గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-23
మహాత్మా –మోతీలాల్ ఘోష్
గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ను విశ్వసించే జాతీయవాదులకు ,ప్రతిఘటన ఉద్యమంగా భావించే వారికి మధ్య అభిప్రాయ భేదాలు బయట పడ్డాయి .దేశబంధు దాస్ నాయకత్వం లో బెంగాల్ లోని వర్గం స్థానిక సంస్థలకు కూడా ప్రతిఘటన ఉద్యమం వ్యాపింప జేయాలని కోరింది .విదేశీ వస్త్రాలు మద్యం షాపులవద్ద పికెటింగ్ లు నిర్వహించారు .విదేశీ వస్త్ర దహన భోగి మంటలు నిత్య దృశ్యమైంది .మొదటి వాలంటీర్ దళానికి సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించాడు .చిత్తరంజన్ భార్య బసంతీదేవి నాయకత్వం లో స్త్రీలుకూడా శాంతియుత పోరాటం చేశారు .1921లో వేల్స్ యువరాజు పర్యటనకు ముందు ఇవి పతాకస్థాయికి చేరాయి .యువరాజు పర్యటనకు ప్రాముఖ్యం ఇవ్వరాదని హర్తాల్ పాటించాలని’ కాంగ్రెస్ ఖిలాఫత్ కమిటీ ‘’నిర్ణయించింది .యువరాజుకు ఆహ్వానం పలకటానికి అధికారులతో విదేయులతో ఒక కమిటీ ఏర్పాటైంది .’’పిడికెడు కాసులకోసం కోటులో దర్జాగా ఒక రిబ్బన్ తగిలించుకొనే గొప్పకోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన నాయకుడు ‘’గా అమృత బజార్ పత్రిక చేత వర్ణింపబడిన సురెంద్రనాద్ బెనర్జీ కూడా ఈ కమిటీ లో ఉన్నాడు .అప్పటికి ఆయనకు ‘’సర్’’బిరుదు ఉంది .మోతీలాల్ ఘోష్ అనుమతిని పొందకుండానే ఆయన పేరు ఆకమిటీలో చేర్చారు .ఆతర్వాత ఆయన తన వైఖరిని స్పష్టంగా పత్రికా ముఖంగా తెలియజేశాడు .దీనిపై ఆయన పత్రికలో రాస్తూ ‘’యువరాజు ఆహ్వాన సంఘం లో మీరుకూడా చేరారా ?అని ఎందఱో ఉత్తరాలురాశారు .ఆయనకు తెలియకుండా సంప్రదించకుండా పేరు చేర్చారు అని అందరికి జాబులు రాశాం .వివాదం సమసిపోయింది .కానీ మోతీలాల్ ను దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతో సురెంద్రనాథ్ తనపేపర్ లో మోతీలాల్ వైఖరి మారినట్లు రాశాడు .దీన్ని తిప్పికొడుతూ పత్రికలో –భారత దేశ భవిష్యత్ రాజకుమారుడి ముందు మోకరిల్లాడు అంటే స్వార్ధం కోసమా దేశ ప్రయోజనాలకోసమా ,తెల్లదొరలనుంచి బిరుదులూ పొందటానికా ,ఏడాదికి 64వేల రూపాయలమంత్రిపదవి కోసమా ?ఇలాంటి కక్కుర్తి పడ్డ బడా నాయకుల్ని చూస్తూనే ఉన్నాం. మోతీలాల్ అలాంటి కక్కుర్తి పడే నాయకుడు కాదు ‘’అని ఘాటుగా నషాళం అన్టేట్లు చివాట్లు పెట్టాడు .
యువరాజు బొంబాయిలో అడుగుపెట్టిన నవంబర్ 17న బెంగాల్ అంతటా హర్తాల్ పాటించారు .ప్రభుత్వం గంగ వెర్రు లెత్తింది .ఆయన కలకత్తా వచ్చినపుడు ఇలాగే జరిగితే పరువు బంగాళాఖాతం లో పడి కొట్టుకు పోవటం ఖాయం అని ప్రభుత్వం భావించింది .స్త్రీ పురుష విచక్షణ లేకుండా వాలంటీర్ లందర్నీ అరెస్ట్ చేయమని ‘’రోనాల్డ్ షీ’’ఉత్తర్వులిచ్చాడు .ఎక్కడ చూసినా అరెస్ట్ లే అరెస్ట్ లు .దాసు గారు ఆయన సహచరులు కూడా జైలుపాలయ్యారు.ప్రజలు మరింత ఉత్సాహంగా ముందుకు వచ్చి జైలుపాలయ్యారు .జైలు అంటే భయం లేకుండా ఒక ప్రహసనంగా మారింది .మితవాదులూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు .రాజీకోసం వైస్రాయ్ పిలిస్తే గాంధీ వెళ్ళాడు .రాజీషరతులేవో చెప్పి అరెస్ట్ చేసిన వారందర్నీ విడుదల చేయాలని గాంధీ షరతు పెట్టాడు .ప్రభుత్వం తిరస్కరించి ఆయన్ను 1922మార్చిలో అరెస్ట్ చేసి ఆరేళ్ళు శిక్ష విధించింది .నేషనలిస్ట్ లు శాసనమండలి సభ్యత్వం పొంది ,ప్రభుత్వ సంస్కరణలకు సభనుంచే అడ్డంకులు కలిపిస్తే మంచిది అని ప్రజలు భావించారు .దాస్ జైలులో ఉన్నా ఉద్యమం బలంగానే జరుగుతోంది .శాసన సభలో మెజార్టీ వోటుద్వారా ప్రభుత్వ చర్యలను తిరస్కరించటం మంచిదని మోతీలాల్ నెహ్రు ,టంగుటూరి ప్రకాశం విఠల్ భాయ్ పటేల్ కూడా మద్దతు ప్రకటించారు .
23-4-1922న విఠల్భాయ్ ,,ప్రకాశం గార్లు మోతీలాల్ ఘోష్ ను ఆయన ఇంట్లో కలిశారు .అప్పటికే ఆరునెలలనుంచి జబ్బుతో ఆయన మంచం మీద ఉన్నాడు .మోతీలాల్ తో జరిపిన సంభాషణ ను ప్రకాశంగారు స్వరాజ్య పత్రికలో రిపోర్ట్ ఇచ్చారు –‘కొత్తగా కౌన్సిల్ ఏర్పడినప్పుడల్లా దానిలో ప్రవేశానికి నేను వ్యతిరేకిస్తూనే ఉన్నాను .గాంధీజీ వచ్చి ఇక్కడ నన్ను కలిసినప్పుడు ఆయనకు ఒక మాట చెప్పాను. అప్పుడు విఠల్ భాయ్ కూడా ఉన్నారు.కౌన్సిల్ కు ఎవరు వెళ్ళినా అక్కడి దుష్టవాతావరణం లో చెడిపోవటం ఖాయం .మనవాళ్ళే కొందరు కౌన్సిల్ ప్రవేశం కోరటం దురదృష్టకరం .దీనివలన మన శిబిరం లో చీలిక రాకూడదు ‘’అన్నాడు. దీనికి విఠల్ భాయ్ పటేల్ ‘ స్త్రీలతోసహా 25వేలమంది దేశ భక్తులను మనం జైళ్లకుకు పంపి ఇప్పుడు ఇలా అనటం భావ్యం కాదు .చీలిక రాకుండా చూస్తాం .డిసెంబర్ కాంగ్రెస్ లో పరిష్కార౦ సాదిస్తాం ‘’అన్నాడు .నాయకుల దేశ భక్తుల త్యాగంతో మొతీలాల్ కళ్ళు చెమర్చాయి ,’’ఇంతటి త్యాగం దేశభక్తి నేను బతికి ఉండగా చూస్తానని అనుకోలేదు .జీవించి ఉండిఇవన్నీ చూస్తున్నందుకు ఆనందంగా ఉంది ‘.అన్నాడు సంతృప్తిగా .ఆఇద్దరు మహా నాయకులు ఆవృద్ధ నాయకుని వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు .వారితో మాట్లాడినంత సేపు మోతీలాల్ పడుకోలేదు .మంచం మీద ముడుచుకొని కూర్చుని , వణుకుతున్న కఠం తో మంత్రించినట్లు మాట్లాడి ఆనాయకులపట్ల పూర్తీ మర్యాద గౌరవాలను చూపాడు .అధికారం చేతికి వస్తే దిగజారుతారని ఆయన భయం .ఎన్నికలు నిష్పాక్ష పాతంగా జరగవని ఆందోళన .వస్తే సర్వ స్వేచ్చాయుతమైన పార్లమెంట్ రావాలి లేకపోతె ఏదీ వద్దు అని మోతీలాల్ భావించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-8-22-ఉయ్యూరు