చెన్నై తెలుగు తల్లి (జనని )కి పాతికేళ్ళు
నిండిన సందార్భంగా ఆ సాహితీ సంస్థ ‘జనని ‘’రజతోత్సవ సంచికను 43వ్యాసాలతో 452పేజీలతో బృహత్తరంగా సర్వాంగ సుందరంగా అర్ధవంతమైన తెలుగు రచయితల ముఖ చిత్రం 28-5-2022 న శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారి రూపకల్పన , డా ఉప్పలధడియం వెంకటేశ్వర గారి సంపాదకత్వం లో వెలువరించి ,కార్యదర్శి శ్రీ చెన్నయ్య గారు నాకు పోస్ట్ లో 8-6-22న పంపగా , అందగా వెంటనే తెలియజేశాను .సరసభారతి సాహితీ పుష్కరోత్సవం హడావిడిలో పుస్తకం చదవలేదు నాలుగు రోజుల క్రితం ఆయనే వాట్సాప్ లో గుర్తు చేసి హోసూరు బస్తీ యువక బృందం డా వసంత ఆధ్వర్యం లో శ్రీ ప్లవ ఉగాదికి తెచ్చిన కవితా సంకలనం లో వారి కవిత్వం పై నేను రాసినవిషయం గుర్తు చేసి ,జనని పైన కూడా నా అభి ప్రాయం రాయమని ఆశతో ఎదురు చూస్తు౦టాననితెలియజేయగా ,అప్పటికి ఇంకా చదవలేదని,నాలుగు రోజులలో చదివి వ్రాస్తాననీ తెలియ జేసి ,గడువుపూర్తికాకుండానే ఇవాళే చదివి రాస్తున్నాను .చెన్నయ్యగారిని ఉయ్యూరు సభలకు ఆహ్వానించమని వరంగల్ నుంచి శ్రీ టి.రంగస్వామి గారు మెయిల్ లో తెలియ జేస్తే ,వారినే ఫోన్ నంబర్ రాయమని చెప్పి ఆయన పంపగా మాట్లాడి ఆహ్వానించాను .అప్పుడే హోసూరు విషయం జ్ఞాపకం చేశారు .చెన్నయ్యగారిని మా సరసభారతికి ఆహ్వానించి విశిష్ట సాహితీ పురస్కారం అందజేయటం మా సంస్థ పొందిన గొప్ప అదృష్టం .చాలాసాదాసీదాగా ఉండే వారు ఇంతటి బృహత్తర సాహితీకార్యక్రమాలను మద్రాస్ నడి బొడ్డున నిర్వహిస్తున్నారంటే వారి దీక్ష దక్షత తపన అర్ధమవుతోంది .చెన్న అంటే మంచి లేక సుందరమైన అని అర్ధం వారి మనసు బహు సుందరమైనది అని అందుకే సార్ధక నామధేయం అని అనిపిస్తుంది .వారింటి పేరు గుడిమెట్ల .ఈపేరు వినగానే సినీ సంగీత దర్శకుడు గుడి మెట్ల అశ్వత్ధామ గుర్తుకు వస్తాడు నాకు ఆయన దేవాంతకుడు సినిమాలో ఆరుద్ర గీతం ‘’ఎంత మధుర సీమా ,ప్రియతమా ‘’కు చేసిన స్వర రచన ముగ్ధులను చేస్తుంది ఆ సినిమా ఆపాట ఎన్నో సార్లు చూశాను విన్నాను .నేను ఆయన సంగీతాభిమానిని .అలాగే నా దృష్టిలో ఆయన’’ మాగ్నం ఓపస్ ‘ ’సినిమా ‘’చివరకు మిగిలేది ‘’ అన్నా మహా ఇష్టం ఆసినిమా కూడా నా దృష్టిలో ఆల్ టైం క్లాసిక్ పిక్చర్ .ఇదంతా గుడిమెట్ల పేరు తెచ్చిన అనుభూతి .చెన్నయ్యగారి గురించి పెద్దగా నాకు ఇప్పటిదాకా తెలియక పోవటం నా అజ్ఞానం .ఉప్పలధడియంగారితో మంచి పరిచయమే ఉంది .నాలుగేళ్ళక్రితం ఆయన్ను ఆహ్వానించి సత్కరించాం. ఆయన పుస్తకాలన్నిటికీ సమీక్ష రాశాను కూడా .ఇక ప్రస్తుతానికి వస్తాను .
ఈ సంచికలో వ్రాసిన రచయితలంత బాగా సాహితీ సుప్రసిద్దులే .దాదాపు అందరూ డాక్ట రేట్ లే .ఇలాంటి రచనలు వారందరికీ నల్లేరు పై నడకే . దాడాపుంని రచనలు అన్నీ పూర్వసాహిత్యం గురించి ఆకవులగురించే ఉన్నాయి .అందుకని ఇది ‘’పూర్వాంధ్ర సాహిత్య లఘు సర్వస్వం ‘’అని పించింది .రచయితలందరూ తమరచనలతో సంచికను సుసంపన్నం చేశారు .రిఫెరెన్స్ పుస్తకంగా సంచిక తయారైంది .తరతరాలు దగ్గర ఉంచుకొని మళ్ళీ మళ్ళీ చదవాల్సిన రచనలే ఆస్వాది౦చ తగిన దగిన అంశాలే .వారందరి కృషికి ,వారందరినీ ప్రోత్సహించి రాయించిన చెన్నయ్యగారి దీక్ష కు అభినందన మందారాలు .ఇంతటి విజ్ఞాన పయః పారావారం లో ఎన్నని రత్నాలు వెతకగలం ?త్రవ్వినకొద్దీ లభిస్తాయి.దిగినకొద్దీ ఆనంద మధురాను భూతియే పొందగలం . ఇంత భారీ పుస్తకం పై అభిప్రాయం రాయాలంటే ఇంతకు మించిన పుస్తకం అవుతుంది .కనుక నా చూపులో పడిన, నాకు దొరికిన రత్నమాణిక్యాలవంటి విషయాలు మాటలు అభిప్రాయాలు సేకరించి మీకు అందించే పని చేస్తున్నాను .
తెలుగు భాషా సాహిత్య సంస్కృతీ త్రివేణీ సంగమం లా సంచిక తెచ్చినట్లు ఉప్పలధడియం చెప్పిన మాట సంపూర్ణ సత్యం 1993గురు పూర్ణమినాడు పురుడుపోసుకున్న జనని –సాంఘిక సాంస్కృతిక సమితి ‘కి మంగళారతులు అద్దారు భువన చంద్ర .నేటి యువతరానికి విషయ వివేకం అధికం గురువు మంచి చెడ్డలు తెలుసుకోనేహక్కు వారికిఉంది కనుక వారి బుద్ధిగరిమకు దాన్ని వదిలి పెట్టాలి ఉపాధ్యాయులు అని అందరికీ హిత బోధ చేశారు పుల్లూరి ఉమా .అద్దంకి శ్రీనివాస్ తెలుగు లక్షణ గ్రంథాలపై విపరీత శ్రమ చేసి గొప్ప వ్యాసం రాసి ,సమగ్ర తెలుగు నిఘంటువు నిర్మించాలని కోరారు .కప్పి చెప్పేదికవిత్వం అయితే విప్పి చెప్పేది విమర్శ .దీన్ని సంపన్నం చేసినవారు డా జివి సుబ్రహ్మణ్యం గారు ,ఇప్పుడొస్తున్న కొత్త భావ వ్యక్తీఅరణ సాధనాలైన ఫేస్ బుక్ వాట్సాప్ లో వచ్చేసాహిత్యాన్నీ అధ్యయనం చేయాలన్నారు మండవ సుబ్బారావు .రంగస్వామి ఉదాహరణ వాజ్మయాన్ని చాలా సోదాహరణంగా వివరించారు .తంజావూర్ నాయకరాజులలో సాహిత్య ప్రముఖుడు విజయరాఘవ నాయకుడు .ఆకాలం గీత నృత్య అభినయాత్మకమైన యక్షగానాలకు స్వర్ణయుగం .తెలుగు సాహిత్య పరిణామ దశ ,జాతీయ వాజ్మయ చరిత్ర ,తెలుగు ఛందో రూపం ,దేశి దృశ్య కళారీతులు పరిశీలించాలంటే యక్షగాన అధ్యయనం తప్పని సరి అని చెప్పారు .హరి కథా వాజ్మయ మధనం చక్కగా చేసి నిసుగులను అందించారు యోగ ప్రభావతీ దేవి .ప్రముఖ హరికథకులలో ములుకుట్ల సదా శివ శాస్త్రి ,కోట సచ్చిదానంద శాస్త్రి ,పిల్లలమఱ్ఱి రామదాసు ,కడలి వీరయ్య గార్ల వంటి వారి పేర్లను వదిలేశారు. సైన్స్ ఫిక్షన్ రచయిత దేవరాజు మహారాజు తెలుగులో సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు అరుదు అన్న వాస్తవం తెలియజేసి ,పరిశోధన పత్రిక నడిపిన ఏం ఎం శాస్త్రి గార్ని ,వసంతరావు వెంకటరావు గార్నీ గుర్తు చేసి ,జనసామాన్యానికి విజ్ఞానం అందించాలన్న రావూరి భరద్వాజ ‘’ప్లాస్టిక్ ప్రపంచం ‘’వంటి పుస్తకాల ను వివరించి ,గణిత శాస్త్రావిషయాలు రాసిన విశ్వనాథ అరుణాచలం ,కందుల నాగభూషణం ,ఆధునికంగా రాస్తున్న వారిని ప్రస్తుతించారు .చారిత్రిక నవలలపై శరత్ చంద్ర బాపిరాజు చారిత్రకావలలో ఎన్నెన్నో చారిత్రాత్మక విషయాలు వివరించారానీ నోరి నరసింహశాస్త్రి గారు ,దేశాభిమానంతో రాశారని ,తెన్నేటి సూరి చంఘీజ్ ఖాన్ ‘’ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిందని ,పాటిబండ్ల మాధవ శర్మగారి రాజశిల్పి కుమారగిరి రెడ్డి నాటి చరిత్రను కళ్ళ ముందు ఉంచుతుందనీ ,ముదిగొండ శివప్రసాద్ శతాధిక చారిత్రిక నవలలు రాశారని ,ధూళిపాల శ్రీరామమూర్తిగారి గృహరాజు మేడ భువనవిజయం ఆనాటి రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయని చెప్పారు. తంగిరాల సుబ్బారావు గారు ‘’పలనాటి వీరకథా చక్రం -,గురిజాల రాయబారం లేక అలరాజు రాయబారం ‘’వ్యాసం లో నవల పల్నాటి పౌరుషానికి ప్రతీక అలరాజు ఒరలో ‘’సూర్య భేతాళం ‘’అనే కత్తిని బయటికి తీస్తే దాన్ని ప్రయోగించి శత్రువును చంపకుండా లోపల పెట్టడు అనే గొప్ప సత్యాన్ని ఎరుకపరచారు .
సుమారు ఆరునెలలక్రితం పరిచయమై నన్ను ‘’బాబాయిగారూ ‘’అని పిలిచే మా మద్రాస్’’ అమ్మాయి ‘’లేళ్ళపల్లి శ్రీదేవి పాల్కురికిసోమన రచనాలక్షణాలు తెలియజేసింది .తనరచనలద్వారాఆయన వీర శైవాన్ని దశ దిశలా వ్యాపి౦ప జే శాడని ,శివకవులకాలం వాడైన నాచన సోమన ప్రభావం పోతన తిక్కన శ్రీనాథ ధూర్జటి,రామలింగకవులపై ఉందన్నది .చోడుడి కుమార సంభవం విశేషాలు వివరిస్తూ బసవ శంకరరావు అతడు రాజసం ఉట్టిపడే కవి ,కవిరాజు ..కవిత్వం లో స్వాతిశయం నిలువెల్లా ప్రవహిస్తుంది .శ్రీకారం తో పద్యం ప్రారంభిస్తే అశుభం అని భావి౦చే కాలం లో శ్రీ తో మొదలుపెట్టి శ్రీతో అంతం ఆయె పద్యం రాశాడు .శ్లేషరచనకు మార్గదర్శి .నూతన కవితా సంప్రదాయాలకు ఆలవాలం కుమార సంభవం .ప్రబంథకవులకు మార్గదర్శి,ఒక్క తెలుగు పదం కూడా లేకుండా సంస్కృత సమాస రచనతో పద్యం అల్లాడు .ఎర్రన కావ్య శిల్పాన్ని సరిత వివరిస్తూ అరణ్యపర్వం లో రామకథ ఉందనీ, కానీ ఆయన రాసిన రామాయణం అలభ్యం అనీ ,అలతిఅలతిపదాలతొ శబ్దసార నిదర్శకంగా ఉండటం ఎర్రన శైలి అన్నారు .అంగాంగ వర్ణనకు ఆయన నృసింహ పురాణ ప్రబంధమే మార్గదర్శి .గుణవాది.పురాణ రచనకు ఓజస్సు తేజస్సు కూర్చాడు .ఎర్రన యుగంలో ఆయనతో దీటైనకవి నాచన సోమన అని శంకర్ రాస్తూ సోమనకు సోమనయే సాటి అని ,హరిహరనాథుని కావ్య వస్తువు చేసిన ఎకైకకవి అన్నారు .భక్తిజనవాటిక ,పేటిక అయిన భాగవతం రాసిన పోతన కవిత్వం లో వీరరసాన్ని బల దాన దయా ,యుద్ధ ధర్మ భక్తి లను అన్ని కోణాలలో హరినాథ్ వివరించారు .భగవంతుని వీరత్వం శిశుపాల దంతవక్త్ర ,బాణాసుర వధ మొదలైన వాటిలో చక్కగా పోషించాడు భక్తీ రసాన్ని పొంగి పొరలించిన పోతనామాత్యుడు .జాతికి అన్నమయ్య చేసిన సేవలు లో రెంటాల ‘’పదకవిత్వం ద్వారా తెలుగు వాడిలో సంగీత కళా౦శ ను అన్నమయ్య కాపాడాడు ,ఆయన కవిత్వం ఆరుద్ర అన్నట్లు ‘’అష్టమ సముద్రం ‘’అన్నారు .అన్నమయ్య అభ్యుదయ భావాలను వివరిస్తూ మన్నవ ‘’సుమారు అయిదున్నర శతాబ్దాల ముందే అన్నమయ్య అభ్యుదయ భావ వ్యాప్తి చేశాడు .డబ్బున్నవాడికీ నిరుపేదకు అహోరాత్రులు ఒకటే అన్న సత్యం చెప్పాడు .
మల్లెపూలవంటి పదాలతో మొల్ల సున్నిత శృంగారాన్ని రాసింది .కమనీయ రమణీయ మనోహర మహనీయ సుందర పద్యాలురాసింది .వేదకాల గార్గి మైత్రేయి లాగా తెలుగు సాహిత్యం లో మొల్ల మహిళలకు మార్గదర్శనం చేసింది ‘’అన్నారు మద్దూరి .మనుచరిత్ర వర్ణనా వైభవాన్ని నాగరాజ లక్ష్మి తన అనుభవ సారంతో వివరించారు .వస్తువు ను వ్యక్తీకరించటానికి పెద్దన సీసాలే వాడాడు అన్నారు .లోకోత్తర ప్రయోగ చాతుర్యం ,పాత్రౌచిత్యం పింగళి సూరన నేర్పు .అప్పటికీ ఎప్పటికీ ‘’కళా పూర్ణోదయం ‘’వంటిది అద్భుత ప్రబంధం అదొక్కటే .ఆయనకు సమకాలీన ధోరణి కూడా ఉన్నవాడు .సూరనకవిత్వం ‘’సమస్త ఔచితీ మండన మందనాయనం ‘’ అనటానికి కళాపూర్ణోదయం గొప్ప ఉదాహరణం అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి ..గుమ్మా సాంబశివ రావు తెనాలి వాడి సంస్కృత పద గు౦ఫనం ‘’పై విస్తృత వివరణాత్మక రచన చేసి తన పాండితీ, బోధనా వైభవాన్ని చాటి చెప్పారు .పాండు రంగ మాహాత్మ్యం లో ఎన్నో పద్యాలు సంస్కృత పద బాహుళ్యాలె .సంస్కృత సూక్తులను తెలుగుపద్యాల్లో నిబంధించాడు .యమ దూతలలో శ్రేష్టమైనది చిరకాలం బతికేదీ ,దూరపు చుట్టాలరాకను మధురస్వనం తో సూచి౦చేది,ఒంటికంటి చూపు కలది ,చలికాలం లో బలం కలదీ బలి భుక్కులలో శ్రేష్టమై నది కాకి అని రామలింగడు ‘’యమ రాడ్దూత శిఖా వతంసము ‘అనే పద్యంలో బాగా వివరించాడని చెప్పారు .శివుడు కన్ను ఆయుధంగా కలవాడు అని చెప్పటానికి ‘’అక్షి కౌక్షేయుడు ‘’అనే పద బంధం సృష్టించాడు గచ్చకాయల ఆట ను ‘’కుబేరాక్ష కేళి ‘’అన్నాడని చెప్పారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-7-22-ఉయ్యూరు