తొలిఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి -3
రోడ్డా కంపెని
జగ్గన్న శాస్త్రి కలకత్తా లో మెడిసిన్ చదివేటప్పుడు అక్కడ ఒక రోడ్డా అండ్ కంపెనీ ఉండేది అందులో తుపాకులు పిస్తోళ్లు మందు గుండు సామాను అమ్మేవారు .విప్లవానికి చెందిన ఒక చోరీ ఈ కంపెనీలో4-8- 1914న జరిగింది.ఆ రోజే బ్రటిష్ ప్రభుత్వం మొదటి ప్రపంచయుద్ధానికి ప్రకటన చేసి౦ది కూడా .ఆగస్ట్ 14 న ఈ కంపెనీకి విదేశాలనుంచి 202పాకేజీలలో పిస్తోళ్లు మందుగుండు సామాను దిగుమతి అయ్యాయి .నమ్మకమైన అధికారిని కస్టమ్స్ శాఖకు పంపి వాటిని తెమ్మన్నారు .అతడు వెళ్లి 192 పాకేజీలు మాత్రమె దిగుమతి చేసుకొని ,ఆమాట అక్కడి అధికారులకు చెప్పి ఇంటికి వెళ్ళాడు .కాని అతడు ఆ రోజునుంచి మళ్ళీ కంపెనీ ముఖం చూడలేదు .మిగిలిన 10పాకేజీలుకూడా కంపెనీకి చేరనే లేదు .మూడురోజులు చూసి కంపెనీ పోలీసులకు తెలియ జేసింది .ఈ 10 కేసులలో 50పిస్తోళ్లు ,46వేల రౌండు లకు ఉపయోగపడే మందు గుండు సామాను ఉంది .ఇందులో 44పిస్తోళ్లు మొదటిరోజు రాత్రే 9విప్లవ సంఘాలకు చేరిపోయాయని ,మిగిలిన 6 ఏమయ్యాయో తెలీదని ప్రభుత్వం చెప్పింది .1914తర్వాత ఈ పిస్తోళ్ళతో 54 బందిపోటు హత్యలు జరిగినట్లు పోలీసు లెక్కల్లో తేలింది .కొంత కాలానికి 31పిస్తోళ్లు చాకచక్యంగా పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు .అప్పుడు కలకత్తాలో ఒకే సారి 150 ఇళ్ళను సోదా చేయగా అందులో జగ్గన్న శాస్త్రి ఉన్న బస కూడా ఉంది .అప్పటికే ఆయన రాస్ బిహారీ బోస్ తోస్నేహంగా ఉంటున్నాడు . రాస్ బిహారీ బోస్ డెహ్రాడూన్ లో ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ లో హెడ్ క్లార్క్ .బెంగాలీ విప్లవ నాయకుడు .ప్రభుత్వాన్ని పడకొట్టే అనేక ఉపాయాలు ఆలోచిస్తున్నాడు .వ్యాసాలద్వారా, విప్లవ సంఘాలు స్థాపించి ఉద్యమిస్తున్నాడు .1912 డిసెంబర్ లో ఢిల్లీ లో వైస్రాయ్ హార్డింజ్ పై బాంబు వేశాడని అభియోగం ఉంది .అతడిని పట్టిస్తే పెద్ద బహుమతి ఇస్తామని ప్రకటన చేసింది ప్రభుత్వం .ఢిల్లీ ,లాహోర్ కుట్ర కేసులు ఇతనిపై బనాయించినా ఫలితం కనిపించలేదు .కాశీకి వెళ్లి అక్కడ రహస్యంగా విప్లవ సంఘాలు స్థాపించి పని చేస్తున్నాడు .1914లో కాశీలోనే ఉన్నాడు .ఒక బెంగాలీ కుటుంబానికి చెందిన తోట బంగళాలో ఉండటం చేత ఆచూకి దొరకలేదు .రాత్రులలో బయటికి వచ్చి చేయాల్సిన పని చేసేవాడు .పిస్తోళ్లు బాంబులు పేల్చే విధానాన్ని శిక్షణ ఇచ్చేవాడు .ఒక సారిరాత్రి అలా ఇస్తుంటే రెండు బాంబు మూతలు చేతిలో పేలి అతనికి సచ్చీంద్రుడు కి గాయాలయ్యాయి .నివాసం మార్చేశాడు .పూనా నుంచి వచ్చిన గణేశ పింగలే ఇతడిని కలిశాడు .1915లో పింగలే సచ్చీన్ద్రులు రాస్ బిహారీ నికలిశారు .ముగ్గురు కలిసి పంజాబు వెళ్లి ,ఆనెల 21న విప్లవానికి గొప్పప్లాన్ వేశాడు .పోలీసులకు ఈ రహస్యం తెలిసిందని పసిగట్టి ప్లాన్ అమలు చేయలేదు .పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు .రాస్ బిహారీ లాహోర్ వెళ్లి అక్కడినుంచి కాశీ చేరి ,అక్కడినుంచి కలకత్తా చేరి ,మిత్రులను కలిసి హిమాలయాలకు వెడుతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు .1915లో టిబెట్ దాటి చైనాలో ప్రవేశించాడు .అక్కడ సన్యట్ సేన్ కు శిష్యుడై ,చాగ్ కై షేక్ తో కలిసిఉన్నాడు .కొన్ని నెలల తర్వాత జపాన్ వెళ్లి జపాన్ ప్రభుత్వ సాయం తో అక్కడ’’హిందూ దేశ విప్లవ సంఘం’’ స్థాపించాడు .ఆసంవత్సరే జపాన్ లో చనిపోయాడువిప్లవ వీరుడు రాస్ బిహారీ బోస్ .
శాస్త్రి నిర్బంధం
కలకత్తాలో జగ్గన్న శాస్త్రిని అన్నం తిననీయకుండా అరెస్ట్ చేసి బొంబాయి కి తీసుకువెళ్ళారు .అప్పటికే అయిదుగురు అరెస్ట్ అయ్యారు ఆరో వాడుశాస్త్రి .అక్కడి పోలీసులు అతిధి పూజా దురంధరులు .సున్నీల స్వాగతం బూతుల దఅష్టోత్తరపారాయణ ,లాఠీ పూజ చంపదెబ్బల ,అర్ధ చంద్ర ప్రహారాల విందు తన్నుల తాంబూలం ,పిడికిట దక్షిణ లతో నిరంతర సత్కారం చేశారు .కొట్టిన దెబ్బలతో పొడిచిన పోట్లతో కట్టిన బొబ్బలతో కమలిన గాయాలతో కారే రక్తంతో కన్నీళ్ళతో ,చెదరని గుండెతో ,కదలని నాలుకతో కదలలేక కూర్చోలేక నిలబడ లేక పడుకోలేక పగలే రాత్రిగా రాత్రే పగలుగా దినం ఒక యుగంగా గడపిన దీక్షా వ్రతం లో ఆత్మ సాక్షియే దైవంగా సత్యమే దిక్కుగా ,బడలి ఒడలు తెలియని ఆబక్క బాపడు జగ్గన్న శాస్త్రి ని చూసి బాధపడే వారెవరూ లేరు .ఆరునెలలు ఇదే తీరున బాధ పెట్టారు .శాస్త్రితోపాటు ఒక గుజరాతీ ఒక మహారాష్ట్ర వేరొక ఆంధ్రయువకుడు ఉన్నారు ఈబాధాలు భరించిన వారిలో .వీరందరిపై కుట్ర నేరం మోపాలనుకొన్న ప్రభుత్వం ఆటలు సాగలేదు .అప్పుడే దేశోద్ధారక కాశీ నాథుని నాగేశ్వర రావు పంతులుగారు బొంబాయి వెళ్లి వీరందర్నిజైలులో కలుసుకొని మూడు వందల రూపాయలు ఇచ్చి గ్రామపెద్దలకు జాబులు రాసి ,వారి సానుభూతి పొందేట్లు చేయగా ,దాని ఫలితంగా శిక్ష పడకుండా వీరు విడుదలయ్యారు .
సశేషం
భారత స్వాతంత్ర్య అమృతోత్సవ శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-8-22-ఉయ్యూరు