శ్రీ మతి కోనేరు కల్పన ‘’ఒకటి తక్కువ పదారు వన్నెలతో ‘’ చిన్నెలతో వినిపించిన తెలుగింటి’’ గుండె చప్పుళ్ళు ‘’
శ్రీమతి కోనేరు కల్పన గారితో సుమారుపాతికేళ్ళకు పైగాసాహితీ అనుబంధం ఉంది .సరసభారతి ఆస్థానకవులలొ ఆమె కూడా ఒక మాణిక్యం .నిన్న నా సహస్ర చంద్ర మాసోత్సవానికి కుమారుడు, మనవడు లతో కలిసి వచ్చి మా శ్రీ సువర్చలాన్జనేయస్వామిని దర్శించి మాకు పట్టు బట్టలు పెట్టి మా ఆతిధ్యం స్వీకరించి ,తాను నవంబర్ లో ప్రచురించిన ‘’గుండె చప్పుడు ‘’కథా సంపుటి అందించారు ,ముక్కు సూటి మనీషి.కథల్లో కవిత్వం లో అదే కనిపించి ఆమెకు విశిష్టను కలిగించాయి .ఆమె సాహితీ ప్రస్థానం సుదీర్ఘం .రావి( వారి )వృక్షం క్రింద ఎదిగిన కవి .బందరు సాహితీ మిత్రుల ప్రధాన కార్యదర్శి ,కోశాధికారి ,ఉపాధ్యక్షురాలు ,అందుకే ఈపుస్తకాన్ని తన మెంటార్ డా రావిరంగారావు గారికి ఆయన సాహిత్య స్వర్ణోత్సవ కానుకగా అంకితమిచ్చారు .ఇవాళ ఉదయమే ఆపుస్తకం చదివి ,నా స్పందన తెలియజేస్తున్నాను .
‘’ అన్ని పనులు సవ్యంగా జరగాలంటే కృష్ణ సారధ్యం కావాలి కానీ శల్య సారధ్యం కాదు.సాయం చేయలేక పొతే కాం గా ఉండండి .నా చేతనయినట్లు నేనే చేసుకొంటాను ‘’అని భర్త కు యాక్సిడెంట్ జరిగి ,కోలుకుంటూ ,కూతురు పెళ్లి నిశ్చయమై ,పనులతో సతమత మౌతుంటే మరిది చేతనైన సాయం చేయకుండా చీటికీ మాటికీ అడ్డువస్తూ చీకాకు కలిగిస్తూ దెప్పుతూ ఉంటె ఒక ఇంటి వదిన గారు మరిదికి పెట్టిన గడ్డి ‘’సారధ్యం ‘’కథ..దొడ్డ మనసు తో బీదా బిక్కీలకు అన్నిరకాలసాయం అందిస్తూ ఆమె పేరేవరికీ తెలియకపోయినా ‘’దొడ్డమ్మా’’అంటూ అందరి చేత పిలిపించుకునే దొడ్డమ్మ పశువులు పొలాలకు వెడుతూ పేడ వేస్తె వాటి ‘’కడి ‘’లలో గింజలను ఏరుకోవటానికి నిర్భాగ్యులు ఎదురు చూసే కరువు వచ్చి అతలాకుతలం చేస్తోంది జనాన్ని .ఆమె రోజూ ఇంటికి ఇళ్ళకు గింజలు పంపుతుంది .జీత గాళ్ళ ఇళ్ళకు ఒక పూట అన్నం పంపుతుంది. ఒక పొరుగూరి వాడు ఆమె ఆనూ పానులను ,ఆమెకు నమ్మకమైన వాడిద్వారా కూపీ లాగుతుంటే వాడికి అనుమానమొచ్చి ఆమె చెవిలో వేస్తె ,బందిపోట్లు దోచుకోవటానికి వస్తున్నారని గ్రహించి తన ఇంట్లో ఉన్న రెండు లంకె బిందెల్లో ఒక దాన్ని ఎవరికి తెలీకుండా ఒక చోట పాటించి రెండవదాన్ని తన దత్తుడి౦ట్లో పెట్టించి ,తలుపులేసుకొని అడ్డ గడియకూడా పెట్టుకొని ఇంట్లో కాపలా లేకుండానే ధైర్యంగా పడుకొన్నది దొడ్డమ్మ. ఆరాత్రే .నిశిరాత్రి నలుగురు బందిపోట్లు తలుపులు బాదుతూ తియ్యకపోతే విరగ్గొడతా మంటే తలుపులు తీయగా వాళ్ళు దౌర్జన్యంగా ప్రవేశించి లంకె బిందేలేక్కడున్నాయో చెప్పమంటే మా ఆయనతోనే మా వైభవమూ పోయింది ఆయన చేసిన అప్పులు తీర్చటానికే అవి చాలలేదు ‘’లౌక్యంగా చెప్పగా నిజం చెప్పకపోతే ‘’నీ కొడుకును చంపేస్తాం ‘’అంటే ‘’వాడు టైఫాయిడ్ తో బాధ పడుతున్నాడు చంపితే పాపం రా ‘’అని చెప్పి తన చేతులకున్న గాజులు మెడలోని ఒంటిపేట గొలుసు తీసి అక్కడ పెట్టి అవే తనదగ్గరున్నవి అనిచెప్పి తీసుకు వెళ్లమంది .వాళ్ళు ఇల్లంతా వెతికి ఏమీ దొరక్క పెరట్లోనూ తవ్వి అక్కడా శూన్యం అని తెలుసుకొని వెళ్లిపోతుంటే ‘’ఆశగా వచ్చారు ఉసూరు మంటూ వెళ్ళకండి కాస్త అన్నం మామిడిఊరగాయ ఉంది నాలుగు ముద్దలు తిని పొండి’’అన్న దొడ్డ ఇల్లాలు దొడ్డమ్మ ‘’బందిపోట్లు కథ ‘’లో దొడ్డమ్మలోని దాతృత్వం మేధావితనం కనికరం అన్ని కోణాలలోనుంచి ఆవిష్కరించిన కత ఇది .
డబ్బు ఎక్కువైతే ఒంటరితనమే వేధిస్తుంది ఎవర్నీ నమ్మలేం .శరీరసుఖాలెన్ని ఉన్నా మనసుకు సాంత్వన ఇచ్చేవాటిపైనే ఆధారపడాలి .తను భార్యా పిల్లలతో సంతృప్తిగా జీవిస్తున్నానని శివం ప్రాణ స్నేహితుడు సత్యం తో అంటే ‘’నాకు ఇవేమీ తెలీవు నా పిల్లలు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకు తున్నారు నేనుమాత్రం అనాధ ,వృద్ధాశ్రమాలు తరుగుతూ సీనియర్ సిటిజెన్స్ పెన్షనర్స్ తో గడుపుతూ ఖానం తీరిక లేకుండా ఉన్నాను .వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళు సుఖపడుతుంటే చూసి ఆనందిస్తున్నాను .ఇదే నాడ్యూటీ గా భావిస్తాను .ఆనందంగా ఉన్నానా లేనా అనే ఆలోచనే నాకు రాదు ‘’అ౦టాడుసత్యం ‘’సత్యం శివంసుందరం ‘’లో .ఆప్యాయంగా ఆత్మీయంగా ఆతిధ్యమిచ్చి అన్నం పెడితే అది చింతకాయ పచ్చడితోనైనా పచ్చి పులుసుతోనైనా ‘’అమృతోపమానం గా ఉంటుందని చెప్పిన కథ ‘’కొత్తాకు బుట్ట ‘’.ఇంతకూ కొత్తాకు బుట్ట అంటే ఏమిటి ?పనసాకుల్ని మడిచి చిన్న చిన్న బుట్టలుగా కుట్టటం.వీటిలో ఇడ్లీ పిండి వేసి ఆవిరిమీద ఉడికిస్తే రుచి అదుర్స్ .అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ‘’అవుట్ స్టాండింగ్ ఉద్యోగాలు ‘’అని చక్కగా విశ్లేషించి చెప్పిదే ‘’’నేనూ మనిషినే ‘’.చిత్తజల్లు లో ఒక గౌరవ నీయ వంశానికి తాను వారసుడిని ఇవ్వ బోతున్నానని ఆ ఇల్లాలు వసంత ఆనంద పడింది .ఇంటికోచిన భర్తకు తనకు ఆరవనెల ,ఆనందంతో గంతులేయకుండా తనకు పిల్లలు ఇష్టం లేదని అబార్షన్ చేయించుకోమని సీరియస్ గాభర్త వెంకట్ చెబితే షాకై ఏమి చేయాలో తోచకుండా ఉంటె సాయంత్రం డాక్టర్ దగ్గరకు తీసుకు వెడితే ఆస్థితిలో అబార్షన్ డేంజర్ అని,తనకు ఆమె మాత్రమె కావాలని మళ్ళీ భర్త అని .ఆమెను పట్టించుకోకుండా ఉంటె ,ఆమెలోస్త్రీత్వం మాతృత్వం భర్తపై అనురాగం త్రివేణీ సంగమ౦గా ఉద్ద్రుతమై పొంగుతుంటే తట్టుకోలేక పోతోంది .పుట్టిన బిడ్డను మాయకుండలో కుక్కుతుంటే ప్రక్కనున్న రాజేశ్వరి రాగా కంగారుపడి బిడ్డ చచ్చిపోయిందని చెప్పగా ఆమె అన్నీ శుభ్రం చేసి ఆమెను పడుకోబెట్టింది .సాయంత్రం వెంకట్ రాగా విషయం చెప్పింది రాజేశ్వరి .డాక్టర్ కు చూపించి మందులిప్పిస్తున్నాడు .ఇల్లుకట్టి రిజిస్ట్రెషన్లో భార్యపేరు చిత్తజల్లు వసంతమ అని ని రాయి౦చగా చూసి ఆశ్చర్యపోయి ,తనను ఇంకా వెలయాలుగానే చూస్తున్నాడని అనుకుని ,తనకడుపున పుట్టిన బిడ్డను తన వారసునిగా అంగీకరిస్తేనే కదా తనకు గౌరవం అని భావించింది .అతడు పిల్లాడిని ముద్దాటటం చూసి విస్తు పోయింది .కుర్రాడు ఒక రోజు అతడిని ‘’పాండురాజు చనిపోతే ధర్మాత్ముడు విదురుడు రాజవ్వాలి కదా ధృత రాష్ట్రుడు ఎలాయ్యాడు ?అని అడుగుంటే విన్నది వసంత .అతడు ‘’విదురుడు దాసీ పుత్రుడు .అందుకే రాజు కాలేదు ‘’అన్నాడు .వసంతకు భ్రమల మబ్బులు వీడాయి ‘’వాళ్ళు బీజం వేసిన వారికి కానీ ,క్షేత్రానికి కానీ వారసులు కాదు .ఆక్షేత్రాల స్వంతదారునికి వారసులయ్యారు ‘’అంటూ భర్త కళ్ళలోకి తీక్షణంగా అర్ధవంతంగా చూసింది .అతనికి అర్ధం కాకపోయినా ఆ చూపు అతని గుండెలో బాకులా గుచ్చుకొన్నది .మళ్ళీ ‘’వాళ్ళు బీజం వేసిన వ్యాసమహర్షి సంతానంగా పెరగలేదు .క్షేత్రాలయిన క్షత్రియ స్త్రీల వారసులుగానూ పెరగలేదు .ఆ క్షేత్రాల స్వంత దారులైన వారి వంశం పేరున పెరిగారు. దాసీ అయిన విదురుడి తల్లిని వాళ్ళెవరూ పెళ్లి చేసుకోలేదు .కనుక అతడు వీళ్ళ వారసుడు కాలేదు కనుక ఇప్పుడు చెప్పండి .నేనిప్పుడు ఎవరి సొంతం ?నాకు పుట్టిన పిల్లలు ఎవరికీ వారసులు ??’అనగానే వెంకట్ తలది౦చు కొన్నాడు .ఇది ధర్మ సందేహాలు లో మల్లాది వారు చెప్పే ధర్మ సూక్ష్మం లాఉంది.పరిణతి చెందిన కథ రచయిత్రి కనుక కల్పనగారు ఈ కథను ఆద్యంతం గొప్పగా రాశారు .శీర్షికా గొప్పగా పెట్టారు
ఇలాంటివి 15 కథలున్న పుస్తకమే ‘’కల్పనగారి ‘’గుండె చప్పుడు ‘’అందరి గుండెలను తాకే కథా కదంబం .తప్పక చదివి ఆనందించాల్సిన పుస్తకం .కల్పన గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-6-22-ఉయ్యూరు