గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-5
ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్త్రీ విద్యను ప్రోత్సహి౦చాడు.క్రిష్టియన్ మిషనరీ బాలికల స్కూల్స్ లో క్రిష్టియన్ కుటుంబాలకు ,తక్కువ కులాల పిల్లలకే ఎక్కువ ప్రవేశం .మతమార్పిడి నేర్పేవారు .విద్యా సాగర్ మిత్రులతోకలిసి గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో న్యాయ విభాగం సభ్యుడు ‘డ్రింక్ వాటర్ బెధూన్’’ సహాయం తో 1849లో హిందూ బాలికల విద్యాలయం స్థాపించాడు .తర్వాత తొమ్మిదేళ్ళ కాలం లో వేర్వేరు చోట్ల స్వయం కృషితో 36 బాలికా స్కూళ్ళు స్థాపించాడు .బ్రహ్మ సమాజికులు ఎన్నో ప్రభుత్వేతర బాలికా విద్యాలయాలు స్థాపించారు .హేతువాది అయిన విద్యాసాగర్ పశ్చిమ ,భారతీయ తత్వ శాస్త్రాలను అధ్యయనం చేయటానికి వీలుగా సంస్కృత కళాశాల విద్యార్ధులకు ఇంగ్లీష్ బోధించాలని సూచించాడు .ప్రజా సంక్షేమ విద్య ఆయన ధ్యేయం .విద్యావంతుల్ని పాలకవర్గ సభ్యులనుగా మార్చటం ఆయనకు ఇష్టం లేదు.ఆయనే ఒక రోల్ మోడల్ గా నిలిచాడు .నిరాడంబర వస్త్రధారణ ,పశ్చిమ దేశాలలోని నైతిక సాంప్రదాయక విలువల అనుసరణ ఆయనను ఆదర్శవంతుని చేశాయి .బెంగాలీ సాహిత్యానికి మార్గదర్శి అయ్యాడు .19వ శతాబ్దికి ముందు బెంగాలీ సాహిత్యమంతా అత్యున్నత కవితామయమే .వచనం ప్రాచుర్యం పొందలేదు .అన్యమత ప్రచారానికి ,,బ్రిటన్ నుంచి వచ్చిన ఆంగ్లప్రభుత్వోద్యోగులకు బెంగాలీ పాఠ్య గ్రంధాలు తయారీకి మాత్రమె వచనం వాడేవారు .వేదాంత సిద్ధాంత వివరణలకు రాజకీయ సాంఘిక పరిణామాల వ్యాఖ్యానానికి రామమోహన రాయ్ వచనాన్నిఎక్కువగా వాడాడు .ఆయన రాసిన 432 గ్రంథాలలో 15పాఠ్య గ్రందాలు౦డటం విశేషం .ఇందులో ఎక్కువగా సంస్కృత ఇంగ్లీష్ గ్రంథాలకు అనువాదాలు ,అనుసరణలు ఉన్నాయి .ప్రాధమిక స్థాయి నుంచి ఉన్నతపాఠశాల స్థాయివరకు ఆయనే పాఠ్యగ్రంథాలు రాశాడు .ఇప్పటికీ అవి చెలామణి లో, బోధనలో ఉన్నాయి .
బెంగాలీ వచనం బంకిం చంద్ర చటర్జీ రచనలలో పరిపక్వస్థాయి పొందింది .కవిత్వం తప్ప ఆయన ముట్టని సాహితీ ప్రక్రియే లేదు .కలకత్తా యూనివర్సిటి మొదటి పట్టభద్రుడు ఆయన .. సంస్కృత ఆంగ్లాల తోపాటు పాశ్చాత్య తత్వశాస్తాలలోనూ లోతైన పాండిత్యం ఉన్నవాడు .ఇంగ్లిష్ ఫిక్షన్ బాగా అర్ధం చేసుకొని జతీయతాభావంతో రచనలు చేశాడు .మతం పై చక్కని విమర్శనాత్మక సందేశమిచ్చాడు .సాటిమానవ సేవ ఉత్తమంగా భావించి సేవలందించాడు .భగవద్గీతకు భాష్యం రాస్తూ కో౦టే,జార్జి స్టువార్ట్ మిల్ ప్రతిపాదించిన ‘’పాజిటివ్ హ్యూమనిజం’’ ను భగవద్గీత లోని నిష్కామ కర్మలను మేళవించి శక్తివంతమైన సంఘ సేవా సూత్రాన్ని తయారు చేశాడు .జాతీయ భావాలతో తన ఆశయాలను వందే’’ మాతరం గీతం’’ లో పొందు పరచాడు .భారత జాతీయవాదులకు ,విప్లవకారులకూ కూడా వందేమాతర గీతం స్పూర్తి దాయకమైంది నవలాకారునిగా ,వ్యాసకర్తగా తత్వ వేత్తగా ,సామాజిక దార్శనికునిగా ,,జాతీయవాదిగా , సిద్ధాంత కర్తగా మన సంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రాతినిధ్యం వహించిన మేధావి బంకిం చంద్రుడు .
చరిత్రకారుడైన మైఖేల్ మధుసూదన దత్తు జాతీయతాభావంగా బెంగాలీ కవిత్వాన్ని కొత్తదారులు తొక్కించాడు .ఇంగ్లీష్ సాహిత్యం ,పాశ్చాత్య శాస్త్ర సాహిత్యాలలో నిష్ణాతుడైన దత్తా చిరస్మరణీయమైన ఇతిహాసాలను ,నాటకాలను పాటలను బెంగాలీలో రాశాడు .అలాగే హేమ చంద్ర బంద్యోపాధ్యాయ ,రంగాలాల్ బెనర్జీ ,నవీన్ చంద్ర సేన్ ,బీహారీలాల్ చక్రవర్తి కూడా .వీరందరి రచనలలో బంకిం ఆశయాలే అంతర్వాహినిగా ఉన్నాయి .దత్తు నాటకాలకు గొప్పవరవడి పెట్టాడు .దీనబందుమిత్రా రాసిన ‘’నీల్ దర్పణ్’’నాటకం దేశ వ్యాప్త ఆందోళనకు కారణమైంది .గిరీష్ చంద్రఘోష్ కలకాలం నిలిచే నాటకాలు రాశాడు .1872లో బెంగాలీ నాటకకళ అస్తిత్వం లోకి వచ్చాక సామాజిక దురన్యాయాలు ప్రభుత్వ దమనకాండ అవినీతి ,జాతీయోద్యమ స్పూర్తి తో అనేక నాటకాలు వచ్చి జనం లో చైతన్యం తెచ్చాయి .రవీంద్రనాథ టాగూర్ సాహిత్య రంగ ప్రవేశం చేసి కవిగా .కథకునిగా నవలాకారునిగా నాటకకర్తగా ,పాటలకర్తగా వ్యాసకర్తగా ,జాతీయవాదిగా సమీక్షకునిగా గొప్ప విమర్శకునిగా రవీంద్ర సంగీత సృష్టికర్తగా 19వ శతాబ్దంలో భాను దీప్తితో ప్రకాశించాడు .
రాయ్ కాలం లోనే రాజకీయ వివేచన మొదలై ౦ది. ఆఖ్యాతి అంతా ఆయన పత్రికలదే..ప్రజలను చైతన్య పరచి ప్రజాభిప్రాయాలకు దర్పణంగా నిలిచాయి .1823లో ప్రెస్ ఆర్డినెన్స్ ను నిరశిస్తూ చేసిన పోరాటం చిరస్మరణీయం ,ప్రజాస్వామ్యానికి మేలుకొలుపు .క్రైస్తవ న్యాయ శాస్త్రాల ద్వారానే క్రైస్తవుల్ని విచారించటానికి వీలుకలిగించే 1827జ్యూరీచట్టాన్ని నిరసిస్తూ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించాడు .భారత్ ను బలప్రయోగం తో అణచాలనుకోవటం అవివేకం ,అసాధ్యం అని కూడా అన్నాడు .ప్రభుత్వానికి రెండే రెండు ప్రత్యామ్నాయలున్నాయని అందులో ఒకటి –భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రయోజనాలు చేకూర్చే అనుకూల మిత్రదేశంగా వ్యవహరించాలా ,2లేకపోతె బద్ధ శత్రువులాగా బ్రిటిష్ ప్రభుత్వానికి శిరో భారాన్ని తెప్పించేదిగా ఉండాలా ఏదోఒకటి తేల్చుకోమని సవాలు విఇరాడు రాయ్ .తర్వాత ఫ్రెంచ్ విప్లవకారుల ఆదర్శాలతో ఉత్తేజితులైన ‘’డిరోజయన్స్ ‘’రంగంలోకి దిగారు ,పత్రికలపై ఆంక్షలు ఎత్తేయమని ఉద్యమించారు .1835లో గత్యంతరం లేక ప్రభుత్వం ఆర్డినెన్స్ ను రద్దుచేసింది .తర్వాతప్రభుత్వంలో అత్యున్నత మైన ఉద్యోగాలలో భారతీయులను నియమించాలని మరో డిమాండ్ మార్మోగింది .ప్రభుత్వం 1843లో ఈ డిమాండ్ ను ఆమోదించింది .ఇలా క్రమ౦గా ప్రభుత్వం ఒక్కటొక్కటిగా ప్రజల డిమాండ్ లను ఒప్పుకొని అమలు పరచటం ప్రారంభమై ప్రభుత్వం కిందచేయిగా ,ప్రజావాణి పై చేయిగా మారటం ప్రారంభమైంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-7-22-ఉయ్యూరు