సుమారు పది హేను రోజులక్రితం కీ.శే .ముళ్ళపూడి వెంకటరమణ గారి అర్ధాంగి శ్రీమతి శ్రీదేవి గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ,తాను రాసిన భాగవతం పుస్తకం ఆవిష్కరణ జరుపుతున్నామని ,అవగానే ప౦పిస్తానని చెప్పారు. శుభం భూయాత్ అన్నాను .న్యాయంగా ఆమె నాకు అలా చెప్పాల్సిన పని లేదు అది వారి సౌజన్యమే . నాకంటే మా శ్రీమతి ఆపుస్తకం రాక కోసం ఎదురు చూసింది ఆమె రామాయణం చదివిన అనుభూతితో .అన్నట్లుగానే నిన్న సాయంత్రమే ‘రమణీయ శ్రీ భాగవతం ‘’-దశావతారాలు ‘పుస్తకం అందింది .అందిందని వాయిస్ మెసేజ్ లో తెలియజేశాను .ఇవాళ ఉదయం చదివి, స్పందిస్తున్నాను .
బాపు –రమణ లు రామాయణ భాగవతాలను పుడిసిళ్ళ కొద్దీ గ్రోలిన వారు .వారిద్దరుఏదిరాసినా ,గీసినా ,చెప్పినా వాటిలోని పరమార్ధమే అంతరార్ధంగా ఉంటుంది .ఆ తానులోని వారే శ్రీదేవి గారు .ముందుగా ‘’రమణీయ రామాయణం ‘’రాసి తమ రామాయణ భక్తి తాత్పర్యాలు నిరూపించారు .ఇప్పుడు ఈ భాగవత మందారమకరందం తానూ గ్రోలి ,మనకూ పంచి పెట్టారు .ఆనాడుసూతుడు శౌనకాది మునులకు పురాణాలు ప్రవచిస్తే ,ఈనాడు ‘’స్త్రీ సూతుడు ‘’సూతి’’ అనచ్చా ?శ్రీదేవిగారు మనవళ్ళకు మనవరాళ్ళకేకాక సమస్త బాలబాలికలకు హృదయంగమంగా ఈ దశావతారాలను ఆధారంగా చేసుకొని భాగవత కథా పరమార్ధాలను వాళ్ళ స్థాయిలో ‘ఒక నానమ్మ,ఒక అమ్మమ్మ ఒక అవ్వ ‘’ బువ్వ పెడుతూ ముద్దుగా చెప్పినట్లు హృద్యంగా చెప్పారు . వ్యాసుడు, తెలుగు వ్యాసుడు పోతన్నగారు బుద్ధుడి గురించి చెప్పలేదు కనుక తానూ ఆయన జోలికి పోలేదన్నారు . .దశావతారాలను శీర్షికగా పెట్టి జయదేవుని అష్టపదిలోని అవతార శోక్లాలను సందర్భోచితంగా ,చిత్రాలతో సహా పొందు పరచారు .పోతన్న గారి రసగుళికల వంటి పద్యాలను చేర్చి రచన రక్తి కట్టించారు .పిల్లలు అడిగే ప్రశ్నలకు జవాబు చెబుతున్నట్లుగా ,కథనం చేయటం ఆకర్షణీయం .అవతార పరమార్ధాలనూ చక్కగా విడమర్చి చెప్పారు .మత్స్యా వతార ఆవశ్యకత గురించి చెబుతూ ‘’వేదాలు సృష్టి నిర్మాణానికి మూలాధారాలు .సమస్త విజ్ఞానం,శాస్త్రాలు వాటిలో ఉన్నాయి .మన బతుకుకు కావాల్సిన విజ్ఞానం అంతా వాటిలో ఉన్నాయి. అవి లేకపోతె గందరగోళమే.సోమకాసురుడు వేద విజ్ఞానాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఆధిపత్యం చలా ఇంచటానికి వేదాలను దొంగిలించాడు .అందరికీ అందు బాటులో ఉండాల్సినవి ఒక్కడి చేతిలో ఉంటె అనర్ధం కనుక విష్ణువు మత్స్యా వతారం పొంది వాడిని, సంహరించి వేదోద్ధరణ చేశాడు ‘’ అని మనసుకు హత్తుకునేట్లు చెప్పారు .లోకాస్సమస్తా స్సుఖినో భవంతు అన్న మన ఆదర్శాన్ని వివరించారు .వ్యాసుడు వరాహావతారం ము౦దుచెప్పి ,నారసింహ కూర్మ వామనావతారాల తర్వాత మత్స్యావతారం చెప్పాడు అని కూడా వివరించారు .పోతనగారు కూడా అలానే చెప్పారు మిగిలినవారెవరూఅలా చెప్పలేదు .
అశ్వత్ధామ చేసిన పరమకిరాతకానికి కొడుకుల్ని పోగొట్టుకొన్న ద్రౌపది వాడి కర్కశ హృదయం కరిగిపోయేట్లు దుఃఖిస్తూ ‘’ద్రోణునితో శిఖిం బడక ద్రోణ కుటుంబిణి యున్నదింట ‘’వీడిని కట్టి తెచ్చినందుకు ఆతల్లి ఎంత పరితపిస్తోందో అని సహ వేదన చూపించి పాండవుల్ని బ్రాహ్మణ హింస పాపం అని చెప్పి వారించిన పోతనగారి పద్యం ఉదాహరించటం సందర్భ శుద్ధి, వెయ్యి మాటలపెట్టు ఆ పద్యం .
నారసి౦హావతారం లో ప్రహ్లాద చరిత్రలో పోతనగారి రంగారు బంగారు పద్యాలు వివరిస్తూ తేనెల సోనలు అందింఛి పోతనకవితామృతాన్ని పంచారు .గజేంద్ర మోక్షం ,వామనావతారం ల లో బాపు గారి కమనీయ చిత్రరాజాలూ పొందుపరచి కళ్ళకు కట్టించారు .’’రవి బి౦బ౦బుప మింప పాత్రమగు ఛత్రమై ,శ్రవణాలంకృతియై’’పద్యానికి’’ బామ్మ ‘’అదే నండీ బాపుగారి బొమ్మ అత్యద్భుతంగా పండింది . ధర్మ విగ్రహుడు ,మర్యాదా పురుషోత్తముడు అయిన శ్రీరాముని రామావతారం ఆమెకు కొట్టిన పిండే.రాముని శివధనుర్భంగం ,బాపు రమణీయ చిత్రంతో పరమ రామణీయకమైంది .సుందరకాండలో సీతామాత ను హనుమ దర్శించటం చరితార్ధకం గా ఉంది చిత్రంతో సహా .బాపుగారి మాగ్నం ఓపస్ చిత్రం శ్రీరామ పట్టాభిషేకం అన్ని భావాల సమ్మిళనం .దాన్ని వివరించిన విధానమూ ఒక నిధానం గా ఉంది .
శరశ్చంద్ర ప్రభువు శ్రీ కృష్ణావతారం శారీరక మానసిక ఆహ్లాద ఆనంద ప్రదానం .ఆ పేరులోనే అనంతమైన ఆకర్షణ ఉంది .పులకింతే కలుగుతుంది .కన్నయ్యకతలు పిన్నయ్యలకు మహారుచి .అంతే రుచికరంగా వర్ణించారు .’’అమ్మా మన్ను తినంగ నే శిశువునో ‘అన్న పద్య భావం, బాపు దానికి తగినట్లు గీసిన చిత్రం కనులకు మిరుమిట్లు గొల్పేవే .బాల కిట్టమ్మ నోటిలోయశోద చూసిన సకల భువనాలు,పొందిన లోకోత్తర అనుభూతి చిత్ర హృదయం చిత్త హృద్యంగా ఉన్నాయి . గోపాలురతోకలిసి ‘’కిత్తమూర్తి మామయ్య ‘’చల్దులు ఆరగించటం ,తెలుగు ఊరగాయలు తినటం పోతనగారు తెలుగు భోజనం రుచి చూపించారు దానినే శ్రీ దేవి గారిక్కడ పొందుపరచారు .ఇక్కడ నాకొక విషయం జ్ఞాపకం వస్తోంది .కరుణశ్రీ గారు ‘’భాగవత వైజయంతిక ‘’లో ఈ ఘట్టాన్ని పేర్కొని, వ్యాసుడు ‘’కృష్ణయ్యా !నువ్వు మరీ తెలుగు వాడివి అయిపోయావయ్యా ‘’అని వెండి గడ్డాన్ని నిమురుకొంటూ ,ముసిముసి నవ్వులు నవ్వాడట.కాళీయయమర్దనమూ బాగుంది చిత్రంతో పాటు .రాసలీలా విలాసాన్నీ రసకందాయంగా ,పోతన శృంగారరస భరిత పద్యాలనాధారంగా రాయటం బాగుంది .’’కిటియై కౌగిట చేర్చెను –వటుడై వర్ధిల్లి కొలిచే వడి కృష్ణుం డై-ఇట పద చిహ్నము లిడెకిం-దటిబామున నేమి నోచితిమమ్మ ధరిత్రీ ‘’అని తమకు దక్కని ఆదివ్యానుభూతి భూమాతకు దక్కిందని అది ఆమె పూర్వ జన్మ సుకృతమనీ భావి౦చారు గోపికలు .మురళీ గానం లో లోకమంతా పరవశించింది .అలాగే శ్రీ కృష్ణ కర్ణామృతం లోని లీలాశుకుని భక్తి పారవశ్య శ్లోక౦’’అ౦గనామంగనా మంతరే మాధవో –మాధవం మాధవం చాంతరే ణా౦గనే-ఇత్ధ మాకల్పితే మండలే మధ్యగః –సంజగౌ వేణునా దేవకీ నందనః ‘’ చేర్చి మనోహరం చేశారు .ఆనీబిసేంట్ చెప్పినట్లు రాసక్రీడ ‘’రిబాల్ట్రీ’’కాదు అది జీవేశ్వరాను బంధం . ‘’.రుక్మిణీ కల్యాణం ,శ్యమంతకోపాఖ్యానం ,నరకాసురవధ ,సత్య అవక్ర ధనుష్ పాండిత్యం ,ఆమె ‘’రోష రాగోదయా విరాట భ్రుకుటి,మందహాసములతో చూపించిన వీరం ,శృంగారం ను మురిపెంగా వర్ణించి సత్యాకృష్ణుల గాఢ అనుబంధాన్ని బాపు బొమ్మ ఆధారంగా రక్తి కట్టించారు .కల్కి అవతారంతో సమాప్తి చేస్తూ,ఫలశ్రుతికూడా చెప్పి అర్ధవంతమైన శ్లోకం పొందు పరచారు –‘శిష్ఠ జనావన దుష్టహర ఖగ తురగోత్తమ వాహన తే –కల్కి రూప పరిపాల నమో భక్తం తే పరిపాలయ మాం –నామ స్మరణా దన్యోపాయం నహి పశ్యామో భవతరణే –రామహరే కృష్ణ హరే తమనామ వదామి సదా నృహరే ‘’.
కృష్ణ పరమాత్మ జగద్గురువు .’’ది లార్డ్ ఆఫ్ ఆటం మూన్స్ ‘’-శర శ్చంద్రప్రభువు’’.ప్రేమ ప్రేమకోసం ,విధి కర్తవ్య నిర్వహణకోసం అనే సత్యాన్ని ప్రపంచ చరిత్రలో మొదటి సారిగా గ్రహించి ప్రకటించిన ప్రధమ ఆచార్యుడు .ఆదర్శ గార్హత్యం ,ఆదర్శ సన్యాసం ఆయనలో చూస్తాం .ది మాస్టర్ స్టేట్స్ మన్ ,ది అన్ క్రౌన్డ్ మోనార్క్ ,దికింగ్ మేకర్ హు హాడ్ నో ఆమ్బిషన్ ఫర్ హింసెల్ఫ్ .ఆయన రసో వై సః‘’అన్నారు స్వామి త్యాగీశానంద .ఇలాంటి లోకోత్తర పురుషుని క్రీ డావిన్యాసమే భాగవతం. భక్తి ప్రకాశం .సుందర పుష్పం .భక్తి సిద్ధాంత మహాద్భుతసారం .ఇంతటి ఉత్కృష్ట గ్రంథాన్ని అత్య౦త సులభశైలిలో అరటి పండు వలిచి పెట్టినట్లు ,ముఖ్యమైన కథలైన అజామిళ ,అంబరీష ,కుచేలాదులను కూడా రసవత్తరంగా వివరించి పరమభాగవతోత్తమురాలై ధన్యురాలయ్యారు శ్రీదేవి గారు .పోతన గారు చేయిపట్టుకొని నడిపించినట్లుంది .మా నూజివీడు రసాలు ,పనసతొనలు ,తెనేతోమాగిన తియ్యమామిడి ,పచ్చకర్పూరం వేసిన పరమాన్నం తిన్నట్లు ,పంచదార పానకం తాగినట్లు అనుభూతి కలుగుతుంది . దశావతారాల విష్ణు మూర్తి ముఖ చిత్రం ,పాలనురగవంటి స్వచ్ఛ మైన కాగితాలపై స్కాలిత్యం లేని ముద్రణ పుస్తకానికి మరింతశోభ చేకూర్చాయి .అందుకే ‘రమణీయం దశావతార శ్రీ దేవీ భాగవతం కమనీయం ‘’అన్నాను . కలం దించకుండా మరిన్ని అర్ధవంతమైన ,మన సంస్కృతీ ప్రతి బి౦బాలైన రచనలు శ్రీదేవి గారు చేయాలని ఆశిస్తున్నాను .శుభం భూయాత్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-7-22-ఉయ్యూరు