గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-22
తుఫాన్
మొదటి ప్రపంచయుద్ధం తర్వాత జర్మనీ వలస సామ్రాజ్యం ,యూరప్ లో ఆఫ్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం ,పశ్చిమాసియాలో టర్కిష్ సామ్రాజ్యం చీలిపోయి చిన్న చిన్న దేశాలుగా మారాయి .రష్యాలో బోల్షెవిక్ తిరుగు బాటు దార్లు గెలిచారు .జార్ ప్రభువును అతని కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు .ఆఫ్ఘనిస్తాన్ విదేశీ వ్యవహారాలలో స్వతంత్రంగా వ్యవహరించింది .ఇవన్నీ భారత దేశం పై ప్రభావంచూపాయి .రౌలట్ బిల్లు లో రెండు సిఫార్సులు చేర్చి బ్రిటిష్ ప్రభుత్వం అందుకే బిల్లు ప్రవేశపెట్టింది .ఏ వ్యక్తినైనా ప్రభుత్వం నిర్బందించవచ్చు దీన్ని వైస్రాయ్ కౌన్సిల్ లో ఎన్నికైన ప్రతినిదు లంతా తిరస్కరించారు .అయినా 1919మార్చిలో బిల్లు చట్టం అయింది .మహమ్మదాలీ బృందం శాసనమండలికి రాజీనామా చేసింది .దేశమంతా నిరసనలు పెరిగాయి .దీన్ని ప్రభుత్వ విద్రోహంగా అందరూ భావించారు .బిల్లు ఆమోదం పొందటానికి ముందు బెంగాలీ నేషనలిస్ట్ లు ఫిబ్రవరి3 న టౌన్ హాల్ లో సమావేశమయ్యారు .అసంఖ్యాక జనం రావటంతో బహిరంగ సభ జరిపారు .72ఏళ్ళ మోతీలాల్ ఆరోగ్యం క్షీణించినా హాజరయ్యాడు ఆయన్ను బుజాలమీద ఎక్కించుకొని వేదికపైకి తీసుకు వెళ్ళారు .మితవాదులు చాలామంది వచ్చారు .స్పష్టమైన నిరసన తీర్మానం మోతీలాల్ ప్రతిపాదించాడు –‘’ఈ బిల్లు ప్రభుత్వానికి నిరంకుశ అధికారాలు కట్టబెడుతుంది .చట్టబద్ధమైన న్యాయబద్ధమైన పాలన ఇక కనిపించవు .బాధ్యతాయుత ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి .శాసన సభ్యుల పునర్వ్యస్థీకరణ జరిగేదాకా బిల్లు ప్రవేశ పెట్టకూడదు ‘’అని ఎలుగెత్తి చెప్పాడు మోతీలాల్ .
ఈ బిల్లులను సవాలుగా తీసుకొని గాంధీ సత్యాగ్రహోద్యమం చేయాలను కొన్నాడు .సత్యాగ్రహ దళం ఏర్పాటు చేశాడు .దేశమంతా హర్తాల్ చేయమని పిలుపు నిచ్చాడు .అందరూ తనమాట మన్నిస్తారనే ఆశాభావం కనపరచాడు .బెంగాల్ మహారాష్ట్ర ,పంజాబ్ లలో విప్లవవాదులు ఉండటం వలన తనమాటకు విలువ ఇవ్వరు అనుకొన్నాడు .హర్తాల్ మార్చి 13 కు బదులు ఏప్రిల్ 16కు మార్చాడు .దేశం లోని ప్రతిపల్లె పట్టణం గాంధీ మాట మన్నించి సంపూర్ణ హర్తాల్ చేసి ఆయనపట్ల అపూర్వ విశ్వాసం కనపరిచింది ప్రజ .అది ఆయన వ్యూహం ఫలించిన అద్భుతమైన రోజు.అపోహవలన ఢిల్లీలో మాత్రం మార్చి 13 హర్తాల్ జరిగింది .హిందూ ముస్లిం ఊరేగింపు దార్లపై పోలీసులు కాల్పులు జరిపారు .ప్రజలలో నిరసన ప్రబలి స్వామి శ్రద్దానంద్ నాయకత్వాన పెద్ద ఊరేగింపు జరిపి హిందూ ముస్లిం ఐక్యత చాటారు .గాంధీ వెంటనే శాసనోల్లంఘనం తాత్కాలికంగా నిలిపి వేశాడు .అసంతృప్తితో ఉన్న పంజాబు ప్రజలు ఏప్రిల్ 10న ప్రదర్శన నిర్వహిస్తే ,హింసా దౌర్జన్యాలకు దారితీసి ,10మంది యూరోపియన్లను చంపేయటం తో సైనికపాలన విధించి అన్ని ప్రదర్శనలు నిషేధించారు .ఏప్రిల్ 13న అమృతసర్ లో పౌరులు నిషేధాన్ని ధిక్కరించి సమావేశం జరపగా ,జలియన్ వాలాబాగ్ లో ఒకేఒక దారి ఉండటం వలన జనరల్ డయ్యర్ 90సైనికులతో వచ్చి ప్రజలపై ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపించాడు .కొరడాలతో కొట్టించాడు .రోడ్లమీదదేకించారు .బ్రిటిష్ పతాకానికి సెల్యూట్ చేయటానికి ప్రజలను మైళ్ళ కొద్దీ దూరం నడిపించారు .ఈ అమానుష కాండను పంజాబ్ గవర్నర్ సమర్ధించాడు .ఆయన చెప్పినవన్నీ కట్టు కధలే అని తర్వాత బ్రిటిష్ గూఢ చారి విభాగం తేల్చేసింది .
డయ్యర్ బుల్లెట్లు భారత ప్రజలని అపూర్వంగా సంఘటిత పరచాయి .పత్రికాసేన్సార్ షిప్ ను ధిక్కరించి పత్రికలు ఆవార్తలు ప్రముఖంగా ప్రచురించి ప్రపంచం దృష్టికి తీసుకు వెళ్ళాయి .యావత్ భారత దేశం సభ్య ప్రపంచం జలియన్ వాలాబాగ్ ఉదంతానికి చలించి పోయింది . నిరసనగా రవీంద్రనాధ టాగూర్ ప్రభుత్వం తనకిచ్చిన ‘సేనాని ‘’విశిష్ట గౌరవాన్ని తిరస్కరించగా ,దేశ ప్రజలు కార్యోన్ముఖులయ్యారు .ఇద్దరు భారతీయులతో వైస్రాయి ఒక కమిటీ వేసినా అది కంటి తుడుపు చర్య అని నిరసనలు కట్టలు తె౦చు కొన్నాయి .కలకత్తా టౌన్ హాల్ లో మళ్ళీ జరిగిన సభకు మోతీలాల్ ఘోష్ ను చైర్మన్ గా నామినేట్ చేశారు .ఆయన మాట్లాడ లేనంత నీరసంగా ఉండటం తో ఆయన ప్రసంగా పాఠం ఐ. బి .సేన్ చదివి వినిపించారు –‘’ఇటీవలి సంఘటనలో ఏమాత్రం తప్పులేని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు .గౌరవ ప్రద జీవితం గడుపుతున్నవారు అవమానాల,వేదనల పాలయ్యారు .దీనిపై ఘనత వహించిన వైస్రాయి ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం భారత ప్రజలను అవమానించటమే .అధికారులకు భయ౦పట్టుకొన్నట్లుంది .పరిస్థితులు చేతులు దాటిపోయినట్లు భావిస్తున్నారు .పంజాబ్ దురంతం ప్రీవీ కౌన్సిల్ లో బట్టబయలు కాకతప్పదు అని వారు శంకిస్తున్నారు .నష్టం భర్తీ అంటూ హడావిడిగా ప్రత్యెక బిల్లు తెస్తున్నారు .దర్యాప్తు కమిటీరిపోర్ట్ వచ్చేదాకా ఆగలేక పోతున్నారు ‘’అని చెప్పాడు .
ఈ దుర్ఘటన దర్యాప్తుకుగా ఒక అనధికార కమిటీ కాంగ్రెస్ వేసింది .చిత్తరంజన్ దాస్ ,గాంధీలు మొదటిసారిగా కలుసుకొన్నారు .లోతుగా చర్చించారు ఆసమావేశం మంచి ఫలితాలకు దారి తీసింది .పంజాబ్ అనాగరక అణచి వెతచర్యలను అమృత బజార్ పత్రిక ప్రముఖంగా విమర్శించింది ‘’బ్రిటిష్ అధికారులు ము౦దుగాతమ స్వంత సేవ చేసుకొని తర్వాతే ఇండియా సేవ గురించి ఆలోచిస్తారు ‘’అని కడిగేసింది .’’చట్టబద్ధమైన పాలన ఇక లేదని ప్రజలు భావిస్తున్నారు .ప్రజల్ని పిట్టల్నికాల్చినట్లు కాలుస్తారని భయపడి పోతున్నారు .రౌలట్ చట్టం ప్రాధమిక హక్కులకు మరీ భంగం కలిగిస్తుంది అని గ్రహించి హిందూ ముస్లిం లు ఏకమయ్యారు .జీవితాలు బాగుపడటం దేవునికి ఎరుక ఇంతకన్నా అద్వాన్నం కాకుండా ఉండాలని ప్రజలు కోరుతున్నారు .రౌలట్ చట్టాన్ని ఆమోదించటం తప్పే అని బ్రిటిష్ యంత్రాంగానికి అర్ధమయింది ‘’అని రాశాడు మోతీలాల్ .
1913నుంచి ప్రభుత్వ ఖజానాలో ఉన్న పత్రిక ధరావత్తు 5వేలరూపాయలు ప్రభుత్వం నాకేసి ,మరో 10వేలు కట్టమని తాఖీదు పంపారు .మే 15న పంజాబ్ లో ఈ పత్రిక ను నిషేధించారు .కొద్దికాలం లోనే పత్రిక శ్రేయోభిలాషులు డబ్బు కట్టేశారు .పత్రికను ఆర్ధిక ఇబ్బందుల్లో పెట్టాలన్న ప్రభుత్వం ఎత్తుగడ ఫలించకుండా ప్రజలు సహకరించారు .పట్టువదలని విక్రమార్కుడు మోతీలాల్ ‘’బొందిలో ప్రాణం ఉన్నంతవరకు ,మా స్వేచ్చను గుంజుకోనంతకాలం మా విధి మేము నేరవేరుస్తూనే ఉంటాం .ఈ పత్రికా చట్టం నిబంధనలను బట్టి పత్రికను ఆదర్శవంతంగా నడపటం అంటే నిత్య రాజకీయాలు గాలికి వదిలేసి ,బంగాళా దు౦పల మీద అరటి పళ్ళ మీద రాయాలి ‘’అని ఘాటుగా చేరిగేశాడు .భారతీయుల క్రోధాగ్ని ఎంతగా ప్రబలి ఉందొ డిసెంబర్ 19సంపాదకీయం లో మోతీలాల్ –‘’ఫౌంటెన్ మార్చకుండా నీటి గొట్టాలు మారిస్తే మురికి నీరు వస్తు౦ దేతప్పశుద్ధ త్రాగు నీరు రాదు .’’అన్నాడు .
23-12-1919న ఆమోదించిన చట్టం జాతీయవాదులకు అసంతృప్తే మిగిల్చింది .స్వయం పాలన మృగ్యం .దీనివలన ‘’బ్యార్టీ’’అనే పాలన వచ్చింది .విద్య ప్రజారోగ్యం పబ్లిక్ వర్క్స్ మంత్రుల అధీనం లో ఉంటాయి .మంత్రులు శాసనసభలకు బాధ్యులు .మంత్రిజీతం ఏడాదికి 64వేలు .పోలీస్ ,న్యాయశాఖ భూమి శిస్తు లు గవర్నర్ ,ఆయన కౌన్సిలర్ల పరిధిలో ఉంటాయి .కేంద్ర ప్రభుత్వం భారతీయ శాసన మండలితో సంబంధం కలిగి ఉండదు .ముస్లిం సిక్కులు ,క్రిస్టియన్లు వేరువేరుగా వోటర్లు .పదేళ్ళ పరిస్థితిని బట్టి బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకొంటే చేయచ్చు .ఈ చట్టాన్ని ఆమోదయోగ్యం చేయటానికి రాజకీయ ఖైదీలతో సహా డిటిన్యూ ల నందరికి పంచమ జార్జి క్షమాభిక్ష పెట్టి విడుదల చేయించాడు .
బ్రిటిష్ అధికార వృక్షం వ్రేళ్ళు అవినీతి తో కుళ్లిపోవటాన్ని గాంధీ సహించలేకపోయాడు .సహాయ నిరాకరణే మంత్రం అని భావించి కలకత్తా కాంగ్రెస్ సభలో దాన్ని ఆమోదింప జేశాడు .చరఖాతో నూలువడకటం సర్వ రోగ నివారిణి కాదని బెంగాలీ తత్వ సూత్రధారులు చిత్తరంజన్ దాస్ ,బిపిన్ చంద్రపాల్ నిరసించారు .గ్రామీణ పరిశ్రమలద్వారా దేశ ఆర్ధిక పుష్టి కలిగించాలన్న గాంధీ వాదం తో రైతాంగం బలపరచింది 1920చివరలో బెంగాలీ విప్లవకారుల౦దర్నీ విడుదల చేశారు .భారీగా ప్రజలు సహాయనిరాకరణలో పాల్గొనాలని చిత్తరంజన్ పట్టుబట్టాడు .1920డిసెంబర్లో జరిగిన నాగపూర్ కాంగ్రెస్ అభలో అత్యధిక మెజారిటీతో సహాయనిరాకరణ ఉద్యమ ప్రతిపాదన ఆమోదించారు. దాస్ ,మోతీలాల్ నెహ్రు , కొడుకు జవహర్ లాల్ లు కొత్తగాధీతత్వాన్ని ఆమోదింఛి ప్రజల మనుషులయ్యారు .జాతీయ ఉద్యమం లో అసలు సిసలైన శక్తి ప్రజా బాహుళ్యం నుంచే వెల్లువై ప్రవహించింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-22-ఉయ్యూరు ,