మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -2
3- పోలీసు లాఠీ చార్జి లో గాంధీ దర్శనం పొందిన మరో వినోబా డా .కొరళ్ళ రాజారావు
కాకినాడలో వైశ్య కుటుంబానికి చెందిన డా .కొరళ్ళ రాజారావు,మెట్రిక్ పాసై ,గురువులవద్ద సంప్రదాయ బద్ధంగా ఆయుర్వేద విద్య నేర్చారు .బాల్యం నుంచి దేశ సేవ పై అభిలాష ఎక్కువ .1921-22లో కాంగ్రెస్ లో చేరి సేవ చేశారు .1930 ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్న 200 మందిలో మొదటివారు శ్రీ బులుసు సాంబమూర్తి గారు కాగ ,రెండవ వారు డా .కొరళ్ళ రాజారావు గారు .గాంధీజీకి వినోబా ఎలాగో బులుసువారికి కొరళ్ళ అలాటి శిష్యుడు ..
సత్యాగ్రహం తర్వాత కొందరు వాలంటీర్లతో కలిసి రామ చంద్రాపురానికి ప్రచారం కోసం వెళ్లి అక్కడి ఒక ఇంట్లో లో రాత్రి పడుకొని ఉండగా ,విషయం పసిగట్టిన ముస్తఫా అర్ధరాత్రి ,పోలీసులతో ప్రవేశించి తుపాకి మడమతో రాజారావు గార్ని పొడిచి నిద్ర లేపి నిర్దాక్షిణ్యంగా లాఠీ చార్జి చేశాడు .రాజారావు గారు ఏమాత్రం భయపడక చలించక అలాగే నిలబడ్డారు .ఆయన్ను కొట్టటానికి నలుగురు రిజర్వ్ పోలీసులను నియమించి వాళ్ళతో రక్తం ధారగా కారెట్లు చితక బాదించాడు .అయినా నిబ్బరంగా తక్కుకున్నాడు ఆ వైశ్య ధీర ధైర్య దేశ భక్తుడు .ముస్తాఫాను కొట్టాలంటే రాజారావు గారి కి చాలా తేలికే .అంతటి బలిష్టులాయన .కానీ గాంధీజీ చెప్పిన దౌర్జన్య రాహిత్య తత్వానికి అంకిత భావం తో లోబడి ,ముస్తఫా పై చేయి చేసుకోలేదు .మిగిలిన సత్యాగ్రహులను అందర్నీ ఒక వాయింపు వాయించి మళ్ళీ ముస్తఫా ఈయన దగ్గరకు వచ్చాడు .మళ్ళీ రెండో సారి లాఠీ చార్జి చేశాడు పరమ కిరాతకం గా .అప్పుడు ‘’తనకు గాంధీ మహాత్ముని దివ్య దర్శనం’’ కలిగిందని దేశభక్త డా .కొరళ్ళ రాజారావు గారు చెప్పారట .అప్పటికీ డాక్టరు గారు చలించక పోవటం తో ముస్తఫా మిలిటరీ బూటుతో రాజారావు గారి ఆయువు పట్టుపై అత్యంత బలంగా తన్నాడు .డాక్టర్ గారికి స్పృహ తప్పికింద పడిపోయారు .గిలగిల తన్నుకొన్నారు .అయినా వదలక ఆ నరరూప రాక్షసుడు మళ్ళీ తన్నగా నెత్తురు కక్కుకొన్నారు .రాక్షసానందం తో నవ్వుకొంటూ బలగంతో వెళ్ళిపోయాడు ముస్తఫా . గ్రామస్తులెవ్వరూఅక్కడికి వచ్చి ఆయన ముఖమైనా చూడలేదు. రాజారావు గారిని లెవ తీయనూ లేదు.మంచినీళ్లివ్వ లేదు భోజనం పెట్టలేదు .అందరూ ముస్తాఫాకు భయపడి ఏరకమైనా సానుభూతి కాని సహాయంకాని ప్రజల ప్రాణాలు కాపాడే అ డాక్టర్ గారికి చూప లేకపోయారు .ఆ రోజు రాత్రి ఎలాగో కాకినాడ చేరారు .అప్పటినుంచి ఆరోగ్యం దెబ్బతిని క్షయవ్యాధి వచ్చింది .కానీ తాను సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు అవటంతో తగిన మందులు తానె చక్కగా వాడుకొని ఆరోగ్యం పొందగలిగారు .1941లో మళ్ళీ వ్యక్తి సత్యాగ్రహం లో పాల్గొన్నారు రెట్టింపు ఉత్సాహం తో .పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయలేదు .కొద్ది శిక్ష వేసి వదిలేశారు .
4-అభినవ ప్రహ్లాద శ్రీ కాశీ భట్ట జగన్నాథం
తూగోజి అమలాపురం తాలూకా కడలి గ్రామ కాపురస్తులు శ్రీ కాశీ భట్ట జగన్నాథం గారు .వైదీక శోత్రియ బ్రాహ్మణులు.సదాచార సంపన్నులు .మొదట్నించి గాంధీజీ ఉద్యమం లో పని చేశారు .ప్రతిగ్రామాన్ని కాలినడకతో తిరిగి గాంధీ సూత్రాలు ప్రచారం చేసిన మహాను భావులు .నిరంతరం రాట్నం పై నూలు వడికే కర్మిష్టి .గాంధీ మహాత్ముడికంటే ఎక్కువ నూలు వడికిన వారుగా జగన్నాథంగారు అని చెప్పుకొంటారు . .కాంగ్రెస్ సేవ తప్ప వేరే జీవితం లేనివారు .పరాదీనతలో బ్రతకరాదనే సిద్ధాంతాన్ని అమలు చేశారు .గ్రామాలలో వారానికి ఒకసారి జరిగే సంతలకు వెళ్లి అక్కడ ప్రజల్ని సమీకరించి మహాత్ముని సందేశాలు వినిపించేవారు. .
1932లో అలాగే ఒక ఊరు వెళ్లి ,అక్కడ త్రివర్ణ పతాకం ఎగరేసి ,అక్కడికి అందర్నీ పిలిచి ,గాంధీగారి ఖద్దరు ఉద్యమం గురించి బోధ చేశారు .ఇంతలో ముస్తఫా వచ్చి ఆ జండాను ముక్కలు ముక్కలుగా చి౦పేసి జగన్నాథం గారిని లాఠీ చార్జి చేయించాడు .ఆయన్ను వస్త్ర విహీనుడిని చేసి ,విదేశీ వస్త్రాన్ని ఆయనపైకి విసిరేసి దాన్ని కట్టుకోమని ఆజ్ఞా పించాడు .ససేమిరా కట్టుకోనన్నారు .కోపం నషాళానికి అంటిన ముస్తఫా ఆయన నుంచి ఊడదీసిన ఖద్దరు వస్త్రాలను ఆయన ఎదుటే తగలబెట్టించాడు .మళ్ళీ లాఠీ చార్జి చేయించాడు .తగిలే ప్రతి దెబ్బకు ‘గాంధీ గాంధీ గాంధీ ‘’అంటూ ఆక్రోశించటం తప్ప జగన్నాధం గారు ఏమీ చేయలేక పోయారు పాపం .కిందపడిన ఆయన్నుమట్టిలో పొర్లించాడు . బూటుకాలుతో కసితీరేదాకా తన్నాడు ఆ కంస రూప రాక్షస పోలీసు ఆఫీసర్ముస్తాఫా .ఆయన గాంధీనామం తప్ప వేరేదీ స్మరించలేదు .ఆయనకున్న జంధ్యం చూసి బ్రాహ్మణుడు అని గుర్తించి కల్లు కుండ తెప్పించి ,నోట్లో కల్లుపోయించే ప్రయత్నం చేయించాడు .ఆయన నోరు తెరవలేదు .ఆ నరాధముడు బాయినెట్ తో నోరు పెకలించి ,కల్లు పోశాడు నోట్లో .వెంటనే జగన్నాధంగారు ప్రక్కకు తిరిగి ఉమ్మేశారు .వాడు ఆయన గుండేపైకి ఎక్కి కూర్చుని ,బాయి నెట్ తో నోరు తెరిచి మళ్ళీ కల్లు నోట్లో పోశాడు .ఆయన మింగక పోవటంతో ఆకు౦డలోని కల్లు అంతా ఆయనపై కుమ్మరించి అక్కసుతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు .
జగన్నాథం గారు నెమ్మదిగా లేచి కూర్చుని నోటిలోఒక్క కల్లు చుక్క కూడా లేకుండా ఉమ్మేసి ,అక్కడి వారు ఇచ్చిన ఖద్దరు తువ్వాలు కట్టుకొని, ఇంటికి వెళ్ళారు ఆ ‘’అభినవ ప్రహ్లాదుడు ‘’జగన్నాధం గారు .కాంగ్రెస్ వారికి ఎన్నికలు వచ్చినప్పుడే ఆయన గుర్తుకు వస్తారు .నిశ్చల దేశభక్తులు అచంచల సత్యాగ్రహి .గాంధీజీ ని మాత్రమె నమ్ముకొన్నఆధునిక భక్త ప్రహ్లాదుడు ఆయన..డబ్బు కు ,పదవులకు ,పలుకు బడికి ప్రాకులాడని విశుద్ధ దేశ భక్తులు శ్రీ కాశీ భట్ట జగన్నాధం గారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-8-22-ఉయ్యూరు