గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-17
పంజాబ్ లో రైతాంగం భూమిపట్టాల లోటుపాటు చట్టాలవలన లజపతిరాయ్ అజిత్ సింగ్ నాయకత్వాన తీవ్ర ఆందోళనకు దిగారు .వారపత్రిక పంజాబీ ప్రచురణకర్త ముద్రాపకుడిని జైలు లో పెట్టి బర్మాకు తరలించింది ప్రభుత్వం .ప్రజాతిరుగుబాటును కఠినంగా అణచి వేయాలని ప్రభుత్వం భావించింది .విదేశీ వస్తు విక్రయశాలలవద్ద పోలీసు కాపలా పెట్టింది .తూర్పు బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్బాంఫీల్డీ ఫుల్లర్ కఠినాతి కఠినంగా వ్యవహరించాడు .బరిసాల్ జిల్లాలో అశ్వినీకుమార్ ,అశ్వినీకుమార్ దత్తు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రభుత్వానికి వణుకు పుట్టించారు .స్థానిక వివాద పరిష్కారానికి అశ్వినీకుమార్ దత్ పంచాయితీ కోర్టులను సమర్ధ వంతంగా నిర్వహించాడు .1906 ఏప్రిల్ 14,15తేదీలలో బెంగాల్ రాష్ట్రీయ రాజకీయ మహా సభ జరిగినప్పుడు అక్కడ రక్తం చిందింది.బందేమాతరం నినాదం చేయటానికి అనుమతించలేదు ప్రభుత్వం .అంతకుముందే బందేమాతరం పై నిషేద్ధం ప్రకటించినందువల్ల దాన్ని కొనసాగించలా వద్దా అనేది సమస్య అయింది .అప్పుడు మోతీలాల్ అమృత బజార్ పత్రికలో ‘’నా శిరస్సు అంత విలువైనదేమీ కాదు వందేమాతరం అనకుండా ఉండలేను .అలానినాదంచేసే సమయంలో పోలీసులు అరెస్ట్ చేయటానికి వస్తే ప్రతిఘతించండి ‘’అని రాశాడు .చివరికి నిషేధపు ఉత్తర్వును శాంతియుతంగానే ధిక్కరించాలని నిర్ణయించారు .
మహాసభ ప్రతినిధులు శిబిరాలనుంచి బయటికి వచ్చి సభకు హాజరవటానికి వందేమాతరం అంటూ వెడుతుంటే పోలీస్ సూపరిం టే౦డెంట్ అతనిబలగాలు లాఠీలతో ప్రజలపై విరుచుకు పడ్డారు .సురెంద్రనాద్ మోతీలాల్ అశ్వినీకుమార్ లు ముందుకు వచ్చి కావాలంటే తమల్ని అరెస్ట్ చేయమన్నారు .కానీ సురెంద్రనాథ నుమాత్రమే అరెస్ట్ చేసి ,మేజిష్ట్రేట్ ఇంటికి తీసుకుపొగా ఆయన నాలుగు వందల రూపాయలు జరిమానా విధించాడు .ఆ ఫైన్ చెల్లించి మళ్ళీ వందేమాతరం నినాదాలతో రెట్టింపు ఉత్సాహం తో ప్రజలు ఆయనను సభాస్థలికి ఊరేగింపుగా తీసుకు వెళ్ళారు .కలకత్తా ప్రముఖ న్యాయవాది అబ్దుల్ రసూల్ అధ్యక్షోపన్యాసమిచ్చాడు .మోతీలాల్ ఆ సభలో ఒక కీలక తీర్మానం ప్రవేశ పెట్టాడు అందులో సారాంశం –‘’తూర్పు బెంగాల్ ,అస్సాం లలో దేశభక్తులైన కార్యకర్తలపై ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తోంది .న్యాయబద్ధమైన చట్టబద్ధమైన పరిపాలన ఏనాడో అంతరించింది .ఈబాధ్యతా రహిత ప్రభుత్వంతో ఎలాంటి చార్చాలు జరపము .ప్రజలస్వయం కృషివలన పరిష్కరించదగిన అంశాలే చర్చిస్తాము ‘’
15ఏళ్ళ తర్వాత గాంధీ అహింసావిధానం లో సహాయనిరాకరణ శాసనోల్లంఘన చేయాలని పిలుపునిచ్చాడు .అప్పట్లో ఆంగ్లో ఇండియన్ ల అభిప్రాయాలను చాటే స్టేట్స్ మాన్ పత్రిక ‘’1906లోనే బెంగాల్ లోని బరిసాలాలో మొదటిసారి శాసనోల్లంఘన మోతీలాల్ ఘోష్ నాయకత్వాన జరిగింది .గాంధీ సహాయ నిరాకరణ మంత్రం కూడా మోతీలాల్ సూచిన్చిందే .చరఖాపై నూలు వడకటం కూడా మోతీలాల్ చెప్పిందే .ఆయన కృషి సత్ఫలితాన్నిచ్చి భాద్రాలోక్ కుటుంబాలలో వేలాది చరఖాలు వెలిశాయి .కానీ విభజన ఆందోళన కారులు దీని ప్రాముఖ్యాన్ని గుర్తించలేక పోయారు .’’అని రాసి మోతీలాల్ దూర దృష్టి మార్గ నిర్దేశనం ను శ్లాఘించింది .
కర్జన్ తర్వాత వచ్చిన మింటో ప్రజలపై మరింత కఠినంగా ప్రవర్తిస్తూ కలకత్తాలో వందే మాతరం అని అరచిన 15ఏళ్ళబాలుడికి 16కొరడా దెబ్బలు శిక్ష వేశాడు .ఈ కేసు విచారించి,తీర్పు చెప్పిన మేజిష్ట్రేట్ కింగ్ ఫోర్ట్ పై పగ తీర్చుకొంటామని విప్లవకారులు ప్రతిజ్ఞ చేయాగా ఆయన్ను ముజఫర్ పూర్ కు ట్రాన్సఫర్ చేశారు .అతన్ని చంపటానికి ఖుదీరాం బోస్ ,ఫ్రఫుల్ల చక్కీ లకు బా౦బులిచ్చి పంపారు .వీరు వేసిన బా౦బులలో మేజిష్ట్రేట్ కాక ఇద్దరు యూరోపియన్లు చనిపోయారు .బెంగాల్ లెఫ్టినెంట్ జనరల్ ఆండ్రూ ఫైజర్ పైకూడా రెండు సార్లు బాంబు దాడి జరిపారు .కానీ వెంట్రుకవాసిలో తప్పించుకోగలిగారు .ఒక బాంబుదాడిలో ఢాకాడిష్ట్రిక్ట్ మేజిష్ట్రేట్ ‘అలెన్ ‘’చనిపోయాడు .చివరికి చిక్కీ ఒక బెంగాల్ పోలీసాఫీసర్ కు చిక్కగా ఆత్మహత్య చేసుకొన్నాడు . తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ను విప్లవకారులు చంపేశారు .కలకత్తా శివార్లలోని ‘’మానికాల్ గార్డెన్ ‘’లో ఉన్న చిన్న ఆయుధ శాలలపై పోలీసులు దాడి చేయగా అరవి౦దఘోష్ తమ్ముడు వీరేంద్ర ఘోష్ తో సహా అనేకమంది విప్లవకారులు అరెస్ట్ అయ్యారు .వారిలో చాలామందికి యావజ్జీవ కారాగార వాస శిక్ష విధించారు .అరవి౦దోను కూడా ఖైదు చేసి విచారించి ఏ ఆధారం దొరకక నెల తర్వాత విడుదల చేశారు .
విప్లవకారులు ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్ ,అమెరికాల లో కూడా విప్లవ కేంద్రాలు స్థాపించారు .అక్కడి నుంచే బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు సాగించారు .వీరిలో శ్యాం జీ కృష్ణవర్మ ,మేడంఎస్ ఆర్ రాణా,వీరేంద్రనాధ చటోపాధ్యాయ ,తారాకాంత దాస్ ,బేడీ సావర్కార్ ,,లాల్ హరిదయాల్ లు ముఖ్యులు .వీరంతా పత్రికలద్వారా ప్రచారం చేశారు .అక్కడి భారతీయ విద్యార్ధులను సమీకరించి ప్రబోధం కలిగించారు .లండన్ లో జరుగుతున్న ఒక సమావేశం లో విదేశాంగమంత్రి కార్యదర్శి సర్ కర్జన్ వైల్ ను మదన్ లాల్ ధింగ్రా కాల్చి చంపాడు .అతన్ని ప్రభుత్వం ఉరి తీసింది .కలకత్తా ఆలీపూర్ జైలు లో ఒక రాజకీయ కేసులో అరెస్ట్ అయి విచారణలో ఉన్న సత్యన్ బోస్ మాణిక్ లాల్ కేసు లో అప్రూవర్ గా మారిన నిందితుడు నరేంద్ర గోస్వామిని కాల్చి చంపాడు .ఈ కేసు విచారిస్తున్న పోలీస్ అధికారినీ ప్రాసిక్యూషన్ న్యాయవాదినీ బూటారంగా కోర్ట్ లో కాల్చి చంపారు .టెర్రరిస్ట్ విజ్రు౦భణకు పత్రికా స్వేచ్చముఖ్యకారణం అన్నాడు మింటో .1910లో పత్రికా చట్టం తెచ్ఛి అంక్షలు విధించాడు .నిషేద్ధిత వార్త ప్రచురిస్తే పత్రిక ఐదువేలు ఫైన్ కట్టాలని రూల్ పెట్టాడు .
మోతీలాల్ కు ,పత్రికకు ఎప్పుడూ ఏదో ఒక హెచ్చరిక అందుతూనే ఉంది .ప్రజలను భయభ్రాంతులను చేసి లొంగ తీద్దాం అనుకొన్న మింటో ఆశలు అడియాశలే అయ్యాయి .’’ముందు అణచి వేత తర్వాతే చర్చలు ‘’అనే మింటో విధానాన్ని మేధావి వర్గం తిరస్కరించింది .తర్వాతవచ్చిన మోర్లె,లార్డ్ క్రేవీ లవలన కూడా ఏమీకాలేదు .మింటో మార్లే సంస్కరణలను ముస్లిం లు మాత్రమె సమర్ధించారు .1911లోబెంగాల్ విభజన రద్దు అవగానే ముస్లిం లకు అసంతృప్తి పెరిగింది .1902లో బోయర్లు స్వాతంత్ర్యం సాదించుకొన్నారు .1905లో చిన్న దేశం జపాన్ రష్యా జార్ ప్రభువుల అహంకారానికి దెబ్బకొట్టింది .1912 డిసెంబర్ లో వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ ను నడి రోడ్డుమీద హత్య చేయటానికి జరిగిన ప్రయత్నం లో అప్పటిదాకా నివురుకప్పిన నిప్పులాగా ఉన్న జ్వాల ఒక్కసారి ఎగసి పడింది .మోతీలాల్ అహింసను ,ప్రజోద్యమాన్నే బలపరచాడు .గాంధీ యుగం ఆరంభించటానికి ముందే మేధావులలో ముఖ్యులైన రవీంద్రుడు ,మోతీలాల్ ఘోష్ జాతికోసం ప్రాణాలు త్యజించి పోరాడిన వీరుల చిత్త శుద్ధినీ ,ఔన్నత్యాన్నీ కొనియాడారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-22-ఉయ్యూరు