గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-14
ప్రభుత్వ అణచివేతపై స్పందిస్తూ శిశిర్ కుమార్ ‘’ఇది దివ్యౌషధం .మంచిమార్పుకు ఆయుధం .ఇంగ్లాండ్ లో గొప్ప విప్లవాలు తెచ్చింది అణచివేతలే ‘అని రాశాడు .1898లో వచ్చిన మున్సిపల్ బిల్లుపై వచ్చిన ఆందోళనలు మోతీలాల్ ను బాగా ఆకర్షించాయి లార్డ్ కర్జన్ బ్రిటిష్ ప్రయోజనాలను బుజానకెత్తుకోవటం సహించలేకపోయాడు .ప్రజా వెల్లువతొఅనెక బహిరంగ సభలు జరిగాయి.ఒక సభకు అధ్యక్షత వహించాడు .కలకత్తా పన్ను చెల్లించే వారిని ఉద్దేశిస్తూ పత్రికలో ‘’ప్రజలు నిర్ద్వంద్వంగా బిల్లును వ్యతిరేకించాలి ఖండించాలి .ఆ బిల్లు వద్దని సభ్యపదజాలంతో పాలకులకు తెలియజేయాలి .ప్రభుత్వం వినకపోతేప్రహసనం గా మారిన ఎన్నికల వ్యవస్థ రద్దు చేసి ,కలకత్తా మునిసిపల్ విభాగాన్ని ప్రభుత్వ విభాగంగా మార్చమని కోరాలి ‘’అని రాశాడు .ప్రభుత్వ మొండితనంతో బిల్లు చట్టమైంది .ఆతర్వాత స్వయం ప్రతిపత్తికల కార్పోరేషన్ కావటానికి 24ఏళ్ళు పట్టింది .డాకా మున్సిపాలిటి నుంచి విధాన పరిషత్తుకు ప్రతినిధిని ఎన్నుకొనే పధ్ధతి రద్దు చేయటం తో మరో వివాదం చెలరేగింది .ఈ విషయంలోనూ మోతీలాల్ సురెంద్రనాద్ ల మధ్య భేదాలేర్పడ్డాయి .మోతీలాల్ వ్యతిరెకిస్తెఆయన బలపరచాడు .పరస్పరారోపణలు వ్యక్తిగాతదూషణలుపెరిగాయి .ఈ అవాంచనీయ జర్నలిజం కొంతకాలం సాగింది .పరువు నష్టం దావా వేస్తానని మోతీలాల్ కు నోటీస్ పంపాడు .దీనపై పత్రికలో ‘’గాజు ఇంట్లో ఉంటూ అవతలవారిపై రాళ్ళు విసిరితే ఏమి జరుగుతుందో ఆపెద్దమనిషికి తెలీదా ? ఎవరు తవ్వుకొన్న గోతిలో వారే పడతారు అన్న సామెత గుర్తు౦చు కోవాలి ఆయన ‘’అని రాశాడు .ఇద్దరి అనుయాయులు పరిష్కారానికి తీవ్ర ప్రయత్నం చేసి,సాధించి ఒక ప్రకటన తో సమాప్తి చేయించారు .కర్జన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి వారి సఖ్యత ఒక రాజ మార్గమైంది .
జన జాగృతికి కారణమైన కర్జన్
1899లో వచ్చిన కర్జన్ 1905 లో వెళ్లి పోయేముందు బ్రిటిష్ సామ్రాజ్యం బీటలు వారింది .బ్రిటిష్ జాతి అత్యున్నతజాతి అని ఆయన నరనరానా భావించి అహంతో ప్రవర్తించిన ఫలితమే ఈబీటలు .’’ఇండియాను వదులుకుంటే బ్రిటన్ మూడవ ప్రపంచ దేశంగా ఆధః పాతాళం లో పడిపోతుంది ‘’అనేవాడు .అందుకే ఉక్కు పిడికిలి లో బిగించాలని అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు .భారతీయులను ,విద్యాధికులను అర్ధం చేసుకోలేక పోయాడు .పాలనలో భారతీయ భాగం తగ్గించటానికి తీవ్రయత్నాలు చేశాడు .అతడి నిష్క్రమణ ను వివరిస్తూ మోతీలాల్ ‘’కర్జన్ యువకుడు డాబు దర్పం ఉన్నవాడు .శిక్షణ లేకుండా అధికారానికి వచ్చాడు .మన దేశం పై ముసరిన పెద్ద మేఘం అతడు .రాకెట్ లా పైకి లేచి మిణుగురులా కూలిపోయాడు ‘’అని సార్ధకమైన వ్యాసం రాశాడు .
కలకత్తా మున్సిపాలిటీ పనిపట్టి విశ్వవిద్యాలయం లో కూడా రాజకీయ జోక్యం పెంచాడు కర్జన్ .విద్యావ్యవస్థలోకూడా జాతీయ వాదం లేకుండా చేయటానికి విశ్వ ప్రయత్నం చేశాడు .అమృతబజార్ పత్రిక మొదలైనవి ఆయన చర్యలపై ఘాటైన విమర్శలు చేశాయి .మోతీలాల్ ఆయన్ను కలుసుకోవటానికి వెడితే మొహం చూపించని అహంకారి .ఇద్దరూ వేర్వేరు గదులలో కూర్చుని చీటీలద్వారా స౦భాషణ జరిపారు .కర్జన్ ప్రైవేట్ సెక్రెటరి ఆసులో గొట్టం లా అటూ ఇటూ తిరుగుతూ ఈ’’ చీటీ రాయబారం చేశాడు .ఈ సంఘటనపై మోతీలాల్ ‘’ప్రభువుగారు నాలాంటి సామాన్యులతో చర్చించటం న్యూనత గా భావించిన ఉన్నతులు ‘’అని రాశాడు .1902కలకత్తా యూని వర్సిటి కాన్వో కేషన్ లో కర్జన్ చాన్సలర్ హోదాలో ‘జాతీయ పత్రికలు చెప్పేది నమ్మవద్దు ‘’అని హితవు చెప్పాడు .దీనికి దీటుగా మోతీలాల్ పత్రికలో ‘’ఒక వైస్రాయి చేయతగినవీ చేయతగనివీ ఏమిటి ‘’?అనే శీర్షికలో ‘’ ఎడ్వర్డ్ చక్రవర్తి ప్రతినిధిగా వైస్రాయి కర్జన్ కు నాలుగు కళ్ళు రెండు ముందు,రెండు వెనక ఉండాలి .వైస్రాయి ఎంతై వాడైనా కళ్ళజోడు వాడకూడదు .పచ్చకామెర్ల జబ్బు ఉంటె నయం చేసుకోవాలి. అసలు ఆజబ్బున్నవాడు సింహాసనానికి పనికి రాడు.ప్రత్యర్ధి విమర్శను హత్యగా భావి౦చ రాదు .విమర్శలను సంతోషంగా స్వీకరించే లక్షణం అవసరం ‘’అని రాశాడు .ఈ విమర్శ అతడికి చేరినా తెలు కుట్టిన దొంగ లా మిన్నకున్నాడు.బ్రిటిష్ రాజ్యం పతనావస్థలో ఉందని తెలిసి కాపాడుకొనే ప్రయత్నం లో మునిగిపోయాడు .1905లో కలకత్తా విశ్వ విద్యాలయ స్నాతకోత్సవం లో కర్జన్ ‘’ప్రపంచం లో సమున్నత సత్య సంధత ప్రాచ్య దేశాలకంటే పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా ఉంది .పొగడ్త సత్య దూరం కారాదు ‘’అని భారతీయతను ఎద్దేవా చేస్తున్నట్లుమాట్లాడాడు .దీనితో తీవ్ర ఆందోళనలు చేశారు జనం . ‘’ప్రాక్ ప్రపంచపు సమస్యలు ‘’అనే కర్జన్ రాసిన గ్రంథం లో కొరియా బాయబారిగా ఉండటానికి తాను ఆడిన ఒక అబద్ధాన్ని కర్జన్ తన నోటి తోనే చెప్పిన ఉదంతాన్ని పేర్కొని మోతీలాల్ ఎద్దేవా చేశాడు రెండవ ముద్రణలో కర్జన్ ఆభాగాన్ని తీసేయించి జాగ్రత్త పడ్డాడు కర్జన్ . కర్జన్ ఆడిన అతిపెద్ద అబద్ధాన్ని బట్ట బయలు చేసినందుకు మొతీలాల్ ను , అమృత బజార్ పత్రికను దేశ విదేశాల పత్రికలన్నీ శ్లాఘించాయి భారత పత్రికలూ ఉబ్బి తబ్బిబ్బే అయ్యాయి .దివీక్లీ టైమ్స్ ‘’పత్రిక దీనిపై స్పందిస్తూ ‘’బహుశా సత్య సందత అనేది కర్జన్ కు యాన్కీలకు సహజంగా ఉండే సత్య సంధత ఆయన పెళ్లి చేసుకొన్న అమెరికన్ అమ్మాయి భార్య అయినతర్వాత వచ్చి ఉంటుంది ‘’అని వ్యంగ్యంగా రాసి చురుక్కుమనిపించింది .బ్రిటిష్ జీవన సరళిని అనుకరిస్తున్న సంపన్నులైన భారతీయులను తేలికగా చిన్న చూపు చూస్తూ ‘’కాంగ్రెస్ పునాదులు కదుల్తున్నాయి.ఇండియాలో ఉండగానే దాని సర్వనాశనం చూడాలని నా ముఖ్య ఆశయం ‘’అన్నాడు 1900లోనే . కానీ కాంగ్రెస్ దినదినాభి వృద్ధి చెంది బ్రిటిష్ పునాదులే కదిలించి మూటా ముల్లె సర్దుకొని పోయేట్లు చేసింది ..సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-22-7-22-ఉయ్యూరు .