శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన హరిహర నాథ శతకం -2(చివరి భాగం )
‘’శ్రీకరమై నీ నామము –ధీకరము నగణ్యపుణ్య దీప్తి కరమ్మై-లోకోత్తర శీలకర-మ్మై కావుట మమ్ము నెపుడు హరిహరనాథా ‘’అని కంద శతకం మొదలుపెట్టి మహమ్మద్ కవి .’’క౦దమ్ములు భక్తి రసా-నందంబులు ,నవ రసార్ద్ర నానాగుణమా –కందంబులువరశిల్పపు -టందంబులు స్వీకరింపు హరిహరనాథా ‘’అని ప్రార్ధించి క౦ద౦ అందంగా చెప్పారు .’’నీ కరుణ కృతార్ధ సుధా –సేకరణ ,మఖర్వ వృజిన జీమూత విశు-ష్కీకరుణ మపూర్వ ప్ర-జ్ఞా కరణ మకారణముగ’అంటూ కవితా రామణీయకంగా అన్నారు .’’కవి ‘’ముసిలి’’మ్మట వ్రాసెడి-కవనమ్ముజాను తెనుగునట కవితా ప్రభువో –భవహర హరిహర పతివట-హవణిల్లదే సుంత వింత ‘’అని మనకొచ్చే అనుమానం ఆయనకే వచ్చి సమాధానం చెప్పారు .’’ఇరు తెగల అఖిల మతుల నరిగెడి వారలకు హరిహర నాథుడు పతి అని శివ విష్ణు అద్వైతాన్ని తెలియజేశారు .క్రోధం అధముని విత్తం,బాధాకరం ,కుటిల వ్యాపారానికి సాధన కనుక ఆ వ్యాధినుంచి విముక్తి చేయమని వేడారు .
శత్రువులకంటే అంతశ్శత్రువులే పరమ డేంజర్.వీటినుంచి బయట పడేట్లు చేయి .ఇదికాదు అదికాదు అంటూ అన్నీకాదని దేన్నీ చెప్పలేకపోయాయి పరమాత్మను .నీ కరుణా పీయూషాన్నిజుర్రకపోతే వెయ్యి పుటాలు పెట్టినా అజ్ఞానం తొలగదు .’అక్కజపు నింగి రిక్కల –లెక్కను దక్కువలు సేయులే –నా దొసగుల్-ఉక్కు సెడే-బెక్కు యతనము –లక్కున గ్రక్కున గదింపు ‘’ .పూచిక పుల్లను కూడా కదల్చ లేని వాడిని –‘’నీ చెయిది విశ్వ సృజనము ‘’కనుక నీ కరుణ యాచిస్తున్నాను .ఇంగువ కట్టిన గుడ్డ వాసన అంతావ్యాపించినట్లు పూర్వజన్మ పాపాలన్నీ నావెంట వచ్చాయి దాన్ని వదిలించు .’ఏ నాటి కు సంస్కారమో ‘’అని మొదటి పంక్తి తో మూడు పద్యాలురాసి కుసంస్కారం ,ఇంద్రియ లోలత్వం ,జ్ఞానులను సాధువులను చులకన చేయటం లో కొట్టు మిట్టాడే వారిని ఉద్ధరించు అని కోరారు .అలాగే ‘’నీ యాజ్ఞామాత్రమ్మున’’తో అయిదు పద్యాలురాసి వాయువు వరుణుడు క్రమం తప్పకుండా విధి నిర్వహణ చేస్తున్నారు ,చంద్ర సూర్యులు వేడి వెలుగు ఇస్తున్నారు ,సప్త సముద్రాలు తమ ధర్మాలను నేరవేరుస్తున్నాయి ,పంచ భూతాలూ ప్రకృతి ధర్మాలను తుచ పాటిస్తున్నాయి ,నీ ఆజ్ఞ లేకుండా చీమకూడా కదలదు అని ఉపనిషత్ రహస్యాలను అందంగా కందంలో బంధించారు .’’బలవంత మెంత చేసినా భోగాలపై ఆసక్తి పోగొట్టమని ,,విషయ వాంఛలను తుదముట్టించమని ,పర ద్రవ్యాపేక్ష కూకటి వ్రేళ్ళతో కూల్చమని వేడుకొన్నారు .’’నీ కూర్మిలేకుండా మేమేమీ సాధించలేం ‘’.నీ నెనరు లేకపోతె స్నానధ్యానజపతపాలు ఫలించవు .చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు పాపకూపాల్లో పడి క్షోభిస్తున్న నాకు నువ్వే దిక్కు .’’తెలివి తక్కువ ఆకలి ఎక్కువ ‘’అనే సామెత నిజం అవటానికి నన్ను పుట్టి౦చావు –లెక్కకు మించిన ఇక్కట్లతో చతికిలపడ్డాను’’ అంటారుకవి .నీ సంకల్ప బలం కొంచెం ఉంటె చాలు సింధువు బిందువు అవుతుంది హిమాలయం వట్టి రాయి అవుతుంది .నీ యక్కటికము బోలని –మాయత్నము పురుషాహంకారమా –కాదు ప్రభూ ‘నీ వద్ద అద్దం వెలుగులు చిమ్మగలుగుతుందా ‘’అని వేదాంత రహస్యం బోధించారు .
‘’ నా మేధా వైదగ్ధ్యం –నీ ము౦గల దాప నేర్తునె?’’తల్లి పుట్టిల్లు మేనమామకు తెలీదా స్వామీ ?ఎండినమాను చిగిర్చివసంతం లో శోభించినట్లు ‘బెండు పడిఉన్ననన్ను నువ్వే అనునయించాలి .ఏదో అభిశాపం నాపై దారుణ దాహమూని- బలవత్కామోన్మాదిగ బాధిస్తోంది తరుణోపాయం నువ్వే చెప్పాలి .గోరంత గౌరవం వస్తే కొండంతగా చాటి చెప్పుకొని భీర స్వా౦త౦తో అల్పునిగా బతికే నాకు నువ్వే ఏడుగడ హరిహరా ..కొండంత దేవుడికి కొండంత పత్రి ఇచ్చుకోలేముకదాకనుక ‘’గుండియనుడుగర సేసెద –నండగ నీ నెనరు నింపు ‘అని ప్రార్ధించారు కవి .’’దేవర చిత్తం నా భాగ్యం ‘అంటూ 113 వ పద్యంతో శతకం పూర్తి చేశారు .
శతకానికి అనుబంధంగా ప్రాతస్మరణ ,నిద్రా సమయస్మరణ ,కూడా కందాలు రాసి చివరి కందాలలో ‘’పది తొమ్మిది వందల నలు –బది ఏడవ వత్సరా౦త వాసరముల స-మ్మదమున దీని రచియించితి –నదిరా క్రీస్తు శకమ౦దు హరిహరనాథా ‘’అనీ తర్వాతపద్యంలో ద్వారకా తిరుమల పుణ్య క్షేత్రానికి సమీపం లోని ‘’దొరసాని పురం ‘’లో జన్మించాననిచెప్పారు .130వ పద్యం లో ‘’దీని రచించిన నీ –సేవానిరతున్ ,గుణ గణాఢ్యు ,వరమహమ్మద్ హు –స్సేనాఖ్యు గవిత్వ పద –ధ్యానపరున్,నన్ను గావు హరిహర నాథా ‘’అని శతకం పూర్తి చేశారు కవి మహమ్మద్ హుస్సేన్ జీ .
దీనికి బోనస్ గా ‘’పంజాబ్ దురంతాలు ‘’శీర్షికతో 45 పద్యాలు రాసి ఆ దృశ్యాలను కళ్ళకు కట్టించారు .కవి గారు లోతైన పాండిత్యం ,సకల శాస్త్రాలలో గొప్ప అవగాహన ఉన్నవారు. మీదు మిక్కిలి ఆంద్ర ఆస్థానకవులు శ్రీపాద వారి ప్రియశిష్యులు .వారి వాత్సల్యామృతాన్ని పుష్కలంగా గ్రోలినవారు .ద్రాక్షాపాక౦గా ,సరళ మృదు మధుర పదజాలంతో రాసిన శతకం .హరిహరనాథునికి మరో అరుదైన కానుక ఇది .భక్తకబీర్ రామనామ పారాయణ చేసి ధన్యుడైనట్లు మహమ్మద్ హుస్సేన్ కవిగారు హరిహరనాథుని స్మరించి ధన్యులయ్యారు .వారికి ఆంధ్రలోకం కృతజ్ఞత తో కైమోడ్పు ఘటి౦చాలి .ఈ శతాకాన్ని, కవి హుసేన్ గార్ని పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగినందుకు పొంగిపోతున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-6-22-ఉయ్యూరు