సంప్రదాయం ,ఆధునికత కలిపి చేసిన షష్టి పూర్తి-2(చివరి భాగం )

సంప్రదాయం ,ఆధునికత కలిపి చేసిన షష్టి పూర్తి-2(చివరి భాగం )
19వ తేదీ శుక్రవారం నాడు ఉదయం మేమిద్దరం పద్మ వాళ్ళ మామగారికి నూతన వస్త్రాలు సమర్పించి ,పండిత శాలువా కప్పి నమస్కరించి ఆశీర్వాదం పొందాం.రామకృష్ణ కు పద్మకు నూతన వస్త్రాలు అందించి శాలువా కప్పి జ్ఞాపిక అందించి ఆశీర్వదించాం .మా అమ్మాయి విజయలక్ష్మి దంపతులు వారిద్దరికీ ఇవ్వమని చెప్పిన 5వేలరూపాయలు అందజేసి ,పద్మకు మా సహస్ర చాంద్రమాసోత్సవం సందర్భంగా మంగళహారతి కి గాను వెయ్యిన్నూట పదహారు రూపాయలు అందజేశాం .అలాగే రవి తేజ అమ్మగారికి నాన్న గారికి ,రవళి అత్తగారికి మామగారికి సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక ఇచ్చాం .వీరు సరసభారతి బ్లాగ్ అభిమానులం అని చెప్పారు .అలాగే మా మేనల్లుడు శాస్త్రి ,భార్య విజయలక్ష్మి కొడుకు కృష్ణ కు కూడా శాలువా కప్పి జ్ఞాపిక అందించాం .శుక్రవారం రాత్రి బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఫోన్ చేసి ,మర్నాడు శనివారం సాయంత్రం ఉయ్యూరులో కృష్ణాష్టమి ప్రసంగానికి ఒక చోటుకు వస్తున్నానని ,శ్రీ సువర్చలాన్జనేయ స్వామిని దర్శించాలని ఉందని తెలియజేస్తే ,మేము హైదరాబాద్ లో ఉన్నామని ,పూజారికి ,సరసభారతి కార్యదర్శి శివ లక్ష్మికి ఫోన్ చేసి ,వారిని గౌరవంగా గుడికి తీసుకు వెడతారని చెప్పాను .అలాగే వాళ్ళిద్దరూ దేవాలయానికి తీసుకు వెళ్లి పూజారి మురళితో ఆలయ మర్యాద ననుసరించి సత్కారం జరిపించి సరసభారతి తరఫున శివ లక్ష్మి దంపతులు వారికి శాలువా కప్పి పిల్లలకు పెట్టిన కృష్ణ గోపికల వేష ధారణ లో పాల్గొన్న బాలబాలికలకుబహుమతులు అంది౦ప జేశారు .శాస్త్రిగారు ప్రేరణాత్మక ప్రసంగం చేశారు అని శివ లక్ష్మి మెయిల్ పెట్టి ఫోటోలు పంపింది .
మూడవ రోజు 20-8-22 శనివారం ఉదయమే లేచి స్నానసంధ్య పూజాదికాలు పూర్తీ చేసి ,ఒక గంట ‘’భారతీ నిరుక్తి ‘’లైవ్ చేశాను గెస్ట్ రూమ్ నుంచే .ఆతర్వాత కిందికి దిగి ,టిఫిన్ ,కాఫీలు హాట్ హాట్ గా స్వీకరించగా ఉయ్యూరునుంచి వచ్చిన మా అన్నయ్యగారి అబ్బాయి రాం బాబు మద్రాస్ నుంచి వచ్చిన మేనల్లుడు శ్రీనివాస్ లను పలకరించి ,ఆరోజు కార్యక్రమం పెళ్లి చూపులు వేడుక ,ఉంగరాలు తొడగటం లో పాల్గొన్నాం .పద్మ తరఫున మేమందరం ,అశోక్ దంపతులు శాస్త్రి కుటుంబం ,రవి తేజ ,రవళి ,మొదలైన వారు ,రామ కృష్ణ తరఫున అల్లుడు కోడలు ,రామకృష్ణ బంధు గణం పాల్గొన్నారు యాంకరింగ్ బావ బావమరది సరదాగా చేసి రక్తి కట్టించారు .పెళ్లి కూతురు తరఫున మేమిద్దరం పెళ్లి పెద్దలుగా ,పెళ్లి కొడుకు తరఫున రామకృష్ణ పెదనాన్న గారి అబ్బాయిలు ఆడపడుచులు వ్యవహరించాం .కాసేపు సూటీ పోటీ మాటలు కవ్వింపులు ,ఇద్దరి అభీష్టాలు తెలుసుకోవటం వారిద్దరికీ వివాహం చేయటానికి నిశ్చయించటం జరిగి ,ఉంగరాలు అంద జేసుకొన్నారు ఉభయులు .ఇంతవరకే మేము ఉన్నాం .
మేము ఇక్కడికి వచ్చి ప్రతిపూట పెడుతున్న ఫోటోలు చూస్తున్నడా. శ్రీమతి కోనేరు లక్ష్మీ ప్రమీల గారు ‘’గురువుగారూ !మీదర్శన భాగ్యం నాకు కలుగ జేయండి ‘అని వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్నారు .వీలుంటే వస్తాను అని రిప్లై ఇచ్చాను .ఆమె 30ఏళ్ళు సంసార జీవితం లో మునిగి తర్వాత భర్త ను ఒప్పించి నెమ్మదిగా ఆపేసిన చదువు ఆయన ప్రోత్సాహంతో కొనసాగించి తెలుగులో ఎం ఏ.పాసై ,ఆంధ్రదేశం లోని ‘’పేరంటాళ్ళు దేవతలు ‘’పై రిసెర్చ్ చేసి పిహెచ్ డి చేశారు .అకస్మాత్తుగా భర్త చనిపోయారు అయినా కృత నిశ్చయంతో దాన్ని ప్రచురించి భర్తకు అంకితం చేశారు .ఆపుస్తకం నాకు ఆమె బెజవాడ సభలో ఇస్తే వెంటనే చదివి ‘’స్వయం సిద్ధ లక్ష్మీ ప్రమీల ‘’అని సమీక్షగా రాసి పంపాను .ఆమెను 2019సరసభారతి ఉగాది వేడుకలకు ఆహ్వానించి మేము ఇస్తున్న ‘’స్వయం సిద్ధ ఉగాది పురస్కారం ‘’అందించాం .ఆమె ఆనందానికి అంతులేదు .ఆమెగుంటూరు జిల్లా వేమూరు గ్రామం లో జన్మించారు .అక్కడే శ్రీ రోశయ్య వేమూరి గగ్గయ్య గార్లు జన్మించిన సంగతి మనకు తెలుసు .ఇప్పుడు రెండవ పుస్తకం గా ‘’వేమూరు గ్రామ చరిత్ర ‘’రాశారు .దీన్ని రాస్తుండగా ఆమెకు హార్ట్ సమస్య వచ్చి రెండు స్టె౦ట్లు’’వేశారు .ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు .ఆమెను చూడటం ధర్మం అనుకొన్నాం .అలాగే బోయిన్ పల్లిలో ఉన్న మా బావగారిని ,బాచుపల్లిలో ఉన్న మా శ్రీమతి అక్కయ్య గారినీ చూడాలని అనుకొన్నాం .
ఉయ్యూరు నుంచి మాతో వచ్చిన కారు ,మా మేనల్లుడు శాస్త్రి కారు లో ఉదం 11 గంకు మేమిద్దరం,మా అబ్బాయి మా ఇద్దరుకోడళ్ళు రాంబాబు ,శ్రీను బయల్దేరి యూసఫ్ గూడా లో ఉన్న ప్రమీల గారింటికి వెళ్లి ,పలకరించాం .ఆమె ఆనందానికి అవధులు లేవు .జ్ఞాపిక అందించి త్వరలో కోలుకోవాలని చెప్పాం .యోగాలో పరుగుపందెం లో ఆటాపాటలలో ఎన్నో బహుమతులు పొందిన ఆమెకు గుండె జబ్బు అంటే ‘’ఇనుముకు చెదలు ‘’పట్టటమే .అక్కడ ఇచ్చిన మజ్జిగతాగి బయల్దేరి సరాసరి ఓల్డ్ బోయిన్ పల్లి లో ఉన్న మా బావగారు -92ఏళ్ళ శ్రీ వివేకానంద్ గారిని చూసి నమస్కరించి ఆశీస్సులుపొంది నూతన వస్త్రాలు అందించి శాలువా కప్పి , జ్ఞాపిక నిచ్చాం .మమ్మల్ని చూడగానే ఆయన ఆనందం ఉత్సాహం రెట్టింపు అయింది .ఆయన నాతొ ‘’నేను ఆంజనేయస్వామికార్యక్రమాలకు నువ్వు అడగక పోయినా వీలువెంట డబ్బు పంపుతున్నాను .ఇంకా కావాల్సి వస్తే మొహమాటం పడకుండా అడుగు ‘’అన్నారు .నేను ‘’మాకు డబ్బు ఏమీ అక్కర్లేదు .మీ ఆరోగ్యం బాగా ఉంటే,మీ ఆశీస్సులు ఉంటె చాలు బావగారూ ‘’అన్నాను .ఆయన వద్ద సెలవు తీసుకొని ,బాచుపల్లి లో ఉన్న 90ఏళ్ళ మా తోడల్లుడు గారి భార్య ,మా ఆవిడ పెద్దక్కగారు శ్రీమతి లక్ష్మీ గారిని-చూసి జ్ఞాపిక అందించి ,వాళ్ళబ్బాయి సూర్యం ఇచ్చిన డ్రింక్ తాగి బయల్దేరి మళ్ళీ క్లబ్ హౌస్ కు సాయంత్రం 4కు చేరాం .అప్పుడు ఏదో తిన్నాం అనిపించినట్లు భోజనం చేసి రూమ్ కు వెళ్లి విశ్రాంతి తీసుకొన్నాం .
సాయంత్రం మెహిందీ హడావిడి ,తర్వాత ఎదుర్కోలు ,ఆతర్వాత సంగీత విభావరి జరిపారు .కుర్రకారు ముసలి వారు అత్యుత్సాహంగా సంగీతం ,నృత్యాలలో పాల్గొన్నారు .ఊగారు తూగారు స్టెప్స్ వేశారు .కిక్ తెప్పించారు .రామకృష్ణ బంధువు ఒక కుర్రాడు అద్భుతంగా చేసి అందరి మెప్పు పొందాడు .హాల్ లోకే మాకు ‘మైసూర్ బొండా’’ సర్వ్ చేయించారు .బాగున్నాయి .మా బావగారరుశ్రీ వేలూరి వివేకానంద్ గారి పెద్ద బావగారు అంటే పెద్దక్కయ్య గారి భర్త శ్రీ మైలవరపు కృష్ణ శాస్త్రి గారి అమ్మాయిలు శ్రీమతి నళిని,సోదరీమణులు భర్తలతో సహా వచ్చి వారే పరిచయం చేసుకొని ,వాళ్ళు నా ఫాన్స్ అని చెప్పి సంతోషం కలిగించారు .ఫోటోలు తీసుకొన్నాం .ఒకే ఒక పుస్తకం ఉంటె నళిని గారికిచ్చి ,అడ్రస్ రాస్తే పుస్తకాలు పంపిస్తానని చెప్పి ఇవాళ రిజిస్టర్ పార్సిల్ లో ఉయ్యూరు నుంచి పంపాను .అక్కడే బయట ఒక వీల్ పై నిలబడి అది గుండ్రంగా తిరుగుతుంటే వీడియో తీయిన్చుకోన్నాం ఉచితంగా .రూమ్ కు వెళ్లి పడుకున్నాం . నాల్గవరోజు 21-8-22 ఆదివారం –ఉదయమే లేచి స్నాన సంధ్య పూజలు పూర్తీ చేసి ,కిందకు దిగే టప్పటికి మద్రాస్ నుంచి రాత్రి ఫ్లైట్ లో వచ్చిన మా పెద్ద మేనకోడలు అంటే మా పెద్దక్కయ్య లోపాముద్ర కుమార్తె ,కొడుకు బాలాజీ ,కోడలు అన్నపూర్ణ కనిపిస్తే పరమాశ్చర్యం వేసింది .అందరు శాస్త్రి కుటుంబం రామ కృష్ణ కుటుబం సరదాగా మాట్లాడుకొంటూ,మాఅమెరికా మనవడు పీయూష్ సరదాగా అడిగినట్లు ‘’టిపినీలు’’తాగి ,‘’కాఫీలు’’ తిన్నాం .సందడే సందడి ,ఊరంతా పండగే ,ప్రతి రోజు పండగే గా ఉంది .మాచి జోష్ ఫీలయ్యారంతా .ఆతర్వాత మా తమ్ముడుమోహన్ ,మరదలు సునీత వచ్చారు.శుక్రవారం కృష్ణాష్టమి సెలవు రోజున ఉదయం మల్లాపూర్ నుంచి మా పెద్దబ్బాయి శాస్త్రి ,కోడలు సమత వచ్చి రాత్రి దాకా ఉండి వెళ్ళారు . మా అన్నయ్యగారి మనవడు రవి భార్య గాయత్రి కొడుకు రేయా౦శ్ లు కూడా వచ్చారు .కళావాళ్లకు జ్ఞాపిక ఇచ్చాం .
ఉదయం 10గంటలకు చి రామకృష్ణ ,చి. సౌ .పద్మ ల షష్టి పూర్తి వేడుక వివాహం పురోహితుడు చక్కగా చేయించారు .మట్టెలు మంగళసూత్రధారణ ,బంతాట ,బిందెలో నీళ్ళలో వేసిన ఉంగరాలు తీయటం వగైరా పెళ్లి తంతు లన్నీ జరిపించారు .తెనాలి నుంచివచ్చిన మస్తానయ్య, కుమార్తె నాదస్వరం వాయిస్తే డోళ్ళువాద్యాలపై ఇద్దరు చక్కని సహకారం అందించి’ సునాద నాద వినోదం ‘’కలిగించారు .అందరూ మహా మెచ్చారు .చెవుల తుప్పు వదిలించారు .ఆ బృందాన్ని అభినందించి సరసభారతి తరఫున మస్తానయ్యగారికి నూతన వస్త్రాలు అందించి ,తండ్రీ కూతుళ్ళకు శాలువాకప్పి రెండు వేల రూపాయలు అందించాం మేమిద్దరంమా మేనల్లుడు శాస్త్రి కుటుంబం .
ఈ నాలుగు రోజులు రాత్రి 11గబ్తలదాకా ఫంక్షన్ లో ఉంటూ మళ్ళీ పొద్దున్నే ఆరు గంటలకు హాజరవుతూ అలసట లేకుండా ,అందర్నీ చక్కగా పలకరిస్తూ చిరునవ్వులు చిందిస్తూ అంతాతామే గా పని చేసి షష్టి పూర్తిని ఇష్టపూర్తి గా నిర్వహించిన రవి తేజ ,భార్య రమ్య ,రవళి ,భర్త వంశీ లకు అభినదన పూర్వకంగా ‘’వీర తాడుగా ‘’శాలువా కప్పి బుజాలు తట్టి మనస్పూర్తిగా అభినదనలు తెలిపాం మేమిద్దరం .ఆ నలుగురు శిరసులు వంచి కృతజ్ఞతలు తెలియ జేస్తుంటే తెలియని ఆనందం కలిగింది అందరికి .ఇదొక చిన్న అప్రీసి ఏషన్’’మాత్రమె .మేము చూసింది నాలుగు రోజులనుంచే అంతకు ఎన్ని రోజులముందు నుంచి వారు శ్రమిస్తున్నారో ఆలోచిస్తే అర్ధమౌతుంది .అంకితభావంతో చేసిన సమష్టి కృషి ఫలించింది .ఉదయం బాచుపల్లి నుంచి మా రెండో అబ్బాయి శర్మ కోడలు ఇందిర, మనవడు హర్ష ,మనవరాలు హర్షిత కూడా వచ్చి పాల్గొన్నారు .అందరికి హనుమజ్జయ౦తినాడు స్వామివార్లకు వెయ్యి రసాలమామిడి పళ్ళతో చేసిన పూజ ప్రసాదం గా అందరికి గుడిలో పంచగా మిగిలిన పళ్ళతో చేసిన మామిడి తాండ్ర ప్రసాదం అంద జేశాం . ఆతర్వాత భోజనాలు .అప్పుడు మేనల్లుడు శాస్త్రి కొడుకు కృష్ణ తో ‘’మీ నాన్న షష్టి పూర్తి ‘’కూడా మీరు చేయాలి .ఇన్ని రోజులు కాకపోయినా ఒక్కరోజు ఇంతటి ఆర్భాటం లేకుండా చేయండి ‘’అన్నాంమేమిద్దరం .వాడు ‘’మాకూ చేయాలనే ఉంది మార్గశిరమాసం లో .నాన్న ఒప్పుకోవటం లేదు ‘’అన్నాడు ఒప్పించి చేయండి అని సలహా ఇచ్చాం .ఉచిత సలహానేగా .తప్పని సరిగా అన్నాడు .
సాయంత్రం మినర్వా గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో రిసెప్షన్ .మళ్ళీ హడావిడి .ఒకతను ట్రంపెట్ చాలా శ్రావ్యంగా నేపధ్య సంగీతంగా మొదటి నుంచి చివరిదాకా వినిపిస్తూనే ఉన్నాడు .వేదిక పై పద్మ దంపతులకు అభినందన తెలియజేయటానికి మిత్రులు బంధువులు ,కుటుంబ సభ్యులు వచ్చారు .తెలుగు విద్యార్ధి సంపాదకులు స్వర్గీయ కొల్లూరి కోటేశ్వరరావు గారబ్బాయి రమణ ,కొడుకు కోడలూ ఉన్నారు . పత్రిక వస్తోందా అని అడిగితె ‘’మీకు పంపకుండా పత్రిక నడుపుతానా .కరోనా నుంచి పత్రిక నడపటం లేద’’న్నాడు రమణ నిజాయితీగా .
మేనల్లుడు శాస్త్రి పెద్దబావమరాది స్వర్గీయ సత్యనారాయణ భార్య కొడుకు కూతురు వచ్చారు.శుక్రవారం ఉదయం చిన్న బావమరది కామేష్అమెరికా నుంచి కూడా వచ్చి వెళ్ళాడు .మా తమ్ముడికొడుకు రాజు ,కోడలు రాజ్యలక్ష్మి వచ్చారు .మా మేనల్లుడు అశోక్ దంపతులు ,కూతురు భార్గవి అల్లుడు మురారి ,వచ్చారు మనవలు వచ్చారు .మురారి విశ్వనాధ సత్యనారాయణ గారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారి మనవడు అంటే కొడుకు శ్రీనివాస్ కుమారుడు .శ్రీనివాస్ ఉయ్యూరు హైస్కూల్ లోనూ ఇంటి దగ్గర ట్యూషన్ లోనూ శిష్యుడు .బిహెచ్ ఎల్ నుంచి మా కోడలు రాణి అన్నయ్య, కొడుకు వచ్చారు .మళ్ళీ ఇక్కడా సందడే సందడి .పెంద్రాళేభోజనం చేసి కళా వాళ్ళు మద్రాస్ వెళ్ళిపోయారు .మేమూ భోజనాలు చేసి ,బయటకు వస్తుంటే మా శ్రీమతి చిన్ననాటి స్నేహితురాలు వసంత కుటుంబం కనిపించారు .మమ్మల్ని స్టేజి పైకి పిలిచి అందారితో కలిసి ఫోటోలు తీయించాడు రామకృష్ణ .వెళ్లి పోతుంటే ‘’బాబాయి గారూ !రేపు పొద్దున్న ఏడున్నరకు మాఇంట్లో టిఫిన్ చేసి వెళ్ళాలి మీరు ‘’అన్నాడు సరే అన్నాం .రూమ్ కు వచ్చి పడుకున్నాం .
22-8-22-సోమవారం స్నానసంధ్యాదులు పూజ అయ్యాక పద్మా వాళ్ళింటికి వెళ్లాం .రమణ కూడా వచ్చాడు .అందరికి పొంగల్ ఇడ్లీ గారే సాంబారు అల్లం చట్నీ కారప్పొడి వగగైరాలతో టిఫిన్ పెట్టారుకాఫీ ఇచ్చారు పద్మ దంపతులు .లడ్డూలు ఇచ్చారు . .అన్నీ పూర్తీ చేసి ఉదయం 10గంటలకు కారులో బయల్దేరాం .మల్లాపూర్ మా శాస్త్రి ఇంటికి వెళ్లి మనవడు భువన్ కు ఉయ్యూరు నుంచి తెచ్చిన కొబ్బరికాయలు రామకృష్ణ ఇచ్చిన స్వీట్లు అందించి అక్కడి నుంచి ఉప్పల్ దగ్గర ఆర్ టీసి కాలనీ లో ఉన్న మా బావ వివేకానంద్ గారి చెల్లెలు 86ఏళ్ళ శ్రీమతి శాంతమ్మగారిని చూశాం .ఆమెవరలక్ష్మీ వ్రతం నాడు కుర్చీలోంచి కిందపడితే తుంటిఎముక విరిగితే ఆపరేషన్ చేసి రాడ్ వేశారు .మా కుటుంబం అంటే ఆమెకూ ఆమె భర్త గాడేపల్లి శ్రీమన్నారాయణ గారికి మహా అపేక్ష .రవళి పెళ్ళికి మేమంతా రోజూ ఒకే చోట కూర్చుని భోజనాలు చేశాం. ఆయన నాలుగేళ్ళక్రితం చనిపోయారు .రామకృష్ణ రెండు అంతస్తుల డాబా కట్టుకొన్నాడు .మామిడి చెట్టు ఉసిరి చెట్టు తమలపాకు చెట్టు పెంచాడు. ముందు శ్రీ సంజీవరాయ ఆంజనేయస్వామి దేవాలయం ఉంది .ప్రశాంత వాతావరణం .మా అందరికి రామకృష్ణ వల్లి దంపతులు నూతనవస్త్రాలు అందించి గౌరవించారు రెండావ కొడుకు మహేష్ కూడా చాలా ఆప్యాయత చూపించాడు .రామకృష్ణ ను జూన్ 27న ఉయ్యూరులో జరిగిన సరసభారతి సాహితీ పుష్కరోత్సవం నాడు ఉయ్యూరుకు ఆహ్వానించిపురస్కారం అందించి నూతనవస్త్రాలు సమర్పించి శాలువాకప్పి జ్ఞాపికా నగదుతో సత్కరించాం .భార్యకు మా ఇంటి వద్దనే చీర సారే పెట్టాం .చాలాకలుపు గోలుగా ఉన్నారు వాళ్ళిద్దరూ ఉయ్యూరులో .
అక్కడినుంచి మళ్ళీ రోడ్డునపడి ,మధ్యాహ్నం 3కు సూర్యాపేట దగ్గర కాకినాడ వారి సుబ్బయ్యగారి హోటల్ లో భోజనంఒక్కొక్కరికి 279రూపాయలతో చేసి రాత్రి 7-30కు ఉయ్యూరు చేరాం .ఈ అయిదు రోజుల పర్యటనలో మా మనవడు చరణ్ మనవరాలు రమ్య మా రెండు ఇళ్ళను ,వాటర్ ప్లాంట్ ను చూసుకొంటూ వాడు జాబ్ ట్రెయినింగ్ అవుతూ కాన్ఫరెన్స్ కు అటెండ్ అవుతూ ,పిల్ల బెజవాడ కాలేజికి వెళ్లి వస్తూ ఎంతో ధైర్యంగా ఉన్నారు .హైదరాబాద్ నుంచి ప్రతిపూటా ఫోన్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాం .వీళ్ళిద్దరూ అభినందనేయులే .
పదనిసలు –
1-సాధారణంగా షష్టి పూర్తికి చేసే కలశ స్థాపన ,పూజ ఉద్వాసన తర్వాత దంపతులు ,దంపతి పూజ చేసి సత్కరించి ఆశీస్సులు పొంది భర్తకు కలశం కొబ్బరికాయ ,భార్యకు జాకెట్ ముక్క ఇవ్వటం సంప్రదాయం .కానీ పద్మా వాళ్లకు ఆవిషయం తెలుసో లేదో తెలీదు .చేయించే బ్రహ్మగారు చెప్పారో లేదో తెలీదు .అవగానే పురోహితుడు అన్నీ మూటలు కట్టి తీసుకు వెళ్ళటం చూశాం .కాంట్రాక్ట్ వ్యవహారం లో భాగమేమో .
2-క్లబ్ హౌస్ లో వేడినీరు సరఫరా లేదు .ముసలి ముఠాకు ఇబ్బంది .మాకు రూమ్ లో కరెంట్ తో వేడినీళ్ళు కాచుకొనే ఫ్లాస్క్ ఉంది .కనుక ఇబ్బంది లేదు దానితో కాచుకొని మా శ్రీమతి స్నానించింది .నేను చన్నీళ్ళే చేశాను .
3-ఎసి కూడా సరిగా పని చేయలేదు .మాకు ఇబ్బంది లేదుకాని పద్మ అక్కయ్య బావగారు మా పక్క రూమ్ లో ఉన్నారు బాగా ఇబ్బంది పడ్డారు .ఆవిడ చాలా కలుపుగోలు మనిషి. వాళ్ళల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆవిడే .
3-రూమ్ క్లీనింగ్ లేదు .పక్కబట్టలు మార్చటం లేదు .ఇవి క్లబ్ మేయిన్ టేనెన్స్ వారి బాధ్యతలు .
4-వై.ఫై. రోజులివి .కింద తప్ప పై రూమ్స్ కు కనెక్షన్ రాలేదు .
సరిగమలు
కార్యాలలో ఇవన్నీ మామూలే .వీటిని మించి మనం ఆలోచించాలి .మేము అయిదు రోజుల షష్టి పూర్తీ అతి ఆనందంగా అనుభవించాం .ఒకరకంగా పరవశించాం .ఆప్యాయత ఆదరణ గౌరవం మన్నన మర్యాదా చూపిన పద్మ రామ కృష్ణ కుటుంబానికి మనస్పూర్తిగా అభినందనలు .రామ కృష్ణ అన్నగారబ్బాయి ఒకాయన మా దగ్గరకు వచ్చి ‘మీరు రావటం వలన కార్యక్రమానికి నిండు దనం వచ్చింది. ధన్యవాదాలు ‘’అని చాలా సార్లు అన్నారు .పద్మ దంపతులు పదే పదే అలానే అన్నారు .వారందరికీ వినాయక చవితి ,నవరాత్రి, దీపావళి శుభా కాంక్షలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-22-ఉయ్యూరు

.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.