త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం -2
1924నుంచి సుబ్రహ్మణ్యంగారు తీవ్రవాదులై ,నిర్మాణ కార్యక్రమాలలో పాల్గోన్నారుకానీ శాసనసభ ప్రవేశానికి మొగ్గు చూపలేదు .చిత్తరంజన్ దాస్ ,మోతీలాల్ నెహ్రూ లు శానసభలో ప్రవేశించి బ్రిటిష్ ప్రభుత్వానికి అడ్డు తగలానని భావించారు .ఇదే స్వరాజ్యోద్యమం .ఇది మణ్యం గారికి నచ్చలేదు .
సీతానగర ఆశ్రమం
రాజకీయాలు చాలా విధాలుగా నడుస్తున్నాయని తెలిసి ,గాంధీ మార్గాన్నే అనుసరించారు సుబ్రహ్మణ్యం గారు .రాజమండ్రి దగ్గర గోదావరి ఒడ్డున ప్రశాంత వాతావరణం లోసీతానగరం లో ఒక ఆశ్రమం నిర్మించి శిష్యవర్గంతో పని చేస్తూ గాంధీగారి నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించారు .దీనికోసం 14ఎకరాలు మూడు వేలరూపాయలు పోగుచేసి కొని ఆశ్రమ నిర్మాణం ప్రారంభించి భవనాలు నిర్మించారు. దీనికి చాలాకస్టపడ్డారు .ఇటుకలు ,పెంకులు కలప కు చాలాడబ్బు కావాల్సి వచ్చింది .నిర్మాణ వ్యయం 20వేలు అయింది .ఇందులో 13ఎకరాలు వ్యవసాయానికి ,మిగిలిన ఎకరం లో భవనాలు నిర్మించారు .వివిధ శాఖలకు వేర్వేరు భవనాలు ,నివాసానికి వేరుగా భవనాలుమొత్తం 12 భవనాలు అన్నీ ఆ ఎకరం లోనే కట్టారు .ప్రజాసేవ ప్రారంభించారు .ఇదంతా గాంధీగారి నిర్మాణ కార్యక్రమం ను అనుసరించే జరిపారు .
గాంధీ గారి దృష్టిలో నిర్మాణ కార్యక్రమాలు అంటే –సత్య ,అహింస పద్ధతులలో సంపూర్ణ స్వరాజ్య సాధన .అంటే జాతి మత కులాలకు అతీతంగా స్వేచ్చా స్వాతంత్ర్యాలు కలిగి ఉండటం .అంటే అన్యోన్య ఆశ్రయంగా కలిసి పని చేయటం .కృషిని బట్టి ఫలితం ఉంటుంది .ఇది సక్రమంగా అమలు జరిపితే ,మనం కోరుకున్న స్వతంత్రం వస్తుంది .ఈ నిర్మాణ కార్యక్రమానికి 13 విషయాలున్నాయి .అవి-వివిధ జాతి సమీకరణ ,అస్పృశ్యతా నివారణ ,త్రాగుడు ,ఖద్దరు పల్లెటూరి పరిశ్రమలు ,గ్రామ పారిశుధ్యం ,నూతన విద్యావిధానం ,వయోజన విద్య ,స్త్రీ జనోద్దరణ ,ఆరోగ్యబోధ ,రాష్ట్ర భాషా ప్రచారం ,స్వభాష ,ఆర్ధిక సమానత్వం .వీటిని ఈ ఆశ్రమం లో ఎలా తీసుకువచ్చి సఫలీకృతం చేశారో చూద్దాం –హిందూ ముస్లిం క్రైస్తవులు పరస్పర అవగాహనతో మిత్రత్వం తో కలిసి ఉండటం .అంటరానితనాన్ని ఆశ్రమం లో పాటింపక పోవటం,కల్లు సారాయి దుకాణాలవద్ద పికెటింగ్ చేసి త్రాగుడు మాన్పించటం , నూలు అందరూ వడికి ఆదాయం పెంపొందించటం .దీనికి ప్రత్తి చెట్లు పెంచి ప్రత్తి తీయించి రాట్నాలు సప్లై చేసి నూలువడికించి వస్త్రాలు నేయించి అమ్మకానికి పెట్టారు .ఇతర పరిశ్రమలు ఇక్కడ పెట్టలేదు. వ్యవసాయమే ముఖ్యంగా చేశారు .గ్రామాలకు వెళ్లి పారిశుధ్యాన్ని బోధించి అమలు అయెట్లు చేశారు .వవైద్యాలయం ఏర్పాటు చేసి రోగులకు సాయపడ్డారు .చిన్న చిన్న బడులు పెట్టి గ్రామస్తులకు విద్య నేర్పించారు .కాంగ్రెస్ అనే పత్రిక స్థాపించి వయోజన విద్యా ప్రచారం చేశారు .మద్దూరి అన్నపూర్ణయ్య ,గాడిచర్ల వారు పత్రికాధిపతులుగా ఉంటూ ప్రేరణాత్మకంగా రాస్తూ ప్రయోజనం కలిగించారు .స్త్రీ జనోద్ధరణకు ప్రత్యెక కృషి చేయలేదు .సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ కనుక గ్రామస్తుల ఆరోగ్యాన్ని చక్కగా కాపాడారు .కొందరుమాత్రమే హిందీ నేర్చారు నేర్పించారు ,కాంగ్రెస్ పత్రిక తెలుగులోనే ప్రచురించి స్వభాషకు గౌరవం ప్రోత్సాహం కలిగించారు .దీనికి అన్నపూర్ణయ్యగారి కృషి అద్వితీయం ,ఆశ్రమనిర్వహణకు ఇతరులపై ఆధార పడాల్సి వచ్చినందున ఆర్ధిక సమానం కు కృషి చేయలేకపోయారు .ఈ ఆశ్రమం ఖద్దరుకు ప్రఖ్యాతి చెందింది .రాట్నాలు కదుళ్ళు చేయించి మంచి దూది తో యేకులు చేయించి ఆశ్రమం లోనూ ,గ్రామస్తులకు ఇచ్చి ఖద్దరు ఉత్పత్తి చేయించారు .ఒకరిద్దరు ఆశ్రమవాసులు ఖద్దరుకోసమే వినియోగి౦పబడ్డారు .సీతానగరం ఖద్దరు అంటే ఆంధ్రదేశం లో మంచి నాణ్యమైనది అనే పేరు పొందారు .మంచి వారపత్రిక ‘’కాంగ్రెస్ ‘’నడపటానికి ముద్రణా యంత్రం కొన్నారు .మద్దూరి అన్నపూర్ణయ్య గారే వీటికి బాధ్యత వహించారు .సుమారు మూడు వేలమంది చందాదారులు ఉండేవారు .ముట్నూరి వారి కృష్ణా పత్రికకు దీటుగా మద్దూరి వారు కాంగ్రెస్ పత్రిక ను ఆకర్షణీయంగా ,విజ్ఞాన దాయకంగా ,ప్రబోధ దాయకంగా నడిపారు .ఒక భవనంలో వైద్యాలయం పెట్టి,రోగులకు ఉచితంగా మందులిచ్చేవారు .డా.సుబ్రహ్మణ్యం గారికి లొంగని రోగం ఉండేదికాదు .కావాల్సిన డబ్బును ప్రజలనుంచి ప్రోగు చేసి ఎలాంటి లోపం లేకుండా వసతులతో వైద్యాలయం ఆదర్శంగా నడిపారు .వ్యవసాయానికి ఎడ్లు బండీ,నాగళ్ళు సంపాదించి వ్యవసాయం చేయిస్తూ కావలసిన కూరగాయలు ,జొన్న చోళ్ళు మిర్చి మొదలైన మెరకపంటలు పండించారు .ఆదాయం బాగా ఉండేది .ఆ ఆదాయం ఆశ్రమవాసుల భోజనాదులకుసరిపోయేది .ఆశ్రమం మాంచి ఉచ్చస్థితిలో ఉండగా గాంధీజీ వచ్చి రెండు రోజులు ఉండి,చూసి మెచ్చి ఆశీర్వదించి వెళ్ళారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-8-22-ఉయ్యూరు