గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన,అమృత బజార్ పత్రిక స్థాపకుడు , స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -1
సచ్చీంద్ర లాల్ ఘోష్ బెంగాలీ లో రాసిన దానికి శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ ‘’మోతీలాల్ ఘోష్ ‘’గా తెలుగు అనువాదం చేయగా, కేంద్ర సాహిత్య అకాడెమి1992లో పుస్తకంగా ప్రచురించింది .వెల-37 రూపాయలు .పుస్తకం ద్వితీయ ముద్రణ భాగ్యం పొందింది .
19వ శతాబ్దం మొదట్లో జాతీయోద్యమమ ,,భారతీయ జర్నలిజం జమిలిగా ఒకదాని నొకటి కాపాడుకొంటూ నడిచాయి .దేశం స్వాతంత్ర్యం పొందేదాకా ఈ రెండు జోడు గుర్రాలస్వారి చేశాయి .1757నుంచి 1910దాకా కలకత్తా నగరం బ్రిటిష్ పాలనలో పాలనా యంత్రా౦గానికి రాజధానిగా ,తూర్పు భాగాన ప్రధాన వ్యాపార కేంద్రం గా ఉంది .అందువలన జాతీయోద్యమం అక్కడే పుట్టింది .కలకత్తా ,బెంగాలీలు జాతీయోద్యమం లో అసామాన్య పాత్ర నిర్వహించారు .కలకత్తా పత్రికల సంపాదకులు భారత రాజకీయ లక్ష్యాలను ,అభిప్రాయాలను విస్తృతంగా ప్రచారం చేశారు.దాదాపు 50 ఏళ్ళ పాటు ఆ లక్ష్యాలు ,కార్యక్రమాలను రూపొందించి ,నిర్దేశించింది ఈ సంపాదకులే .దేశానికి రాజకీయ జాగృతి కలిగిన మొదటి దశలో ముగ్గురు మహానుభావులు మూడు మార్గాలలో చైతన్య రధాలను నడిపించి సారధులయ్యారు .అన్నగారైన శిశిర్ కుమార్ ఘోష్ శిష్యరికం ,తర్ఫీదు లో మోతీలాల్ ఘోష్ స్వాతంత్రోద్యమ కారుడుగా రూపొందాడు ,శాంతియుత ప్రతిఘటనకు ప్రజలను సమాయత్తం చేశాడు .బ్రిటిష్ పాలన తొలగించటానికి ,,స్వాతంత్ర్యం సాధించటానికి ,బ్రిటిష్ వలస రాజ్యమైన ఇండియా స్వీయ పాలనకోసం పోరాటం చేయటానికి సురేంద్ర నాథ బెనర్జీ పిలుపు నిచ్చాడు .అరవింద ఘోష్ సంపూర్ణ స్వరాజ్యం ప్రతిపాదించాడు .ఆ విప్లవోద్యమానికి సిద్ధాంత కర్త కూడా అయ్యాడు .దేశ రాజకీయ పోరాట మౌలిక ప్రముఖులలో అరవిందులు ఒకరు .చిన్న కుగ్రామం నుంచి వచ్చిన మోతీలాల్ ఘోష్ పై ప్రముఖ వర్గానికి చెందిన వాడు కాదు .ఆ నాటి గ్రామీణ ప్రజల సాధకబాధకాలు గ్రహించి స్వాతంత్రోద్యమం వైపు మళ్ళినవాడు .గ్రామీణ ప్రజలను కాపాడాలంటే ,విదేశీ పాలకులను తరిమి కొట్టాల్సిందే అని భావించి గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం స్వాతంత్రోద్యమం లో అడుగుపెట్టాడు .
కాలం ఆ తర్వాత మహా వేగంగా గడవటం తో ,వర్తమాన భారతం ఆ స్వాతంత్రోద్యమ ప్రారంభకులను మర్చే పోయింది .కానీ గాంధీ ,నెహ్రూలు ఈ మహానుభావులను తరచూ స్మరించేవారు .వంకలేని తిన్ననైన జీవితం మోతీలాల్ ఘోష్ ది.పత్రికా రచనలో కర్తవ్య దీక్షలో ఆయన జీవితం పండి పోయింది .జాతీయోద్యమ ,స్వాతంత్ర్య పోరాటాలలో గ్రామీణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించి ,అత్యంత ప్రముఖ వ్యక్తిగా భాసిల్లాడు .ఆయన వ్యక్తిగత జీవితం కంటే ప్రజాజీవిత విశేషాలు కార్యక్రమాలు ,కార్య కలాపాలకే అత్యధిక ప్రాధాన్యత నిచ్చి ఈ చిన్న పుస్తకం రాశానని బెంగాలీ రచయిత సచ్చీంద్ర లాల్ ఘోష్ వివరించాడు .
ప్రవేశిక
18వ శతాబ్దిలో బ్రిటిష్ వ్యాపారులు బెంగాల్ ను చేజిక్కించుకొని పాలన చేశారు .ఈ పునాదులపై విస్తరిల్లిన కలకత్తా మహా నగరం రాజకీయ ఉద్యమాలకు ,వ్యాపారాలకు గొప్ప కేంద్రమై ప్రాముఖ్యం పొందింది .స్వదేశే విదేశీ పాలకులమధ్య సాంస్కృతిక ఘర్షణలకు కూడా ఈ నగరం కేంద్రమైంది .మొగల్ సామ్రాజ్యం లో రాజకీయ ఐక్యత సాధించిన భారత్ ,బ్రిటిష్ వ్యాపారులు వచ్చాక ,చిన్న చిన్న రాజ్యాలు పరస్పరం ఘర్షణలకు దిగాయి .బ్రిటిష్ వారిచే అణచి వేయబడిన ప్రజలు ,రాజకీయ అధికార మార్పిడిని పెద్దగా పట్టించుకోలేదు .1757లో జరిగిన ప్లాసీ యుద్ధం లో ,బెంగాల్ పై ఆధిపత్యం చేతులు మారిన తరుణం లో ప్రజలు నిస్సహాయంగా ఉండి పోయారే తప్ప ,ప్రతిఘటన ప్రయత్నం చేయకపోవటం తో భారత దేశ భవిష్యత్తు స్థంభించి పోయింది .’’’లక్షల సంఖ్యలో ఉన్న బెంగాల్ జనాభా యూరోపియన్లను తరిమి వేయాలి అని యేమాత్రమైనా అనుకుని ఉంటె,రాళ్ళు రప్పలతో ఆ లక్ష్యాన్ని సాధించగలిగి ఉండేవారు .కాని వాళ్ళను స్తబ్దత ఆవరించింది ‘’అన్నాడు బ్రిటిష్ పార్లమెంట్ సెలెక్ట్ కమిటీ సమావేశం లో రాబర్ట్ క్లైవ్.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-22-ఉయ్యూరు