సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం తో వారం రోజులు సందడే సందడి -3
జూన్ 20 కి ముందు పది రోజులక్రితం పామర్రు జిల్లా పరిషత్ హైస్కూల్ 1986-87 దవ తరగతి విద్యార్ధి నాయకుడు గ్లాడ్ స్టన్ ఫోన్ చేసి జూన్ 26 ఆదివారం ఉదయం 9 కి పామర్రు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణం లోని ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం ఉంటుందని ,నన్ను తప్పకుండా రావలసిందని అందరి తరఫున ఆహ్వానించాడు .సరే అన్నాను .మరో నాలుగు రోజులతర్వాత ఆ బాచ్ విద్యార్ధులు ఒక అరడజను మంది కారు లో మా ఇంటికి వచ్చి ఆహ్వానించి ఆహ్వాన పత్రిక అందించి వెళ్ళారు .నేనూ వారిని 20,27 కార్యక్రమాలకు రమ్మని ఆహ్వానించి వాట్సాప్ లో ఆహ్వానం పంపాను ..
సహస్ర చంద్ర మాసోత్సవం
జ్యేష్ట బహుళ సప్తమి తిదులప్రకారం నా పుట్టిన రోజు నాడు ఉదయం 5కే లేచి కాలకృత్యాలు తీర్చుకోగా మా మనవడు చి.చరణ్ కు, నాకూ మా శ్రీమతి,మా మనవరాలు రమ్య ముఖాన కుంకుమ బొట్టు పెట్టి ,మాడున చమురు పెట్టి మంగళహారతి అద్దారు .వారిద్దరికీ కానుకలిచ్చాను .ఆ తర్వాత తల౦టిస్నానం చేసి ,సంధ్యావందనం ,పూజ చేసి కొబ్బరికాయ కొట్టాను .ఇంతలో శ్రీ మతి భావానిగారు భర్త రాంబాబు గారు వచ్చి పళ్ళు తాంబూలం ఇచ్చి నమస్కరించి ఆశీర్వాదాలు అందుకొన్నారు .ఉదయం 7-30కు మా అబ్బాయి రమణ దావూద్ కారు తీసుకొని వచ్చి మమ్మల్నిద్దర్నీ భవాన్ని గారినీ ఎక్కించి మంగళ వాద్యాలు ముందు నడుస్తుండగా ,రావి చెట్టు బజారు గుండా మన శ్రీ సువర్చలామ్జనేయస్వామి దేవాలయం దగ్గరున్న ఫంక్షన్ హాల్ దాకా తీసుకు వెళ్లి ,అక్కడ మా పూజారి రమణ తో హారతి ఇప్పించి ,పుష్పమాలలు వేసి ,,పూర్ణ కుంభం తో మమ్మల్ని నడిపించి ఆలయం దగ్గరకు సన్నాయి మేళం తో మాపై ఇరువైపులా బాలబాలికలు అత్యుత్సాహం గా పూలను శిరసు,పాదాలమీద చల్లిస్తూ,పెద్ద సినిమా సెట్టింగ్ లాగా ఆలయం దగ్గరకు తీసుకొని వెళ్ళారు ఫోటోలు వీడియోలు జోరుతో .ఇది మేము ఊహంచని విషయం .అవాక్కయ్యాం .కానీ అద్భుతః అని పించేట్లు చేశాడు రమణ. బడ్డీ కొట్టు బుడ్డీ ,పెద్దాడు మొదలైన వారంతా .ఆలయం వద్ద ఆ రోజు బెజవాడ నుంచి వచ్చిన నవగ్రహ పూజ ,ఆయుష్షు హోమం చేసే శ్రీ వంశీకృష్ణమాచార్యులు ,ఆయన సహాయకుడు మాకు స్వాగతం పలికి ఆలయ ప్రవేశం చేయించి ,ప్రదక్షిణాలు చేయించి ఆలయం లోకి ప్రవేశింప జేశారు .అప్పటికే ఆలయమంతా అరటి పిలకలు ,పూల తోరణాలు తో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఉంచారు .శ్రీ అర్చలాన్జనేయ స్వాముల దివ్య విగ్రహం దర్శనం చేశాం .హారతి ఇచ్చి మా అర్చకస్వామి వేదాంతం మురళీ కృష్ణ అష్టోత్తర సహస్రనామ పూజ ఆరంభించాడు .అప్పటికే ఆలయం లో హోమ వేదిక తయారు చేసి ఉంచి దానికి పసుపు ,కుంకుమ అలంకరణ ముగ్గులు తీర్చి దిద్దారు .
నవగ్రహ పూజ
మేమిద్దరం ‘పీటాదిపతులం ‘’అంటే కింద కూర్చో లేని వాళ్ళం కనుక కుర్చీలలోనే వే౦ చేయించి వంశీ కృష్ణ నవగ్రహ పూజ చేయించాడు .ప్రతి గ్రహానికి ఆవాహన చేయించ ఆగ్రహ బొమ్మను పెట్టి ఆగ్రహానికి యిష్టమైన రంగు పూలతో ఒక్కో గ్రహానికి కిలో పూలతో పూజలు చేయించారు మాతోనూ ,మా అబ్బాయి రమణ ,మహేశ్వరి దంపతులతో .అగరు ,జాజి ,జవ్వాది కుంకుమపువ్వు ,శ్రీగంధం మొదలైన 9 ద్రవ్యాలతో వరుసగా ధూపం వెలిగిస్తూ నవ గ్రహాలకు ధూపం మాతో వేయించారు . ఇది కన్నులపండుగగా ఉంది . ఇంతవరు ఇలా చేయటం చూడలేదు .వంశీ యువకుడే .మా రమణ ఎక్కడో ఆతను చేయించే విధానం చూసి ముచ్చటపడి డా.దీవి చిన్మయ గారితో మాట్లాడించి పిలిపించాడు .గ్రహాలకు కొబ్బరి కాయలు కొట్టించి హారతి ఇప్పించారు .ఆ తర్వాత మా సువర్చలాన్జనేయ స్వామికి ‘’దధ్యోజనం ‘’బాలభోగంగా నైవేద్యం పెట్టించి ,హారతి ఇప్పించి ,లఘు మంత్రపుష్పం ఇప్పించి శటారి ఇప్పించి ప్రసాదం ఇవ్వగా అందర౦దద్యోజన ప్రసాదం కళ్ళకద్దుకొని భుజించాం .అప్పటికి సమయం సుమారు 9 అయింది . శ్రీ దండిభోట్ల దత్తాత్రేయ శర్మగారు బెజవాడ నుంచి వచ్చి ,చూసి మా దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించి బందరులో ఏదో పని ఉంటె వెళ్ళారు .మా అన్నయ్యగారబ్బాయి రాంబాబు మద్రాస్ నుంచి వచ్చిన మా మేనల్లుడు శ్రీనివాస్ ,మా మిత్రులు శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు గారు ,శ్రీ కాట్రగడ్డ వెంకటేశ్వరరావు హాజరయ్యారు .
ఆయుస్సుహోమం
మా దంపతుల్ని అక్కడే కూర్చోబెట్టి ,అగ్ని హోత్ర వేదిక వద్ద మా అబ్బాయి దంపతులను కూర్చో బెట్టి వారిద్దరితో హోమం విధి విధానంగా చేయించారు హోమద్ర్వవ్యాలను పళ్ళెం లో పెట్టి మా చేత తాకించి వారిద్దరికీ ఇస్తే వాళ్ళు హోమం చేశారు మంత్ర పురస్సరంగా. దాదాపు రెండు గంటలు హోమం వివిధ ద్రవ్యాలతో సాగింది .ఆతర్వాత మా ఇద్దరి చేత పూర్ణాహుతి సామాను ఉన్న పట్టు వస్త్రం మూటను మంత్రాలు చదువుతూ అగ్ని హోత్రునికి సమర్పింప జేశారు .పవిత్ర హోమ భస్మాన్ని మా నుదుట పెట్టారు .అగ్ని హోత్రం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేయించారు .
హోమం జరుగుతుండగానే పామర్రు హైస్కూల్ 86-87 టెన్త్ క్లాస్ బ్యాచ్ విద్యార్ధినులు శ్రీమతి శైలజ ,శ్రీమతి లలిత వచ్చి మా ఇద్దరికి శాలువాలు కప్పి సన్మానించి ,ఆదివారం జరిగే ‘’రీయూనియన్’’ కు మా దంపతులను ఆహ్వానించి కారు పంపిస్తాము తప్పక రావలసిందని కోరారు సరే అన్నాం.వారినీ 27కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించాం .
హోమం కాగానే మమ్మల్నిద్దర్నీ కుర్చీలపై కూర్చోపెట్టి మా అబ్బాయి దంపతులతో పుష్పమాలలు వేయించి పళ్ళెం కో కాళ్ళు పెట్టించి వైభవంగా పాద పూజ చేయించారు. మా శ్యామలాదేవి గారు,భవానిగారు ,మల్లికామ్బగారు ,రాంబాబు దంపతులు మేనల్లుడు శీను మొదలైన అక్కడికి వచ్చిన వారంతా అల్లాగేపుష్పాలతో పాద పూజ చేసి నమస్కరించి ఆశీస్సులు అందుకొన్నారు . మంగళహారతు లిచ్చారు . హారతి పళ్ళెం పట్టుకొన్న వారందరికీ తలొక అయిదు వందలు కానుకగా ఇచ్చాం .మా ఇంటి ఆడపడుచులుగా భావించే భవానిగారికి ,మల్లికంబగారికి రెండేసి వేలు ఈ శుభ సందర్భంగా అంద జేశాం. పూజారి మురళి సహాయకులు శ్రీ బలరాం గారికి ,హోమానికి సహకరించిన చిన్మయగారి తమ్ముడికి బడ్డీ కొట్టు వృద్ధ దంపతులు ,మా పెరట్లో పూలు ,తమల పాకులు కోసి స్వామి పూజకు అందించే శ్రీమతి దుర్గ , కంపౌండర్ శివ ,కు రెండేసి వేలు ,వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్న శ్రీమతి సుబ్బమ్మ ,పని మనిషి కి వెయ్యేసి రూపాయలు ఇచ్చాం .వంశీ కృష్ణమాచార్యులు వేదాశీస్సులు పలికి ఈ కార్యక్రమ విశేషాలు తెలియజేశాడు .శ్యామలాదేవి గారు కూడా మాట్లాడి ఉత్సాహం కలిగించారు . నేను ఇదంతా మాస్వామి అనుగ్రహమే తప్ప వేరే ఏమీ లేదని 27 న లైబ్రరీలో జరిగే సరసభారతి సాహితీ పుష్కరోత్సవానికి అందర్నీ రమ్మని ఆహ్వానించాను .
దాదాపుగా వచ్చిన వారంతా మాకు నూతనవస్త్రాలు సమర్పించారు .విజయవాడ నుంచి శ్రీ మతి కోనేరు కల్పన గారు కుమారుడు మనవాడి తో వచ్చి మాకు నూతన వస్త్రాలు అందించారు .దాదాపు 60 ఏళ్ళనాటి శిష్యుడు సోమయాజుల మురళీ కృష్ణ చీరాలనుంచి వచ్చాడు .చాలా ఆనందించాం.వాడు నావద్ద ట్యూషన్ కూడా చదివాడు .అలాగే మా కోడలు రాణి మనవడు చరణ్ ,సదాశివ దంపతులు ,వేణు దంపతులు రమేష్ దంపతులు అతని తల్లిగారు ,గీతామందిరం ఆంటీ, కుమార్తె, హనుమంతు ,ఆంజనేయులు దంపతులు ,గంగాధరరావు గారు జర్నలిస్ట్ వీడియోగ్రాఫర్ ప్రకాష్ దంపతులు చాలా ఆనందంగా పాల్గొని వస్త్రాలు ఇందజేశారు .శ్రీమతి రాజీవి దంపతులు కూడా వచ్చి వస్త్రాలు సమర్పించారు .ఒక గొప్ప పండగ వాతావరణం కలిపించారు ఇంతమంది రావటం వలన .తమ ఇంట్లో పండగ గా అందరూ భావించారు .సహస్ర చంద్ర మాసోత్సవం జరుపుకొన్న వృద్ధ దంపతులు సాక్షాత్తు ‘’ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులే ‘’అని వంశీ కృష్ణ చెప్పిన మాట అందరికి బాగా ‘’కనెక్ట్’’ అయింది .మేమూ నవగ్రహపూజా హోమం చేయించిన వారిద్దరికీనూతనవస్త్రాలు దక్షణ తాంబూలాలు సమర్పించాం .అలాగే మాఆలయ అర్చకుడు మురళి ,బలరా౦ గారు ,చిన్మయ తమ్ముడు దంపతులకు దాదాపు అందరికి నూతన వస్త్రాలు అందించాం .ఇదంతా సందడే సందడిగా మహోత్సాహంగా జరిగింది .
ఆతర్వాత ఆలయం ప్రాంగణం లో అందరికి షడ్రశోపేతమైన విందు ఏర్పాటు చేశాం .పదార్ధాలన్నీ మహా రుచికరంగా ఉన్నాయని మెచ్చుకొంటూ అందరూ భోజనం చేయటం మాకు మహదానందంగా మహా సంతృప్తిగా ఉంది .పూజారి బలరాం గారు వంశీ ,అతనితో వచ్చిన ఆతను కూడా హాయిగా నేలమీదే కూర్చుని కమ్మగా భోజనం చేయటం నయనానంద కారకం .రమేష్ భార్య ,గీతా త మందిరం ఆంటీ గారి అమ్మాయి ,గంగాధరరావు .చంద్ర శేఖరరావు గారు దంపతులు బఫే వడ్డన కు బగా సహకరించారు .ఇంతమంది ని ఇన్వాల్వ్ చేసిన ఘనత మా రమణ దే .మేమూ భోజనాలు చేసి మాకు పెట్టిన బట్టలన్నీ మూట కట్టుకొని,కారులో ఇంటికి చేరే సరికి మధ్యాహ్నం 2-30 అయింది. ఫోటోలు పంపి కాసేపు విశ్రమించాం
సరిగ్గా 3-30కు బెజవాడ నుండి మాకు అత్యంత ప్రియమైన శిష్యుడు రెండేళ్ళ క్రితం మరణించిన మేమంతా ‘’కాళీ ప్రసాద్ ‘’అంటూ ప్రేమగా పిలిచే వంగవేటి కాళీ వరప్రసాద్ కుమారులిద్దరూ వచ్చి ,మా ఇద్దరికీ నూత్న వస్త్రాలు సమర్పించి ఆశీస్సులు అందుకొని తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకొన్నారు .వాళ్ళ చెల్లెలు శ్రీమతి వల్లీ రమా పరమేశ్వరిని 27 న జరిగే కవిసమ్మేళనానికి రమ్మని ఆహ్వానించాం .తప్పక వస్తుందని చెప్పారు .
సాయంత్రం ‘’నా దారితీరు ‘’ప్రత్యక్ష ప్రసారం మామూలుగానే చేశాను .మిగిలిన విషయాలు మరో ఎపిసోడ్ లో తెలియ జేస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-22-ఉయ్యూరు