గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-12
కాంగ్రెస్ రెండవ సదస్సు తర్వాత కలకత్తాలో దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షత న జరిగిన సభలో ఇండియన్ అసోసిఏషన్ అందులో విలీనమై జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది .భారతీయుల్ని నామినేట్ చేయకుండా ఎన్నికలలో నిలిచి గెలిచేట్లు చేయాలనే డిమాండ్ వచ్చింది .విదేశీ యంత్రాంగం కింద మగ్గడం అనే కాంగ్రెస్ మాటలకు లార్డ్ డఫ్రిన్ కు కోపమొచ్చి విరుచుకుపడ్డాడు .మోతీలాల్ కాంగ్రెస్ ను సమర్ధించాడు .డఫ్రిన్ కాంగ్రెస్ ను ‘’సూక్ష్మమైన అల్ప సంఖ్యాక వర్గానికి ‘’ప్రాతినిధ్యం వహిస్తోందని అనటం మోతీలాల్ కు నచ్చక కాంగ్రెస్ తో చేతులు కలిపాడు .1888అలహాబాద్ కాంగ్రెస్ సదస్సుకు ఖద్దరు బట్టలతో హాజరయ్యాడు .ఐయే ఎస్ పాసైన భారతీయులు లండన్ లో ఒక ఏడాది శిక్షణ పొందాలి అన్నదాన్ని వ్యతిరేకించాడు .అందరూ ఆయన్ను అభినందించారు .కాంగ్రెస్ లో చర్చలు సరిగ్గాజరగాకపోవటం ,భారత్ ఇంగ్లాండ్ లమధ్య సయోధ్యతకే తంటాలు పడటం ఆయనకు నచ్చలేదు .పాలనలో బ్రిటిష్ వారితో సమానాధికారాలకోసమే అర్రులు చాచటమూ నచ్చలేదు .మైనారిటీల మానవ హక్కులు చాలా విలువైనవనీ వాటిని బల ప్రదర్శనతోనే సాధించుకోవాలని ఆయన నమ్మి ,పత్రికలో దాన్ని వ్రాసేవాడు .
ప్రభుత్వం ముస్లిం వేర్పాటు వాదాన్ని వెనకేసుకొచ్చింది .సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ద్వారా పోటీ రాజకీయ పక్షాన్ని రూపొందించారు .హిందువులు ,ముస్లిములు వేర్వేరు జాతులనీ ,కనుక ప్రభుత్వం ఏర్పడితే బెంగాలీ బాబుల ఆదిపత్యం పెరిగి ముస్లిం లకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేశాడు .’’ఉన్నత కుటుం బీకులు తమ ధన మాన ప్రాణాలను దిగువ శ్రేణి ప్రజలకు నమ్మి ఇవ్వరు ‘’అని వ్యంగ్య బాణాలు వేశాడు .దీనికోసం 1888లో ‘’యునైటెడ్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్ ‘’ను కాంగ్రెస్ కు పోటీగా స్థాపించాలనుకొని హిందూ ముస్లిం ఉన్నతవర్గాలవారితో ఏర్పాటు చేశాడు .1878లోనే అమీర్ అలీ అనే సంపన్న ముస్లిం బారిస్టర్ ‘’సెంట్రల్ నేషనల్ మహామ్మదీన్ అసోసియేషన్ ‘’ను ప్రభుత్వం లో ముస్లిం భాస్వామ్యాన్ని పెంచటానికి ఏర్పరచాడు .నామినేషన్ లద్వారానే లాభం పొందాలని అతడి ఆలోచన.దీనివల్ల బెంగాల్ లో కాంగ్రెస్ అంత పటిష్టం కాదు అనే భావన కలిగింది .స్థానిక ,ప్రాంతీయ సమస్యలను చర్చించటానికి కాంగ్రెస్ అంతగా అభి రుచి చూపకపోవటమూ మరోకారణం .కరువు కాటకాలు వరదలు ఒకదానితర్వాత ఒకటి వచ్చి మీద పడటం తో గ్రామీణ రైతాంగానికి దిక్కు తోచటం లేదు .తేయాకు తోటల్లోకి బలవంతంగా కూలీలను తెప్పించి శ్రమ దోపిడీ చేస్తోంది ప్రభుత్వం .బెంగాల్ ప్రజలు పేదరికం లో అల్లాడి పోతుంటే కాంగ్రెస్ అసలేమీ పట్టించుకోవటం లేదు .ఈ మొండి వైఖరి వలన 1887’’బెంగాల్ ప్రోవిన్షియల్ కాంగ్రెస్’’ఏర్పడక తప్పిందికాదు .అణగారిన ప్రజలు రైతులు కూలీల తరఫున విద్యాధికులు ఉద్యమిస్తేనే తప్ప వారికి న్యాయం జరగదని మోతీలాల్ మొదలైన వారు భావించారు .ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వంకోసం కాంగ్రెస్ కంటే బెంగాలీలే పట్టు బట్టారు .అన్ని గ్రామాలూ జిల్లాలు కలకత్తా తో సమానంగా నిలిచాయి .ఈకార్యకలాపాలను అమృతబజార్ పత్రికలో కవరేజ్ బాగా వచ్చేది .శిశిర్ కుమార్ ఇంగ్లీష్ భాష మధ్యతరగతి వారికి హాయిగా అర్ధమయ్యేది .భారతీయ ప్రత్యామ్నాయ పదాలు కూడా మధ్యమధ్యలో వాడేవారు .ఈ ఇంగ్లీష్ ను ఇంగ్లీష్ వారు ‘’బాబూ ఇంగ్లీష్ ‘’అని ముఖం చిట్లించేవారు .
ప్రజా జీవన రంగం లో
1887 లో పబ్లిక్ సర్వీస్ లపై సుప్రీంకోర్ట్ ‘’రాయల్ కమిషన్ ‘’ఏర్పాటు చేయగా ,మోతీలాల్ సాక్షిగా హాజరై ముందుగా పోస్టల్ డిపార్ట్ మెంట్ గురించి మాట్లాడుతూ అందులో ఉద్యోగులంతా ఆంగ్లేయులే అనీ ,అవినీతి నిలయంగా మారిందని ,సమర్ధ భారతీయులతో ఈశాఖను నింపాలని చెప్పాడు .ఆతర్వాతనే భారతీయులను తీసుకోవటం మొదలుపెట్టారు .పోస్టల్ డైరెక్టర్ జనరల్ ‘’హాగ్ ‘’రాజీనామా చేసేశాడు .18-20మధ్య వయసున్నవారిని ఆ డిపార్ట్ మెంట్ లో పెద్దపెద్ద పదవుల్లో నియమిస్తే అనుభవం లేక పాలన సరిగ్గా జరగదు .వాళ్ళంతా తల్లి గర్భం లో 12ఏళ్ళు ఉన్న ఆష్టావక్రులై ఉంటేనే అది సాధ్యం అని వ్యంగ్యం గా అన్నాడు .మోతీలాల్ చేసిన ఈ వ్యాఖ్యలకు పాఠకుల నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది .ఒక యూరపియన్ ఆకాశ రామన్న ఉత్తరం పత్రికకు రాస్తూ-‘’మోతీలాల్ !పబ్లిక్ కమీషన్ ఎదుట నీ వాగుడు చదివిన వారికి మీ దుర్మార్గజాతి ఎలాంటి నీచులో తెలిసింది .అక్కడి యూరోపియన్ పెద్దమనుషులు బూటు మడమలతో నీ వీపు మోగించ లేదు అంటే ఆశ్చర్యంగా ఉంది .మీ బెంగాలీలకు అదే శాస్తి జరగాలి .మీ అంత నికృష్టజాతి భూమ్మీద లేదు .మెకాలే ఏమన్నాడో తెలుసా ?మీ (ముద్రించటానికి వీల్లేని బూతు )అందర్నీ ఇంగ్లీష్ ప్రభుత్వం కనుక సహిస్తోంది .బెంగాలీలు దగుల్బాజీలు లుచ్చాలు ,మోసగాళ్ళు వాళ్ళందర్నీమించి నువ్వు నీ వాళ్ళు నీజాతి పరువు తీసేశారు ‘’అని అక్కసు వెళ్ళ గక్కాడు .అమృత బజార్ పత్రికలో ఆ లేఖను ముద్రించి చివరగా ‘’ఈ లేఖ ఒక యూరోపియన్ కానీ పోస్టల్ ఆఫీసర్ కాని రాసి ఉంటాడు .అదే నిజమైతే ఆబూతులన్నీ అతనికి ఉద్యోగామిచ్చిన పెద్దమనిషికే తగలాలి .దీన్ని ఆయనకు ఉచిత కానుకగా ఇస్తున్నాం ‘’.అని రాశారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-7-22-ఉయ్యూరు