గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-8
అమృతబజార్ పత్రిక ఆవిర్భావం -2
ప్రజలపై పాలకులు ,అధికారులు చేస్తున్న అన్యాయాలను బహిర్గతం చేస్తూ ,కొద్దికాలం లోనే అమృతబజార్ పత్రిక బాగా ప్రాచుర్యం పొందింది .దొరలకు ఎక్కడో కాలి ఘోష్ కుటుంబానికి గుణపాఠం చెప్పాలని అనుకోగా పత్రిక మిత్రవర్గం బాగా విస్తరించింది .న్యాయవాదుల అధ్యాపకుల ప్రజల మద్దతు బాగా వచ్చింది .నాలుగు నెలలకే పత్రికపై పరువు నష్టం దావా వచ్చింది .పత్రికలో ఒక మిత్రుడు యూరోపియన్ అధికారిపై విమర్శ రాయటమే కారణం .ఎడిటర్ పై కేసుపెట్ట టానికి ప్రాసిక్యూషన్ తటపటాయించి ,మోతీలాల్ ను సాక్షిగా పెట్టారు .మాజిష్ట్రేట్ స్వయంగా క్రాస్ ఎక్సామినేషన్ చేసినా సంపాదకుడు ఎవరో తేలలేదు .ఎవరు సంపాదకుడు అని అడిగితె మోతీలాల్ పెట్టి నాలుగు నెలలే అయింది ఇంకా సంపాదకుడిని పెట్టలేదని చెప్పాడు .శిశిర్ కుమార్ సంపాదకుడు అని అంటున్నారు అనగా, బాగా రాస్తాడుకనుక అలా ప్రజలు భావించారు అని సమాధానం .ఆయన ఇంగ్లీష్ బాగా రాయగలడా అంటే ,బాగా జీతాలు తీసుకొనే ప్రభుత్వ ఆఫీసర్లకంటే బాగా రాయగలడు అని సమాధానం ..పత్రిక తరఫున డిఫెన్స్ వకాల్తా కలకత్తాకు చెందిన ప్రముఖ ప్లీడర్ మదన్ మోహన్ ఘోష్ .ఎనిమిది నెలలు కేసుకోనసాగి ఘోష్ సోదరులు నిర్దోషులని కోర్టు తేల్చింది .అయితే ముద్రాపకుడికి ఆరునెలలు రచయితకు ఏడాది శిక్షపడింది .సాక్ష్యాధారాలు గల్లంతు చేశారని మళ్ళీ ప్రాసిక్యూషన్ సాగితే కేసు విఫలమైంది .ఘోష్ సోదరులు ఈ దావాతో తీవ్రంగా ఆర్ధిక చిక్కుల్లో పడ్డారు .మిత్రుల ప్రోద్బలం తో పత్రిక యధావిధిగా కొనసాగింది .
1869లో ఇంగ్లీష్ లో కూడా పత్రిక వెలువడి ద్విభాషా పత్రిక అయింది .అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సిలో బెంగాల్ బీహార్ ఒరిస్సాలు కూడా ఉండేవి .పత్రిక బాగా విజయం పొందింది .1871కి ఆర్ధికంగా బలపడింది .సిబ్బందికి మంచి జీతాలిస్తూ అనవసర ఖర్చులు తగ్గించుకోవటమే ఈ విజయ రహస్యం .సగటు ప్రజల హృదయాలలో అమృతబజార్ పత్రిక సుస్థిర స్థానం సంపాది౦చి౦ది .నిరాడంబరత్వం ఘోష్ కుటుంబానికి ఆదర్శం .
తూర్పు భారతం లో కీర్తనలకు మంచి పేరుంది .శిశిర్ కుమార్ ద్విపద కర్తకూడా .చైతన్యుని జీవిత చరిత్రను ‘’అనియామివై ‘’కావ్యంగా రాశాడు .బెంగాలీ సాహిత్యం లో ఇదొక గొప్ప ఇతిహాసం .గ్రామం లో ఉన్నప్పుడూ ,కలకత్తా లో ఉండగానూ ఘోష్ కుటుంబం లో సాయంత్రం వైష్ణవ భజనలు తప్పక జరిగేవి .
ఘోష్ సోదరులు ఆధ్యాత్మిక చింతనపై కూడా దృష్టిని కేంద్రీకరించారు .మోతీలాల్ చిన్నతమ్ముడు హీరాలాల్ ఎప్పుడూ ఏదోపోగొట్టుకోన్నవాడిగా విచారంతో ఉంటూ 1886లోఆత్మా హత్య చేసుకొన్నాడు .తండ్రిమరణం తో పాటు ఈతమ్ముడి మరణం వలన కుటుంబంలో విచారం పెరిగింది .శిశిర్ అమెరికావెల్లి భూతవైద్యం నేర్చుకోవాలి అనుకొంటే ,మిత్రులు దానికి సంబంధించి జ్ఞానాన్ని అందించారు .తర్వాత ఆధ్యాత్మిక సదస్సులు నిర్వహించాడు .1908 లో హిందూ స్పిరిట్యువల్ అనే మేగజైన్ లో ఆయన రాస్తూ ‘’ఇక్కడే లో ఆధ్యాత్మిక వాదాన్ని మనమే మొదలుపెట్టాం .సదస్సులు గోష్టులు గ్రామాల్లోనే జరిపాం .ఇవి తెలుసుకొని కలకత్తాలోని మిత్రులు బాగా ప్రచారం చేసి దేశం లో తీవ్ర సంచలనం కలిగించారు .పల్లెలకు పట్టణాలకు సమాచారం బాగా చేరింది .అమృతబజార్ గ్రామం లో చనిపోయిన వారితో ప్రజలు మాట్లాడుతున్నారు అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ‘’అని తెలిపాడు .
భూతవైద్యం ,అతీత శక్తుల విజ్ఞానం నేర్చుకొనే సమయం మోతీలాల్ కు లభించలేదుకానీ మిగిలిన సోదరులు అందులో నిష్ణాతులయ్యారు .హేమంతకుమార్ కొడుకు మృణాల్ కాంతి 1954లో చనిపోయే నాటికి ఆరంగంలో గణనీయంగా అభి వృద్ధి చెందాడు .మరణానంతర జీవితం పై అతడు రాసిన ‘’పరలోక్ కధా’’పుస్తకం విపరీతంగా అమ్ముడయింది .జాతర ,ఆరుబయట రంగస్థలాలు బాగా ఉన్న ఆకాలం లో ఘోష్ సోదరులు తమ గ్రామం లో రంగస్థల నాటకాలను బాగా ప్రోత్సహించి పోషించారు .ఉన్నతప్రమాణాలతో వారి నాటకాలు ఉండేవి .ప్రసిద్ధి చెందిన నటులు అనేకప్రాంతాలనుంచి వచ్చి నటించేవారు .’’నీల్ దర్పణ్’’నాటకరచయిత దీనబంధు మిత్రాకూడా ఈనాటకాలలో పాల్గొనే వాడు .ఆగ్రామ ప్రజల్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్ళే కృషి ఘోష సోదరులు చేశారు .
1869లో మోతీలాల్ వివాహం నాదియాజిల్లాలోని కుమారఖలికి చెందిన వధువు తో జరిగింది .సోదరులు బ్రహ్మ సమాజ సభ్యులు కాకపోయినా ఛాందసులు కక్షకట్టి క్రైస్తవం పుచ్చుకున్నారనే కట్టు కధ ప్రచారం చేసి పెళ్ళికూతురు వాళ్ళకూ తెలిపారు .అందులో నిజానిఆలు వారు గమనించి ‘’లైట్ తీసుకొని ‘’ హాయిగా పెళ్లి చేసి సుఖాంతం చేశారు .గ్రామీణ కక్షలు ఎలా ఉంటాయో ఎంత విపరీతానికి వొడగట్టుతారో మోతీలాల్ వివాహం రుజువు చేసింది .ఈ దంపతులకు 1876’’సజల నయన ‘’అనే కూతురు పుట్టింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-7-22-ఉయ్యూరు