1975డిసెంబర్ లో సంస్కృతం అధ్యయనం మొదలుపెట్టి 1976కల్లా అందర్నీ ఆశ్చర్యపోయేట్లు నేర్చింది .స్నేహితురాలు మేరీకి ఉత్తరం రాస్తూ ‘’ఈ సారి ఫ్రెంచ్ సాహిత్య క్షేత్రం నుంచి గాక ,సంస్కృత క్షేత్రం నుంచి పెద్ద ధాన్యపు పనను కూడా బెడతాను ఇప్పటికే రెండు మూడు కంకుల్ని చేరవేశాను ‘’అన్నది . ఆమె రాసిన ‘’హిందూ దేశపు గేయ గాథలు ,,పురాణకధలు ‘’పుస్తకం ఆమె చనిపోయాక1878లో అచ్చయింది .ఇప్పటికి ఆమె ఫ్రెంచ్ ఆంగ్ల సాహిత్య మోజును వదిలేసి హిందూ దేశ సాహిత్యం పై గొప్పగా మనసు పడ్డది .ఆమె రాసిన గేయగాథలలో ఉన్నదంతా భారత దేశానికి సంబంధించిన విషయాలే .ఆమె రాసిన సావిత్రి ,ప్రహ్లాద లలో ఆసియా ఖండ ఆత్మ యొక్క అంతర్ దృష్టిని చూపించింది .అంతబాగా ఏ నవీన ప్రాచ్య వాదీ ఆవిష్కరించ లేకపోయాడు.ఆమె అనువదించిన ‘’జోగాఢ్య ఉమ’’కూడా కల్పనతో ఉన్న కవితా శిల్ప ఖండమే .ఇవి ఆమె ఆన౦దబాష్పాలు రాలుస్తూ పదేపదేపాడుకొనే పదాలే ..మన సంస్కృతి పయనించే అద్భుత పధం లో తోరూ ఒక మైలు రాయి .
ఫ్రెంచ్ ఇంగ్లీష్ లలో ఆమె గుణజ్ఞురాలు రసజ్ఞురాలు .కానీ వ్యక్తిత్వం ఆలోచన ఊహల్లో మాత్రం నూటికి నూరుపాళ్ళు హైందవ స్త్రీ .ఇండియాతర్వాత ఫ్రాన్స్ ను అభిమాని౦చినా ఇంగ్లాండ్ లో స్థిరపడి పోయింది .కారణం హిందూ స్త్రీలకంటే ఆంగ్ల స్త్రీలకు స్వేచ్చ ఎక్కువ అని భావించి ఉండచ్చు.19వ శతాబ్ది మధ్యలో చాలామంది బెంగాలీ స్త్రీలు తెరచాటుగానే ఉండేవారు .ఆమె ఇతర దేశాలలో ఉన్నప్పుడు ఇండియాలో ఎక్కువ ఆంక్షలు చూసింది .అందుకే అంతర్జాతీయ పరిధిలో హైందవ తత్త్వం తో కూడిన క్రైస్తవాన్ని ఇష్టపడి అనుసరించింది .కానీ శివుడు విష్ణువు ఆమె పై గొప్ప ప్రభావం కలిగించారు .అందుకే పురాణాలవైపుకు మనసు మళ్ళింది .దేవీదేవులు నాయికా నాయకులు ఆమెకు ఎంతగానో ఇష్టం .ఆమె అభిమాని గాసే ‘’తోరూ కవితలు వేదాల గాంభీర్యం నింపుకొని సరళంగా శోభిల్లాయి .అపత్వం నీచత్వం వాటిలో లేనేలేవు ‘’అన్నాడు .
‘’బెంగాల్ ఆడపడుచు తోరూ ప్రపంచం నుంచి అబ్బురాన్నీ అభినందనల్ని అందుకొన్న వప్రసాదిని .జాతీ సంప్రదాయం వలన హిందువు ,విద్యవలన ఆంగ్ల వనిత .18ఏళ్ళవయసులోఆంగ్ల ఫ్రెంచ్ కవులను లోతుగా అధ్యయనం చేసి ఇండియన్ లకు చక్కగా పరిచయం చేసింది .తనలో ఆమూడు దేశాలతత్వాలు సంప్రదాయాలు మిళితం చేసుకొన్నది .తనపా౦డిత్యం విరగ బూసె సమయం లో ,ప్రతిభ పరిపూర్ణ మయే వయసులో ఇరవై ఏళ్ళకే తొరూ దత్ లోకాన్ని విడిచి వెళ్లి పోయింది .ప్రపంచ సాహిత్యం లో తోరూలాంటి వ్యక్తి లేనేలేరు .ఆమెకు ఆమె సాటి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-22-ఉయ్యూరు