గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-13
మోతీలాల్ ఘోష్ భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు .1889లో కాంగ్రెస్ సభలకుఅధ్యక్షత వహించిన సర్ విలియం వెడర్బన్ శాసన పరిషత్తు లో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించటానికి సంస్కరణలు సూచిస్తే ,మోతీలాల్ దానికి ఒక పధకం ఆలోచించాడు .భారతీయుల లక్ష్యాలను బలపరచే ‘’బ్రిటిష్ పార్లమెంట్ లో భారతీయ సభ్యుడు ‘’అని పిలువ బడే చార్లెస్ బ్రాడ్ లాప్ కూడా హాజరయ్యాడు .అమృతబజార్ పత్రిక ప్రతిపాదనలే బాగా ఉన్నాయనిమెచ్చాడు .కానీ టోరీ పార్టీ వీటిని బలపరచకపోవచ్చు అనీ చెప్పాడు .ఆమోదింపబడిన తర్వాత ప్రోవెంషియల్ కౌన్సిల్స్ లో భారతీయ ప్రాధాన్యం పెరిగింది .
బ్రిటన్ లో కాంగ్రెస్ లక్ష్యాల సాధనకు కాంగ్రెస్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది .ఇందులో రిటైర్ అయిన ప్రభుత్వోద్యోగులు వెడర్ బర్న్,కాటన్ ,కీర్ హార్డీ,రాట్ క్లిఫ్ ,బ్రిటీష్ లేబర్ ప్రధాని కాబోయే మాక్దోనాల్ద్ ,చార్లెస్ బ్రాడ్ లాఫ్ హెచ్ బి రూధర్ ఫర్డ్ లాంటి ఉగ్రవాదులు , నేవింగ్ సన్,విలియం డిగ్ బీ ,స్కేవెన్ బ్లాంట్ మొదలైనవారితో బ్రిటిష్ కమిటీ ఏర్పడింది .1892లో కాంగ్రెస్ నాయకుడు దాదాభాయ్ నౌరోజీ బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికవటం ఘనవిజయం .ఇంతకు మించి ఆ కమిటీ ఏమీ సాధించలేక పోయింది .బ్రిటిష్ పార్లేంట్ లో ఇండియా విషయాలు చర్చిస్తే ,ఆ దేశాన్ని బ్రిటిష్ కోల్పోయినట్లే అనే అభిప్రాయం అక్కడ దిగువ సభలో బలంగా ఉండేది. పైకమిటీకి కాంగ్రెస్ యాభై వేలరూపాయలు వార్షిక గ్రాంట్ మంజూరు చేసింది .అక్కడ ‘ఇండియా ‘అనే పత్రికపెట్టినా ,పొడిచేసిందేమీ లేదు .ఈవిషయం మొతీలాల్ ముందే చెప్పాడు .ఈ సభలప్పుడే మోతీలాల్ –బ్రాడ్ లాఫ్ సమావేశం జరిగి ఆయన మనసు ఇండియాకు అనుకూలంగా మార్చగలిగాడు మోతీలాల్ .జీవితాంతం భారత్ ను బలపరుస్తూనే ఉన్నాడాయన’
మలిమార్పు
1891లో పెళ్లి అయిన ఆడపిల్లలకు దాంపత్య జీవితానికి వయోపరిమితిని 10నుంచి 12 ఏళ్ళకు మార్చటం కోసం చేసిన ప్రతిపాదన తీవ్ర సంచలనం కలిగించింది .అమృతం కూడా సనాతనులతో పాటు నిరసించింది .ప్రజలు కోరితేనే మార్చాలని వీరి అభ్యంతరం .పత్రికను సమర్ధిస్తూ భారీ నిరసనలు సభలు జరిగాయి .అయినా బిల్లు చట్ట౦ అయింది. ప్రజాభిప్రాయాన్ని మన్నించ నందుకు ,ప్రజల నిత్య సమస్యలను చర్చించటానికి ఒక పత్రిక కావాలని అందరూ భావించారు .ఘోష్ సోదరులపై వత్తిడి తెచ్చినా ఆర్ధికంగా దెబ్బ తిన్న కారణంగా సాహసించలేకపోయారు. కానీ ప్రజాభి ప్రాయం బలంగా ఉంది దినపత్రికగా మారకపోతే మాబతుకు బస్ స్టాండ్ అవుతుందని వాపోయారు సోదరులు ఒప్పుకోక తప్పలేదు .ప్రింటింగ్ మెటీరియల్ తగినంతగా లేకపోయినా ధైర్యంగా ముందడుగు వేశారు 19-2-1891అమృత బజార్ ఆంగ్లం లో దినపత్రికగా ప్రత్యక్షమైంది .ప్రజా సంఘటితను రాజకీయ సాంఘిక సంస్కరణలవైపు మళ్ళించితేనే జాతికి ప్రయోజనం అని మోతీలాల్ ఆలోచించాడు. లాల్ ఆలోచన తర్వాతే 1920లో తిలక్, గాంధీ కూడా .రాజకీయ ఉద్యమం లో సంస్కరణల అవసరాన్ని ప్రచారం చేశారు .
మున్సిపాలిటీ లలో మాత్రమె ప్రాతినిధ్యం కలిగింది. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ప్రతినిధిని పంపే అధికారం 1892చట్టం ప్రకారం కలకత్తా మున్సిపాలిటీకి మాత్రమె ఉంది .మోతీలాల్ మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయాలనుకోగా పత్రిక ,ప్రజలు పూర్తిగా మద్దతు ఇచ్చారు .ఉత్తరాకలకత్తా 1వ వార్డు నుంచి ఆయన ఎన్నికల అరంగేట్రం చేశాడు .ప్రత్యర్ధులు చాలాబలమైన సంపన్నులు అక్కడ కాయస్థ కులం వారు ఎక్కువే .’’చేతనైనంత ప్రజా సేవ చేస్తాను ‘అని మాత్రమె ప్రచారం చేసి ఓడిపోయాడు .డబ్బు ,విందు మందు పంచలేదు ,దీనితో ఎన్నికలలో నిలబడకూడదు అనే భావం పెరిగిపోయింది .ఒక కేసులో అప్రతిష్ట పాలైన ఒక స్త్రీకి మోతీలాల్ అండగా నిలిస్తే సురెంద్రనాద్ బెనర్జీ హితవాది సంపాదకుడు కాళీ ప్రసన్న కావ్య విశారదను బలపరిస్తే రాజీకోసం ఈయన ప్రయత్నించినా కోర్టులో కేసుజరిగి కాళీ దోషిగా నిర్ధారించబడ్డాడు .దీనితో మోతీలాల్ పై కక్షకట్టాడు .జైలు నుంచి విడుదలై అమృత బజార్ పత్రికపై అవాకులు చెవాకులు పేలుతూ వ్యాసాలూ రాస్తే ఘోష్ సోదరులు 1889లో ఆయనపై పరువు నష్టం దావా వెయ్యాలని అనుకొంటే ఆయనే ముందు వీరిపై వేయగా విచారణ జరిగి మోతీలాల్ కు వెయ్యి రూపాయలు జరిమానా వేయగా చెల్లించి బయటికి వచ్చాడు .మరోకేసులో దోషి ఒకయూరోపియన్ .విచారించిందీ ఆయన దేశం వాళ్ళే .దోషికి శిక్ష పడలేదు పైగా విస్తృత ధర్మాసనం కూడా అక్కర్లేదని తెల్ల జడ్జి నల్ల తీర్పు .ఈ కేసుతో భారత జాతీయతా వాదానికి ఆనుకూల్యత బాగా ఏర్పడింది .
రాజకీయ దక్షత
కాంగ్రెస్ లో ఉన్నా సురేంద్ర నాధ బెనర్జీ ఉగ్రవాదుల్ని ,మోతీలాల్ సమకాలీన అంశాలకు మద్దతిచ్చేవారు .మహారాష్ట్రలో కూడా శిశిర్ కుమార్ ను గురువుగా భావించే తిలక్ ఉగ్రవాదుల్ని బలపరచాడు .గోఖలే తిలక్ తో భేదించాడు .అరవిందో ,పాల్ ,రాయ్ సర్దార్ అజిత్ సింగ్ లు అతివాదులై బలం చేకూర్చారు .1888లో కలకత్తాలో రాష్ట్రస్థాయి రాజకీయసభలు కలకత్తాలో సురేంద్ర నాధ నాయకత్వాన జరిగాయి .తర్వాత జిల్లాలు పట్టణాలలో కూడా జరపాలను కొన్నారు .1895లో బెంగాల్ లో అనేక పట్టణాలలో పెద్ద పెద్ద పందిర్ల కింద జరిగిన ఆఖరి సభ చివరి 6నిమిషాలలో బెంగాల్ అంతా తీవ్ర భూకంపం వచ్చి తీవ్ర నష్టం కలిగించింది .అమృతబజార్ పత్రిక ‘’భూకంపం జరిగిన అర్ధగంట తర్వాత మళ్ళీ అందరూ సమావేశమై సభ నిర్వహించారు ‘’అని రాసింది .
1896 పశ్చిమ భారతం లో కరువు ప్లేగు వ్యాపించి ఇబ్బంది పెడితే ,తిలక్ నిర్విరామంగా కృషి చేసి వైద్య ఆరోగ్య ఆహార సౌకర్యాలు కలిపించాడు .శివాజీ ఉత్సవాన్నీ జరిపాడు .బ్రిటిష్ ప్రభుత్వం ఈ కల్లోల సమయంలో మొరటుగా వ్యవరిస్తే కోపోద్రేకం తో ఇద్దరు యువకులు కెప్టెన్ రాండ్ ,లెఫ్టినెంట్ అయేష్టి అనే సైన్యాదికారుల్ని కాల్చి చంపారు .వేగంగా విచారణ జరిగి ఉరి శిక్ష వేశారు .ప్రజలు ఆందోళనలకు దిగగా తిలక్ ‘’కేసరి ‘’లో ఈ దారుణాలపై వ్యాస పరంపరాలతో చైతన్యం కలిగించాడు .బొంబాయి ప్రభుత్వం తిలక్ ను ప్రాసిక్యూట్ చేసింది .తిలక్ తరఫున ప్రముఖ బెంగాల్ బారిస్టర్ ఆర్ధర్ పఫ్ వాదించాడు .9మంది సభ్యుల జ్యూరీ విచారించి తిలక్ 18నెలలు జైలు విధించారు .రీ అప్పీల్ కు అవకాశమివ్వలేదు క్షమాపణ చెప్పి బయట పడమని కొందరు సూచిస్తే అమృత బజార్ పత్రిక దాన్ని ఖండించి తిలక్ క్షమాపణ కోరరాదు అన్నది –దీనికికారణాలు –‘’తిలక్ రాతలలో రెచ్చగొట్టే మాటలు లేవు ,రాజకీయం లో ఉన్నవారు కష్టనష్టాలకు తలక్రిందు కారాదు .ఆయన మహారాష్ట్రలో ఉండి నిత్యం అవమానం పొందటం కంటే అండమాన్ లో ఉండటమే మంచిది ‘’అని రాసింది .రాజీ పరిష్కార సూచానకూ తిలక్ బాధపడుతూ మోతీలాల్ కు రాసిన లేఖలో –‘’తప్పు చేశాను అని ఒప్పుకో మంటోంది ప్రత్యర్ధి వర్గం .ప్రజలమధ్య నాస్థానం నా ప్రవర్తనమీద ఆధార పడి ఉంటుంది .నేను తలొగ్గితే మహారాష్ట్ర మొత్తం అండమాన్ అయి నన్ను శిక్షిస్తుందని నాకు తెలుసు .జ్యూరీ ముందున్న కేసు చాలా బలహీనమైందనీ నాకు బాగా తెలుసు .కీలక సమయం లో మనో ధైర్యాన్ని కోల్పోతే ,మనం ప్రజల్ని మోసం చేసినట్లే .గౌరవనీయ నిజాయితీ పరుడుగా ఉన్ననేను చేయని నేరాన్ని ఒప్పుకోవటం దేనికి ?.నాకు శిక్షపడితే ,నా దేశ ప్రజల సానుభూతి నా కష్టకాలం లో నాకు అండగా ఉంటుంది ‘’అని రాశాడు ఆయన విదేశీ మిత్రులు ప్రొఫెసర్ మార్క్స్ ముల్లర్ ,సర్ విలియం హంటర్ ల జోక్యంతో ఏడాది శిక్ష అవగానే విడుదలయ్యాడు తిలక్ .ఆయనపై మళ్ళీ అవినీతి ఫోర్జరీ వగైరా కేసులు పెట్టారు కానీ ఏవీ నిలవలేదు .తిలక్ కేసుమూలంగా తిరుగుబాటు ప్రోత్సహించే కార్యాలపై 1897లో నిబంధనలు మరీ కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం .స్వీయ రక్షణకు ఇవన్నీ అవసరం అని లెఫ్టినెంట్ గవర్నర్ మెకంజీ అన్నాడు .ఇవి చాలక తమ రక్షణకోసం మరిన్ని తీవ్ర చట్టలు తెచ్చింది ప్రభుత్వం .’’దేశ ప్రయోజనాలకోసం శత్రు సంహారం అవసరమే ‘’ అనే గీతావాక్యాలను తిలక్ ,బంకిం చంద్రాల నోటి నుండి విని ప్రజలు ప్రభావితులయ్యారు. అరవిందుడు బెంగాలీ విప్లవ దళం పెట్టి యువతను ఆకర్షించాడు .నాతూ సోదరుల నిర్బంధం జాతీయవాదాన్ని మరింత పదునెక్కించింది .ప్రభుత్వ అణచి వేతలు పెరిగినకొద్దీ ఉగ్రవాద జాతీయోద్యమం మరింత బలపడింది ,
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-22-ఉయ్యూరు