రజాకార్ల పాలిటి సింహస్వప్నం ,గిరిజనజాగృతి,సిపిఎం శాసనసభ్యురాలు,’’నా మాటే తుపాకి తూటా’’గా ఆత్మకధ రాసుకొన్న –శ్రీ మతి మల్లు స్వరాజ్యం
మల్లు స్వరాజ్యం (1931 – 2022 మార్చి 19[1])[2] తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. మల్లు వెంకట నరసింహారెడ్డి సతీమణి. మల్లు స్వరాజ్యం ఆత్మకథ “నా మాటే తుపాకీ తూటా” అన్న పేరుతో 2019లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా పుస్తకంగా వచ్చింది.
కుటుంబం
స్వరాజ్యం 1954లో మల్లు వెంకట నరసింహారెడ్డిని వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు గౌతమ్, నాగార్జున, కుమార్తె కరుణ ఉన్నారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యానికి సోదరుడు.
జివిత విశేషాలు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించిన మల్లు స్వరాజ్యం నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచింది. 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించింది. ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1947-48లో ఈమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. మల్లు స్వరాజ్యం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులను మేల్కొల్పింది.
ఈమె జానపద బాణీల్లో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకునేది. ఈమె ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1978-1983[3], 1983-1984[4] సంవత్సరాలలో రెండు పర్యాయాలు సి.పి.ఐ.(ఎం) పార్టీ తరఫున ఎన్నికైంది. నల్లగొండకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా యోధుడు, పార్లమెంటేరియన్ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఈమెకు సోదరుడు. వామపక్ష భావాలతో, స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ‘చైతన్య మానవి’ సంపాదకవర్గంలో ఈమె ఒకరు.
ఈమె పాటల్లో ఒక ఉయ్యాలపాటలో[5] కొంత భాగం:
వీరమరణం చెందిన ‘మట్టారెడ్డి’, ‘అనంతరెడ్డి’లను స్మరిస్తూ బతకమ్మ పాటశైలిలో ఇలా వివరించింది.
వీరిమట్టారెడ్డి ఉయ్యాలో
ధీర అనంతారెడ్డి ఉయ్యాలో
మీవంటి వీరులు ఉయ్యాలో
మా మధ్య నిలబడి ఉయ్యాలో
మాకు వెలుగులు చూపి ఉయ్యాలో
ఓర్వదీ ప్రభుత్వంబు ఉయ్యాలో
పాత సూర్యాపేట ఉయ్యాలో
పోరాటమును చూడు ఉయ్యాలో
ప్రజల బలమును జూసి ఉయ్యాలో
పారిపోయిరి వాళ్ళు ఉయ్యాలో
మన ప్రజల రాజ్యమును
పొంది తీరాలమ్మ ఉయ్యాలో
మరణం
మల్లు స్వరాజ్యం వయో భారంతోపాటు ఊపిరితిత్తుల సమస్యతో దీర్ఘకాలంగా బాధపడుతున్న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 2022 మార్చి 19న -92వ ఏట మరణించింది.[6][7]
2-తెలంగాణా పోరాట సమితి తొలియోధుడు ,గెరిల్లా నాయకుడు ,,హరిజన సేవా సంఘం స్థాపించి 100పాఠశాలశాలలు నిర్మించిన సంఘ సంస్కర్త ,ఆంధ్రమహాసభ స్థాపకుడు ,నల్గొండ లోక్ సభాస్థానాన్ని నెహ్రూ కంటే భారీ మెజారిటీ తో గెలిచిన ‘వీర తెలంగాణ వాది’’-శ్రీ రావి నారాయణ రెడ్డి
రావి నారాయణరెడ్డి, (జూన్ 5, 1908 – సెప్టెంబర్ 7, 1991) కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు[1]. ఆయన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా కూడా ఆయనను పేర్కొనవచ్చు.
జననం
యాదాద్రి – భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో 1908, జూన్ 5న భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు.
రాజకీయ రంగం
విద్యార్థి దశలో
రావి నారాయణరెడ్డి తొలిదశలో ఆంధ్రమహాసభ, ఆంధ్రజనసంఘం ఏర్పరిచిన సాంస్కృతిక చైతన్యం వల్ల ప్రభావితమైనాడు నిజాం పరిపాలనలో తెలంగాణాలో రాజకీయ చైతన్యం లేని స్థితిలోనే ఆయన పోరాటాన్ని ప్రారంభించాడు రెడ్డి హాస్టల్ విద్యార్థిగా ఉండగానే అప్పటి నిజాం కళాశాల విద్యార్థి అయిన బద్దం యెల్లారెడ్డితో కలసి 1930 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో కాకినాడ వెళ్లి మరీ పాల్గొన్నాడు.[2] 1931లో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్యదర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించాడు రెండు వసతి గృహాలను నిర్వహించాడు. 1930లో బ్రిటిష్ ప్రభుత్వం మహాత్మా గాంధీని అరెస్టు చేయగా, దానికి నిరసనగా హైదరాబాద్‌లోని హస్మద్ గంజ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించాడు. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడాడు. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ అధికారిగా వ్యవహరించే బ్రిటిష్ రెసిడెంట్, తన గూఢచారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని, కొత్వాల్ రాజబహదూర్ వెంకట రామారెడ్డిని ఇంటికి పిలిపించి రావి నారాయణరెడ్డిని హెచ్చరించవలసిందిగా సూచించాడు. పాతికేళ్ళ ప్రాయంలోపుగానే దేశభక్తి, రాజకీయ పోరాటం పట్ల దృఢచిత్తాన్ని ఏర్పరుచుకున్నాడు. 1931లో దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభలకు తన తోటి విద్యార్థులను పోగుచేసి పాదయాత్రగా ఆంధ్రోద్యమాన్ని ప్రచారం చేస్తూ హైదరాబాద్ నుంచి దేవరకొండ చేరుకున్నాడు. మహాసభల్లో చురుకైన పాత్ర వహించాడు.
నిజామాంధ్ర మహాసభలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ విశిష్టమైనది. ప్రజాజీవితంలో ఉన్న నాయకులు ఒక కీలకమైన చారిత్రక సన్నివేశంలో సిద్ధాంతపరంగా విభేదించే శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరచి ఏకతాటిపై ఉద్యమాన్ని ఎలా నిర్మించవచ్చో తన ఆచరణ ద్వారా నిరూపించిన ప్రజాస్వామికవాది ‘రావి’. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి, పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది[3].
ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ప్రజాపోరాటానికి చూపునిచ్చిన జననేతగా ప్రసిద్ధుడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పనిచేశాడు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐ లో చాలాకాలం పనిచేశాడు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించాడు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకాన్ని, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలనూ అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసాడు.[4]
జాతీయోద్యమం బలంగా వేళ్లూనుకున్న ప్రాంతాల్లో మాత్రమే కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంటుందని, అందుకు కారణం ఉద్యమంలో పాల్గొన్న అనుభవం వలన వాళ్లు కేవలం విడివిడి వృక్షాలను కాక, మొత్తం అరణ్యాన్ని చూడగలరన్నది ఆయన విశ్వాసం. ఆంధ్రమహాసభ కార్యకలాపాల్లో క్రియాశీలంగా పాలుపంచుకొన్న అనుభవంతో రాటుదేలడం వల్లే తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు గణనీయమైన విజయాలను కైవసం చేసుకోవడం సాధ్యమైందని ఆయన తరచు అంటుండేవాడు. 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరులో జరిగిన ఎనిమిదవ నిజామాంధ్ర మహాసభకు, 1944లో భువనగిరిలో జరిగిన మహాసభకు ఆయనే అధ్యక్షత వహించాడు. భువనగిరి సమావేశాల్లోనే ఆంధ్రమహాసభ అతివాద, మితవాద శిబిరాలుగా చీలిపోయింది.
దేశ స్వాతంత్య్రానికి ముందు సాగిన సాయుధ పోరాటాన్ని వ్యూహాత్మకంగా సమర్థించిన రావి నారాయణరెడ్డి 1947 తరువాతి కాలంలో పోరాటాన్ని కొనసాగించాలనే ‘మెజారిటీ’ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను, సమ సమాజ ఆకాంక్షలతో కలగాపులగం చేయడం వల్లే పార్టీ, 1948 ఫిబ్రవరిలో పోరాటం కొనసాగించాలనే తప్పుడు నిర్ణయం తీసుకుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. చరిత్ర ఆయన మార్గమే సరైనదని తీర్పు చెప్పడం విశేషం. కాళోజీ నారాయణరావు ప్రవచించిన ‘వేరు తెలంగాణ’ను తాత్వికంగా వ్యతిరేకించడంతో ఆగక, తాను ఎన్నటికీ ‘వీరతెలంగాణ’ వాదిగానే ఉంటానని చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ రావి నారాయణరెడ్డి. తన స్వంత భూమిని 200 ఎకరాలు దానం చేశాడు
విశేష ఘట్టాలు
- 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసాడు.
- 1941, 1943 సంవత్సరాల్లో భువనగిరిలో జరిగిన పదకొండవ, పన్నెండవ ఆంధ్ర మహాసభలకు వీరు అధ్యక్షత వహించి,ఆ సభను విజయవంతం చేశాడు.
- మహాత్మాగాంధీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తన భార్య సీతాదేవితో వెళ్ళి కలిసి తన భార్య ఒంటిపై ఉన్న నగలన్నింటినీ తీసి గాంధీ చేతిలో పెట్టి, హరిజన సేవక సంఘానికి ఇవ్వమని గాంధీజీని అభ్యర్థించాడు.
- హైదరబాదు సాయుధ పోరాట సమయంలో తన స్వంత భూమి వందల ఎకరాల భూమిని రైతులకు పంచిన ఉదారవాది.
- నారాయణ రెడ్డి గారు తన 23 ఏళ్ల వయసులో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్య దర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించాడు రెండు వసతి గృహాలను నిర్వహించాడు.
- 1952లో భారతదేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించాడు.
- 1932లో తక్కర్ బాబా అఖిల భారత హరిజన సేవక్ సంఘ్‌ను స్థాపించాడు. హైదరాబాద్ విభాగానికి సరోజినీనాయుడును అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా రావి నారాయణరెడ్డిని నియమించాడు.
- 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను స్థాపించిన వారిలో రావి ముఖ్యులు. నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై విధించిన నిషేధం ఎత్తేయాలని అక్టోబరు 24న తొలిబ్యాచ్ సభ్యుడిగా సత్యాగ్రహం చేశాడు.
- 1928లో ఆంధ్రమహాసభ ఏర్పడింది. 1941-44-45ల్లో మూడుసార్లు రావి అధ్యక్షునిగా పనిచేశాడు. వితంతు వివాహాలు, అక్షరాస్యతా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఆంధ్రమహాసభను క్రియాశీల రాజకీయ సంస్థగా మలిచాడు. 20 ఎకరాల భూమిని మించి కలిగి ఉండరాదు అని కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానించింది. ఆ స్ఫూర్తిని గాంధేయవాది అయిన రావినారాయణరెడ్డి స్వీకరించాడు తనకు సంక్రమించిన భూమిలో 20 ఎకరాలను మాత్రమే ఉంచుకుని 500 ఎకరాలను రైతుకూలీలకు పంచిపెట్టాడు.
- రావి నారాయణరెడ్డి నాస్తికుడు . కుటుంబసభ్యులు మందిరానికి వెళ్తే కాదనని ప్రజాస్వామ్యవాది. రావి తన వివాహానంతరం ఒక విల్లు రాశాడు. తాను మరణిస్తే తన భార్య వైధవ్య ప్రతీకలను ఆమోదించరాదని, కట్టూబొట్టులతో సలక్షణంగా ఉండాలని కోరాడు. ఆమె తన అభీష్టానుసారం జీవించవచ్చనీ రాసాడు. భార్య మరణించిన అరవై ఏళ్లకు 1991 సెప్టెంబర్ 7న రావి 83వ ఏట మరణించాడు. తన అస్థికలను గంగానదిలో కలపవద్దని, పొలంలో చల్లితే చాలనీ అన్నాడు. ఆ మేరకు వారసులు పచ్చని పొలాల్లో రావి ‘విభూది’ని చల్లారు.
స్మారకాలు
హైదరాబాదు లోని బంజారా హిల్స్ నందలి ఒక ఆడిటోరియంకు “రావి నారాయణరెడ్డి స్మారక ఆడిటోరియం కాంప్లెక్స్” గా 2006 లో నామకరణం చేసారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి “రావినారాయణ రెడ్డి మెమోరియల్ నేషనల్ ఫౌండేషన్ పురస్కారం” ను కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ఎ.బి.బర్థన్ కు అందజేసాడు.[5]
మరణం
1991, సెప్టెంబర్ 7 న ఆయన తుదిశ్వాస విడిచాడు.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-22-ఉయ్యూరు