తొలిఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి -4(చివరిభాగం )
జైలు నుంచి విడుదలకాగేనే మళ్ళీ వైద్య వృత్తి అవలంభించాడు జగ్గన్న శాస్త్రి .అయిదేళ్ళు బాగానే నిలకడగా ఉన్నాడు .ఇంతలో హోమ రూల్ హడావిడి మొదలైంది .కాంగ్రెస్ పునరుద్ధరణ జరిగింది. అల్లూరి సీతారామరాజు గడబిడ .ఈయనతో శాస్త్రికి సంబంధం ఉందని ప్రభుత్వానికి అనుమానం .మూడేళ్ళు ఇద్దరి ఇళ్ళపై కదలికలపై తీవ్ర నిఘా కొనసాగింది .శాసన సభా బహిష్కార ఉద్యమ లో ‘’నో వోట్ కాంపైన్ ‘’ప్రారంభించినపుడు శాస్త్రిని ఉప్పలగుప్తం పోలింగ్ ఏరియాకి పంపితే ,వెళ్లి ఒక్కవోటు కూడా పోల్ కాకుండా చేసి ఖాళీ బాలట్ బాక్స్ లను తిరగొట్టించాడు .1930లో నాయకులంతా జైలులో ఉండగా ,బిక్కిన వెంకటరత్నం గారు జిల్లా నాయకుడు గా నియమింప బడినప్పుడు అయన ఉప్పుసత్యాగ్రహ స్థానమైన కాకినాడ వదలి చోడవరం వెళ్లి ఆయన ఇంటి నుంచే సత్యాగ్రహం నడపాలనుకొన్నారు .శాస్త్రి కాకినాడలో ఉండి సత్యాగ్రహం జయప్రదంగా నిర్వహించాడు .మళ్ళీ ఉద్యమమ దిగ్విజయంగా సాగుతోంది .ప్రభుత్వం గుర్తించి జైలులో పెట్టింది ,అక్కడే ‘’జాతీయ నాయకులు ‘’అనే పుస్తకం రాసిన కోటమర్తి చిన రఘుపతి కూడా ఉన్నారు .వీళ్లిద్దరితోపాటు 59మందిని మొదటి బాచ్ గా రాయవెల్లూరు జైలుకు పంపారు .శాస్త్రి ని మద్రాస్ కు, అక్కడినుంచి అల్లీపూర్ జైలుకు మార్చగా రఘుపతి మాత్రం అక్కడే శిక్ష పూర్తీ చేశారు .
’హిందూ దేశ స్వాతంత్ర్య యుద్ధం
1930ఉద్యమ౦ ,అంతకు ముందు బెంగాల్ విభజన ఉద్యమంలో పాల్గొన్న వినాయక దామోదర సావర్కార్ రాసిన ‘’హిందూ దేశ స్వాతంత్ర్య యుద్ధం ‘’పుస్తకం బాగా ప్రచారమైంది .ఇది మొదట 1906,07లలో మహారాష్ట్ర భాషలో రాయబడి,1907లో ఇంగ్లీష్ లో అనువాదంచేయబడి 1908లో జర్మనీలో ముద్రింపబడింది .బొంబాయిలో దామోదర కంపెనీకి పాలడబ్బాల వ్యాపారం ఉండేది .జర్మనీ నుంచి ద పాలడబ్బాలుదిగుమతి అయ్యేవి .ఒకసారి ఆపాల డబ్బాలతోపాటు ఆ పుస్తకాలు కూడా దిగుమతి అయ్యాయి .జగ్గన్న శాస్త్రి బొ౦బాయి కొన్ని పుస్తకాలు కొని తెచ్ఛి, ఆంధ్రదేశం లో పంచిపెట్టాడు .
గాంధీ సత్యాగ్రహ ఉద్యమం వదిలి శాసన సభా ప్రవేశ ఉద్యమం లో ఉన్నప్పుడు నచ్చక శాస్త్రి దూరమయ్యాడు .సావర్కారు నాయకత్వం లో ‘’హిందూ మహా సభ ‘’లో చేరి పని చేశాడు .సావర్కార్ రాసిన ‘’హిందూ పద శాహి’’గ్రంథాన్ని మృదు మధుర శైలిలో అనువాదం చేశాడు శాస్త్రి .హిందూ మత ధర్మాలు పాటిస్తూ ,మహాసభకు వీర విధేయుడుగా ఉన్నాడు .అనేక గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు .ఒక రోజు కోటమర్తి కి ‘’గాంధీ ముస్లిం కాన్స్పిరసి’’అనే పుస్తకం ఇచ్ఛి ఆపుస్తకం తనలో కలిగి౦చిన మార్పును గురించి చెప్పాడు .ముస్లిం లకు గాంధీ దేశాన్ని కట్టబెట్ట బోతున్నట్లు శాస్త్రి భావించాడు .అందులో కొన్ని ముఖ్యవిషయాలు –‘’బ్రిటిష్ ప్రభుత్వం తో సంధి చేసుకో కూడదని కాబూల్ లోని సుల్తాన్ కు టెలిగ్రాం ఇచ్చానని రాజకీయ నాయకులంతా నాపై కక్ష కట్టారు .నేను కూడా అది మంచిపనికాదని చెప్పాను .కాని బ్రదర్ మహమ్మదాలీ నన్ను పక్కకు తీసుకు వెళ్లి తన చేతి సంచిలోని వ్రాతప్రతి అయిన టెలిగ్రాం ను నాకు ఇచ్చి చదవమన్నాడు .అది అహింసాయుత సహాయ నిరాకరణ ఉద్యమ నాయకుడి దస్తూరిగా ఉండటం నన్ను ఆశ్చర్య పరచింది .’’అని స్వామి శ్రద్ధానంద రాయగా ,గాంధీ తన హరిజన పత్రికలో 10-2-1940న ‘’నేను ఆఫ్ఘనిస్తాన్ అమీర్ కు ఏరకమైన టెలిగ్రాం పంపినట్లు గుర్తు లేదు .ఆ ఆరోపణ నిజంకాదు .స్వర్గీయ స్వామి శ్రద్ధానంద నాతొ ఎప్పుడూ ఈ విషయం ప్రస్తావించ లేదు ‘అని సమాధానం గా రాశాడు గాంధీ .23-3-40న హరిజన్ పత్రికలో గాంధీ –‘’బ్రిటిష్ వారి సాయంతో ముస్లిం లు హిందూ దేశం పై తమశక్తిని ప్రయోగిస్తారు .కాంగ్రెస్ నా వెంట ఉంటె ,వాళ్లకు ఆశ్రమ ఇవ్వను .వారి చేత పరిపాలి౦ప బడటం నాకు ఇష్టమే .కారణం వారిది హిందూ పాలనమే కనుక ‘’అని రాశాడు .ఇవన్నీ చదివి శాస్త్రి ‘’హిందూ దేశం లో గాంధీ మహమ్మదీయుల చేతిలోబందీగా ఉన్నాడు .అది నాకు ఇష్టం లేదు .బయటి బ్రిటిష్ ప్రభుత్వం కంటే ఇంటిలోని మహమ్మదీయ సమస్య పరిష్కరించాలని నేను హిందూ మహా సభ సభ్యుడిగా చేరాను ‘’అని తాన రాజకీయ దృక్పధాన్ని మార్చుకొన్నట్లు శాస్త్రి స్పష్టంగా చెప్పాడు .తాను ‘’హిందూ మహా సామ్రాజ్యం ‘’పుస్తకాన్ని అనువదించటానికి ముఖ్యకారణం హిందూ ఉత్క్రుష్టత ను స్పష్టం చేయటానికే అని చెప్పాడు .ఎర్రమిల్లి జగ్గన్న శాస్త్రి మంచి ఆవేశ పరుడైన విప్లవకారుడు గొప్ప ఉపన్యాసకుడు ,దేశాభిమాన౦ , హిందూ మతాభిమాన మున్న మహోన్నత వ్యక్తీ ‘’అని కీర్తించాడు శాస్త్రి కో డిటేన్యు కోటమర్తి చిన రఘుపతి .
ఆధారం
శ్రీ కోటమర్తి చిన రఘుపతి రచించిన ‘’ జాతీయ నాయకులు –మొదటి భాగం .ఇందులో జగ్గన్న శాస్త్రి తోపాటు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ,డా.పట్టాభి సీతారామయ్య , ,అయ్యదేవర కాళేశ్వరరావు గార్ల జీవిత చరిత్రలూ సంగ్రహంగా ఉన్నాయి .దీన్ని రాజమండ్రిలోని కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్ 1955లో ముద్రించారు .వెల-రూపాయిన్నర .
వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-8-22-ఉయ్యూరు