గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-9
వలస
అమృతబజార్ పత్రికకు మూడేళ్ళలోనే విస్తృత పాఠకలోకమేర్పడింది .అభిప్రాయాలు వ్యాసాలూ సూటిగా ఉండటం ,కౌలుదార్ల ,భూస్వాముల సమస్యలు చర్చించటం తో అభిమానపాత్రమైంది .పత్రికకు ఆర్ధిక సాయం అందించటానికి జనం క్యూ కట్టారు .1871లో బెంగాల్ అంతటా మలేరియా కోరల్లో చిక్కింది .బెంగాల్ లో ఇదే మొదలు అంటువ్యాధి ప్రబలటం ..జేస్సూర్ జిల్లా అతలాకుతలమైంది .అమృతబజార్ గ్రామం లో ప్రతి యింటినీ బాధించింది .నిర్దిష్టమైన చికిత్స లేదు. కర్పూరం అప్పుడు అందరాని వస్తువు .దేశవాళీ మందులతో ఉపశమనం పొందినా మళ్ళీ తిరగబెట్టేది .అనేకమంది చనిపోవటం సోకినవారి కాయకస్టా నికి పనికి రాని నీరసంతో ఉండటం జరిగింది .దీనికి తోడూ వరదలూ ముంచెత్తాయి .పంటనాశనం పశునష్టం లెక్కలేకుండా పోయింది .నీరు నిలిచి మలేరియా దోమలకు అవాసాలుగా మారాయి .పత్రిక కూడా కష్టాలపాలైంది .కార్మికులూ బాధపడి ముద్రణ కుంటుపడింది .వర్షాకాలం వరదలు మరీ భీభత్సం సృష్టించాయి .
కనుక పత్రికను కలకత్తాకు తరలించాలని ఘోష్ సోదరులు భావించి ,చేతిలో దమ్మిడీకూడా లేక ప్రెస్ అమ్మేయాల్సి వచ్చింది .మోతీలాల్ దగ్గరవున్న రెండువండలు ,ఊర్లో షావుకారు దగ్గర అప్పు చేసిన మరోవంద మొత్తం మూడు వందల రూపాయలతో 30మంది కల ఆకుటుంబం కలకత్తా చేరి,బజార్ క్వార్టర్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని దిగారు .మళ్ళీ పత్రిక ముద్రించాలని సంకల్పం కలిగి ,ఒక ప్రెస్ 600రూపాయలకు అమ్మకానికి వస్తే ,శిశిర్ కుమార్ చాకచక్యం తో కమీషన్ ఏజెంట్ గా మారి 800 రూపాయలు సంపాదించగా ప్రెస్ కొన్నారు .ఈచేతి యంత్రాల ప్రెస్ తో కలకత్తాలో మొదటి అమృతబజార్ పత్రికను 21-9-1871న ముద్రించారు .ఇందులో శిశిర్ కుమార్ ‘’ఎన్నో వ్యయప్రయాసలు పడి,పత్రిక స్థాపించి నిలబడి అందరి మన్ననలు పొంది పల్లెనుంచి ఇప్పుడు తప్పని సరి పరిస్థితుల్లో ఈ పట్టణం నుంచి ముద్రిస్తున్నా మా అభిప్రాయాలలో మార్పెమీలేదు.కలకత్తా పౌరులు దయాపూరిత హృదయాలతో పత్రికను ఆహ్వానించాలని కోరుతున్నాం ‘’అని రాశాడు .1874వరకు తామున్నబౌ బజార్ లోని ఇంటి నుంచే పత్రిక ముద్రించారు .1874లో ఉత్తరకలకత్తా లోని బజార్ క్వార్టర్స్ లో విశాలమైన పురాతనమైన ఇంటిని అద్దెకు తీసుకొని .జర్నలిజం చరిత్ర చరిత్ర సృష్టించిన ఈపత్రిక ఉన్న గృహం కాశీం బజార్ మహారాజుది .నెలకు 40రూపాయలు అద్దె.50ఏళ్ళు ఇక్కడి నుంచే అమృతతబజార్ పత్రిక వెలువడటం మరో చరిత్ర ప్రసిద్ధమైన విషయం .ఇదే ఘోష్ సోదరుల నివాసంకూడా..తర్వాత అదే వీధిలో స్వంతభవనం కట్టుకొన్నా ,దీన్ని అద్దె భవనంగానే ఉంచుకొన్నారు .
దేశీయోద్యమం లో ఎందరెందరో మహానుభావులు దేశ ,విదేశాలనుంచి ఈ ఇంటికి వచ్చేవారు .ప్రఖ్యాత బెంగాలీకవి నవీన్ చంద్ర ఈ భవనం గురించి రాస్తూ శతాబ్ద కాలం మరమ్మతులు ఎరగని భవనం అన్నాడు .మెమరీస్ ఆఫ్ మోతీలాల్ పుస్తకం లో పరమానంద దత్తు ‘’కింద ,పై అంతస్తులనిండా ప్రింటింగ్ కు సంబంధించిన సామగ్రి గుట్టలు గుట్టలుగా ఉండేది .దుర్వాసన ,దుమ్ముతో ఉండేది .అపరిశుభ్రత కు నిలయం మెట్లు చాలాయిరుకు .మెట్లను కానీ గదులనుకానీ ఒక్కసారి కూడా ఊడ్చిన దాఖలాలు లేవు .మొదటి అంతస్తు వరండాలో మట్టికొట్టుకుపోయిన టేబుల్,విరిగిన కుర్చీపై మొకాళ్ళమధ్య గడ్డాన్ని ఆనించి ఒక చిన్న మనిషి ‘’బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించే అపార సామర్ధ్యం కల వ్యక్తీ కూర్చున్నాడు .మోతీలాల్ అనే ఈ సామాన్యవ్యక్తి ఒక మామూలు కాగితం ,సాదా పెన్ను తో రాజకీయ ఆయుధాలు విసురుతున్నాడు .ఆయన మకిలి పట్టిన ఎర్ర బోర్దరున్న సాదా పంచ ,బొత్తాలులేని తెల్లచొక్కాతో ఉన్నాడు.ఆయన పక్కన మరో బెంచి, నల్లులమయమైన ఒక చెయ్యివిరిగిన ఇంకో పాతకుర్చీ ఉన్నాయి .సీలింగ్ ల పై మరకలు సాలె గూళ్ళు ,గోడలపై ఉమ్మి మరకలు ,ఇంకా ఎన్నెన్నో మచ్చలు ఉన్నాయి .గది అంతా దర్రీ పరిచి దానిపై దుప్పట్లు పరిచారు .దుప్పట్లు వగైరాలు ‘’మేము చాకలాడి మొహం చూసి ఎరగం ‘’అని మొత్తుకొంటున్నాయి.అలాంటి గదిలో తమ పాదముద్రలతో పవిత్రం చేయని దేశ ప్రముఖుడు ఎవరూ లేరు .లోపలిగదులు మరీ దారుణం అని విన్నాను ‘అని రాశాడు .
ఘోష్ కుటుంబం కలకత్తా చేరేనాటికి దాని జనాభా 10లక్షలు .బెంగాలీలమెజారిటి తక్కువ -1.3శాతం .రాజకీయ వాణిజ్యాదికారాలన్నీ బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉన్నాయి .టెలిగ్రాఫ్ రైల్వేలకూ వారే అధిపతులు .వ్యాపార వాణిజ్యాలలో కొద్దిమంది అమెరికన్లు యూదులు గుజరాతీలు ,ముస్లిం లు ఉండేవారు .కార్మికులంతా బీహార్ యుపి ఒరిస్సా ల నుంచి వచ్చిన వారే .బెంగాలీలలో ఎక్కువమంది గుమాస్తాలు టీచర్లు లాయర్లు డాక్టర్లు .ఇంగ్లీష్ విద్యకు ఆనగరం గొప్ప కేంద్రంగా ఉంది .1872నాటికి జిల్లా ముఖ్య పట్టణాలైన జెస్సోర్ ,ఢాకా,కృష్ణనగర్ ,మిడ్నపూర్ ,మెమెన్ సింగ్ ,ర౦గపూర్ ,పాట్నా లలో జాతీయోద్యమం జీర్ణించు కొన్న విద్యావంతుల వర్గం ఏర్పడింది .స్టేట్స్ మన్,ఇండియన్ డైలీ న్యూస్ ,దిఇంగ్లీష్ మాన్ పత్రికలు బ్రిటిష్ వారికి కొమ్ముకాసేవి .దిహిందూ ,పెట్రియట్,ఇండియన్ మిర్రర్ ,దిబెంగాలీ అనే ఇంగ్లీష్ పేపర్లు బాగా ప్రాచుర్యం పొందాయి .బెంగాలీ పత్రికారంగానికి సోంప్రకాశ్ , వారపత్రిక సులభ ఫా సమాచార్ ,అమృతబజార్ పత్రిక ప్రాతి నిధ్యం వహించాయి .పత్రిక నడపటం ఈ మహానగరం లో చాలాకష్టంగా ఉండేది .దీనికి తోడూ ఆదాయం పై పన్ను పెంచి ప్రభుత్వం మరీ ఇబ్బంది పెట్టింది .దీన్ని అన్ని పత్రికలూ నిరశి౦చాయి .అమృతబజార్ పత్రిక మాత్రమె సమర్ధించగా ,చాలామంది ధనికులు ఆ పత్రిక కొనడం మానేశారు .దిగువ తరగతి ఆడాయవర్గాలు పత్రికే ను బాగా ఆదరించి వెన్ను దన్నుగా నిలబడ్డారు .రాజాదిగంబర సింగ్ లాంటి సంపన్నులు పత్రిక సర్క్యులేషన్ పెంచటానికి బాగా కృషి చేశారు .కలకత్తా హైకోర్ట్ ప్రముఖ న్యాయమూర్తి ద్వారకానాద్ మిత్రా కూడా అండగా నిలిచాడు .కానీ ఆయన ఒకసారి ‘’మీ పత్రికలో ఉగ్రవాదం అంతర్లీనంగా ఉంది ముందుముందు ప్రమాదంగా మారచ్చు ‘’అని అంటే ‘ప్రజలలో వారి అస్తిత్వాన్ని తెలుసుకోనేట్లు చేసి ,వివేచనా దేశ భక్తీ కలిగించటం మా పత్రిక లక్ష్యం ‘’అని శిశిర్ కుమార్ దీటుగా బదులిచ్చాడు .ఈ విధానాన్నే తర్వాతకాలం లో అన్ని పత్రికలూ అనుసరిచటం వలన అమృతబజార్ పత్రిక మార్గ దర్శనం చేసింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-22-ఉయ్యూరు