శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన హరిహర నాథ శతకం -1
పశ్చిమ గోదావరిజిల్లా భీమడోలు మండలం దొరసాని పాడు గ్రామానికి చెందిన టీచరు ,కవి మహమ్మద్ హుస్సేన్ గారు హరిహర నాథ శతకం రచించి ,1959లో ప్రచురించారు .ఈశతకానికి ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు అభిప్రాయం రాస్తూ ‘’ఎలిమెంటరి స్కూల్ మాస్టర్ అయిన మహమ్మద్ హుస్సేన్ నాకు 20ఏళ్ళ నుంచి పరిచయం ..శిష్యప్రాయుడు .గర్వం లేని సజ్జనుడు .మతసహనమున్నవాడు .ఈ శతకం లో కవిత్వం సరళం ధారాళం,మనోహరం .చక్కని కల్పనలతో భక్తి రస ప్రవాహంగా రాశాడు .ఇప్పటికే 15పుస్తకాలు రచించిన సామర్ధ్యం ఉన్నవాడు .చదివి ఆదరించి ప్రోత్సహించమని కోరుతున్నాను ‘’అన్నారు .
భీమడోలు BDO శ్రీ బాలకృష్ణ ‘’ఈ కవి నాకు చాలాకాలంగా పరిచయమున్నవాడు .ఈ శతకం మధుర మంజులంగా రాశారు .కందాన్ని అందంగా నడిపించిన నేర్పున్నవారు .శతకం చదివి ఆనందంతో పులకిస్తారు అందరూ .అభ్యుదయకవిగా పేరు పొందాలి ‘అని అభిప్రాయం రాశారు .
శతకాన్ని కవిగారు వితరణశీలి విద్యాభిమాని శ్రీమతి గారపాటి హైమవతీ దేవి ఆర్ధిక సాయంతో ప్రచురించినట్లు కందపద్యాలలో కృతజ్ఞత చెప్పుకొన్నారు .’’హరిహర నాథ స్మరణ –స్ఫురణం బాధ్యాత్మిక ప్రబుద్ధ విశుద్ధం –బరయుము ,మద్రచితంబిది-హరిహరనాథ శతకము మహత్కృతి చరితా ‘’అని వినయంగా చెప్పి ‘’ఆశుకవిని గాను ,హాస్య చతురత లేదు –గర్భ బంధ చిత్ర కవిత రాదు –దేవ దేవు డిచ్చు భావభక్తి ప్రేర-ణ౦బు మామక కవనంబు డంబు’’అని విస్పష్టంగా చెప్పుకున్నాడుకవి .కవి గారి అభ్యర్ధన పై హైమవతీ దేవిగారు ‘’మీరు కవితారూపం లో మానవ కల్యాణానికి ,విజ్ఞాన దాయకంగా వికసించు మీ వాణి ద్వారా మానవ అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలుతూ మహోపకారం చేస్తున్నారు .విద్యపై నాకున్న అభిమానం తో 116రూపాయలు మీకు అందిస్తునాను. గ్రహించి శతక ముద్రణకు ఉపయోగించండి ‘’అని రాశారు .అనన్య వదాన్య శేఖరులు ,కేవల కీర్తి వాంఛా పరులు ఉదార మనస్సంపన్నులు గుండుగొలను వాసి శ్రీ మావులేటి సోమరాజు గారిని కీర్తిస్తూ కవి రెండు పద్యాలు రాసి ‘’కృతులు శాశ్వత బుధనుత కీర్తి నిధులు –బళిర మిము నుతింప నేపాటి వాడను ‘అని వినయం ప్రకటించారు కవి .
ఆకాంక్ష లో హుసేన్ జీ ‘’సార్దీకృత జన్ముడుగా నర్ధింటు ననుగ్రహింప హరిహరనాధా ‘’,’’వెలి చూపును ,లోజూపును –వెలివోని సుధీ బలమ్ము విలసి౦చు సము –జ్జ్వల ఫాలజ్యోతిని నా –నకలవడ ,నిలబడ నొనర్పు హరిహరనాథా ‘’ .హరిహరనాథా మకుటంతో ఉన్న ఇది కందాల శతకం ‘ఇందులోని అందాలు తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-6-22-ఉయ్యూరు