సహస్ర చంద్రదర్శన సౌభాగ్య మహోత్సవ పద్య రత్నములు
దైవతాశీస్సు!
శ్రీ ‘సువర్చలాదేవి’తో స్థిరముగాను, పూర్వకాలాన ‘నుయ్యూరు’ పురమునందు,
‘గబ్బిటాన్వయ’ పుణ్యంపు గరిమ మహిమ, తెలుప; స్థాపించుకొన్నట్టి దేవ ‘హనుమ’
గుణధనమున వెలిగెడు నీ గొప్పవాని, శిష్టు, దుర్గాప్రసాదు నా శీర్వదించు!
వేకువఝామునన్ గడగి వేదవిశేష సుమంత్ర శేముషిన్,
చేకొని ‘యాంజనేయుని’కి సేవలుచేసిన పుణ్య భాగ్యమే,
నీ కమనీయ గ్రాత్ర వరణీయమహీయ వదాన్యసూత్రమై
సాకెనటంచు నెంచి, మనసా వచసా నతులన్ వచించెదన్!
గబ్బిట వంశ వర్ధనుడు! గౌరవ ‘దుర్గ ప్రసాదు మాస్టరున్’,
నిబ్బరమైన ప్రఙ్ఞకును, నిర్మలవర్తన మేలుబంతిగాన్,
కబ్బములెన్నొ వ్రాసిన ప్రకాండుడునై, గురుతుల్యుడై,
యబ్బిన విద్యలందఱకు నందగ జూచుట, ‘నెంత ధన్యుడో’!
సొగసు నిండార పండిన సోకుగాడు!
నిత్య పరిశుభ్ర సరిదభ్ర నీటుగాడు!
అందరిని కుదిపి కదుపు నాటగాడు!
పొగరు పండించి పెంచె, నీ పోటుగాడు!
వీరి వర్తనకు మత్తకోకిలా కీర్తన!
‘నెమ్మదిన్’ తన కోశమందున నిల్వజేయని వీరుడున్,
మమ్మునందరి దుమ్ము దుల్పుచు మారుపల్కగజేయకన్,
సమ్మతంబున వారి వెన్కనె సాగునట్టుల జేయుటన్
యిమ్మహాత్ముని ‘యాంజనేయుడె’ యెల్లవేళలగాచుతన్!
భవదీయుడు.
సరస కవిరాజు
విద్వాన్ నవులూరి రమేశ్ బాబు,
ఉయ్యూరు.
—