త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం
వైదీక తెలగాణ్య శాఖకు చెందిన బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం కొండ వీడుసీమలోని ఫిరంగి పురం లో 12-10-1891న జన్మించారు .కొద్దికాలం అక్కడే చదివి బెజవాడలో చదివారు .మెట్రిక్ తప్పటం వలన చదువు ముందుకు సాగలేదు .నిరాశ చెందక కలకత్తా వెళ్లి నాలుగేళ్ళు వైద్య విద్య నేర్చారు .1915-16లో రాజమండ్రి వచ్చి వైద్య వృత్తిలోచేరి గొప్ప పేరు ప్రఖ్యాతులు,డబ్బు సంపాదించారు .నెలకు సుమారు వెయ్యి రూపాయలు సంపాదించేవారు .బీద విద్యార్ధులకు విద్య చెప్పించేవారు .1916-17లో వచ్చిన హో౦ రూల్ వైపు ఆకర్షితులై ,సేవా భావంతో కార్యదర్శియై ,ప్రజలను జాతీయోద్యమం వైపు మళ్లి౦చ గలిగారు.
1920లో గాంధీగారి సత్యాగ్రహోద్యమం లో పని చేసి ,శాసన సభా బహిష్కారాన్ని ప్రచారం చేసి ,వైద్యం మానేసి ప్రజాసేవలో మునిగిపోయారు .అప్పటికి ఆయనకు వైద్యం కింద అయిదు వేలు రోగులు ఇవ్వాల్సి ఉంది .ఆయన అడగలేదు .కానీ ఇల్లు గడవటం కష్టంగా ఉంటె ఇంట్లోని వారు ఒత్తిడి చేసి వసూలు చేస్తున్నారని తెలిసి ,బాకీ బిల్లుల్ని చింపి పారేశారు .గొప్ప ఉపన్యాసాలివ్వగల వక్త అవటంతో .గోదావరి జిల్లాలోని ప్రతిగ్రామం ప్రతి సభలో మాట్లాడి ఉత్తేజ పరచారు .హాస్యం చతురత తో ఆకర్షించేవారు .ప్రజలు నడుం కట్టి కార్యరంగం లోకి దూకేవారు .ఈయన ప్రభావం మద్దూరి అన్నపూర్ణయ్య ,ధరణిప్రగడ శేషగిరిరావు ,రామ చంద్రుని వెంకటప్ప ,మామిడి లక్ష్మీపతి ,మాచిరాజు రామచంద్ర మూర్తి ,డా.వంగవీటి దీక్షితులు మొదలైన వారిపై పడికర్తవ్య పరాయణులను చేసింది .
1920-21లో తీవ్రంగాసత్యాగ్రహోద్యమం నడపటం చేత 21డిసెంబర్ లో ఈయనను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు లో తర్వాత కడలూరు జైలులో ఉంచారు .శిక్షాకాలం సంవత్సరం లో ఆరోగ్యంగా ఉంటూ తోటఖైదీలకు సాయం చేసేవారు .22నవంబర్ లో విడుదలై ,ప్రజాసేవ చేస్తూ ఉద్యమాలు నిర్వహించారు .1923కాకినాడ కాంగ్రెస్ సభలలో సుబ్రహ్మణ్యం గారి సేవలు నిరుపమానం .నూలు వడుకుతూ వడి కించేవారు .రాజమండ్రిలోని ఆచంట పరబ్రహ్మం అనే డాక్టర్ ,ఈయనపై దురాగ్రహం తో చెంపమీద కొట్ట గా ,ప్రజలంతా మణ్య౦ గారి వెనక నిలబడి ప్రతీకారం తీర్చుకోమని కోరినా అహింసా వ్రతం అవలంబించి ,వారించారు .కొంతకాలానికి పరబ్రహ్మానికి పక్షవాతం వచ్చి బుద్ధి తెచ్చుకొని క్షమాపణ పత్రం రాసి కాళ్ళమీద పడ్డాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-8-22-ఉయ్యూరు