మహాకవి జాషువా విశిష్ట పురస్కార స్వీకారం

మహాకవి జాషువా విశిష్ట పురస్కార స్వీకారం

27-6-22 ఉయ్యూరులో జరిగిన సరసభారతి సాహితీ పుష్కరోత్సవ సభకు  పద్మభూష ణ్ జాషువా స్మారక కళాపరిషత్ –దుగ్గిరాల  అధ్యక్షులు డా పి.యోహాన్ గారు వచ్చి పాల్గొని ,సన్మానితులై,అప్పటికప్పుడు జులై 24న జరిగే జాషువా గారి 51వ వర్ధంతి ,జాషువాస్మారక కళాపరిషత్ నాడు నాకు ‘’జాషువా పురస్కారం,’’ అందజేయ బోతున్నట్లు తెలియజేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచేశారు . మధ్యలో ఒకసారి ఫోన్ చేసి మా శ్రీమతిని కూడా తీసుకు రమ్మని చెప్పారు .నిన్న తెనాలిలో జరిగిన ఆసభకు వెళ్లి స్వీకరించాను .ఆ వివరాలు .

  నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు నేనూ మా శ్రీమతీ శ్రీమతి ప్రభావతి ,మామూడవకోడలు రాణి మనవడు చరణ్ ,నల్గవకోడలు మహేశ్వరి ,జాగృతి సంస్థ అధికారిణి రాజీవి కుమారుడు షణ్ముఖ్ ,కారులో దావూద్ డ్రైవింగ్ లో బయల్దేరి ,ముందుగా దుగ్గిరాల గాంధీనగర్ లో ఉంటున్న అంధులైన  ,అడవి బాపి రాజు గారిపై పరిశోధనచేసి పి.హెచ్. డి.అందుకొన్న నాగార్జున యూని వర్సిటి విశ్రాంత తెలుగు ఆచార్యులు ,నాపై విశేష ఆదరాభిమానాలున్న వారు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ  గారిని వారింటిలో దర్శించి, వారికి నేను రాసి, సరస భారతి ప్రచురించిన మల్లినాథ సూరి ,ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు పుస్తకాలు ,నూతన వస్త్రాలు ,శాలువా ,సాహితీ పుష్కరోత్సవ జ్ఞాపిక అంద జేసి అందరం ఆశీస్సులు పొందాము. వారి తల్లిగారు ఆరునెలల క్రితం మరణించారని తెలిసింది .ఒంటరిగా ఉంటున్నారు .ప్రస్తుతం ఏం చేస్తున్నారు రాస్తున్నారు అని అడిగితె ఎక్కువగా లైవ్ ప్రోగ్రాములు చేస్తున్నానని చెప్పి వారితో ‘’బాపిరాజుగారి పై మీ పరిశోధన పుస్తకం ఉంటె నాకు ఇస్తే  ప్రత్యక్ష ప్రసారం గా చేస్తాను ‘’అని చెప్పాను . తనవద్ద కూడా లేదనీ ,ఎవరిదగ్గరైనా ఉంటె పంపిస్తాను అన్నారు. లైవ్ చేశాక మళ్ళీ తిరిగి పంపిస్తాను అన్నాను సరే అన్నారు .

 దుగ్గిరాలనుంచి సరాసరి తెనాలి లో రామలింగేశ్వర నగర్ లో ఉంటున్న  ,70ఏళ్ళ క్రితం ఉయ్యూరు హైస్కూల్ లో నా క్లాస్ మేట్,కనకవల్లి వాస్తవ్యుడు తెనాలి మున్సిపల్ హై స్కూల్ లో సెకండరీ గ్రేడ్ టీచర్ చేసి,రిటైరై , రెండస్తుల స్వంత బిల్డింగ్ నిర్మించుకొని ఉంటున్న ,నాటక ,రేడియో  నటుడు శిష్ట్లా సాక్షి కామేశ్వర సోమయాజులు ఇంటికి వెళ్లాం .పై అంతస్తులో ఉంటున్నారు. అతని భార్య నాలుగు నెలలక్రితం అకస్మాత్తుగా మరణించింది .మార్గదర్శిలో పని చేస్తున్న మూడవ కొడుకు కుటుంబం తో ఉన్నాడు .మొన్ననే వాళ్లకు మేము వస్తున్నట్లు ఫోన్ చేసి చెబితే చాలా సంతోషించారు .సోమయాజులు నాకంటే మూడు నెలలు పెద్ద వాడు .ఆత్మీయం గా అందరూ పలకరించిమాట్లాడారు అతడు, కొడుకు, కోడలు మనవరాళ్ళు . అతను ఉయ్యూరు వైపు ఎప్పుడొచ్చిన మా ఇంటికి వచ్చి కనిపించకుండా వెళ్ళే వాడు కాదు .భార్యతో కూడా మూడేళ్లక్రితం వచ్చాడు .ఏడాది క్రితం ఉయ్యూరులో ఒక పెళ్ళిలో కలిశాం కూడా .’’ఏరా అంటే ఏరా ‘’అనుకొనే స్నేహం మాది .అతనికి మేము నూతనవస్త్రాలు సమర్పించి శాలువాకప్పి సాహితీ పుష్కరోత్సవ జ్ఞాపిక అందించాము .వాడు వెంటనే నాకు వస్త్రాలు సమర్పించి ఆశ్చర్యం కలిగించాడు .మా కోడళ్ళకు మా ఆవిడకు బొట్టు పెట్టి ,బ్లౌజు పీసెస్ ఇచ్చారు .మంచి వాతావరణం ,మొక్కలు ,ఆహ్లాదకరమైన లోగిలి .మా ఆవిడ మేడ ఎక్క లేక కిందనే కూర్చుంది .పై నుంచి అందరం కిందికి దిగి ఫోటోలు దిగి అందరికీ వీడ్కోలు పలికి బయల్దేరాం .అందరి మనసులనిండా సంతోషం నిండింది .ఇక్కడొక విషయం జ్ఞాపకం వచ్చింది .మేము ఉయ్యూరు హైస్కూల్ లో చదువుతున్నప్పుడే నాకూ సోమయాజులు  మిగతా మిత్రులకు స్నేహితుడైన సూరి నరసింహం అన్న ,ఉయ్యూరు పాలిటెక్నిక్ లో చదువుతున్న ,మాంచి స్పోర్ట్స్ మన్ ,జావెలిన్ త్రో హీరో అనంతరాం పెళ్లి తెనాలిలో జరిగితే పెళ్లి కొడుకు బృందంతో పాటు నన్నూ ,ఆదినారాయణ ,లను నరసింహ తీసుకు వెళ్ళాడు .ఆ రాత్రి సెకండ్ షో  ‘’ఇలవేలుపు ‘’చూశాం .’’చల్లని రాజా ఓ చందమామ’’పాట రఘునాథ పాణి గ్రాహిపాడాడు .సుసర్ల దక్షిణా మూర్తి సంగీతం .ఆర్ నాగేశ్వర రావు ఒక ఆశ్రమ నిర్వాహకుడు. ‘అందరూ ‘’నాన్నగారూ ‘’అని పిలిచే సాఫ్ట్ కార్నర్  పాత్ర వేయటం గొప్ప ఆశ్చర్యం .

  సోమయాజులు ఇంటి నుంచి వైకుంఠ పురం లోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ,అక్కడి నుంచి కవిరాజు పార్కు లోని  సీనియర్ సిటిజెన్స్ హాల్ కు సాయంత్రం 6-30కు చేరాం .పద్యాలు పాడుతున్నారు .రాత్రి 7కు సన్మాన సభ ప్రారంభమైంది .మాజీ మంత్రి ,ప్రస్తుత ఎం ఎల్ సి .శ్రీ డొక్కా మాణిక్యవర  ప్రసాద్  గారిని శ్రీ యోహాన్ వేదికపైకి ఆహ్వానించారు .జాషువా చిత్రపటానికి  పూల మాల వేశారాయన . యోహాన్ గారు రాసిన ‘’కవికోకిల ,విశ్వకవి సమ్రాట్ గుర్రం జాషువా –సాంఘిక పద్యనాటకం ‘’పుస్తకాన్ని ఆయన ఆవిష్కరింఛి  జాషువా గురించి ,యోహాన్ గారి గురించి మాట్లాడారు .తర్వాత  యోహాన్ గారికి కుచ్చు టోపీ పెట్టి శాలువా కప్పి ఎం ఎల్ సి గారు సన్మానించారు .తర్వాత నన్నూ ,మా శ్రీమతిని వేదికపై కి ఆహ్వానించి సన్మానపత్రం అందించి శాలువాలుకప్పి దండలు వేశారు .నాకు ‘’సాహితీ కళా రత్న ‘’బిరుదు ప్రదానం చేశారు .మా శిష్యుడు కీ శే .వంగవీటి కాళీ వరప్రసాద్ కుమారుడు’’దైవజ్ఞ రత్న’’  సుబ్రహ్మణ్య శాస్త్రి నిన్న సాయంత్రమే ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి తాడేపల్లి వచ్చి వెంటనే ,  అతని చెల్లెలు శ్రీమతి వల్లీ రమా పరమేశ్వరిని కూడా   తాడేపల్లి నుంచి బైక్ పై తీసుకు వచ్చి మా ఇద్దరికీ శాలువాలు కప్పారు .జాగృతి సంస్థ తరఫున మా కోడలు మహేశ్వరి ,మనవడు చరణ్ ,మాతోవచ్చిన శ్రావణ్ రోజా పుష్పమాలలు మాకు వేయించి రోజా పూలతో పాద పూజ చేసి నెత్తిన చల్లి గొప్ప అనుభూతిని అందరికి కలిగించారు .ఒక రకంగా గొప్ప కిక్ తెప్పించారు నీరసంగా ఉన్న సభకు .నేను నాలుగు మాటలు జాషువా గురించి చెప్పాను .మాణిక్యవర ప్రసాద్ గారు చాలా బాగుందన్నారు .చాలామంది మెచ్చుకొన్నారు .శ్రీ నాగేల్లి ప్రభాకర్ (అక్షరం )-మహబూబాబాద్ గారికి సాహితీ విద్యా రత్న ,శ్రీ సాపాటి ప్రభాకర్ –బ్రాహ్మణ కోడూరు కు సాహితీ రత్న,శ్రీ గొట్టిముక్కల నాసరయ్య-త్రిపురాంతకం గారికి సాహితీ భూషణ్ ,శ్రీ దార్వేముల అనిల్ కుమార్ –గుంటూరు గారికి సాహితీ భూషణ్ ,శ్రీ రంగి శెట్టి రమేష్ –చిలువూరు గారికి సాహితీ భూషణ్ ,శ్రీ ఈపూరి ప్రేమ కుమార్ –పెదరావూరు గారికి నాటకరత్న ,శ్రీ పంతుల వెంకటేశ్వరరావు-విజయవాడ  గారికి సాహితీ రత్న బిరుదులూ జాషువా పురస్కారాలు అందించారు . అక్షరం ఆయన నన్ను గురువు గారూ అంటూ సంబోధిస్తూ ,సరసభారతి విషయాలు వాట్సాప్ గ్రూప్ విషయాలూ తెలుసుకోవటమే కాకుండా సన్మానితులలో నా పేరు తర్వాత తన పేరు ఉండటం గొప్ప అదృష్టం అని ఫీలయ్యారు. ఇది అవగానే మేము బయల్దేరాం .దారిలో మా అమ్మాయి ,విజ్జి, అల్లుడు అవధాని అమెరికా లోని  షార్లెట్ నుంచి అట్లాంటా లో ఒక వారం  ప్రాజెక్ట్ వర్క్ చేయటానికి   మా మనవడు ఆశుతోష్  ను అట్లాంటా తీసుకు  వెళ్లి దింపటానికి వెడుతూ ఫోన్ చేసింది మా అమ్మాయి .మమ్మల్ని అందర్నీ చూసి మాట్లాడింది వాట్సాప్ కాల్ లో .

అక్కడినుంచి ఎక్కడైనా మంచి హోటల్ ఉందేమో వెతికితే దావూద్ మమ్మల్ని ‘’సజ్జాస్ ఫుడ్ కోర్ట్ ‘’కు తీసుకు వెళ్ళాడు. పెద్ద హోటల్ ఆదివారం కనుక మిగతా హోటళ్లకు సెలవ్ .నీట్ గా ఉంది .తలొక రెండు ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చిఆబగా తింటూ పింగ్ పాంగ్ ఆడుతున్నట్లు  ఫుడ్ కోర్ట్ లో దున్నేశాం .అన్నీచాలాబాగున్నాయి కాఫీ తో సహా .మామనవడు చరణ్ స్పాన్సర్ చేశాడు.మాతోపాటు రమ్మని కోరగా ,వొప్పుకొని ,కాళీప్రసాద్ కొడుకు, కూతురు వచ్చి ఇష్టమైనవి తింటూ మంచి కంపెనీ ఇచ్చారు .హాయైన అనుభవం . హోటల్ లో ఏది బాగా లేకపోయినా  నేను రుచి చూసిపెదవి విరవటం అలవాటు .కానీ నిన్న మాత్రం చట్నీలతో సహా అన్నీ బాగా ఉన్నందుకు మహా సంతృప్తిగా తినటం నాకే ఆశ్చర్యం కలిగించింది  .ఇది చూస్తుంటే మరో అనుభూతి గుర్తుకొచ్చింది .2019లో నోరి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు గురు పౌర్ణమినాడు హైదరాబాద్ త్యాగరాజ గాన సభ లో ‘’కళా సుబ్బారావు గారి ‘’పురస్కారం అందజేయటం ఉయ్యూరునుంచి మేము వెళ్ళటం హైదరాబాద్ లో ఉన్న మా అబ్బాయిలు శాస్త్రి, శర్మ,మా బావమరది ఆనంద్ కుటుంబాలతో వచ్చి శాలువాలు కప్పటం పూలహారాలు వేయటం ,పుష్పాభిషేకం చేయటం ,గాన సభ అంతా మా ముఠా ‘’హల్ చల్ ‘’చేయటం, ఆతర్వాత అందరం ఒక హోటల్ లో టిఫిన్లు చేయటం ,ఆఖర్చు మా శర్మ’’ ఎయిత్ వండర్’’ గా స్పాన్సర్ చేయటం మర్చిపోలేని మరో అనుభవం .

   టిఫిన్లు అయ్యాక కాళీ ప్రసాద్ పిల్లల్ని ఇంటికి బయల్దేరి వెళ్ళమని చెప్పి ,మేము కారెక్కి ,ఉయ్యూరుకు రాత్రి 10-15కు చేరాం .కార్ పెట్రోల్ ఖర్చు కూడా నా చేతికి అంటనివ్వలేదు .ఇలా ఆదివారం యాత్ర పూర్తయింది .వెంటనే వాట్సాప్ లో ఫోటోలు పెట్టేసి పడుకొన్నాను .ఇప్పుడు  తెనాలి సభలో నేను మాట్లాడిందీ మాట్లాడాలను కొన్నదీ వివరంగా తెలియ జేస్తాను .

                 విశ్వ నరుడుజాషువా

 సాహిత్యం లో పీడితులపక్షాన కలం పట్టిన యోధుడైన సాహితీ మూర్తి జాషువా .దళిత హృదయార్తి కి బీజమే ఆయన కవిత్వం .గాంధేయ విధానం ఆయన కవిత్వానికి మూలం .అనుభూతి,ఆవేశం వలన కవిత్వావిర్భావం జరుగుతుందని చెప్పాడు .సర్వ కవిత్వ సమన్వయ లక్షణం ఆయనది .కరుణ  రసావిష్కర్త .’విశ్వ నరుడను ‘’అని చెప్పుకున్న ధీరకవి .గాయపడిన మనసు ఆక్రోశమే జాషువా కవిత్వానికి ‘’షడ్జమం ‘.అన్నిటికీ అతీతమైన సమసమాజస్థాపన  ఆయన లక్ష్యం .మనిషిని మనిషిగా గుర్తించమని ప్రాధేయపడిన మానవతా మూర్తి జాషువా.తెలుగు పద్యం ఇంత హృద్యంగా ఉంటుందని రుచి చూపించిన కవి ..భాషపై పట్టు,భావం పై అధికారం ,నడకపై తూగూ ఊపూ ,కమ్మని శైలి ఆయనకే స్వంతం .ద్రాక్షాపాకమే ఆయన కవిత్వం .వృత్త పద్యానికి మహోన్నత శిల్పి జాషువా .మానవ ప్రవృత్తికీ ,జడ ప్రవృత్తికీ ఉన్న అంతరాన్ని ,కొత్తదృక్పధం తో తగ్గించిన సంస్కారి .

  జాషువా కు తల్లి అంటే పంచ ప్రాణాలు .ఆమె చనిపోయినప్పుడు ‘’నీ ఋణము తీరదు రక్తము ధార పోసినన్ ‘’అని వెక్కి వెక్కి ఏడ్చాడు .పెంపుడు కుక్క మరణిస్తే ‘’విశ్వాసము నీ కులానికి నిసర్గ భూషణమ్ము-ఇట్టి సావాసము చచ్చి పోయినది ‘అని దుఖించిన కరుణా మూర్తి .’’పేదరికం పెద్ద విద్యాశాల .దానిలో లజ్జ లేదు .ఉదరమే ఒజ్జ .ఓర్మిని నేర్పిస్తుంది ‘’అని తన అనుభవాన్ని జోడించి చెప్పాడు తాత్వికంగా .ముంతాజ్ మహల్ కోసం షాజహాన్ కట్టిన తాజ మహల్ యొక్క శిలలను గురించి ‘’కలము నందుకొన్న కవి వరేణ్యుని మ్రోల తలలు వంచు శబ్దాల విధాన –నాటి శిల్పి చెంత నవనీతమును బోలి –మెత్తదనము దాల్చె మేటి శిలలు ‘’అనగల సత్తా జాషువాది .

  కోతిని గురించి రాస్తూ –‘’నిన్నీక్షించి హసి౦చనట్టి నరుడున్ నీపై దయాభావముత్పన్నంబందని వాడు –గానమునకున్ వైముఖ్యమును చూపు వా-డున్నాడా సకల ప్రపంచమున ,నాయుర్భూతి నిండార తిమ్మన్నా !హాస్య కళాసముద్రమున మమ్మెలార్పు నశ్రా౦త మున్ ‘’అని బొమ్మ కట్టించిన శిల్పి .తేనే పట్టు అంతా పిండుకొని తాగే వాళ్ళమే కాని అందులోని మధుపం మనో భావాలను అర్ధం చేసుకోలేని దౌర్భాగ్యం మనది .ఎంత రసవంతంగా రాశాడో ఈ పద్యాలు చూడండి –‘’కుత్తుకలు గొని రణమున –కాయత్తంబై న వీర యోధులట్లు మధుపముల్ –మొత్తమయి లేచి పొడిచెన్  -గత్తులతో నన్ను నొక్క క్షణ కాలమునన్ ‘’అని మీద దాడి చేశాయి తేనెటీగలు కవిమీద .అందులోనుంచి ఒక అళి కుమారుని మనో వేదన, ఆర్తనాదం విని చలించిపోయాడుకవి .అందులోని ఒక శిశు మధుకరం –‘’ఓరి దురాత్మ !బిడ్డలు లేరా ?యొక్కింత కరుణ లేదా?మమ్మున్ నోరెరుంగనట్టి నిసుగుల –గారించుట నీకు వేడుకా ?దౌష్టంబా ‘’?అని నిలదీసింది .బిక్క చచ్చిపోయాడు గురుడు .’నరుడు అ౦టుకొంటేకొడుకులు చనిపోతారని మా మిళింద మాతలు  మళ్ళీ దయతో పెంచుతారు .ఇది మాకులం కట్టు బాటు .’’అని బుద్ధి చెప్పింది .చివరగా ‘’మా తీయని నగరంబును –ఘాతుకమతి వౌచు మంట గలిపితివి –మా తలల్లు లండ్రు –నరులకు నీతి హుళక్కి యనుచు ,నేడు నిజ మయ్యెన్ ‘’.కరుణ శ్రీ గారి ‘’పుష్పవిలాపం ‘’గుర్తుకొస్తుంది .

  వంచిత అనే పద్యం లో –ఆబల యను బిరుద మంటించి కాంతల –స్వీయ శక్తులదిమి చిదిమి నారు –సబల యన్న బిరుదు నావరించి హక్కులు –గడవ జేసి కొమ్ముకష్ట చరిత ‘’అని ఓదారుస్తూ ధైర్యం నూరి పోశాడు కవి .బడిపంతులు పద్యం లో –‘’ఎంతెంత వారు నాదగు –‘’చింత బరికె ‘’ సోకకుండ,సిరి గలిగి యశో –వంతులు కాగలరా యని –సంతృప్తి వహించు తాతని సహజ గుణంబున్ ‘’అని ఫోటో తీసి చూపించాడు జాషువా .అమ్మవారు పద్యం లో –‘’మొగమున కక్కుకొట్టి మసిబాసి ,వికార మొనర్చ నీచపుం –దెగులునకు ‘’అమ్మవారనుచు ‘’తీయని పేరిడిమేకపోతులన్ దగరుల జంపి ,రక్తమున దండవ కేళియొనర్చు వెర్రికిన్ దగిన చికిత్స చేయగలదా నవ భారత మెన్నడేనియున్’’అని సమాజానికి సవాల్ విసిరాడుకవి .

  ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని కీర్తిస్తూ –‘’నీవు ఫిడేలు దాల్చి కమనీయ నినాదఝరీ మరంద –మాలా వివిధ స్వరూప రస లక్ష్ముల సృష్టి యొనర్చు లాఘవం –బీ వర కెవ్వ డందు గడియించి ఎరు౦గరు నీదు వ్రేళ్ళలో –నే వరమున్నదోయెరుగ రెవ్వరు ‘’ద్వారము వంశ భూషణా ‘’.-చెవులు పిండి ,శిక్షించి జడమైన –కట్టె కెట్లు విద్య గరపినావో _అంగుళీయకంబులంటియంతక ముందే-నీ ఫిడేలు మధుర నిధులు గురియు ‘’అంటూ ద్వారంవారి సర్వోత్తమ వైదుష్యాన్ని కళ్ళకు కట్టించాడు .వీరేశ లింగం గారిని ప్రస్తుతిస్తూ –‘’ఒకవంకన్ బదివేల కంఠములతో హు౦కారముల్ సల్పిసాం-ఘిక శార్దూలము చప్పరించుటకు లంఘి౦పన్ –రవంతేని జంకక ,దీక్షా రథమున్ మరల్పక –కళా క్షాత్రంబు జూపించు ను –వేద౦డుని యుక్కు గుండెలు మహా౦ధ్రా మీకు నా దర్శముల్ ‘’  .భట్టుమూర్తి రామరాజ భూషణుడికి పద్య భూషణాలు తొడుగుతూ జాషువా –‘’శ్లేష కవిత్వ చండ భాస్వంతుడవహో –సరస భట్ట కవీ ,కవితా కళానిధీ-నాటికి నేటికి ఒక నాటికి నీ కెదురేరి సత్కవీ –చక్కదనాల కబ్బపుం గాపులు గాచి పోయితివిగా కవితా దివిజ ద్రుమబునకున్ ‘’అని అత్యద్భుతంగా వర్ణించాడు .గోవుకు నమస్కరిస్తూ జాషువా –‘’వెలగలయట్టి నీ రుధిర  బిందువు లెన్ని వ్యయించి పాలుగా జిలికెద వోగదా’’మొదవు చేడియ’’!నీ బలమెల్ల ఇమ్మనుష్యుల కిడి  వృద్ధురాలవయి సుక్కిన నీకు గటారి పోటులాఫలితము ?-భారతీయుని గృపా పరతంత్ర త గొడ్డు వవోయెనో ‘’అంటూ సహవేదన చెందాడు మనసు మెత్తని కవి జాషువా .సర్దార్ పటేల్ ను –‘’కొండవంటి తనువు-కొండంత భుజ శక్తి –కలిగి యుండ భరత ఖండ లక్ష్మి –వల్లభాయి మంత్రి పరమ పది౦పగా –గుండె లేని దయ్యె- గుండెగలిగి ‘’అంటూ స్మృత్యంజలి ఘటించాడు దేశభక్త కవి జాషువా .

  చివరగా తన గురుదేవుడు శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు తన కాళ్ళకు బంగారపు కడియం తొడుగుతుంటే ఆనందం ,భక్తీ ,వినయం త్రివేణీ సంగమంగా –

‘’చెళ్ళపిళ్ళ సత్కవీశుడు ప్రసిద్ధుండు –వీర శతావధాని ,యాంధ్రుల శుభ రక్తనాళములరూపము  నెత్తిన బ్రాహ్మణుండు-‘’నా పలుకుల రాణి పాదము’’ ను బంగరు గగ్గెర తో నలంకృతుల్ సలిపె-నికేమి కావలె ప్రశస్తి కవిత్వ కళా వధూటికిన్ ‘’అని కృతజ్ఞతాంజలి ఘటించాడు శిష్యుడు జాషువా .తనకు తొడిగారు అనకుండా తన కవితా సరస్వతి పాదాలకు తొడిగారు అనటం జాషువా మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం .అలాంటి అరుదైన వ్యక్తిత్వం ,సర్వసమానత్వం, విశాల భావ సంపద తో విరాజిల్లిన మహాకవి జాషువా గారి పురస్కారాన్ని అంతే వినయ విధేయతలతో అందుకొంటున్నాను ‘’అని ముగించాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-7-22-ఉయ్యూరు  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.