గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-16
స్వదేశీ ఉద్యమం
బెంగాల్ విభజన వలన కనీ వినీ ఎరుగని రీతిలో ఉద్యమం రూపు దాల్చింది .స్వదేశీ వస్తువులను ముఖ్యంగా వస్త్రాలనే వాడాలనే సంకల్పం బలీయమైంది .ఇదే ‘’వందేమాతరం ‘’ఉద్యమంగారూపు దాల్చి,ప్రజల నరనరానా జీర్ణించుకు పోయింది .1906లో కలకత్తా కాంగ్రెస్ లో తిలక్ ‘’శిస్తులు ,పన్ను వసూళ్లు చేయం ..మనడబ్బుతో ప్రభుత్వం ఎక్కడెక్కడో చేసే యుద్ధాలలో సహకరించం .న్యాయస్థానాలలోకూడా సహకరించం .మనల్ని విచారించటానానికి మనమే స్వతంత్ర న్యాయస్థానాలు నిర్వహిస్తాం .కాలం కలిసివస్తే మనం పన్నులే కట్టాల్సి న పని ఉండకపోవచ్చు .సమైక్యతతో దీన్ని సాధించగలిగితే మనం సర్వ స్వతంత్రులం ‘అని ఉద్బోధించాడు .ఇంతకుముందు ఏడాదిన్నర క్రితం మోతీలాల్ ఘోష్ ప్రవచించిన మాటలు గుర్తుకు తెచ్చుకొందాం –‘’ఆరుకోట్ల బెంగాలీలను కర్జన్ బంగాళాఖాతం లో మున్చేశాడుకర్కశపాలనలో .మన డబ్బూ దస్కం తో మేపబడుతున్న 72వేల మంది బ్రిటిష్ సైనికుల్ని అండగా చేసుకొని ఈ దారుణం చేశాడు .కోల్పోయిన శక్తియుక్తుల్ని కూడా తీసుకొని స్వజాతి రక్తాన్ని ధారపోయని జాతి ప్రపంచం లో లేదు .అమెరికన్లు ఇంగ్లాండ్ ప్రజలు ఇలా త్యాగాలు చేసిన జాతి అని మర్చిపోరాదు ‘’నీలి విత్తనాలను మళ్ళీ ఈ చేతులు ముట్టవు ‘’అని శపథం చేసి మన రైతాంగం మాట నిలబెట్టుకొన్నారు అలానే బెంగాల్ విభజన వద్దు అనే వారంతా ‘’ఈ చేతులతో విదేశీ వస్తువులు మళ్ళీ ముట్టుకోము ‘అని శపథం చేసి ,నెరవేర్చుకోవాలి .16-10-1905న విభాజిత రాష్ట్రాల ప్రారంభోత్సవం జరిగినప్పుడు మోతీలాల్ అమృత బజార్ పత్రికలో ఇలా రాశాడు –‘’భారతీయులు పశువులమందలేకానీ మానవ మాత్రులు కాదు అని పరాయిపాలకులు భావిస్తున్నారు .బెంగాలీలకు తగిలిన ఈ కొరడా దెబ్బ మంచిదే అయింది .లేకపోతె దీర్ఘనిద్ర నుంచి అంతత్వరగా మేలుకొనే వారుకాదేమో .కర్జన్ హేయమయిన చర్యలవలన తలెత్తిన స్వదేశీ ఉద్యమం సక్రమమార్గం లో నడిస్తే మృతప్రాయమైన దేశానికి మళ్ళీ జవసత్వాలు కలుగుతాయి .మనం ఈ ఉద్యమానికి ఎంతో రుణపడి ఉన్నాం ‘’అని ఎలుగెత్తి చాటాడు .
1906తర్వాత అయిదవ జార్జి వేల్స్ ప్రభువు కలకత్తావస్తే అమృతబజార్ పత్రిక,దిబెంగాలీ,ఉగ్రవాది ఎస్ కే రాడ్క్లిఫ్ సంపాదకత్వంలో వెలువడే ది స్టేట్స్ మన్ అనే పత్రికలను రాజుకంటపడకుండా బ్రిటిష్ అధికారులు నానా తంటా పడ్డారు .కానీ రాజు ఆంతరంగిక కార్యదర్శి ,మోతీలాల్ స్నేహితుడు సర్ వాల్టర్ లారెన్స్ అమృతబజార్ పత్రికలూ కొన్నిటిని సేకరించి చూపించాడు యువరాజుకు .లారెన్స్ పిలవనంపితే మోతీలాల్ సంప్రదాయమైన ఖద్దరు పంచ చొక్కాధరించి గవర్నర్ హౌస్ కు వెళ్ళాడు .’’యువరాజు ను చూడాలని ఉందా ?’’అని వెళ్ళగానే లారెన్స్ అడిగితె ,చూడకపోతే మర్యాదగా ఉండదేమో అనుకోని సరే అంటే .లోపలి తీసుకు వెళ్ళాడు .వాళ్ళిద్దరూ ఏయే విషయాలు మాట్లాడుకోన్నారో అవన్నీ మోతీలాల్ చాలాకాలం తర్వాత పత్రికలో ఇలా రాశాడు –‘’యువరాజు షేక్ హాండ్ ఇవ్వటానికి చేయి చాచగా ,భవిష్యత్తులో రాజుకాబోతున్న ఆయన ను భారతేయులు గౌరవించే పధ్ధతి అదికాదని చెప్పి ముకుళితహస్తాలతో నమస్కరించాను . గద్గదస్వరంతో ఇలా విన్న వించాను –‘’ మీ పరిచయాన్నికలిగిన్చినందుకు ధన్యవాదాలు ,ఇది గౌరవంగా భావించి కలకాలం మనసులో భద్రపరచుకొంటాను .నిరుపేద ఇండియాదయనీయ పరిస్థితి వివరించటానికి అనుమతించండి .మా భవిష్యత్ పాలకులు మీరేకనుక మీ చేతులతో మా దేశస్థితిని చక్క దిద్దండి .భారతీయులని మరవకండి .ఇంగ్లాండ్ లోని నాలుగుకోట్ల ఆంగ్లేయుల్లాగానే ,భారతీయుల్నికూడా మీ స్వజనం గా భావించండి .మాకు మా పాలకుల దయాదాక్షిణ్యాలు శ్రద్ధాసక్తులు చాలా అవసరం ‘’అన్నాడు మోతీలాల్ ఆ మాటలకు యువరాజు కరిగిపోయినట్లు కనిపించాడు .చాలా ఆప్యాయంగా మోతీలాల్ ను లేచి నిలబడమని కోరి ,ఆత్మీయత ధ్వనించే కంపిత స్వరంతో ‘’మిమ్మల్ని కలుసుకోవటం నాకెంతో సంతృప్తినిచ్చింది .నిజంగానే నేను భారతీయులను మరువనే మరువను అని మీద్వారా మాట ఇస్తున్నాను .నా స్మృతిపధం లో భారతీయులు ఎప్పుడూ నిలిచే ఉంటారు .మీరు మాకు చూపిన స్వాగత సత్కారాలను మా తండ్రిగారికి నివేద్దిస్తాను .ఎంతో ఆత్మీయతా భావంతో మీ దేశం నుంచి తిరిగి వెడుతున్నాను ‘’అన్నాడు యువరాజు .ఇంగ్లాండ్ వెళ్ళిన వెంటనే తండ్రికి ఈ విషయాలన్నీ చెప్పాడు.భారతీయుల విధేయత మరింత పొందగలిగితే ,ఆదేశ పాలనాభారం మరింతసులువుగా ఉంటుందని అక్కడి ప్రభుత్వానికి నివేదించాడు .1911లో ఆయన బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించాక బెంగాల్ ను పునరేకీకరించాలని సూచన చేసినట్లు తెలిసింది .11-12-1911న ఢిల్లీ లోని రాజదర్బార్ లో ఈ పునరేకీకరణ సంకల్ప ప్రకటన జారీ అయింది .మోతీలాల్ ఘోష్ ,యువరాజు దీన్ని అత్య౦త రహస్యంగా ఉ౦చాలనుకొని రహస్యాన్ని కాపాడారు .1910లో మోతీలాల్ ఘోష్ ను అరెస్ట్ చేసే పధకాన్ని అత్యంత నాటకీయంగా చేబట్టకపోవటానికి ఇదే కారణం .
బెంగాల్ లో స్వదేశీ ఉద్యమ సారదులలో మోతీలాల్ ఘోష్ ఒకరన్న సంగతి మర్చిపోలేము .అనేక బృందాలు సమితులు ఊరూరా ఉద్యమవ్యాప్తికోసం తీవ్ర కృషి జరిపారు .స్వతంత్ర ఉద్యమానకి వీరంతా వాలంటీర్లుగా సాయపడ్డారు .అరవిందులు మోతీలాల్ కు అత్య౦త సన్నిహితులు .స్వామి వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత వారితో అందరికంటే మోతీలాల్ కు ఎక్కువ పరిచయం ఉందికూడా .
స్వాతంత్ర సాధనకు తిరుగుబాటు పద్ధతులను ప్రోత్సహించే పత్రికలూ కూడా వచ్చాయి .బ్రహ్మబంధం ఉపాధ్యాయ సంపాదకత్వం లో సంధ్య దినపత్రిక ,భూపెంద్రనధ దత్తు సంపాదకత్వం లో జుగ౦తర్ వారపత్రిక ,మనోరంజన్ గుహ ఠాకూర్త గారి నవశక్తి దినపత్రిక ,అరవింద ఘోష్ ‘’బందేమాతరం ‘’పత్రిక గొప్ప ప్రచారం చేశాయి .ఉన్నదున్నట్లు రాసి పత్రికలూ స్వచ్చతను పాటించి గౌరవం పొందాయి .వీటిపై నిరంతరం నిఘా సాగేది .బ్రహ్మబందు తాను కోరుకోన్నట్లే విచారణ ఖైదీగా ఉండగానే చనిపోయాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-22-ఉయ్యూరు