విశ్వ పుత్రిక తోరూ దత్-11(చివరి భాగం )
ఇరవై ఏళ్ళు
ఇంగ్లాండ్ యువరాజు రావటం వెళ్ళటం జరిగాక కలకత్తా నిస్తబ్ద౦గా ఉంది .తోరూ ఆయన్ను చాలాదగ్గరగా చూసి అందగాడు నీలికన్నుల వాడు తెలుపు బట్టతలా అని మేరీకి జాబు రాసింది .ఆయన్ను చూడటానికి కాశ్మీర్ రాజు 40లక్షల తలపాగాతో వచ్చి ,101కాశ్మీర్ శాలువలు ,నవరత్నాలు పొదిగిన బంగారు హుక్కా ,బంగారపు భోజన సామాను బహుమతులుగా ఇచ్చాడు.బాబూ జగదానంద ముఖర్జీ యువరాజును తన ఇంటికి ఆహ్వానించి,ఆడవాళ్ళను పరిచయం చేసి మర్యాద చేశాడు .ఇది జనం లో సంచలనం కలిగించింది .స్త్రీలను పరిచయం చేస్తానంటేనే వచ్చాడు యువరాజు .దీన్ని సభ్యసమాజం తప్పు పట్టి దీనిపై వ్యతిరేకంగా నాటకాలు రాసి ప్రదర్శించారు .దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది .తోరూ పుస్తకముద్రణ దాదాపు పూర్తయింది .
మిల్లె క్లారిస్ బాదర్ అనే ఫ్రెంచ్ మహిళ భారతీయ వీర వనితలపై రాసిన పుస్తకం తోరూను బాగా ఆకర్షించింది .దీన్ని అనువదించటానికి ఆమెనుంచి పర్మిషన్ తెప్పించుకున్నది .బాదర్ కు ఉత్తరం రాస్తూభారత దేశం లో భర్త అసమర్దుడూ స్వార్ధ పరుడు అయినా సరే భార్య భర్తకు సర్వ సమర్పణ చేసి ఆరాధిస్తుంది ఇది ఆశ్చర్యం కదా ‘’అన్నది .మార్చి 4న తోరూకు 20ఏళ్ళు వచ్చాయి .పుట్టిన రోజు నాడే బాదర్ పంపిన పుస్తకం అందింది .మార్చి 24 నాడే ‘’షీఫ్ ‘’కూడా విడుదలైంది .అన్ని దినపత్రికలు రోజూ చదివేది .మానవత్వం ను అగౌరవపరుస్తూ పేపర్లలో వచ్చే వార్తలను ఆమె బాగా ఖండించి మేరీకి రాసేది .ఉత్తరాలలో హిందూ శబ్దానికి బదులు ‘’దేశీయ ‘’అని వాడేది .హిందూస్త్రీల భద్రతా విషయం లో ఆమెకు ఆదుర్దా ఉండేది .ఆనందమోహన్ బోస్ చాలా సార్లు తోరూ ను చూడటానికి వచ్చాడు .యుక్త వయసు కన్యల కోసం తాను నడిపే స్కూల్ వ్యవహారాలు చూడమని తోరూ ను కోరేవాడు .ఇండియాలో ఉంటె తోరూ స్త్రీ విద్యా వ్యాప్తికి చాలా తోడ్పడుతుందని ఆయన బాగా విశ్వసించాడు .
తొరూ రోజులు దగ్గర పడుతున్నాయి .ఆమెను పాడనివ్వటం లేదు .ఆంక్షలు భరించలేక ‘’నన్నుఒక గాజు పెట్టెలో పెట్టండి ‘’అని విసుక్కునేది .హ్యూగో నవలలు ఫ్రెంచ్ కవితలు అనువదిస్తూనే ఉంది .’’షీఫ్ ‘’పుస్తకం జోరుగా అమ్ముడయి మంచి ఉత్సాహం తెచ్చింది .ఆమె కవితలు కొన్ని ‘’కలకత్తా రివ్యు ‘’పత్రికలో ప్రచురించటానికి తీసుకొని తండ్రికీ కూతురుకు గొప్ప జోష్ ఇచ్చింది .బెంగాల్ పత్రిక ఆమెను రచనలు పంపమని ఎప్పుడూ కోరేది .సోలరి, సెంట్ చాన్ ,గామెటి ది గ్రామెంట్,ఆగస్ట్ వాక్వేరి ధియో షెల్ గెటే,వాల్టర్ ,మార్నేర్ ,,విక్టర్ హ్యూగో రచనలు అనువదించి పంపేది .
1876డిసెంబర్ నాటికీ తోరూ తీవ్రంగా జబ్బు పడింది .ఇంటి డాక్టర్ ఊరు వెళ్ళటం తో వైద్య కళాశాల డాక్టర్ స్మిత్ వచ్చి చూసి మందులిచ్చేవాడు .కళ్ళలో నుంచి రక్తం కారేది. ఏమందులవలన ఇది తగ్గలేదు .డిజిటాలిసిస్ కూడా ప్రభావం చూపలేదు .ఒకసారి డాక్టర్ స్మిత్ విజిట్ కు వచ్చినప్పుడు ఆమె పక్కనే ఉన్న ‘’షీఫ్ ‘’పుస్తకం చూసి ఆమె రాసిందే అని అడిగి తెలుసుకొని ఆమెపై మరీ శ్రద్ధతో వైద్యం చేశాడు .
విశ్వం నుంచి విశ్వ పుత్రిక నిష్క్రమణం
క్లారిసే బాదర్ కు తోరూకు గాఢ స్నేహమేర్పడింది. క్లారిసే రాసిన పుస్తకాన్ని అనువదించటానికి పర్మిషన్ ఇమ్మని కోరగా ఆమె ‘’నేను రాసి గంగాతీర ప్రాచీనార్యులకు అంకితమిచ్చిన పుస్తకాన్ని అనువాదం చేయాలనుకొంటున్నది నేను మెచ్చే హైందవ నాయికల వారాసు రాలు కాబోలు ‘’అని సంతోషంగా అనుమతించింది క్లారేస్ .1877ఏప్రిల్ లో తోరూ జబ్బు బాగా ఎక్కువైపోయింది .ఈవిషయాన్ని మేరీకి ఉత్తరంలో తెలియజేసి ఆమెఫోటో పంపమని,ఇక యూరప్ రాలేము అని తెలియజేసింది .మేరీ బాధ పడుతూ జవాబు రాసి,ఫోటో పంపింది .జులై 3న యేవో మూడు లైన్లు తప్ప రాయలేకపోయింది .ఆగస్ట్ 30న తోరూ మరణించినట్లు తండ్రి మేరీకిఉత్తర౦ లో తెలిపాడు .చివరిదాకా హ్యూగో రచనలను అత్యాసక్తిగా చదివింది .ప్రాణప్రదంగా చూసుకొన్ని కొడుకు ,ఇద్దరు కూతుళ్ళు తమ కళ్ళ ముందే చనిపోవటం ఆ తలిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు .
షీఫ్ బాగా ఆకర్షించింది సాహిత్య ప్రియులను –అందులో –‘’నువ్వు నిజంగానే పునర్జీవిస్తావు –నీ ఆశ నికరమైనది ‘’అన్నపంక్తులు చదివి చలించని వారులేరు –‘’సుందరమైన వదనం మీద –మందహాసం కరగిపోయినట్లే –అంతరించింది –నీ మీద నాకున్న ప్రేమ –నిన్ను విస్మృతికి తెచ్చే –శాపాలనుండి కాపాడుతుంది ‘’అన్నకవితను ఇ.జె.ధాంసన్ బాగా మెచ్చాడు .21ఏళ్ళకే విశ్వ పుత్రిక తోరూ దత్ ఈ విశ్వం నుంచి నిష్క్రమించింది .
ఆధారం –పద్మిని సేన్ గుప్తా రచనకు ఆచార్య నాయని కృష్ణకుమారి అనువాద పుస్తకం ‘’తోరూ దత్’’.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-6-22-ఉయ్యూరు