ఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి
ఉపన్యాసాలు ఇవ్వటం లోనే కాదు ఆచరణలో పెఅట్టటం లోనూ ఘనుడు డా యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి .ఒంటరివాడు .ప్రోత్సాహం లేకపోయింది .కాని ఆకర్యదీక్ష సాహసం ఇంకొరికి లేనే లేదు .’’యుద్ధ విరామ సైనికులే నేటి కాంగ్రెస్ నాయకులు ‘’అనే వాడు .రాజనీతి రాజకీయ పరిజ్ఞానం ఉంటేనే శత్రు సంహారం చేయగలం అనే వాడు .పట్టాభి లాగా ఈతడూ డాక్టరు,రాజకీయ పండితుడు .నెలకు సుమారు వెయ్యి రూపాయల జీతం .రాజకీయం దేశ స్వాతంత్ర్యం కోసం దాన్ని వదిలేశాడు .నాడీ పరీక్షలో మేటి .సిద్ధహస్తుడు అమృత హస్తుడు అని పేరు పొందాడు .హస్తవాసిమంచిదని కళ్ళకు అద్దుకోనేవారు .
తూర్పు గోదావరిజిల్లా మండపేటలో వైదీక తెలగాణ్య కుటుంబం లో 16-2-1886న జన్మించాడు తండ్రి రామస్వామి .కౌశిక గోత్రీకుడు .విశ్వామిత్రుని లోని అన్ని లక్షణాలు ఉన్న వాడు .తండ్రి ఏక సంథాగ్రాహి, మంచికవి .కుటుంబభారం అంతా శాస్త్రి దే .విరక్తుడై కాడి పారేయలేదు .వివాహం అయ్యాక ,విద్య మానేసి కుటుంబ భారం మోశాడు .అప్పుడే బెంగాల్ విభజన జరిగి రాజకీయాందోళనలు మిన్ను ముట్టాయి .
ప్రభుత్వం బెంగాల్ రహదారుల విషయం లో నిర్లక్ష్యం చేసింది .తరచూ నదులకు వరదలు వచ్చి ప్రజాజీవితం అస్త వ్యస్తమయ్యేది .జనపనార ముఖ్య పంట.రైతులకు రాబడి బాగా ఉండేది .నదీ పరివాహక ప్రాంతాలు ఎక్కువ .అక్కడి ఇళ్ళు వెదురు బద్దలతో కట్టుకొనేవారు .వరదలలో గ్రామాలుదిబ్బలమీద ఇళ్ళు లాగా ఉండేవి .పడవలమీదే ప్రయాణం .బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ ఏకాభి ప్రాయం .ఇది రాజకీయంగా నష్టం అని ప్రజాభిప్రాయం .పత్రికలుకూడా ఎలుగెత్తి చాటాయి .బెంగాల్ పశ్చిమ భాగం ,బీహార్ ఒరిస్సా ఒకభాగం ,తూర్పు బెంగాల్ అస్సాం ఒక భాగంగా విభజించాడు కర్జన్ దుర్జన్ అని పించుకొన్నాడు .విప్లవ జ్వాలలు పశ్చిమ బెంగాల్ లో ఎక్కువ .అందుకే తూర్పు పశ్చిమ భాగాలను వేరుచేశాడని ప్రజల ఘోష .పశ్చిమ బెంగాల్ లో విద్యాధికులు రాజకీయ నాయకులు ఎక్కువ .తూర్పున విద్య లో వెనకబడింది .ముస్లిం లు ఎక్కువ .రెండు ప్రాంతాలవారు కలిస్తే ప్రభుత్వానికి ముప్పు అని చేసిన విభజన అని ప్రజాభిప్రాయం .విభజించి పాలించటం బెంగాల్ తోనే మొదలైంది .
బంకిం చంద్ర చటర్జీ ఆనంద మఠం నవలలో ‘’వందే మాతరం’’గీతం రాయగా ఆది ప్రజల నోళ్ళలో నాని జాతీయ గీత గౌరవం పొందింది .తిలక్ కలకత్తా వచ్చి ప్రచారం చేస్తే ,అరవిందుని సోదరుడు బరీంద్రుడు బరోడానుంచి కలకత్తా వచ్చాడు .స్వామి వివేకానంద సోదరుడు భూపేంద్ర నాథ దత్తు ,మిత్రుడు అవినేష్ భట్టాచార్జీ లతోకలిసి ‘’యుగంధర్ ‘’పత్రిక స్థాపించి ప్రచురించాడు.వీరి విప్లవోద్యమానికి 11రివాల్వర్లు ,4రైఫిల్స్ ,ఒక తుపాకీ రహస్యంగా సంపాదించారు .ఈ సంఘం లో ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా 15మంది యువకులున్నారు .వీరంతా పులిన్ బిహారీ దాస్ నాయకత్వం లోఢక్కాలో ‘’అను శీలన సమితి ‘ఏర్పరచి ,రెండవ శాఖ కలకత్తా లో ఏర్పరచారు .ఢక్కా సంఘానికి 500 శాఖలేర్పడ్డాయి .సంధ్య అనే వారపత్రికను కూడా పెట్టి’’ సంపూర్ణ స్వరాజ్యం కావాలి ‘’ అని ప్రకటించారు .వీరంతా భగవద్గీత ,వివేకానందుని ఉపన్యాసాలు మాజిని, గారిబాల్డీ ల జీవిత చరిత్రలు చదువుతూ చదివిస్తూ ప్రేరణ పొంది పొందించారు .వీరి ముఖ్య గ్రంథం ‘’ముక్తికాన్ పథే’’.వీరంతా బెంగాల్ లో ఉత్తమ కులీనులు అంటే భద్రజాతి వారు .డబ్బు కోసం దోపిడీలు చేసేవారు .కొన్ని విఫలమయ్యాయి .మిడ్నపూర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ వెళ్ళే రైలుకింద బాంబు పెట్టారు .ఢక్కాలోని నౌతాయి గంజి లో డబ్బు సంచులు మోసుకు వెడుతున్న వాడిని పొడిచి డబ్బు దోచుకు వెళ్ళారు .23-7-1907న జిల్లా కలెక్టర్ అలెన్ ను పిస్టల్ తో కాల్చారు .సిబిపూర్ లో ఒక ఇంట్లో నాలుగు వందలు దోచారు .30-4-1908న కేనడిభార్య కూతురుప్రయాణం చేసే రైలు పై బాంబులు విసిరితే ,ఆడవాళ్ళు ఇద్దరూ చనిపోయారు .కలకత్తాలోని గార్డెన్ రీచ్ లో కింగ్స్ ఫోర్డ్ ను చంపే ప్రయత్నం చేశారు .చావకపోతే పార్సెల్ లో బాంబు పంపారు వాడు విప్పలేదు కనక చావలేదు .1908 ఏప్రిల్ 30న బీహార్ లోని ముజఫర్ పూర్ లో ఇద్దరు స్త్రీలను ఒకపురుషుడిని చంపారు .
24పరగణా జిల్లా అల్లీ పూర్ కుట్ర జరిగి యావజ్జీవ ,ద్వీపాంతర వాస శిక్షలు పడ్డాయి .దాకా బారాబజార్ లో 25వేలు నగదు అపహరించారు .కొన్ని చోట్ల కొబ్బరికాయలలో బాంబులు పెట్టి పేల్చారు .పడవలలో దొంగతనాలు హత్యలుచేశారు .కలకత్తాలో నందార్ లాల్ బెనర్జీ అనే సబ్ ఇన్స్పెక్టర్ ను చంపారు .ఇలా లెక్కలేనన్ని దోపిడీలు దొంగతనాలు హత్యలు బాంబు ప్రేలుళ్ళతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడ లాదించారు విప్లవ వీరులు .దేశం అట్టుడికి పోయింది .అప్పుడే బిపిన్ చంద్రపాల్ ఆంద్ర దేశ పర్యటనకు వచ్చి బెంగాల్ విభజనపై తీవ్ర ప్రచారం చేసి విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ వస్తు ప్రోత్సాహం కలిగించాడు .ఆరోజుల్లో పోలీసు అంటే హడల్ .జగ్గన్న శాస్త్రి బిపిన్ చంద్ర పాల్ తో పల్లెపల్లెకూ తిరిగి ప్రచారం చేశాడు ధైర్యంగా .పాల్ 24-4-1907న రాజమండ్రి వస్తే జగ్గన్న శాస్త్రి ,గాడిచర్ల హరి పురుషోత్తమ రావు,బోడి నారాయణ రావు గార్లు ఆయన్ను కలిసి ప్రచారం చేశారు .
రాజమండ్రి ట్రెయినింగ్ కాలేజి విద్యార్ధులను బయటికి రాకుండా మార్క్ హంటర్ ప్రయత్నిస్తే జగ్గన్న శాస్త్రి విద్యార్ధులతో సమ్మె చేయించి ఒక్క విద్యార్దికూడా కాలేజికి వెళ్ళకుండా చేయగలిగాడు .అప్పటినుంచే శాస్త్రి బహిరంగ రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నాడు .బిపిన్ పాల్ తో గ్రామగ్రామానా ప్రచారం చేసి ,ప్రజలలో స్వదేశీ అభిమానం కలిగించాడు జగ్గన్న శాస్త్రి .వందే మాతరం న్యూస్ పేపర్ రి పోర్ట్ ప్రకారం జగ్గన్న శాస్త్రి బిపిన్ పాల్ వెంట వుండి ప్రచారం చేస్తూ ,తాము విదేశాలకు వెళ్లి బాంబులు తయారు చేయటం బాంబుల్ని నిర్వీర్యం చేయటం నేర్చుకొని తిరిగి వచ్చి ,ప్రతిఅమావాస్య రాత్రి తమకు శత్రువులైన 108 మంది తెల్ల దొరలను బాంబులతో చంపేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లు ఉంది .
26-3-1908 న చిదంబరం పిళ్ళై ను అరెస్ట్ చేసినప్పుడు స్వరాజ్య పత్రికలో ‘అరే.ఫరంగీ .క్రూర వ్యాఘ్రమా నిష్కారణంగా ముగ్గురు హిందువులను అరెస్ట్ చేసి నీతినీ చట్టాన్నీ పొట్టన పెట్టుకోన్నావు .మీ రోజులు దగ్గర పడ్డాయి అని తెలుసుకో ‘’అని రాశారు .ఎడిటర్ ను, ప్రింటర్ ను అరెస్ట్ చేసి శిక్ష వేయగా పత్రిక అంతటితో ఆగిపోయింది .జగ్గన్న శాస్త్రి తన మొదటి బహిరంగ ఉపన్యాసాన్ని 1907లో సామర్లకోటలో ఇచ్చాడు .అక్కడినుంచి చాలాగ్రామాలు తిరిగి ఉపన్యాసాలిచ్చాడు .ప్రజల్లో గొప్ప రాజకీయ చైతన్యం కలిగించాడు .బెంగాల్ లో వందలకొలది విప్లవ కారులు చేసిన ప్రచారం ఆంధ్రాలో ఒక్క జగ్గన్న శాస్త్రి మాత్రమె చేసి అబ్బుర పరచాడు.బందరు మొదలైన చోట్ల విప్లవ సంఘాలు పెట్టాడుకానీ అవేవీ సరిగా పని చేయలేదు .అయినా అధైర్యపడ లేదు శాస్త్రి .
1908లో గోదావరి పుష్కరాల సమయం లో జగ్గన్న శాస్త్రి ,మరొక దేశ ప్రేమికుడు వంగల వెంకట నారాయణ గారు కలిసి ఒక బోర్డు పెట్టి , పుష్కర యాత్రికులకు సకల సౌకర్యాలు కలిగించారు .ఇది పోలీస్ సూపరిం టే౦న్డెంట్ కు కంటి మంటగా ఉండి బోర్డు తీయమన్నాడు .ఇద్దరూ కలిసి తియ్యము పొమ్మన్నారు .కలెక్టర్ కు తెలిసి శాస్త్రిని వచ్చి కలవమనితాసీల్దార్ దావులూరి ఉమామహేశ్వర రావు తో కబురుపంపాడు .ఆయనమండపేటవచ్చి శాస్త్రిని కలిసి కలెక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు .కలెక్టర్ శాస్త్రి తో ఆయన్ను అరెస్ట్ చేయటానికి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందనీ ,శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని అరెస్ట్ చేయటం లేదని ,విప్లవసంఘాలతో సంబంధం పెట్టుకోవద్దని హితవు చెప్పి పంపించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-22-ఉయ్యూరు