ప్రముఖ కవి రచయిత, అనువాదకుడు, రేడియో ప్రయోక్త ,’’కవితల్లజ ‘’ –కందుకూరి రామ చంద్రరావు

ప్రముఖ కవి రచయిత, అనువాదకుడు, రేడియో ప్రయోక్త ,’’కవితల్లజ ‘’ –కందుకూరి రామ చంద్రరావు
కందుకూరి రామభద్రరావు ( 1905 జనవరి 31, – 1976 అక్టోబరు 8, ) ప్రముఖ తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. వీరు గోదావరీ నది తీరంలో రాజవరం గ్రామంలో జన్మించారు.వారి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని రాజవరం. వీరు పిఠాపురం మహారాజా కళాశాలలో పట్టభద్రులై ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆత్రేయపురంలో మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో సంస్థాపక ప్రధానోపాధ్యాయులుగా ఉత్తమ సంప్రదాయాలను నెలకొల్పారు. వీరు రాజవరం పంచాయితీకి మొదటి అధ్యక్షులు. వీరు కవిగా తరంగిని, వేదన, జయపతాక, కవితాలహరి మొదలైన గేయాలను, గేయమంజరి అనే గేయ కావ్యాన్ని, ఎందరో మహానుభావులు అనే వచన గ్రంథాన్ని రచించారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ చిత్ర నాటికను తెలుగు భాషలోకి అనువదించారు. వీరి స్వీయ కవితలను “Searching Strains”గా ఇంగ్లీషులోకి అనువదించారు. వీరు “Leaves from a diary” అనే ఆంగ్ల గ్రంథం రచించారు.
జీవితం
రామభద్రరావుగారి తండ్రి కందుకూరి సూర్యనారాయణ ఉత్తమ సంస్కారం గల సంపన్న గృహస్థు. ఆ గ్రామానికి కరణం కూడా. అతనే రాజవరంలో శివ, కేశవులకు ఆలయాలను కట్టించిన ధర్మకర్త. తల్లి నాంచారమ్మ. సౌజన్యం, సౌందర్యం, మూర్తీభవించిన పురంధ్రి. రామభద్రరావు ప్రాథమిక విద్య రాజవరంలోనే గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన గురువు వద్ద జరిగింది. ఆ రోజుల్లో అక్కడ ప్రాథమిక పాఠశాల కూడా లేదు.ఉన్నత పాఠశాల తరగతులు రాజమహేంద్రవరంలో సుప్రసిద్ధ వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాల.జయంతి గంగన్నపంతులు ప్రధానోపాధ్యాయుడుగా ఉండేవాడుు.ఆదర్శ ప్రధానోపాధ్యాయులుగా ప్రసిద్ధి పొందారు. రామభద్రరావు తగిన వయసులోనే వివాహం జరిగింది. భార్య పేరు రామలక్ష్మి. F.A., B.A.లు కాకినాడ పిఠాపురం మహారాజా కళాశాలలో చదివారు. ఆ రోజులలో వేమూరి రామకృష్ణారావు ప్రిన్సిపాల్ గా ఉండేవాడు. అతను ఆంగ్లంలో గొప్ప పండితుడు. క్రమ శిక్షణకు పెట్టింది పేరు. పెద్దాడ రామస్వామి. కాళ్ళకూరి సత్యనారాయణ ప్రభ్రుతులు అధ్యాపకులుగా ఉండేవారు. గాంధీ మహాత్ముని సారథ్యంలో స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజులు. సాంఘికంగా రఘుపతి వెంకటరత్నం నాయుడి బ్రహ్మసమాజ ప్రభావం కాకినాడలోను తత్రాపి కళాశాలలోను వ్యాపించిన రోజులు. కాలేజీ విద్యార్థిగా రామభద్రరావు ఆంగ్ల ఆంధ్రభాషలలో వక్తృత్వపు పోటీలలో బహుమతులు సంపాదించాడు. విద్యార్థులలో ప్రసిద్ధి పొందారు. ప్రిన్సిపాల్ రామకృష్ణారావు, పెద్దాడ రామస్వామి గార్లకు ప్రియతమ విద్యార్థి. F.A. పరీక్షలో తెలుగులో ప్రథమంగా నిలిచి ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకాన్ని పొందాడు. B.A. పరీక్ష ఉత్తీర్ణులవటానికి అంతరాయం కలగటం వలన కొన్నాళ్ళు స్వగ్రామం రాజవరంలో ఉన్నాడు. ఆ గ్రామానికి పంచాయతీ ఏర్పాటు చేసి సంస్థాపక అధ్యక్షులు అయ్యాడు. ప్రాథమిక పాఠశాల భవనం ఏర్పాటు చేశాడు. చిత్తరంజన్ దాసు పేరిట ఒక గ్రంథాలయాన్ని కూడా ప్రారంభించాడు.
B.A. పాసయిన తరువాత కాకినాడ కళాశాల తెలుగు డిపార్ట్ మెంటులో ట్యూటరుగా పనిచేశాడు. పెద్దాడ రామస్వామి ప్రిన్సిపల్ గా ఉండేవాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి పి.యల్.యన్. శర్మ, సి. సీతారామమూర్తి, బులుసు వెంకటేశ్వర్లు, జనమంచి కామేశ్వరరావు ప్రభృతులు లు కూడా రాజావారి కళాశాలలో పని చేసే వారు. కళాశాల యాజమాన్యం వాడుక భాషలో రచనలు చేసినందుకు కొంతమందికి ఉద్వానం చెప్పారట. అందులో రామభద్రరావు గారొకడు.
తరువాత రాజమండ్రి ప్రభుత్వ ట్రయినింగ్ కాలేజీలో బి.ఇ.డి. ట్రయినింగ్ పొందాడు. అంతర కళాశాల వక్తృత్వపు పోటీలలో ట్రయినింగు కాలేజీ జట్టులకు నాయకత్వం వహించి ఇంగ్లీష్ తెలుగులోను ప్రథమ బహుమతులు సాధించాడు. కాలేజీ సెక్రటరీగా, మేగజైన్ ఎడిటరుగా ప్రిన్సిపాల్ ప్రభ్రుతుల మన్ననలు పొందాడు. ట్రయినింగ్ అయిన తర్వాత వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. జయంతి గంగన్న పంతులు ప్రధానోపాధ్యాయులుగా ఉండేవాడు. ఉపాధ్యాయుడిగా చాలా మంది విద్యార్థులను ఉత్తేజపరిచాడు. మల్లెపుడి పళ్లంరాజు రామభద్రరావుపై ఉండే సదభిప్రాయం వల్ల అతనని సమ్మతపరిచి జిల్లా బోర్డు సర్వీసులోకి తీసుకున్నారు. ఆ సందర్భంగానే గొల్లపాలెం అనే చిన్న గ్రామంలో హయ్యరు ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేశాడు. ఆ ఊరి ప్రజలలో కలిగించిన చైతన్యం కారణంగా, వారు ‘వేదన’ అనే ఖండకావ్య సంపుటిని ప్రచురించి, కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి సన్నిధిలో సన్మానం పొంది,ఆ సన్మానంలో ‘కవితల్లజ’ అనే బిరుదు ఇచ్చారు.
తరువాత పేరూరు మిడిల్ పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించినపుడు అతనిని హెడ్మాస్టారుగా తీసుకున్నారు. పేరూరు ఉన్నత పాఠశాల హెడ్మాస్టారుగా నాలుగైదుళ్ళు పనిచేశారు. శ్రీ వేదుల వారిని కూడా పెద్దాపురం నుంచి పేరూరు పాఠశాలకు తెలుగు పండితులుగా తీసుకువచ్చాడు. ప్రఖ్యాత చిత్రకారుడు పిలకా నరసింహమూర్తి కూడా పేరూరు ఉన్నత పాఠశాలలో కొంత కాలం పనిచేశారు. పేరూరు ఉన్నత పాఠశాల జిల్లా బోర్డుకి అప్పగించటంతో రామభద్రరావు రాజోలు, అమలాపురం హైస్కూళ్ళలో ప్రధానోపాధ్యాయులుగా చేరారు. మధ్యలో స్వస్థలమైన ఆత్రేయపురం ఉన్నత పాఠశాల సంస్థాపక హెడ్మాస్టారుగా పనిచేశాడు. 1960 సం.లో అమలాపురం ఉన్నత పాఠశాల హెడ్మాస్టారుగా రిటైర్డు అయిన సందర్భంగా విద్యాశాఖామంత్రి పట్టాభిరామారావు అధ్యక్షతన సన్మానం పొందారు. పింగళి, వేదుల, కాటూరి, కోలవెన్ను రామకోటేశ్వరరావు, మధునాపంతుల ప్రభృతులు పాల్గొన్నారు.
పదవీ విరమణ అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రయోక్తగా ఒక దశాబ్ది కాలం పనిచేసి ఎన్నో గేయాలు, ప్రసంగాలు, కవితలు, సంగీత నాటికలు ప్రసారం చేశాడు.హెడ్మాస్టారుగా రిటైర్డు అయిన కొద్ది నెలలకే, విజయవాడ ఆకాశవాణికి విద్యావిషయిక ప్రయోక్తగా ఎంపికయ్యాడు. ఆకాశవాణిలో సుమారు పది సంవత్సరాలు విధులు నిర్వహించాడు. స్టాఫ్ ఆర్టిస్టులు అసోసియేషన్ కి అధ్యక్షులుగా పనిచేశాడు. అనేక గేయాలు, సంగీత రూపకాలు, విద్యావిషయనాటికలు రచించారు. కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. ఆంగ్లంలో ప్రసంగాలు చేశారు. 1970లో విజయవాడ కేంద్రం నుంచి రిటైరు అయ్యారు.రామభద్రరావు తన జీవితాన్ని గాంధీమహాత్ముడు, సాహితీ రచనలను రవీంద్ర కవీంద్రుడు ప్రభావితం చేశావని చెపుతూ ఉండేవారు.
తర్వాత అనారోగ్య కారణంగా కొన్నాళ్ళు స్వగ్రామం రాజవరంలో ఉన్నారు. ఇంతలో ఆత్మీయుడు, అల్లుడు శశాంక ఆకస్మిక మరణం వలన హైదరాబాదులో శేష జీవితాన్ని గడిపి 1976 అక్టోబరు 8న తేదిన కన్నుమూశారు.
రామభద్రరావు రచనలు
• పద్య కవితలు: లేమొగ్గ, తరంగిణి, వేదన, జయపతాక, నివేదనము, కవితాలహరి
• గేయ కవిత: గేయమంజరి, గేయ నాటికలు
• ఆంగ్ల రచనలు: Searching strains (Rendering of his poems into English), Leaves from a diary.
• అనువాదం: చిత్ర (రవీంద్రుని రచన)
• వచనం: ఎందరో మహానుభావులు
కందుకూరి రామభద్రరావు సమగ్ర సాహిత్యం
2005 సంవత్సరంలో ప్రచురించబడిన తెలుగు పుస్తకం రచయిత శతజయంతి సందర్భంగా ఉత్సవ కమిటీ వారి విశేష ప్రచురణ.[1]
• చిత్ర (1932) (విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ చిత్ర నాటికకు తెలుగు అనువాదం)
• తరంగిణి (1935)
• వేదన (1942)
• జయపతాక (1953)
• గేయమంజరి (1955, 1986)
• నివేదనము (1958)
• ఎందరో మహానుభావులు (1964)
• దేశభక్తి గేయాలు (1986)
• కవితాలహరి (1989)
• ఆకాశవాణి సంగీత రూపకాలు (2005)
  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.