విశ్వ పుత్రిక తోరూ దత్-7
ఫ్రాన్స్ లో తోరూ
గోవిన్ చందర్ కుటుంబం ముందు మార్సేల్స్ చేరి అక్కడి నుంచి నైస్ కు వెళ్ళింది .1870 వసంతం దాక అక్కడే ఉండి,స్కూల్ లో తొరూ ఆరూ చేరి ఫ్రెంచ్ చదివారు .కొన్ని నెలలతర్వాత తండ్రి ఇంటివద్దనే ష్వేయర్ అనే టీచర్ తో చదువు చెప్పించాడు .అప్పుడే ఫ్రెంచ్ సాహిత్యపు లోతులు తరచారు అక్క చెల్లెళ్ళు .అప్పటి అ సాహిత్యం లో స్వాతంత్ర్య కాంక్ష ప్రముఖంగా ఉండేది .జార్జి సాన్డ్స్ నవలలో స్త్రీస్వాతంత్ర్యం కూడా ఉంది .తోరూకు ఫ్రాన్స్ పై అభిమానం పెరిగిపోయింది .’’ఎవరూ మార్చలేని ,అధికారం చెలాయించ లేని ఫ్రెంచ్ మహిళ ను నేను ‘’అని రాసుకొన్నది .
నైస్ లో ఈ కుటుంబం హెలేవిటి హోటల్ లో ఉండేది .ఇక్కడి నుంచి కలకత్తాలోని బంధువు అరుణ్ చందర్ కు ఉత్తరాలు రాసేది తోరూ.లెంట్ సమయంలో కాధలిక్కులు కలివిడిగా పెద్దమనిషి తరహాగా ఉంటారని రాసింది .ఒకరోజు కుటుంబ మంతా సంతకు బయల్దేరారు .తలిదండ్రులు ఒక డొక్కు బండీ ఎక్కితే ఆడపిల్లలిద్దరూ మిస్టర్ ఇలియట్ తో వెళ్ళారు .ఇతడు మిసెస్ బార్టన్ తమ్ముడు .ఒక డాబా ఎక్కి కుర్చీలపై నుంచుని సంతా అంతా చూశారు ..ఒక డాక్టర్ భార్య వీరి కుటుంబానికి సన్నిహితంగా ఉండేది .ఆమె పిల్లలిద్దర్నీ ఫ్రెంచ్ లోనే మాట్లాడమని హితవు చెప్పేది .తప్పులు మాట్లాడినా ప్రోత్సహించేది .
ఆకాలం లో ఇంగ్లాండ్ కంటే ఫ్రాన్స్ కు పేరు ప్రతిష్టలు ఎక్కువ .ఫ్రెంచ్ బాలికలు అధునాతన బెంగాలీ బాలికలకంటే మెరుగ్గా ఉండటం తోరూను ఆకర్షించింది .తన నవలలో ఒకదానిలో అలాంటి ఫ్రెంచ్ బాలిక ను మార్గరెట్ పేరుతొ చక్కగా చిత్రించింది .జేమ్స్ డామేష్టర్ ఫ్రెంచ్ సాహిత్యం లో తోరూకున్న అద్భుత పరిచయానికి అబ్బురపడ్డాడు .నైస్ లో దత్తు కుటుంబం ‘’ప్రోమెనేడ్ డెస్ యా౦ గ్లాయిస్ ‘’లో నివసించింది .అక్కడి బహు వర్ణమిశ్రమంగా ఉన్న మేడిటరేనియన్ దృశ్యానికి ముగ్దురాలైంది .ద్రాక్ష తీగలు ,పళ్ళ తోటలు , నీలి సముద్రం లను చూసి అక్క చెల్లెళ్ళలో కవితాత్మ మేలుకొన్నది .కాన్స్ నుంచి మొనాకో కు చేసిన ప్రయాణం తన్మయులను చేసింది .అక్కడి జీవన మాధుర్యానికి చలించిపోయారు .దక్షిణ ఫ్రాన్స్ లో ఉన్న ఈ చల్లని వాతావరణం ఆరూ కు పడలేదు .కనుక అక్కడి నుంచి వెళ్లి పోవాలనుకొన్నారు .ఇంగ్లాండ్ లో ఉంటె ఆరూ ఆరోగ్యం బాగు పడుతు౦దనుకొన్నాడుతండ్రి .కానీ అక్కడ చలీతేమా ఎక్కువ అన్న సంగతి ఆలోచి౦చినట్లు లేదు .1870లో శ్రీమతి బార్డాన్ తో సహా ఇంగ్లాండ్ చేరారు .’’వాళ్లకు కళ చరిత్ర బాగా తెలుసు .అది వాళ్ళనాన్న గారి కృషే .ఒకసారి కానన్ చైల్దర్ హౌస్ కు వీళ్ళను తీసుకు వెళ్లి అక్కడ కంచుతో చేసిన చనిపోతున్న మల్లుడి విగ్రహం చూపించి ఎవరిదీ అని అడిగ్తే ఆరూ తొరూ లిద్దరూ చటుక్కున సమాధానం చెప్పి నన్ను ఆశ్చర్యం లో ముంచేశారు వాళ్ళు రోమ్ ను చూడకపోయినా.పుస్తకాలద్వారా గ్రహించారన్నమాట .ఫ్రాన్స్ కష్టదశలో ఉన్నప్పుడు మా దేశం పై తొరూ ప్రేమ వర్షించింది ‘’‘’అని రాసింది బార్డాన్ .14ఏళ్లవయసులో తోరూ కు బిస్మార్క్ రాజకీయం పట్ల అయిష్టత ఉండేది .యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆమె మనస్సంతా ఫ్రాన్స్ క్షేమం మీదే ఉండేది .1851లో ఫ్రాన్స్ శాసన సభలో విక్టర్ హ్యూగో చేసిన ప్రసంగాన్ని ‘’సమకాలీన చరిత్రలో ఒకరంగం ‘’పేరుతొ తోరూఅనువదించి బెంగాల్ పత్రికకు పంపితే ప్రచురితమైంది .ఫ్రెంచ్ రాజ్యాంగం లో కొన్ని మార్పులు కావాలని కొందరు అంటే హ్యూగో ‘’అలా చేస్తే నెపోలియన్ ఫ్రాన్స్ కు రాజుగా చేసి అమితమైన అధికారాన్ని కట్ట బెట్టి నట్లే ‘’అని ధైర్యంగా వ్యతిరేకించిన ప్రజాస్వామ్యవాది .తొరూ దీన్ని బాగా బలపరచింది .మిస్టర్ ధియర్ ఉపన్యాసాన్నికూడా అనువదించి బెంగాలీ మేగజైన్ కు పంపగా ప్రచురితమైంది .1870లో ఫ్రాన్స్ ప్రష్యా పై యుద్ధ ప్రకటన చేయటాన్ని ఆయన ఖండించాడు .ఒక చిన్న బాలిక ఇంతగా రాజకీయంగా పరిణత బుద్ధి చూపటం అమితాశ్చర్యకరం .ఆమె తనను ఫ్రెంచ్ బాలికగా మలచుకున్నది .
1871జనవరి సంచికలో తనకు ఫ్రెంచ్ దేశమంటే ఎంత గౌరవమో వెల్లడించింది తొరూ .ఆమె ఫ్రెంచ్ దేశభక్తుడికియేమాత్రం తీసి పోదు ..’’మేము పారిస్ లో ఉన్నది కొద్దికాలమే అయినా అదెంత అందమైన ప్రదేశం ,అవేమి వీధులు ,,అదెంత సేన .కానీ ఇప్పుడు ఎంతగానో పతనమై పోయింది.నగరాలన్నిటికి తలమానికమే అయినా ,ఇప్పుడు దాని నిండా దుఖం పొంగి ప్రవహిస్తోంది ‘’అని బాధపడింది.ఫ్రాన్స్ పతనానికి నాస్తికతే కారణం అనీ అందుకే దేవుడు దాన్ని శపించాడని భావించింది –‘’ఎంత పతనం చెందావ్ ఫ్రాన్స్ !ఇంత అవమానం భరించాక ఇక నువ్వు తప్పని సరిగా భగవంతుని పూజించి సేవించు .నీ కోసం నా గుండె ఎలా ముక్కలై పోతోందా తెలుసా ??అని వాపోయింది చిన్నారి తొరూ .15ఏళ్ళ వయసులో ఆమె రాసిన కవితలో ఆమె కున్న పరిపక్వత కనిపిస్తుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-6-22-ఉయ్యూరు