జ్ఞాపకాల మొగలిపొత్తు పరీమళాలలో శ్రీ సోమయాజి గారు

జ్ఞాపకాల మొగలి పొత్తు పరీమళాలలో  శ్రీ సోమయాజి గారు

  ఈనాటి సాహిత్యలోకం లో సోమయాజి గారు అంటే శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారే .ఆయనలో గొప్ప కవీశ్వరుడు ,దార్శనికుడు ,ఆత్మీయ స్నేహమూర్తి ,మీదు మిక్కిలి భక్తకవి కనిపిస్తారు .తాతగారు వాగ్గేయ కారులు శ్రీ పువ్వాడ రామదాసు గారు .తండ్రిగారు ఆంధ్రదేశం పట్టని కవిపాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారు .వీరు అక్కడి కుదురు లోని ఇంగువకట్టిన గుడ్డ .సల్లక్షణాలన్నీ,వారసత్వంగా ,కొంత స్వయం సంపాదకంగా లభించినవీ ,లాభించినవీ .’’జీవితభీమా సంస్థ ‘’లో ఉద్యోగించి డివిజనల్ స్థాయి ఆఫీసర్ గా పదవీ విరమణ చేశారు .గత ఏభై  ఏళ్ళుగా  కృష్ణా జిల్లా రచయితల సభకు పెద్ద కాపుగా అండదండగా ఉంటూ సంస్థ ఎదుగుదలకు అన్నిరకాలుగా దోహదం చేశారు .మొన్న అంటే 18 వ తేదీ సోమవారం రాత్రి  అయ్యదేవర కాళేశ్వర రావు గారిపై  నేను చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఆద్య౦త౦ 6-30 నుంచి 7-30వరకు నాన్ స్టాప్ గా చూశారు .నిన్న 19 మంగళవారం ఉదయం 6-30 గంటలకు శివైక్యం చెందారంటే ఆశ్చర్య పోయి ,నమ్మాల్సి వచ్చింది .ఆయన నమ్మిన శ్రీ రామ సన్నిధి చేరారు .నాపై అనంత ప్రేమ ,ఆదరం, గౌరవం ,ఆపేక్ష ఉన్నవారాయన .నాకూ వారు పెద్దన్నయ్య లాటి వారే  .నిన్న అనుకోకుండా నేను కొంచెం నీరసంగా ఉండటం తో   వారి అంతిమ దర్శనానికి వెళ్ళలేక పోయిన అభాగ్యుడను .వారి ఆత్మకు శాంతి కలగాలనీ ,వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

కృష్ణా జిల్లా రచయితల సంఘానికి వెన్నెముకగా ఉన్న ప్రముఖ కవులు రచయితలు   శ్రీ మాదిరాజు రామలింగేశ్వరావు గారు ,శ్రీమతి కె.బి. లక్ష్మిగారు గతించి పూడ్చరాని పెద్ద లోటునే కలిగించారు  .ఇప్పుడు పువ్వాడ వారి ఆకస్మిక మరణం కోలుకోలేని  మరో దెబ్బ .నవ్వుతూ ఆనవ్వుమాటున వ్యంగ్యపు మొగలి ముల్లు గుచ్చుతూ స్నేహ పరీమళాన్ని వ్యాపించే ఉత్తమ సంస్కారి సహృదయులు ,సౌజన్య మూర్తి సోమయాజులుగారు .నుదుట ఎర్రని నిలువు శ్రీ చూర్ణం ,తెల్లని పైజమా, లాల్చీలతో నవ్విస్తూ ,కనుకోసల్నించి కవ్విస్తూ పలకరించారు అంటే ఆయన పువ్వాడ సోమయాజి గారే .

  సోమయాజి గారితో నా మొదటి పరిచయం సుమారు 52ఏళ్ళ క్రితం జరిగినట్లు జ్ఞాపకం .కృష్ణా జిల్లా గ్రంథాలయ  శాఖ కార్యదర్శి శ్రీ చంద్ర శేఖరరావు గారు బందరు  ఫోర్ట్ రోడ్ లోని సెంట్రల్ లైబ్రరీ లో  శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి ని ఆహ్వానించి ముఖ్య ప్రసంగం ఏర్పాటు చేశారు .అప్పుడు ఉయ్యూరు హైస్కూల్ లో మాతో పాటు పని చేస్తున్నఆధునిక కవిత్వం పై అధారిటి ,మహా సారస్వత విమర్శకుడు  స్వర్గీయ టి.ఎల్.కాంతారావు గారు మమ్మల్ని కూడా  ఆసభకు  వెడదాం రమ్మని కోరగా ,ఆయనతోపాటు నేనూ ,లెక్కల మేష్టారు శ్రీ పసుమర్తి .ఆంజనేయ శాస్త్రిగారు ,హిందీ మాస్టారు శ్రీ కొడాలి రామా రావు గారు కలిసి బస్ లో వెళ్లాం .అక్కడ సోమ సుందర్ గారి ఉపన్యాసం రాత్రి 8కి అని గుర్తు .అనర్గళంగా తన వజ్రాయుధం కావ్యం గురించి మిగిలిన సాహిత్య విషయాలగురించి అద్భుత ప్రసంగం చేశారు .అదే ఆయన్ను మొదటి సారి చూడటం .  ,అప్పుడప్పుడు బెజవాడ రేడియో స్టేషన్ వారి ఉగాది కవి సమ్మేళనాల లో  చూశాను. చివరిసారిగా కృష్ణా జిల్లా రచయితల సంఘం జరిపిన ప్రపంచ తెలుగు రచయితల సభలో ఆయన వెబ్ సైట్ ను శ్రీ రామతీర్ధ వేదికపై ప్రారంభించినప్పుడు  చూశాను .బహుశా ఇదే చివరి సారి అయిఉంటుంది .అప్పటికే పండి పోయారు .

  సరే బందరులో ఆవంత్స వారి ప్రసంగం అవగానే ఆయన్ను కారేక్కించి పంపేశారు .ఆ రాత్రి భోజనం ,పడక  సెక్రెటరి చంద్ర శేఖరరావు గారి౦ట్లోనే అని గుర్తు .ఈ ఏర్పాట్లన్నీ కాంతారావు గారే చేశారు .బహుశా మర్నాడు ఆదివారం ఉదయం అందరం అక్కడే కాలకృత్యాలు వగైరా  ,కాఫీ టిఫిన్లు పూర్తీ చేశాక .మమ్మల్ని కాంతారావు గారు ముందుగా శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారింటికి తీసుకు వెళ్ళారు .అక్కడ వారి తండ్రిగారు కవిపాదుషా శేషగిరిరావు గారు వాలు కుర్చీలో  ఆసీనులయి ఉండగా దర్శించి నమస్సులు అందించాం .తర్వాత సోమయాజిగారితో పరిచయం చేయించారు కాంతారావు గారు .మళ్ళీ అక్కడ కూడా వారి ఆతిధ్యం తీసుకోనినట్లు జ్ఞాపకం .అక్కడి నుంచి ప్రముఖ కథకులు విమర్శకులు ,ఎల్ ఐసి లో ఉద్యోగి  శ్రీవిహారి గారింటికి తీసుకొని వెళ్లి పరిచయం చేశారు .ఆతర్వాత అదే సంస్థలో పని చేస్తున్న ,సాహితీ వేత్త శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారినీ పరిచయం చేశారు .అప్పుడాయన ఇన్ షర్ట్ లో సన్నగా రివటగా ఉన్నట్లు జ్ఞాపకం . సుబ్బారావు గారి మీద ఎందుకో కాంతారావు గారి మాటలలో సదభిప్రాయం వ్యక్తమయ్యేది కాదు .పిమ్మట అదేసంస్థలో ఉద్యోగి మహా కథారచయిత సి. రా .అంటే శ్రీ సింగరాజు రామ చంద్ర మూర్తి గారినీ కూడా వారి వారి ఇళ్ళ వద్ద పరిచయం చేశారు .ఆతర్వాత ఆంద్ర సారస్వత సమితి అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణ గారినీ ,పరిచయం చేశారు .వీరందరితో మాకు అదే మొదటి సారి పరిచయం . అంతా అయ్యాక అందరం మళ్ళీ బస్సెక్కి ఉయ్యూరు ఏ మధ్యాహ్నానికో చేరి ఉంటాం .బందరులో ఇందరు సాహితీ మూర్తుల పరిచయ భాగ్యం కలగటం శ్రీ కాంతారావు గారి సౌజన్యమే కారణం .మర్చి పోలేని సుగంధ సాహితీ పరిమళం ఇదంతా .

  2008 లో కృష్ణా జిల్లా రచయితల సంఘం తో పరిచయం శ్రీ సోమంచి రామ౦ గారి వలన  జరిగింది .ఆయనే నన్ను సుబ్బారావు ,పూర్ణ చ౦ద్ గార్లకు పరిచయం చేసి నా చేత సెకండరీ విద్య మీద ఒక వ్యాసం రాయించారు జాతీయ సభలకోసం .అప్పటినుంచి ఆ సంఘం లో నాకు చ.క్కని అవకాశాలిస్తూ  ,ప్రోత్సహిస్తూ ,మంచి మంచి వ్యాసాలూ రాయిస్తున్నారు.నన్ను తమలో ఒకరినిగా చేసుకొన్నారు . సంస్థ నిర్వహించే జాతీయ అంతర్జాతీయ మహాసభల కు నేను తప్పక హాజరౌతూ నావంతు సాహితీ సాయం చేస్తున్నాను .వారిద్దరూ కూడా ఉయ్యూరులో నేను సాహితీ మండలి కన్వీనర్ గా ఉంటూ చేసిన కార్యక్రమాలకు వస్తూ ,విలువైన ప్రసంగాలు చేస్తూ ,ప్రోత్సహించారు .అప్పుడే బెజవాడ సభలలో శ్రీ సోమయాజిగారితో పరిచయం బలపడింది .ఆయన్ను ఉయ్యూరు తీసుకువచ్చి సాహిత్య ప్రసంగం చేయించి ,మా తలిదండ్రులు గబ్బిట భావనమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక పురస్కారం అందించాను .ఆ ఉపన్యాసం పై నా స్పందన తర్వాత కార్డ్ మీద రాసి పంపాను చదివి పరమసంతోషించారు .ఆతర్వాత రేడియోలో బుద్ధుని పై ప్రసంగం చేసినప్పుడు సోమయాజిగారిదో వారి నాన్నగారిదో ఒక పద్యం కోట్ చేసి స్పూర్తి కలిగించా .

  2009లో సరసభారతి స్థాపించిన దగ్గరనుండీ సుబ్బారావు,పూర్ణచంద్ .బుద్ధప్రసాద్ ,మాదిరాజు, సామల రమేష్ ,సోమయాజిగార్లు  మా కార్యక్రమాలకు వస్తూ ప్రసంగిస్తూ,పుస్తకావిష్కరణ లో , కవి  సమ్మేళనాలలో పాల్గొంటూ మాసంస్థ అభి వృద్ధికి తోడ్పడ్డారు . గ్రంథాలయ వారోత్సవాలలో కూడా సోమయాజిగారిని ఆహ్వానించి లైబ్రేరియన్ శ్రీమతి సుజాత గారి ఆధ్వర్యం లో సత్కరించాం.హాస్య కవి సమ్మేళనం లో సోమయాజిగారు ఆత్మీయ అతిధిగా విచ్చేసి ‘’ఉయ్యూరు అంటే నాకు చాలా ఇష్టం .ఇక్కడి కవి సమ్మేళనాలు అంటే మరీ ఇష్టం .అందుకే తప్పక హాజరౌతాను .మంచి సాహితీ అభిరుచి ఉన్న సంస్థగా సరసభారతి అభి వృద్ధి చెందుతోంది ‘’అని చెప్పి హాస్య స్పోరకంగా రాసిన ఒక  పద్యం చదివి వినిపించారు  

  కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన అన్ని బృహత్తర కార్యక్రమాలలో శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిగారు ఒక అధికార కోశాధికారిగా  చేతిలో బాగ్ అందులో డబ్బు ఉన్న కవర్లు పెట్టుకొని ఆహ్వానితులకు అతిధులకు అందజేయాల్సిన పైకాన్ని అందిస్తూ,పుస్తకం లో సంతకాలు పెట్టిస్తూ కనిపించటం ఒక ప్రత్యేకతగా నేను చాలా సార్లు గమనించాను .అంతటి నిబద్ధత వారిది అందుకే ఆ  బాధ్యత వారిపై పెట్టేది సంఘం .సర్వ సమర్ధతతో వారు నిర్వహించేవారు .అసలే మాట బహు స్వల్పం ,వినిపించీ విని పించనట్లు మాట్లేడేవారు ఆబాధ్యతలో నవ్వుతూ చాలా ఓపికగా కనిపించేవారు .ఆయన లేని సభ మొన్న నవంబర్ లో బందరులో జరిగిన సభ తప్ప దాదాపు అన్నిటిలో చూసిన గుర్తు ఆయన ఉంటె ఒక ఠీవి,ఒక దర్జా ,ఒకరాజసం ఒక నిండుతనం,ఒక ఆత్మీయ స్పర్శ  కనిపించేవి .

  సోమయాజిగారు తమ పుస్తకావిష్కరణ సభలనూ కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో చాలా ఘనంగా జరిపేవారు .గొప్ప ఉపాహారం, దానితర్వాత మహా విందు తప్పని సరి .స్వాదిష్టమైన భోజనాలే అవి .దాదాపు నాలుగేళ్ల క్రితం తండ్రిగారి కార్యక్రమం ఒకటి హోటల్ ఐలాపురం లో జరిపి వారి కుటుంబంలోని చిన్నా పెద్దలను అందర్నీ వేదికపై సన్మానించి జ్ఞాపికలు అందించారు .వారందరిలో ఆత్మీయత ,ఆనందం చూసి పొంగిపోయారు .వారి కుటుంబ పెద్దల ఆశీర్వచనం పొందుతూనే వారిలోని వినయ విధేయతలు ప్రస్ఫుటంగా చూశాను .ఆ దృశ్యం ఇంకా నా కళ్ళముందు మెదులుతూ చిరస్మరణీయంగా ఉంది . మిత్రులు ,నా అభిమాని ,సరసభారతికి ఆత్మీయులు ,తనదైన ధోరణలో పద్యరచన చేస్తూ అంతే విలక్షణ ధోరణిలో భావ రాగ యుక్తం గా పద్యాలు  హృద్యాలయేట్లు చదవగలిగిన నేర్పున్న శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు తమ పితృదేవులు కవిపాదుషాశ్రీ పువ్వాడ శేషగిరిరావు మహోదయుల ‘’కవిత్వం ,వ్యక్తిత్వం ‘’పై ఒక సమగ్ర  బృహద్గ్రంథాన్ని ప్రచురించి పిత్రూణ౦ తీర్చుకొన్నారు .దాన్ని నాపై అభిమానంతో నాకు పంపగా 25-7-19 చేరింది .పాదుషా గారి గురించి అందులో ఎందరెందరో ఎన్నెన్నో విధాల చెప్పారు .ఇటీవలే తండ్రిగారి సాహిత్య సర్వస్వం ప్రచురించి పిత్రూణం తీర్చుకొన్నారు .దీనికి నా అభిప్రాయాన్ని రికార్డ్ చేసి వాట్సాప్ లో  పంపమని ఫోన్ పై కోరితే రికార్డ్ చేసి పంపాను .అంతటి అనురాగం వారికి నాపై ఉండేది .సోమయాజిగారి భార్యగారు బహుదొడ్డ ఇల్లాలు .పిల్లలు రత్నమాణిక్యాలు .     దేశం లోని అవధానాలలో ,భువన విజయాలలో ఆయన లేకుండా ఏదీ జరగలేదనే జ్ఞాపకం .పద్యాలు ఆయన హృదయం లోతుల్లోంచి పెల్లుబుకుతాయి .ఆధునిక పదాలకంటే సంప్రదాయ సిద్ధపదాలకే ఆయన ప్రాధాన్యమిస్తారు .ఇటీవలే రామాయణకావ్యమూ రచించి ధన్యులయ్యారు . రేడియోలో ,చినుకు మాసపత్రికలో ఎన్నెన్నో అద్భుత పద్యాలను విశ్లేషించి ,లోతులు తరచి అందచందాలు వివరించారు .సరసభారతి కవి సమ్మేళనానికి ముందు ఆయన్ను పిలిచి తర్వాతే మిగతా వారిని పిలవటం నాకు అలవాటు.  సరసభారతి సాహితీ పుష్కరోత్సవానికి అలానే వారిపేరు ముందు చేర్చి గౌరవి౦చా౦ .

  సరసభారతి తరఫున జరిపిన కవి  సమ్మేళన కవితలను పుస్తకాలు గా ప్రచురించినప్పుడు ఒకసారి మిత్రుడు శ్రీ తుమ్మోజు రామలక్ష్మణా చార్యుల గారి కవిత చదివి బాగుందని మెచ్చి, ఆయన నంబర్ అడిగి తీసుకొని ఆయనతో మాట్లాడి అభినందించిన కవితా పిపాసి పువ్వాడ వారు .అంతేకాదు మేము శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారిపై ముగ్గురు కవులతో మూడు శతకాలు రాయించి నప్పుడు ఆచార్యులవారు సోమయాజిగారికి చూపించి మెరుగులు దిద్ది౦చు కొన్నానని చెప్పారు ,మా సువర్చలాన్జనేయస్వామికి 1,116 రూపాయలు ఆచార్యులగారి   ద్వారా అందించిన మహా భక్తులు .వారిబావగారు శ్రీ కోడూరిశ్రీ పాండు రంగారావు గారు కూడా మహా భక్తకవులైన రిటైర్డ్ ఆఫీసర్ .’’అరణ్య పర్వం నన్నయ్యే వ్రాశాడు’’  అనే సాధికారమైన గ్రంథం రాశారు ‘’శ్రీనాథుని పద్యాలవంటి పద్యాలు రాయగల బావగారు తిక్కన సోమయాజి గారికి దీటైనవారు .పోతన శ్రీనాథులవంటి వారు .వారూ మా సభలకు వచ్చేవారు .ఒకసారి బందరులో మా హెడ్ మాస్టర్ మిత్రుడు శ్రీ కోసూరు  ఆదినారాయణ గారబ్బాయి ఉపనయనానికి  వెడితే అక్కడ రావుగారి దంపతులు తమ ఇంటికి తీసుకువెళ్ళారు .ఈ విషయం సోమయాజిగారికి చెబితే పరమానంద పడ్డారు .

  సోమయాజిగారు తమమనవరాలి నాట్య అరంగేట్రం కు ప్రోత్సహిచమనిచెబితే  అలానే చేసి అందరికీ తెలియజేశాం సరసభారతి ద్వారా . సుమారు అయిదేళ్ళక్రితం తమ బంధువుల అమ్మాయికి సంబంధం చూస్తూ ,ఆవరుడి గురించి వాకబ్ చేయమంటే చేసి సంతృప్తి కలిగించాను . సుమారు మూడేళ్లక్రితం ఆయన భార్యగారు కైలాస గౌరీ  నోము నోచుకోవాలని  అనుకొంటున్నారనీ  ,వారిద్దరూ మా ఇంటికి వచ్చి పూర్తి వివరాలను మాశ్రీమతి వద్ద తెలుసుకొంటామనీ ఫోన్ లో చెప్పారు ,.హృదయ పూర్వక స్వాగతం అని చెప్పాము .చేసుకొన్నదీ లేనిదీ తెలీదు .మరో తమాషా ఏమిటంటే వారింటికి మేము  వెళ్ళటం  మా ఇంటికి వారు రావటం కూడా జరగలేదు .

  2013నవంబర్ 19న శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి అర్ధాంగి శ్వాస  పీల్చటం ఇబ్బంది కి గురై బెజవాడ హెల్ప్ హాస్పిటల్ లో చేర్పిస్తే పూర్ణ చంద్ గారు ఫోన్ చేసి చెబితే  నేను చూడటానికి వెళ్లాను .అక్కడ అప్పటికే ఆయనా ,సుబ్బారావు గారితోపాటు సోమయాజిగారూ ఉన్నారు .మధ్యాహ్నం ఒంటి గంటవరకు అక్కడే ఉండి ఇంటికి బయల్దేరి వస్తూంటే సోమయాజిగారు తమ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తే ,గంటలో ఇంటికిచేర్తాను వద్దని చెప్పాను . బెజవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి ఆధ్వర్యం లో ‘’ఆధునిక గిరీశం –వెంకటేశం ‘’ ‘’ రూపకం లో ఆదిత్య ప్రసాద్ ఆనంద గజపతి వేషం వేస్తే సర్వశ్రీ ధారా రామనాధ శాస్త్రి ,పింగళి  కృష్ణా రావు ,పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,జంధ్యాల మహాతీశంకర్,పువ్వాడ తిక్కన సోమయాజి మొదలైన వారు గురజాడ అప్పారావు ఆదిభట్ల నారాయణ దాసు మొదలైన వారి వేషాలు ధరించి రక్తి కట్టించారు ..

  సోమయాజి గారి  తాత గారు పువ్వాడ రామ దాసు గారి  కీర్తనల పుస్తకం నాకు పంపిస్తే చదివి ,దానిపై నెట్ లోవ్యాసం రాసి ఆయనకు మెయిల్ ద్వారా తెలియజేశాను .ఆయన నెట్ లో ‘’మన సాహితీ  బంధువు .‘’ అన్నీ చదువుతారు స్పందిస్తారుకూడా .సుమారు పాతికేళ్ళ క్రితం మొవ్వలో క్షేత్రయ్య పదసాహితీ సదస్సుఅక్కడి తెలుగు లెక్చరర్ శ్రీమతి వై.శ్రీలత  కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో రెండు రోజులు జరిపితే సోమయాజి గారు వచ్చి అక్కడే పుట్టిన పువ్వాడ రామదాసుగారు తమ తాత గారే అని గొప్ప వాగ్గేయకారులనీ చెప్పారు రేడియోలో ఆయన గీతాలు వినేవాడినే కానీ ,ఆయన వీరికి బంధువని అప్పుడే తెలిసింది .

  సుమారు పది హేను రోజులక్రితం సోమయాజిగారు ఒక మెయిల్ రాస్తూ ,తన పొరబాటు వలన సాహితీ బంధువు లో తన పేరు లేకుండా పోయిందనీ ,మళ్ళీ చేర్చమనీ ,అలానే వాట్సాప్ గ్రూప్ లో కూడా చేర్చమని కోరితే చేర్చాము .అంతేకాదు ఆయన ఇంటిదగ్గర వారు,ఆయన గొప్ప మిత్రుడు  రిటైర్డ్ ఆఫీసర్ ,కవి ,సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ కందికొండ రవి కిరణ్ గారిని సాహితీ పుష్కరోత్సవ కవి సమ్మేళనం లో చేర్చమని మెయిల్ రాస్తే ,ఆయన్ను దత్తాత్రేయ శర్మగారి తో మాట్లాడించి ఎప్పుడో చేర్చామని తెలియజేస్తే చాలా సంతోషించారు .అంతేకాదు తాము రాసిన పద్యాలను అద్భుతంగా కలర్ పేపర్ పై ప్రింట్ చేయించి ,ఫ్రేం కట్టించి సభలో ఆయనతోనే చదివించి నాకు శాలువా కప్పించిన  సహృదయ సాహితీ మూర్తి సోమయాజిగారు .మా అన్నయ్య పై జరిపిన కవి సమ్మేళనం లో సోమయాజిగారి పద్యాలు .

26-అన్నన్నా –శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి –విజయ వాడ –

1- అన్నా !అన్న !ఇదేమి దుర్విది !అనూహ్యంమన్న !నన్నింక నీ

మన్నన్ కాదన నన్న !చేసితిని అన్యాయమ్ము,నీ, కమ్మకున్

మున్నే నే పసిగట్టి చేటు ,నుడువన్ ,మోటైన మాటాడి ,వీరి

మ్మన్నన్,తల్లిటు వచ్చితిన్ శఠుడనై   ఆలోచనా శూన్యతన్ .

2 తరలితీవు బంగారు లేడి తరుము కొనుచు—కొంతవడికి వింటిమి మేము వింత గొలుపు

నార్త నాదమ్ము ‘’హా లక్ష్మణా ‘’రవమ్ము –స్పస్టమది నీదె గొంతు ,ఉచ్చ్రైస్స్వరమ్ము.

3-వెను వేంటనేపోపోమ్మన –వినని ననున్ తల్లి రూక్ష వీక్షల నురిమెన్

మనసును రాయి పొనర్చుచు –నని వార్యపు గతిని కదలితన్నా వినుమా .

4-ఏదీ తల్లి ఇటుండ బాసితినిగా ,ఈ పంచ వటీ స్థలిన్

 ఎదీ లేదిట లోగిలిన్ వేలుపలన్ ,ఏదేని కీడయ్యెనో

ఆ దేవిం గొను పోయి రక్కసులు ద్రోహమ్మేమి  కాంక్షిం చిరో

నా దైవంమగు తల్లి ,అగ్రజుని ప్రాణమ్మింక నేమౌనోకో .

5-అనుచున్ లక్ష్మణుడశ్రు ధారల హ్రుదబ్జాంత ర్దళోద్విగ్నతన్

 ప్రణమిల్లెన్ త్రప నొంది ,అగ్రజునకున్ ,పల్కండు ,తోన్కండేట్

కినుకన్ బూనేనో ?లోని కోప బడ బాగ్నిన్ మ్రింగి చల్లార్చేనో ?

అనుకొంచం గ్రజు వెంటనంటి తరాలేనారాన్య సంశోధనన్ .

6-రాక్షస సంహారము –ముని రక్షణ యు తన అవతారలక్ష్యము లగుచో

 సుక్షత్రియుడౌ రఘు పతి-దీక్షకు భూ పుత్రి రక్ష తీక్ష్ణ సమస్యౌ ‘’.

    ఇంతటి సాహితీ మూర్తి ,ఆత్మీయులు శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజులు గారు మనమధ్య లేకపోవటం తీరని వేలితి.అందుకే ఈ జ్ఞాపకాల పరిమళాలు .

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.