సహస్రచంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం తో వారం రోజులు సందడే సందడి -1
a అంటే తందానా ‘’అనటం హైదరాబాద్ లో ఉన్న మా అబ్బయిలు శాస్త్రి శర్మ ‘’ తలలు ఊపటం’’ తో నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పింది కాదు .ఆలోచన అమ్మాయిది ,కర్తవ్య నిర్వహణ అబ్బాయిది .సాధారణంగా నేను ఒప్పుకోను .కానీ వయసు మీద పడుతోంది ,ఇదివరకైతే ‘’రయ్యి మంటూ’’ స్కూటర్ పై ఎక్కడికైనా వెళ్లి వచ్చేవాడిని .ఇప్పుడు నన్ను అలా వెళ్ళ నీయటం లేదు మా అబ్బాయి, మనవడు చరణ్ ,మనవరాలు రమ్య . వాళ్ళే నన్ను ఎక్కడికైనా తీసుకు వెళ్లి తీసుకు వస్తున్నారు. కనుక ఈ రకంగా నా స్వేచ్చ కూడా కొంత తగ్గినట్లే .దీనికి తోడు రెండేళ్ళ కరోనా ఫలితంగా సరసభారతి ఉగాది వేడుకలు నిర్వహించ లేక పోవటం మనసులో ఏదో వెలితిగా ఉంది .కనుక నా పుట్టిన రోజు జూన్ 27 న నా పుట్టిన రోజుతోపాటు ‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం ‘’జరిపి సాహితీ బంధువులను అందరినీ ఆహ్వానించి ,సాహిత్యం లో విశిష్ట విశేష సేవలందించిన మహనీయులను ఆత్మీయం గా సత్కరించి ,కవులతో కవి సమ్మేళనం చేయించి , నేను రాసిన ‘’అణు శాస్త్ర వేత్త డా .ఆకునూరి వెంకట రామయ్య ‘’ పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి అనువదింపజేసి నాకు,సరసభారతి కి అరుదైన గౌరవం కల్గించిన స్పాన్సర్ శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు(అమెరికా ) కృతజ్ఞతగా ఆ ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరించటం చేస్తే బాగుంటుంది అనిపించింది .సాహితీ బంధువుల సమక్షం లో ఇక నేను కార్యక్రమాలు తగ్గించుకొని లైవ్ లో మాత్రమేసరసభారతి ని నిర్వహిస్తానని అందరికి తెలియ చేయటం నా ధర్మగా భావించాను. అదే చేశాను .
.కొందరు ప్రముఖులను గత రెండేళ్లుగా ఆహ్వానించినా పెద్ద ఎత్తున సభలు జరిపి సన్మానించలేక పోయాము అనే అసంతృప్తీ ఉంది .కార్యక్రమాలు ఆపకుండా మా శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో నిర్వహిస్తూ కవి సమ్మేళనం తప్ప పుస్తకావిష్కరణలు స్థానికులకు ఆత్మీయ సన్మానాలు చేశాం .కనుక కొంచెం భారీగా ఈ సారి కార్యక్రమం జరపాన్నది నా తలపు .అతిధులను అందర్నీ నేనే ఫోన్ లో మాట్లాడి ఆహ్వానించాను .నేను అనుకొన్న పేర్లు కాక ఇంకెవరైనా ఉంటె చెప్పమని శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మగారినిఅడిగితె, ఆయన అవధాన రవళి శ్రీ ఆముదాల మురళి గారి పేరును ,బాల అవధాని చి. ఉప్పలధడియం భరత్ శర్మ ను సూచిస్తూ ,సంగీత కచేరీ కూడా ఉంటె బాగుంటుందని ‘’సన్నాయి నొక్కులు నొక్కారు ‘’మంచి ఆలోచన అంటూ ఎవర్ని పిలుద్దాం అంటే బందరుకు చెందిన శ్రీ మతి ఓలేటి రాధికా సుబ్రహ్మణ్యం పేరు సూచించగా ‘’వాయస్ ‘’అన్నాను .వారినే ఆ ముగ్గుర్ని ఆహ్వానిస్తే ,ఆయన మురళి గారి నంబర్ నాకు ఇవ్వకపోవటం నేను అడగక పోవటం జరిగి ఆయన తప్ప మిగిలిని ఇద్దర్నీ ఫోన్ చేసి ఆహ్వాని౦చాను .ఇవన్నీ ఎప్పటికప్పుడు బులెటిన్ ల లో పెడుతుండగా వరంగల్ లో శ్రీ లేఖ సాహితీ సంస్థను నిర్వహిస్తున్న నాకు ఆత్మీయులు మా పురస్కారం అందుకొన్నవారు డా .టి.రంగస్వామి మెయిల్ రాసి మద్రాస్ లో ఉన్న శ్రీ గుడిమెట్ల చెన్నయ్యగారి సాహితీ సేవా కార్యక్రమాలు రాసి వీలుంటే చూడండి అనగా వెంటనే నంబర్ రాయమంటే ,రాయగా వారితో మాట్లాడాను.’’ సరే ‘’అంటూ హోసూరు లో తెలుగు సంస్థ నిర్వాహకులు డా వసంత్ ఉగాది కవి సమ్మేళన కవితల ‘’పోత్తానికి’’ నేను సమీక్ష చేస్తూ వారి కవితను మెచ్చుకొన్న విషయం గుర్తు చేశారు .శ్రీ బెల్లం కొండ నాగేశ్వరరావు గారినీ గత రెండేళ్లుగా ఆహ్వానిస్తూనే ఉన్నాం .ఈ సారి అయినా తప్పక వస్తారనుకొంటే అకస్మాత్తుగా వారికి ఆరోగ్య సమస్య వచ్చి రాలేక పోయానని నిన్ననే తెలియజేశారు .అలాగే మద్రాస్ లో ఉంటున్నడా మాడభూషి శ్రీధర్ గారి శిష్యురాలు శ్రీమతి లేళ్లపల్లి శ్రీదేవి నిరుడు మాడభూషి వారు ‘’జూమ్ ‘’లో నిర్వహించిన సాహితీ కార్యక్రమం లో నన్ను పరిచయం చేసి అప్పటినుంచి నన్ను ‘’బాబాయి గారు ‘’అంటున్న ఆమెను ఆమె భర్తనూ ఆహ్వానించా .ఆమెకు కూడా అకస్మాత్తుగా జ్వరం వచ్చి రాలేక పోయారు .డా ఎన్.భాస్కరరావు గారు ఢిల్లీ లో ఉండిపోవాల్సి వచ్చి రాలేదు .వీరు తప్పఅందరు హాజరవటం ఆనందంగా ఉంది .
విశిష్ట ,విశేష పురస్కార గ్రహీతలలో ఉన్న నర్మదా రెడ్డి .భవానీ ,ప్రకాష్ గార్ల కూ రెండేళ్ల నుంచి ‘’డ్యూ’’.వీరూ రావటం సంతోషం .శ్రీ సుబ్రహ్మణ్యంగారు చిరపరిచితులు ,బదరీగారు నిడదవోలులో రెండేళ్ళక్రితం పరిచయం .టేకు మళ్ల వారు దాదాపు పదేళ్లుగా పరిచయం .మా కార్యక్రమాలకు తప్పక వచ్చేవారు .మా త్యాగరాజ ఆరాధనోత్సవాలకు వారి శ్రీమతి చిదంబరి గారు వచ్చి కోమలగాత్రంతో అలరిస్తారు .గంధం వారి కథా గంధాన్ని ఆస్వాదించి వారి, రెండు సంపుటాలలోని కథలను ,వారి అన్నగారు శ్రీ వేంకాస్వామి గారి రెండు సంపుటాలలోని కథలను సరసభారతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరోసారి సాహితీ లోకానికి పరిచయం చేసే అదృష్టం కలిగింది .వీరితోదాదాపుగా పాతిక ఏళ్ళ పరిచయం .వారి రాక మాకెంతో ముదావహం .శ్రీ చలపాక ,శ్రీ కళాసాగర్ సరసభారతి పుస్తక ప్రచురణకు వెన్ను దన్ను గా నిలిచినవారు .మా దూరపు బంధువు ,పురాతత్వ శాస్త్ర వేత్త శ్రీ వేలూరి కృష్ణ శాస్త్రి గారి తర్వాత మళ్ళీ ఆశాఖలో మంచి పేరు తెచ్చుకొన్న గాడేపల్లి రామకృష్ణారావు మా రెండవ బావగారు శ్రీ వేలూరి వివేకానంద్ గారి మేనల్లుడు .శ్రీమతి మైలవరపు లలితకుమారి గొప్ప విద్వాంసురాలు .ఆమె రావటం కూడా శోభచేకూర్చింది.ఆమె భర్త రామ శేషు గారు నాకు’’ ఫాన్’’. శ్రీమతి కేనేరుకల్పన ,శ్రీ పంతుల వెంకటేశ్వరరావు గార్లు మాకు పాతకాపులే .ఉయ్యూరు లో సాహితీ ప్రియులు కవి విమర్శకులు శ్రీ సారదిగారు .అలాగే ఉయ్యూరు శాఖా గ్రంధాలయ నిర్వాహకులు శ్రీ కృష్ణారావు గారు శ్రీమతి స్రవంతి గార్లు .వీరిద్దరి సాహితీ సేవ మరువలేనిది .ఇంకా ఎవరినైనా మర్చిపోతే మన్నించండి .
అంతేకాక ఎందరెందరో వదాన్యులు నేను అడగకుండానే సరసభారతి కార్యక్రమాలకు ఆన౦దిస్తూ స్వచ్చందంగా విరాళాలిచ్చిన దాతలకు సభా ముఖంగా కృతజ్ఞతలు తెలుపుకోవటమూ ఇందులో పరమార్ధంగా భావించాము .అందుకే ఆహ్వానం లో వారి పేర్లు రాసి ‘’సౌజన్యం తో ‘’అని కృతజ్ఞత చెప్పుకొన్నాం . ఇంత వరకు బాగానే ఉంది .కవి సమ్మేళనం జరగాలి కదా .విషయ౦ ‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం ‘’అని నేనేచెప్పి ఇదంతా మా సంస్థ,దాని నిర్వాహకునిగా నేనే ఎక్కువగా కనిపిస్తానుకనుక ‘’కవులను వచ్చి నాకు డప్పు కొట్టండి ‘’అని అడిగితె బాగుండదు అని దత్తాత్రేయ శర్మగారికి చెప్పి కవులను ఆహ్వానించే బాధ్యతా, శీర్షికను వారికి తెలియ జేసే బాధ్యతే కాక మొత్తం కార్యక్రమాన్ని అలాంటి పండితుని చేత నిర్వహిస్తే బాగుంటుందని వారిని ఒప్పించి కవుల ఫోన్ నంబర్లు ఇచ్చి ఆయనతోనే వారికి ఫోన్ చేయించా .36పేర్లు సేకరించి ఆయన తెలియ జేసినా, సుమారు ఇరవై మంది మాత్రమె వచ్చారు .పురస్కార గ్రహీతలకూ అవకాశమివ్వటం తో రక్తి కట్టింది .దీనికి శర్మగారికి అభినందనలు . పురస్కార గ్రహీతలకు’’ ఉడతా భక్తి గా ‘’ సత్కారం శాస్త్రోక్తంగా నిర్వహించి మా శక్తిని బట్టి నగదు కానుక అందించాం .వారి విద్వత్ కు శక్తి సామర్ధ్యాలకు మేమిచ్చింది తులతూగేది కాదు . ,కవులనూఅలానే సత్కరించి నగదుకానుక లందించి సంతృప్తి చెందాం .
హైదరాబాద్ లో ఉన్న మా అబ్బాయిలు శాస్త్రి శర్మలు కోడళ్లు కుటుంబాలతో రావాల్సి ఉంది .సరిగ్గా నెల క్రితమే మా మనవడు చి.చరణ్ ఉపనయనానికి అందరూ వచ్చారు కనుక పిల్లల పరీక్షలు చదువులు ఉద్యోగాలవలన రాలేక పోయారు .కానీ మా మనవడు ఛి హర్ష కు ఇలాంటి కార్యక్రమాలు అంటే మహా ఇష్టం .ఈ తాతగారిపై వాడికిఅమితమైన గౌరవం .నా లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తాడు . బిటేక్ సెమిస్టర్ పరీక్షలు వారం రోజులుగా రాస్తూ అలిసిపోయి ఆటవిడుపుగా ఇక్కడికి రావాలని తండ్రిపై ఒత్తిడి తెస్తే , బలవంతం మీద మా అబ్బాయి శర్మ వాడితో వచ్చి నేను అప్పగించిన కార్యక్రమం చక్కగా నెరవేర్చి సంతోషం కలిగించాడు .ఉయ్యూరు మనవడు చరణ్ ,మనవరాలు రమ్య చదువులు పరీక్షలు ,కాన్ఫరెన్స్ లవలన ఎక్కువ సేపు ఉండలేక పోయారు .మా కోడలు శ్రీమతి రాణి ఇంట్లో ఇచ్చిన సహకారం ఎన్నతగినది.అలాగె నాలుగవ కోడలు శ్రీమతి మహేశ్వరి ఆఫీస్ పని,ఈ సభా కార్యక్రమ౦ లలో గొప్ప సహకారం అందించింది .
కార్యక్రమం అరగంట ఆలస్యంగా మొదలవటం ,నేనుఎంత పకడ్బందీగా ప్లాన్ ఇచ్చినా ,వేదికపై తొట్రు పాట్లు జరిగాయి .పురస్కార గ్రహీతల స్పందనకు అవకాశం కలగనందుకు వారిని క్షమించమని వేడుకొంటున్నాను .వారందరూ మాట్లాడితే బాగా ఉండేది .కానీ చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని ,రైల్ కి వెళ్లాలనో, బస్ టైం అయి౦దనో కంగారులో మాట్లాడలేక పోయి ఉంటారు .
ఈ బృహత్తర కార్యక్రమానికి బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు విచ్చేయటం మన ,మా అదృష్టం .మూర్తీభవించిన బ్రాహ్మీ మూర్తులు వారు. ఒక వేదవ్యాస మహర్షియో , వాల్మీకి మహర్షియో ,పరాశర మహర్షియో విచ్చేసిన అనుభూతి కలిగింది. వారు సరసభారతిని, నన్ను ఆశీర్వదించటం వేదాశీస్సుగా భావిస్తున్నాను .వారికి మరొక్క సారి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను .
ఎసి లైబ్రరీ లో జరగాల్సిన కార్యక్రమంప్రత్యక్ష ప్రసారానికి ,సంగీత కచేరీకి ఇబ్బంది అవుతుందని ,సరిగ్గా రెండురోజుల ముందు మాత్రమె గ్రహించి , శివాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వదాన్యులు శ్రీ కుటుంబ రాజు గారి బిల్డింగ్ లో వారి తోడ్పాటు తో నిర్వహించాం . ఎసి అలవాటైన కొందరికి ఇబ్బంది కలిగించి ఉండచ్చు ఈ అసౌకర్యానికి మన్నించండి .రాజుగారికి కృతజ్ఞతలు .వారి సౌజన్యం మరువలేనిది.ఈ మధ్య మన భారీ కార్యక్రమాలు కెసీపి దగ్గరున్న రోటరీ ఆడిటోరియం లో జరిగేవని మీకు తెలుసు అక్కడ మనకు అన్ని రకాల సహాయ సౌకర్యాలు అందించే శ్రీ కొండలు గారు మరణించటం ,ఇప్పుడున్నవారితో మాకు పరిచయాలులేకపోవటం వలన అక్కడ జరపలేదు .
ఇవన్నీ ఒక ఎత్తు .దాదాపు వందమంది పైగా సాహిత్య సంగీతాభిమానులు పాల్గొని సభను దిగ్విజయం చేశారు. వారందరికీ ధన్యవాదాలు .లైవ్ ప్రసారం ,ఫోటోగ్రఫీ నిర్వహించిన శ్రీ ప్రకాష్ అతని బృందం అభినందనీయులు .వేదిక ఏర్పాటు తో సహా సభకు కావాల్సిన హంగు లన్నీ సమకూర్చిన మా అబ్బాయి రమణ అభి నందనీయుడు .వాడికి సహకరించిన వారికీ ధన్యవాదాలు .సరసభారతి గౌర వాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారికి నిర్వహణ సహకారం అందించిన కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మికి ,భర్త శ్రీ శ్రీనివాస శర్మ గారికి సాంకేతిక నిపునులుశ్రీ విబిజి రావు గారికి ,మా అన్నగారబ్బాయి చి రామనాద్ బాబు కు శ్రీమతి మల్లిక గారికి ప్రత్యెక ధన్యవాదాలు .జాగృతి సంస్థ వారు ఉత్సాహంగా పాల్గొని ఘనవిజయం చేకూర్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చి నందుకు అభినందనలు .
అందర్నీ ఆహ్వానించి ,వారికి సరైన ఆతిధ్యం ఇవ్వటం మా ధర్మం .కనుక మంచి ఉపాహారం ,టీ అందించి చివరికి కమ్మని విందు కూడా ఇచ్చి సంతృప్తి పరచాం .శ్రీ ప్రసాద్ గారి కేటరింగ్ అద్భుతంగా ఉందనీ అన్నీ రుచికరంగా ఉన్నాయని అందరూ భావించి సంతృప్తిగా భోజనం చేశారని అందరూ చెప్పగా మా దంపతులం చాలా ఆనందించాం .
అసలు సందడి రేపు రాస్తాను .ఇది నేపధ్యం మాత్రమె .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-22-ఉయ్యూరు
చి. శిష్టు సత్యరాజేష్ గురించి చెప్పటం మర్చిపోయాను. సుమారు అయిదేళ్లుగా పరిచయమున్న ఉత్సాహవంతుడైన సాహితీ కార్యకర్త .గోదావరి రచయితల సంఘం అధ్యక్షుడు .శ్రీ మతి డొక్కా సీతమ్మగారు, శ్రీ ఎస్పి బాలు గార్లపై కవితలు రాయించి సంస్థ తరఫున ప్రచురించాడు. అలాగే బాలలకోసం కథలు, కవిత్వం రాయించి సంకలనాలు తెచ్చాడు .జూమ్ మీటింగ్ లు నిర్వహిస్తాడు .అతడికి విశేష పురస్కారం ఇచ్చాం .అలాగే 58 ఏళ్ళ క్రితం ఉయ్యూరు హైస్కూల్ లో ట్యూషన్ లో నా శిష్యురాలు ,ఉయ్యూరు స్వగ్రామం భర్తగారిదికూడాఉయ్యూరు అయిన శ్రీమతి పువ్వుల కరుణానిధి సరసభారతికి అత్యంత ఆప్తురాలు .రామగుండం లో ఉన్నా ఉయ్యూరు వస్తే ఆ దంపతులు మా ఇంటికి వచ్చి కనపడే వినయశీలి ,స్వచ్చందంగా మా సంస్థకు విరాళాలు అందించే భక్తురాలు .కనుక కరుణా నిధి ,శ్రీ నరసింహారావు దంపతులకు’’ ప్రత్యెక ఆత్మీయ సౌజన్య పురస్కారం’’ అందించాం.నిన్న డా .మాడభూషి సంపత్కుమార్ అని రాయటానికి బదులు శ్రీధర్ అని పొరబాటుగా రాశాను .ఇవన్నీ’’ కవర్ చేసుకోవటాని’’కి సారీ సరిదిద్దుకోవటానికిచేసిన ప్రయత్నమే ఇది .
వారం రోజుల సందడి గురించి రాయటానికి ముందు కొన్ని సంగతులు రాయాలి .నిరుడు మార్చి 22 న మా మూడవ అబ్బాయి డా నాగగోపాలమూర్తి అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించాడు .ఆసంగతి మీకు తెలుసు .ఈ మార్చి 9,10,11 తేదీలలో అతని సంవత్సరీకాలు పూర్తయ్యాయి .దానికోసం ఇళ్ళకు సున్నాలు వేయించటం హడావిడి .ప్రతి ఏడాది మాఘమాసం లో ఒక ఆదివారం మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో ఉదయం పూట పాలుపొంగించి ఉచితంగా సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతాలు జరిపి భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళం .కానీ ఈ సారి మాఘం లో కుదరక ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఆదివారం 13-3-22ఘనంగా నిర్వహించి విందు ఏర్పాటు చేశాం .
తర్వాత ఏప్రిల్ 2 న శ్రీ శుభకృత్ సంవత్సర ఉగాది వేడుకలు మా దేవాలయం లో ,మధ్యాహ్నం ఇంటి దగ్గర ప్రత్యక్ష ప్రసారంగా పంచాంగ శ్రవణం, సాయంత్రం గండి గుంట దత్త గుడిలో పంచాంగ శ్రవణ౦ చేశాను .శ్రీరామనవమికి శ్రీసీతారామ కల్యాణం మనగుడిలో వైభవంగా నిర్వహించాం .
మే 22 ఆదివారం మా మనవడు చి. సుస్మిత్ శ్రీ చరణ్ గౌతమ్ ఉపనయనం మా ఇంటి వద్దే చేశాం. మా అబ్బాయి రమణ కోడలు మహేశ్వరి పీటలమీద కూర్చుని ఉపనయనం చేశారు .దీనికి హైదరాబాద్ నుంచి మా అబ్బాయిలు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు హైదరాబాద్ లో ఉన్న మేనల్లుడు మేనకోడలు దంపతులు మా బావమరది ఆనంద్, భార్య ,కొడుకు, కోడలు ,మద్రాస్ లో ఉండే మేనల్లుడు కుటుంబం తో సహా వచ్చి పాల్గొన్నారు .మా శిష్యులు మల్లాది సత్యం ,వెంకటేశ్వర్లు మా ఇంటికి ఆప్తుడు చిలుకూరి దంపత్యుక్తంగా ,అలాగే మా మూర్తి అత్తగారు బావమరదులు కుటుంబాలతో సహా వచ్చి నిండుతనం తెచ్చారు . బెజవాడ నుంచి మా తోడల్లుడు కుటుంబం ,అలాగే బంధువులు మిత్రులు అభిమానులు విచ్చేసి వటువును ఆశీర్వదించారు. మా దంపతులకు మా రమణ దంపతులకు చరణ్ కూ నూతన వస్త్రాలు అంద జేశారు .మేమూ అందరికీ బట్టలు పెట్టాం . మంచి విందు ,మామిడి పళ్ళతో సహా ఇచ్చాం .మా మేనల్లుళ్లు మేనకోడలు మా అబ్బాయిలకు రసం మామిడి పళ్ళు తలొక 50 ప్రత్యేకంగా పాక్ చేయించి ఇచ్చాం కనుక ఇదో సందడి .
అలాగే మే 23,24,25 సోమ,మంగళ, బుధ వారాల్లో శ్రీహనుమజ్జయంతి ని అత్యంత వైభవంగా మూడు రోజులు నిర్వహించాం మొదటి రోజు ఉదయం స్వామి వారికి అష్టకలశ స్నపన, అభిషేకం, నూతన వస్త్రధారణ. గంధసిన్దూరం ,చామంతి, గులాబిపూలతో పూజ సాయంతం సంగీత విభావరి ,రెండవరోజు మంగళవారం ఉదయం’’ వెయ్యి రస౦ మామిడి పళ్ళతో స్వామి వారలకు విశేష పూజ ,సాయంతం ధార్మిక ఉపన్యాసం ,వైశాఖ బహుళ దశమి బుధవారం శ్రీ హనుమజ్జయంతి నాడు ఉదయం 6గం.నుంచి 9 వరకు తమలపాకు పూజ ,10గం.లకు స్వామి వారల శాంతి కల్యాణం సాయంత్రం మహిళా భక్తులచేశ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ,వడమాల .నిన్న చేసిన మామిడి పళ్ళ ప్రసాదాన్ని కల్యాణం సమయంలోనూ ,రాత్రి చాలీసా సమయం లోనూ భక్తులకు అందజేశాం .రాత్రి 108కొబ్బరి కాయలు కొట్టించి కార్యక్రమం పూర్తీ చేయించాం .ఈ హనుమజ్జయంటికి ధ్వజ స్తంభం తో సహా గుడి గోడలకు అన్నిటికి రంగులు వేయించి ముస్తాబు చేశాం .,
జూన్ మధ్య లో మాకుతుమ్బం అంతా కారులో ద్వారకాతిరుమల వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు మా గబ్బిత వారి రామారావు గూడెం అగ్రహారం లో మా స్థలం లో ఉన్న మా ఇలవేల్పు శ్రీ భాక్తాన్జనేయస్వామిని దర్శించి స్వయంగా పూజచేసి ,అక్కడి పూజారిణి శ్రీమతి రమాదేవి కి నూతనవస్త్రాలు నగదుకానుక అందించి ఇంటికి తిరిగి వచ్చాం .ఇంతటి తీరిక లేని కార్యక్రమాలు పూర్తీ అయ్యాక అసలు సందడి ప్రారంభ మైంది .ఆవివరాలు మరో ఎపిసోడ్ లో తెలియజేస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-22-ఉయ్యూరు