సంప్రదాయం ,ఆధునికత కలిపి చేసిన షష్టి పూర్తి
నేపధ్యం –మే 22 న మామనవడు చి. చరణ్ ఉపనయనం ఉయ్యూరులో చేయగా ,మా మేనకోడలు శ్రీమతి పద్మ ,భర్త చి రామకృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చిఆత్మీయంగా పాల్గొని ఆశీర్వదించి ,వెడుతూ రామకృష్ణ మా దంపతులతో ‘’బాబాయి గారు ,పిన్ని గారూ! నా షష్టిపూర్తి ఆగస్ట్ లో చేసుకొంటాం ,మా ఇరువైపులా పెద్దలు మీరే .తప్పక వచ్చి ఆశీర్వదించాలి ‘’ అని కోరారు .’’సరే ‘’అన్నాం మామూలుగా .
ఆతర్వాత తిధులప్రకారం జ్యేష్టబహుళ సప్తమి సోమవారం నాడు నాకు 82వెళ్లి 83 వచ్చిన సందర్భం గా ఉదయం మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారి దేవాలయం లో ,నవ గ్రహ పూజ అత్యంత వైభవంగా ప్రతి గ్రహానికి ఆవాహన ,ఆ గ్రహం ఉండే కిలో రంగు పూల తో పూజ ,నైవేద్యం ,ఆ గ్రహానికి ఇష్టమైన ధూపం సమర్పణ ,విసర్జన ,తర్వతా ఆయుస్సు హోమం చాలా శాస్త్రోక్తంగా విజయవాడ నుంచి పిలిపించి ఇద్దరు వైష్ణవ పండితులతో చేయించాడు మా అబ్బాయి రమణ .ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నూతన వస్త్ర ధారణా ,ప్రసాదం నైవేద్యంజరిపించాం పూజారి చేత .ఆతర్వాత మా దంపతులకు అందరి దంపతుల చేత ఒక పళ్ళెం లో పాదాలను కడిగించి ఆపాద జలం అందరికి చల్లించి ,పాద పూజ అనేక రంగుల పుష్పాలతో చేయించారు .తర్వాత దంపతులు వచ్చి మా దంపతులకు నూతన వస్త్రాలు అందించగా మేమూ వారికి అప్పటికప్పుడే వస్త్రాలు అందించాం .చేయించిన వారిని నగదుతో సత్కరించాం .ఆతర్వాత ,వచ్చిన వారందరికీ విందు ఇచ్చాం .దీనికి మంత్రాంగం అమెరికాలో ఉన్న మా అమ్మాయి శ్రీమతి విజ్జి ,ఇండియాలోని మా అబ్బాయిలు శాస్త్రి,శర్మ .ఆ రోజు ఉదయం మా ఇంటినుంచి మమ్మల్ని కారులో ఊరేగింపుగా మా గుడిదాకా సన్నాయి మేళం తో తీసుకు వెళ్ళటం ,గుడికి వంద మీటర్లదూరం కారు ది౦పించి అక్కడినుంచి వేదమంత్ర ఆశీస్సులతో పూర్ణ కుంభం తో పూజారి మురళి ము౦దునడువగా ,బాలిక చేత రెండువైపులా నుంచి పుష్పాలు చల్లించటం ,దారిలో పుష్పాలను చల్లిస్తూ మమ్మల్ని గుడికి తీసుకు వెళ్ళటం ఒక హైలైట్ గా నిలిచి చిరస్మరణీయమైంది .
తేదీల ప్రకారం నా పుట్టిన రోజైన 27-6-22 సోమవారం సాయంత్రం ఏసీ లైబ్రరీలో సరసభారతి ఏర్పడి 12 సంవత్సరాలు అయినందున ‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం ‘’నా సహస్ర చంద్ర మాసోత్సవం’ కూడా కలిపి సాహితీ మిత్రుల సమక్షం లో జరుపుకొని ,బందరు సంగీత విద్వాంసురాలు శ్రీమతి రాధికా సుబ్రహ్మణ్యం చేత సంగీత కచేరి ,మూడవ తరగతి చదువుతున్న చి.శ్రీవల్లిక చేత నాట్య ప్రదర్శన ఇప్పించి కవి సమ్మేళనం జరిపించి , బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ,మహా అవధాని శ్రీ ఆముదాల మురళి ,యువ అవధాని చి ఉప్పలధడియం భరత శర్మ ,శ్రీమతి చిల్లర భవానీదేవి.శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారితో తో సహా ‘’ 12మంది లబ్ధ ప్రతిష్టితులైనసాహితీ వేత్తలకు ‘’విశిష్ట సాహితీ పురస్కారం ‘’మరో 12అంది యువ సాహితీవేత్తలకు ‘’విశేష సాహితీ పురస్కారం ‘’అంద జేశాం .అందరికి నగదు ,నూతనవస్త్రాలు శాలువా ,జ్ఞాపిక అందించాం .కవులకు నగదు ఉత్తరీయం ,జ్ఞాపికలు అంద జేశాం .ఇక్కడా మాకు నూతన వస్త్రాలు సమర్పించిన వారున్నారు .కార్యక్రమ ప్రారంభం లో అందరికి ఫలహారం టీ ,చివర్లో బొబ్బట్టు వగైరాలతో కమ్మని విందు అంద జేశాం .దీని నిర్వహణా మా అబ్బాయి రమణ ఆధ్వర్యం ,అమెరికానుంచి మా అమ్మాయి మంత్రాంగం లో జరిపింది ,మా అబ్బాయి శర్మ మనవడు హర్ష హైదరాబాద్ నుంచి వచ్చి పాల్గొన్నారు .ఆ మధ్యాహ్నం ఇందులో కొందరు పురస్కార గ్రహీతలు మా ఇంట్లో నే భోజనం చెయ్యటం ,మా కోడళ్ళు సహకరించటం హై లైట్ .ఇదంతా నేపధ్యమే .
పద్మా ,రామ కృష్ణ ఆహ్వానం పంపటం ,ఫోన్ లోమాట్లాడటం జరిగాక తప్పక వెళ్లాలని నిర్ణయించుకొని ,నా పూజాదికాలు అయ్యాక మేమిద్దరం మా అబ్బాయి రమణ కోడలు మహేశ్వరి మూడవ కోడలు రాణీ లతో 18-8-22 గురువారం ఉదయం 7 కు కారులో బయల్దేరి ,మధ్యలో సూర్యాపేట లో ప్రసాద్ గారి హోటల్ లో టిఫిన్ కాఫీలు లాగించి ,మధ్యాహ్నం హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గం చెరువు గేట్ దగ్గరున్న ‘’ఫార్ట్యూన్ ప్రైం’’ క్లబ్ హౌస్ కు చేరాం .అప్పటికే అందరి భోజనాలు అయ్యాయి .పద్మ దంపతులు కొడుకు అల్లుడు కోడలు కూతురు ఆప్యాయంగా ఆహ్వానించి మాకు పైన రెండు రూమ్స్ కేటాయించగా అందులో చేరి,కిందకు వచ్చి భోజనాలు చేశాం .అప్పటికే మా పెద్దమేనల్లు అశోక్ సంధ్య దంపతులు ,అమెరికా నుంచి వచ్చిన చిన్నమేనల్లుడు శాస్త్రి కొడుకు కృష్ణ కూడా మహాదానందపడ్డారు .అందరం పాతకబుర్లు చెప్పుకొంటూ నవ్వుకొంటూ సరదాగా మాట్లాడుకొంటూ భోజనాలుచేశాం .ఫోటోలు తీసి పంపుకున్నాం .కీరు పరవాన్నం ,పులిహోర పప్పు కూర ,చట్నీ సాంబారు ,రసం పెరుగు వగైరా లతో భోజనం .తృప్తిగా తిన్నాం .’’ఎట్ హోం అట్మాస్స్ ఫియర్ ‘’అనుభవించాం .ఇప్పటి నుంచి రెండు పూట్ల ఒకపూట చేయని పప్పు కూర స్వీట్ హాట్ రిపీట్ కాకుండా వెరైటీ ని చక్కగా మెయింటేన్ చేయించారు పొద్దున్న టిఫిన్ లలో మధ్యాహ్న ,రాత్రి భోజనాలలోకూడా .ఇంతగా ఆలోచించి చేయించటం బహు అరుదు .రసమలై ,పాలకోవా ,రసగుల్లా ,గులాబ్ జాం,జిలేబి ,లడ్డు,బొబ్బట్లు వగైరా స్వీట్లు ,వాంగీ బాత్ ,గోంగూర పులిహోర, బిర్యాని ,ఆకుకూరల చపాతీ ,పూరీ కూర గారే దోసె,ఊతప్పం ,పుల్కామొదలైన వేరైటీ లతో కమ్మని విందు హాయిగా చేయించి ,అడిగి అడిగి వడ్డించి తినిపించారు .బెండు అప్పారావు సినిమాలో రఘుబాబు ఆహుతి ప్రసాద్ తో ‘’అందరూ కత్తులు కఠార్లతో చంపుతుంటే ,మీరు కమ్మటి భోజనాలు పెట్టి చంపుతున్నారండీ ‘’అన్నట్లుగా ఉంది వాతావరణం .ఇంతకీ తి౦ డికోసమే వచ్చావా బాబూ పొద్దున్న జరిగిన విషయాలు చెప్పవా అంటారుకదా –ఉదయంఒక వేదికపై అంకురార్పణ ,60కళాశాల ఆవాహన ,గణపతి పూజ వగైరా లు జరిగాయి మేము వచ్చే లోపే .
సాయంత్రం కల్చరల్ ప్రోగ్రాం .నవ్విస్తూ కవ్విస్తూ ఒకాయన ఈవెంట్ బాగా నిర్వహించాడు .మాజిక్ చేశాడు అందరూ ఫిదా అయ్యారు పోటీలు పెట్టి బహుమతులిప్పించాడు ఒకదానిలో మా కోడలు రాణి ప్రైజ్ కొట్టేసింది కదలకుండా మెదలకుండా సైలెంట్ కిల్లర్ లా .రాత్రి భోజనం చేసి రూమ్ కు వెళ్లి పడుకోన్నాం .
19-8-22 శుక్రవారం తెల్లవారగానే లేచి నేను స్నానం సంధ్య , శ్రీ కృష్ణ జన్మాష్టమి కనుక విష్ణు సహస్రనామం ,కృష్ణ అష్టోత్తరం తో స్పెషల్ గా పూజ నైవేద్యం చేసి ,మా కోడళ్ళు తెచ్చిచ్చిన కాఫీలు తాగి ,కిందికి దిగి టిఫిన్ తిని కాఫీ తాగి పక్కనే ఉన్న పద్మా వాళ్ళ అపార్ట్ మెంట్ లో వాళ్ళింటికి వెళ్లి అక్కడ జరుగుతున్న ఆయుస్ హోమం చూశాం .నాకు ఒక రూమ్ ఇవ్వగా నేను ఒకగంట ‘’భారతీ నిరుక్తి ‘’ప్రత్యక్ష ప్రసారం ఫేస్ బుక్ లో చేశా .తర్వాత పూర్ణాహుతి చూశాం .ఒకప్రక్క సూర్యనమస్కారాలు ,వేరోకప్రక్క మహాన్యాసంతో రుద్రాభిషేకాలు జరిపించారు .ఇది పూర్తయ్యాక మళ్ళీ క్లబ్ హౌస్ కు వచ్చి ,కలశాలకు ఉద్వాసన చెప్పించి,మళ్ళీ పద్మా వాళ్ళ ఇంట్లో అవబ్రుధ స్నానాలు చేయించి మళ్ళీ క్లబ్ హౌస్ కు చేరి ,దశ షోడస దానాలు ఇప్పించి వేదపండిత ఆశీర్వచనం చేయించారు .అందరూ ఘనులైన పండితులే నిష్ణాతులే .తర్వాత భోజనాలు .
సాయంత్రం గానా బజానా యువ బృందం కిరాక్ తెప్పించారు .పద్మ దంపతులు ,కొడుకు కోడలు కూతురు అల్లుడు వాళ్ళతో కలిసి స్టెప్పులకే అందాలు తెప్పించారు ఆడారు పాడారు .పద్మ మనవడు ‘’ఇరగదీశాడు ‘’ఇదంతా యువ బృంద గానం ,ఆట పాట,మజాకా .రామకృష్ణ స్నేహితులు బంధుజనం కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు .భీమ సేన్ నిర్మల్ గారి అమ్మాయి కూడా వచ్చి పాల్గొని నిండుదనం తెచ్చారు .తర్వాత భోజనాలు చేసి మేము రూ౦కు వెళ్లి నిద్రపోయాం .మా అమ్మాయి విజ్జితో ఫోన లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తాజాసమాచారం తెలియ జేస్తూ ,ఫోటోలు పంపించాము .ఈ రోజు నేను పంచ లాల్చీ ధరించాను .పొద్దున్నే చూసిన పద్మా వాళ్ళ డ్రైవర్ సంజీవ ‘’అద్భుతం తాతగారు ‘’అని సంతోషిస్తే బాగుంది తాతగారు అన్నాడు చిరునవ్వుతో తేజ .అంతటా ఆత్మీయత ,అనురాగం గౌరవం దర్శనమిచ్చాయి .ఆ రాత్రి సంజీవ మా రూమ్ కు వచ్చి నాతొ ఎన్నో ఫోటోలు తీసుకోగా అతనికి సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక ఇచ్చాను .అందరూ అభినందనీయులే .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-8-22-ఉయ్యూరు