గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-24(చివరిభాగం )
మోతీలాల్ ఘోష్ చివరి రోజులు
చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడే మోతీలాల్ మితభోజనం ,వేళప్రకారం భౌతికావసరాలు తీర్చుకోవటం వల్లనే బరువు బాధ్యతలు సక్రమంగా నేరవేర్చగలిగాడు .ప్రజాజీవితం లో అలుపెరుగని వ్యక్తీ ,దాపరికం లేని మనిషి .పోరాటశీలి అయిన జర్నలిస్ట్ .ఉమ్మడికుటుంబం లోందరికి ప్రీతిపాత్రమైనవాడు నిరాడంబరుడు పొగతాగటం మద్యం సేవించటం లేనే లేవు .చిన్న ధోవతీ ,చొక్కా మాత్రమె ధరించే వాడు .రాజునైనా ,పేదనైనా అదే దుస్తులతో కలిసేవాడు .ఆయనవి నిక్కచ్చి విమర్శలు .ప్రత్యర్ధులపై అభాండాలు ఎన్నడూ రాయని పెద్దమనిషి .అందరితో అవగాహనతో మెలిగేవాడు .ప్రత్యర్ధులను ఎందరినో మిత్రులుగా గెలుచుకొన్నాడు .బ్రిటిష్ అధికారులకూ ఆయన మిత్రుడే .ఇల్లే ఆఫీసు గా చేసుకొని ఎవరు ఏసమయం లో వచ్చినా ఆత్మీయంగా స్వాగతి౦ చేవాడు .అమృతబజార్ పత్రిక, జాతీయ రాజకీయాలే ఆయన వ్యాపకాలు .సంగీతం వైష్ణవ సాహిత్య అధ్యయనం ఆయన అభిరుచులు .జాతీయోద్యమ సిద్ధాంత కర్త కాకపోయినా ,,సామాన్య మానవులకోసం ముఖ్యంగా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పరితపించాడు .
1917 ఆయనకు ఎన్నో బరువు బాధ్యతలు తెచ్చింది .30లక్షల డయరాన్ రియల్ ఎస్టేట్ సివిల్ కేసు లో కమీషన్ ముందు సాక్ష్యం ఇవ్వటానికి నోటీసులు వచ్చాయి .వీటితో అలసట చెందిన ఆయన శరీరం విశ్రాంతి కోరింది .బీహార్ లోని సోనే నది ఒడ్డున కోయిల్ వార్ అనే ప్రశాంత వాతావరణం లో గడపటానికి వెళ్ళాడు .ఆధ్యాత్మిక గ్రంథాలు తనవెంట తీసుకు వెళ్ళాడు .అక్కడా పత్రికా వ్యవహారాలూ చూస్తూ ఆదేశాలిస్తూ గడిపాడు .అక్కడి ప్రశాంతత నిస్తేజం కలిగించగా 1918ప్రారంభం లో కాశీ వెళ్ళాడు .అక్కడ పక్షవాతం వచ్చి ఎడమభాగం చచ్చు పడి పోయింది .ప్రాణం పోయేదాకా ఇది వదలలేదు .
1918మధ్యలో మళ్ళీ కలకత్తా చేరాడు .మళ్ళీ జబ్బు చేసింది .గాంధీ ప్రతిపాదించిన ఆహి౦సాత్మక సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదం పొందిన సభకు వెళ్ళలేక పోయాడు .శరీరం కృశిస్తున్నా ,గుండె దిటవు తగ్గలేదు .1919లో అల్లుడు నృత్యగోపాల్ మరణం తట్టుకోగలిగాడు .కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఆయన బ్రహ్మానందం ప్రాప్తించే ఊర్ధ్వ లోకాలకు వెళ్ళినందుకు సంతోషించాలికానీ శోకం పనికి రాదు అని తాత్విక బోధ చేశాడు .
1921మధ్యలో మోతీలాల్ ఆరోగ్యం పట్ల ప్రజలు ఆందోళన చెందటం ప్రారంభించారు .ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య విషయాలు పత్రికలో ప్రచురించేవారు .జులైలో స్టేట్స్ మాన్ పత్రిక –‘’చాలామంది యూరోపియన్ లతో పాటు ,అశేష అభిమానులున్న అమృతబజార్ పత్రిక పాఠకులకు సంతోష వార్త .మోతీలాల్ ఘోష్ క్రమంగా కోలుకొంటున్నారు .ఆయనకు వచ్చిన పక్షవాతం చాలా వరకు నయమైంది .ఆయనవయసు 75.’’అని రాసింది .
ఆయన రాయటం మానలేదు ఉదయం తన ఇంటి దగ్గరున్న నదీ తీరానికి గుర్రం బండీలో వెళ్లి స్వచ్చమైన గాలి పీలుస్తూ ,వార్తాపత్రికలు చదివించి విషయాలు తెలుసుకోనేవాడు .కర్ర ఆధారంగా కాసేపు నడిచేవాడు .మధ్యాహ్నం రాసుకోనేవాడు .ఐర్లాండ్ పరిస్థితులు తెలుసుకోవటానికి బ్రిటన్ నుంచి వచ్చిన వార్తా పత్రికలూ చదివే వాడు .మృత్యువు మీద పడుతోంది అన్న వాస్తవం గ్రహించి ,దానితో రాజీకి వచ్చాడు .మృత్యువు రాకకోసం నిశ్చింతగా ఎదురు చూశాడు .మరణం మానవ జీవితం లో ఒక ఘట్టం మాత్రమె అని నమ్మాడు .మరణం తర్వాత మంచి లోక ప్రాప్తి కలుగుతుందని తెలుసుకొన్నాడు .అతీత శక్తిగల భగవంతుడు మనకు మంచి మిత్రుడు అనేవాడు .శ్రీ కృష్ణ ,గౌరాంగ ల లాగా మానవుడిలో ఉండేవాడే దేవుడు అని నమ్మాడు .భారత ప్రజానీకానికి తమ ఇల్లు తాము సరిదిద్దుకొనే సామర్ధ్యం ఉన్నవారని భావించాడు .మానవునిపై అచంచల విశ్వాసం ఆయనది .
1922మధ్యలో మళ్ళీ కోలుకొన్నాడు మోతీలాల్ .తన ఆరోగ్యం గురించి పత్రికలో –‘’రాజైనా రైతైనా సన్యాసి అయినా ,పామరుడైనా మృత్యువును తప్పించుకోలేడు .వంటికి నీరుపట్టటం ,ఊపిరి ఆడని ఆయాసం ,వెన్ను నొప్పులు భరించరానివే .ఈ మధ్య వచ్చిన స్ట్రోక్ వంటిది మళ్ళీ నాకు వస్తే భరించే శక్తి నాకు లేదు .ఆరోజున ఎలాగో భరించగలిగాను .మృత్యువు సమీపిస్తుంటే ,శారీరకబాధలేవీ లేకుండా ,ఆనందం ఆవరిస్తుందని శాస్త్రీయంగా రుజువైంది .అంటే శరీరం నుంచి ఆత్మ వేరై ,ఊర్ధ్వ లోకాలలో తన శాశ్వత గమ్యస్థానానికి వెళ్ళే సమయం లో శరీరానికి బ్రహ్మానందం ప్రాప్తిస్తు౦దన్నమాట .ఆ ఆనందాన్ని అతి త్వరలో అనుభవి౦చ బోతున్నానని ఆశిస్తున్నాను .మానవాళికి ఆ ఆనందం ఇదిగో ఇలాంటిది అని వ్యక్తం చేసే అవకాశం చిక్కదని మాత్రం విచారిస్తున్నాను ‘’అని రాశాడు మోతీలాల్ పక్వ హృదయం తో .
మళ్ళీ వ్యాధి తిరగబెట్టి బాగా నీరసించాడు. గాస్ ట్రబుల్ ఎక్కువైంది జలోదరం తోపాటు న్యుమోనియా వచ్చింది .కొంతకాలానికి తగ్గి ,4-9-1922కి ఆరోగ్యం ప్రమాద స్థాయికి చేరి,ఆ మర్నాడే మోతీలాల్ ఈ బాధామయ ప్రపంచం నుంచి శాశ్వత ఆనందం కోసం వెళ్ళిపోయాడు .కుటుంబ సభ్యులు చుట్టూ చేరిహరినామ స్మరణ చేశారు .మరణానికి కొన్ని రోజులముందు తన్ను చూడటానికి వచ్చిన బంధువుతో మోతీలాల్ –‘’నాకు తీరనిది అంటూ ఎమీ లేదు .మృత్యువుకు కొన్ని అంగుళాల దూరం లో మాత్రమె ఉన్నాను .దేనినైనా తట్టుకొనే వయసు ఉంది .ప్రపంచం లో ఆనందాన్ని పూర్తిగా అనుభవించాను .తెలిసి ఏ పాపమూ చేయలేదు .ఇహాన్ని వదిలి వెళ్లి పోతున్న నాకు బ్రహ్మానందం లభిస్తుంది .ఎందుకు ఆనందంగా ఉండకూడదో చెప్పు ‘’అన్నాడు .
వేలాదిమంది మోతీలాల్ మృతికి సంతాపాలు పంపారు .వచ్చి చూసి చివరి దర్శనం చేసుకొన్నారు .బిన్న రాజకీయ సిద్దా౦తా లున్న మూడు పత్రికలు వ్రాసిన సందేశాలు ఇలా ఉన్నాయి –గాంధీజీ జైలులో ఉన్నప్పుడు రాజాజీ ,జైరాం దాస్ దౌలత్ రాయ్ ,జార్జ్ జోసెఫ్ ల సంపాదకత్వం లో ఉన్న యాంగ్ ఇండియా పత్రిక –‘’శిదిలపేటికను ఒక మహోన్నత ఆత్మ విడిచి పెట్టి వెళ్ళిపోయింది .మనరాజకీయచి౦తన లో సత్యం ధర్యం అనే గుణాలు ప్రవేశపెట్టి ,దాన్ని ప్రజాస్వామ్యానికి అనుగుణంగా తీర్చి దిద్దినవాడు మోతీలాల్ ఘోష్ .భారత స్వాతంత్ర్య చరిత్రలో ఆయనది గౌరవ స్థానం .ఆత్మ సౌన్దార్యం ,దానికి సామర్ధ్యం కలిగిన ప్రజల అభిమానాన్నే కాక ప్రేమను కూడా నోచుకొన్న అరుదైన వ్యక్తీ .గాంధీ ,మోతీలాల్ లను మహానీయులనుంచి వేరు చేసింది వారిలోని ‘’కృష్ణ చైతన్యమే ‘’అని శ్లాఘించింది .ఒకప్పటి స్టేట్స్ మన్ పత్రిక సంపాదకుడు ,తర్వాత లండన్ నుంచి వెలువడే ‘’ది న్యు స్టేట్స్ మన్’’సంపాదకుడు ఎస్.కే రాట్లిఫ్ –‘’తమ వ్యక్తిత్వం రచనలు ,విద్యావంతులకు ,విద్యా లేనివారికి కూడా పరిచయున్న వారు ఎంతమంది ఉన్నారు ?ఇంగ్లాండ్ లో అలాంటి వారు ఒక్కరు కూడా లేరని చెప్పవచ్చు .మొత్తం పాశ్చాత్య ప్రపంచం లో ప్రజలందరికీ తెలిసిన రచయితా లేనే లేడు .అది భారత దేశం లోనే సంభవం .భారత్ మొత్తం మీద ఒక విలక్షణ మేధావి ఉన్నాడు .ఆయనే కలకత్తాలో అమృత బజార్ పత్రిక నడిపే బాబూ మోతీలాల్ ఘోష్ .ఆయన 77వ ఏట కన్ను మూశాడు .ఆయన నిష్క్రమణలో భారతీయ జర్నలిజం లో ఒక శకం అంతరించింది .ఆయన తనకు తానె మహాశక్తిగా ఎదిగిన మహా వ్యక్తీ .భారతీయులకు ఆయన సుపరిచిత వ్యక్తీ .కలకత్తానగరం ఉత్తరభాగాన పెద్ద హిందూ కుటుంబం తో ఉన్న ఇంట్లోనే ఆయన ఎడిటోరియల్ ఆఫీస్ ఉంది .ఆ ఆఫీసులోనే పుష్కరం క్రితం మెక్డోనాల్డ్ అనే ఇటాలియన్ రాజభవనాన్ని తలపించే చోట ఆయన్ను కలుసుకొన్నాం ..అక్కడి ప్రతి రాయి శిధిల గాథ చెబుతుంది .ప్రక్కనే ముద్రణాలయం లో లినో టైప్ యంత్రాలు పని చేస్తున్నాయి .బెంగాల్ లో ఇంగ్లీష్ వారు పత్రికలకు లినో టైప్ యంత్రాలు వాడకముందే ఈయన తనపత్రికకు వాడారు ‘’అన్నది .మూడవ పత్రిక ‘’దిఇంగ్లీష్ మాన్ ‘’మోతీలాల్ దివ్య స్మృతికి నీరాజనాలిస్తూ –‘’భారత రాజకీయ రంగం నుంచి ఒక మహోన్నత వ్యక్తీ నిష్క్ర మించాడు .ఆయన బ్రిటిష్ వారికి ప్రమాదకర వ్యక్తిగా భారతీయులకు ఆరాధనీయుడుగా కనిపించాడు .ఆయన అద్భుతమైన వ్యక్తీ అని శత్రువులు కూడా అంగీకరిస్తారు .కేవలం ఒక చోట భైఠా యించి ప్రభుత్వం మీద ,వ్యవహారాలమీద నిప్పులు చెరిగాడు .అంతకీర్తి ఆయనకు రావటానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శించిన సాహసం మాత్రమె కారణం కాదు .భారత రాజకీయ నాయకులు తప్పుదోవ పడితే వారికి వ్యతిరేకంగా ఆయన చూపిన సాహసమే ముఖ్య కారణం .వ్యంగ్యవైభవంతో కూడిన ఆయన శైలి కూడా కారణమే .ఆయన రచనలు చదివి స్వదేశీయులే భయపడే వారు .యూరోపియన్లు కూడా మోతీలాల్ చిత్త శుద్ధిని ,నిజాయితీని గౌరవించారు ‘’అని మెచ్చింది .ఇంగ్లీష్ కవి టెన్నిసన్ కవిత మోతీలాల్ ఘోష్ కు పూర్తిగా సరిపోతుంది –
‘’అతడొక సాహస హృదయుడు –శ్రమించి శోధించి అంతు కనుక్కోవటమేకానీ –తలవంచి లొంగి పోయి ఎరుగడు ‘’.
ఇంతటి మహోన్నత వ్యక్తి మోతీలాల్ ఘోష్ ను ని స్వాతంత్ర్య అమృతోత్సవసందర్భంగా పరిచయం చేసే అదృష్టం నాకు దక్కినందుకు గర్వంగా ఉంది .
ఆధారం –ఎస్.ఎల్ ఘోష్ రాసినదానికి శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ అనువాదం చేసనపుస్తకం ‘’మోతీలాల్ ఘోష్ ‘’
రేపు 75వ భారత స్వాతంత్రోత్సవ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-22-ఉయ్యూరు