గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-10
పత్రిక మార్పులకు కారణాలు
ఇండియన్ సివిల్ సర్వీస్ వారి విమర్శలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి .ప్రభుత్వ వ్యవహారాల రూపకల్పనలో తమకు ఎక్కువ భాగస్వామ్యం కావాలని వారు కోరుతున్నారు .దీన్ని ఒప్పుకొంటే తమపని ఖాళీ అనుకొన్నది ప్రభుత్వం .అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ నలుగురు బ్రిటిష్,నలుగురు అనధికార ,ఇద్దరు భారతీయ అధికార ,ఇద్దరు అనధికార సభ్యులతో ‘’బెంగాల్ విధాన పరిషత్’’ ఏర్పాటు చేశాడు .సామ్రాజ్య విస్తరణ విధానాలు పత్రికలలో విమర్శలుగా రాకూడదని ,వైశ్రాయికి అసలు తెలియకూడదని ప్రభుత్వం వారి భావన .రష్యా భారత్ పై కన్నేసిందని అనుకోని లార్డ్ లిట్టన్ ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించే ప్రయత్నం లో 1870లో తలమునకలై ఉన్నాడు .కాశ్మీర్ మహారాజుకు ఆయుధాలు సరఫరా చేసి ,చిత్రాల్ లోకి సైన్యాన్ని దించమని ప్రేరేపించాడు .కాశ్మీర్ అజేయ రాజ్యం .అధిక పన్నుల భారం తో ఇండియా కునారిల్లుతోంది .దుర్భిక్షాలు ఇబ్బంది పెడుతున్నాయి .ఈరెండిపైన వైశ్రాయిదృష్టి లేదు .అప్పటి బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్ ఆప్లె ఏడెన్ లంచాలు ఎరచూపి ఇంగ్లీష్ పత్రికల నోళ్ళు నొక్కటానికి ప్రయత్నించాడు .హిందూ పేట్రియట్ పత్రిక ఎడిటర్ కృపతో, దాస్ పాల్ ను లొంగదీసుకొన్నాడు .యితడు శిశిర్ కుమార్ కు కబురు చేశాడు .తనమాటవింటే ప్రభుత్వం లో ప్రాతినిధ్యం కల్పిస్తానని ఆశపెట్టాడు .దీనిపై మోతీలాల్ రాస్తూ ‘’నువ్వు ,నేను ,కృపతో దాసు కలిసి బెంగాల్ని పాలిద్దాం .నేను చెప్పినట్లు పత్రిక నడపటానికి దాస్ ఒప్పుకొన్నాడు .నువ్వూ ఒప్పుకో .పెట్రియట్ కు ఇస్తున్నట్లే నీకూ ముట్ట చెబుతాం .ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నువ్వు ఏదిరాసినా ము౦దు నాకు పంపు .ప్రభుత్వం ఎక్కువకాపీలు కోనేట్లు చేస్తా .నిర్వహణలో దాస్ తో పాటు నిన్నూ సంప్రదిస్తా ‘’అని ప్రతిపాదించాడని చెప్పాడు మోతీలాల్ .
నిజంగా అప్పుడు శిశిర్ కుమార్ చాలా పేద వ్యక్తీ .కలకత్తా సమాజం లో ఆయన స్థితి గొప్పదేమీ కాదు కూడా .తంతే గారెల బుట్టలో పడే చాన్స్ వచ్చింది .కానీ ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి .కృతజ్ఞతలు తెలుపుతూ ‘’అయ్యా !ఈ భూమి మీద కనీసం ఒక్కడైనా నిజాయితీ కల జర్నలిస్ట్ ఉండటం చాలా అవసరం ‘’అన్నాడు ఇంకేముంది అవతలివాడు ఆగ్రహోదగ్రుడయ్యాడు.వ్యంగ్యంగా ‘’నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా .బెంగాల్ అ త్యున్నత అధికారిని నేను ఎప్పుడైనా సరే నిన్ను జైల్లోపెట్టి ఆరునెలలు ఉంచగలను .నీపత్రికను మూటాముల్లె తో సహా జేస్సూర్ పంపెయగలను ‘’అన్నాడు ఎడెన్.అవి వట్టిమాటలుకావు అప్పటికే ‘’వెర్నాక్యులర్ యాక్ట్ కింద ప్రభుత్వం పై ఎలాంటి విమర్శరాయమని జిల్లా మేజిష్ట్రేట్ కు లేదా పోలీస్ కమీషనర్ కు లిఖిత పూర్వకంగా తెలియజేయాలి పూచీకత్తుగా కొంతసొమ్ము కట్టాలికూడా .ఉల్లంఘిస్తే ఈడబ్బు తిరిగిరాదు .కోర్టుకు వెళ్ళే అవకాశాలూ ఉండవు .ఇదంతా ముఖ్యంగా అమృత బజార్ పత్రిక పైన పెట్టిన గురిమాత్రమే .ఈ చట్టం అమలుకు పూర్వమే పూర్తిగా ఇంగ్లేష్ లో పత్రిక నడిపారు ఘోష్ బ్రదర్స్ .చట్టం పరిధినుంచి తప్పించుకోవటం వలన ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అని ఎదుర్కొన్నారు .’’పూర్తిగా ఇంగ్లీష్ లో ప్రచురించే పత్రిక లార్డ్ గారి యాక్ట్ కంటే అతీతమైంది ‘’అన్నాడు మోతీలాల్.వాడికి ఎక్కడోకాలి మిత్రులవద్ద గొణిగాడు .పత్రిక ఇంగ్లీష్ లో రావటం ఒక వారం ఆలస్యం అయిఉంటే ఈ నిబంధనలన్నీ అమలు చేసేది ప్రభుత్వం .వాళ్ళ తిత్తి తీసేవాడిని ‘’అని లబో దిబోమన్నాడట .
21-3-1878లో అమృత బజార్ పత్రిక పూర్తిగా ఇంగ్లీష్ లో ప్రచురితమైంది అందులో సంపాదకీయం లో శిశిర్ కుమార్ ‘’మాతృభాషలో పత్రికకు స్వస్తి చెప్పటం అనివార్యమైంది .మిత్రుల అభిమానుల సూచనలు పాటించాం .ఈమార్పు దేశానికి ప్రయోజనమా కాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది .ఐతే స్వేచ్చా స్వాతంత్ర్యాలతో ఒక ఆంగ్ల పత్రిక అవసరం .ఎన్నో అగ్నిపరీక్షలు తట్టుకోన్నాం .ప్రజాహృదయ స్పందన ప్రజాజాగృతి స్వేచ్చా స్వాతంత్ర్య హక్కు లకోసం పాటు పడే పత్రిక మనది. ఇకపైన కూడా మీ సంపూర్ణ సహకారం లభించాలని భగవంతుని ప్రార్దిస్తున్నాం ‘’అని తెలిపాడు అన్యా పదేశంగా .
కపట చట్టం వలన ప్రజలు తీవ్ర నిరశన తెలిపారు .1875,లో శిశిర్ కుమార్ మోతీలాల్ కల్సి ప్రజా సమైక్యతకు ‘’ఇండియన్ లీగ్ ‘’స్థాపించారు .1876 సురేంద్రనాధ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్ స్థాపించాక దీన్ని రద్దుచేశారు .ఆయన 1869లో ఇంగ్లాండ్ లో సివిల్ సర్వీస్ పాసై నా, వయసు తప్పుగా ప్రకటించాడని నియామకం ఉపసంహరించారు .దీనిపై కోర్టులో పోరాడి విజయం సాధించాడు .1871లో ఆయన్ను సిల్హెట్ లో అసిస్టెంట్ డిష్టిక్ట్ మీజిస్ట్రేట్ గా పోస్టింగ్ ఇచ్చారు .యూరోపియన్ లతో పాటు సమాన స్థాయి పొందాడు .కన్నుకుట్టిన ప్రభుత్వం నిరాధార ఆరోపనలు చేసి సర్వీస్ నుంచి తొలగించారు .ఇదొక పెద్ద వివాదమై ఆయన మళ్ళీ లండన్ లో అప్పీల్ చేసినా ఓడిపోయి ,బారిస్టర్ హక్కుకూడా కోల్పోయాడు .ఇదొక గోప్పమలుపైంది ఆయన జీవితం లో .
‘’ ఎ నేషన్ ఇన్ మేకింగ్ ‘’అనే తనపుస్తకం లో ఆయన ‘’మనం చాలాహీనంగా హేయంగా బతుకుతున్నాం .మనతప్పుల్ని తెలుసుకొని మన వ్యక్తిగత హక్కుల్నీ ,జాతి హక్కుల్నీ పరిరక్షించుకొంటూ గమ్యం వైపుకు సాగుదాం .మీ అందరికి నేను సహాయకుడిగా ఉంటాను ‘’అన్నాడు .ఆయన వజ్ర సంకల్పం వాక్ చాతుర్యం అందర్నీ ఆకర్షించాయి .ఆనందమోహన్ బోస్ నాయకత్వాన స్టూడెంట్స్ అసోసియేషన్ లో చేరాడు .ఆయన్ను ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ కాలేజిలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా నియమించాడు .ఈయన ‘’దిబెంగాలీ ‘అనే పత్రిక స్థాపించి తనభావ ప్రకటనకు ఉపయోగించుకొన్నాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-22-ఉయ్యూరు