మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -3
5-శ్రీ రాపాక తిరుపతి రాజు
1904లో రాజోలు తాలూకా పోతవరం లో బ్రాహ్మణ కుటుంబం లో జన్మించిన శ్రీ రాపాక తిరుపతి రాజుగారు 1921నుంచి కాంగ్రెస్ సేవలో ఉన్నారు .ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లి 1921 రాజమండ్రి జైలునుంచి విడుదలయ్యారు .1929లో అఖిలభారత చరఖా సంఘం లో ఉద్యోగం లో చేరారు .1930 ఉప్పు సత్యాగ్రహం లో అయిదారు సార్లు పాల్గొని ,లాఠీచార్జి కి గురయ్యారు .మంచి ఆరోగ్యవంతులు కనుక తట్టుకోగలిగారు .ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ,గాంధీ గారి పిలుపు అందుకొని అనేక సత్యాగ్రహాలలో అకు౦ఠీత దీక్ష తో పాల్గొన్నారు .
డాక్టర్ కొరళ్ళ రాజారావు గారితో కలిసి స్వదేశీ ఉద్యమం ప్రచారం చేస్తూ రామచంద్రాపురం వెళ్ళారు .ఆ రాత్రి ఆయనతోపాటే ఒక సత్రంలో బసచేసి నిద్రించారు .అర్ధ రాత్రి వేళ పోలీస్ ఆఫీసర్ ముస్తఫా పోలీసు బృందంతో వచ్చి ,ముందుగా రాజారావు గారిపై దమనకాండ సాగించి, తర్వాత రాజుగారిపై లాఠీలతో విరుచుకు పడ్డాడు .విపరీతమైన ఆదె బ్బలకు తిరుపతి రాజు గారు నేలపై పడి పోయారు .కనికరం లేని ముస్తఫా తుపాకి బాయి నెట్ తో అయన మోకాలిపై తీవ్రంగా పొడిచాడు .రాజుగారి శరీరంనుంచి రక్తం కాలువ కట్టింది .ఇద్దరు పోలీసులు ఆయన్నులేపి నిలబెట్టారు .కోపం ,ఉద్రేకం తగ్గని ముస్తఫా ఆయన కుడిజబ్బ పై లాఠీతో బలం గా కొట్టాడు .వాడికున్న అక్కసు అంతాచూపించాడు ఆదెబ్బలో రాజుగారి జబ్బ ఎముక విరిగి పోయింది .ఇంకా కసి తీరక, అరెస్ట్ చేసి రాజుగారిని జైలుకు పంపాడు .ఆరునెలలు బళ్ళారి జైలులో శిక్ష అనుభవించారు .తిరిగి వచ్చి మళ్ళీ దేశసేవ లోనే మునిగిపోయారు శ్రీ రాపాక తిరుపతి రాజు.
6-శ్రీ పోడూరి పేర్రాజు
తారణ నామ సంవత్సరం లో షష్టి పూర్తి చేసుకొన్న శ్రీ పోడూరి పేర్రాజు బ్రాహ్మణులు .కృష్ణా జిల్లా బందరు తాలూకా చిన గొల్లపాలెం లో జన్మించారు .1906వరకు రాజమండ్రి ట్రెయినింగ్ కాలేజి లో చదివి ,వందేమాతరం ఉద్యమం లో చదువు మానేసి ,స్వగ్రామం పోడూరు చేరారు .
1907లో బొంబాయి వెళ్లి శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారి అమృతాంజన్ కంపని లో ఉద్యోగం లో చేరారు .1908 లో రంగం అంటే రంగూన్ వెళ్లి,ఒక ఏడాదిగడిపి తిరిగి స్వగ్రామం చేరారు ,కొన్ని రోజులతర్వాత మళ్ళీ రంగూన్ వెళ్లి ,అక్కడ డబ్బు సంపాదించి అక్కడి రాజకీయాలలో పాల్గొనేవారు .
మళ్ళీ స్వగ్రామంచేరి ,పెళ్లి చేసుకొని రాజమండ్రిలో కాపురం పెట్టివ్యాపారం చేశారు .యుద్ధ సమయం లో విపరీతంగా డబ్బు సంపాదించారు .హోం రూల్ లీగ్ లో చేరి ,1919లో వ్యాపారం మానేసి ,గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమం లో పూర్తిగా పని చేశారు .నాలుగైదు సార్లు జైలుకు వెళ్ళారు .1930లో రాజమండ్రి నుంచి రాయ వెల్లూరుకు మార్చబడిన ఖైదీలలో శ్రీ వెలిదేండ్ల హనుమంతరావు గారి తో పాటువీరూ ఉన్నారు .
పొట్టిగా ఉండే పేర్రాజుగారికి పొడవైన దట్టమైన గుబురు మీసాలు ఉండేవి .రాజమండ్రిలో లాఠీఛార్జి చేసే సార్జంట్ రాజుగారి మీసాలు పట్టుకొని ,’’యు ఆర్ ఎ లిల్లీ పుట్.ఐయాం ఎ లిల్లీపుట్ ‘’అంటూ మీసాలు అటూ ఇటూ లాగి నరకాన్ని చూపించాడు .లాఠీతో వెన్నుమీద ,పిర్రలమీద చావు దెబ్బలు కొట్టాడు .రెండు కాళ్ళూ పట్టుకొని లారీలోకి గిరాటేశాడు .చావుతప్పి కన్ను లొట్ట పోయినట్లు ఆ లారీలో రాయ వెల్లూరు చేరారు .విడుదలైనతర్వాత రాజమండ్రి వచ్చి, మళ్ళీ దేశ సేవకు అంకితమయ్యారు శ్రీ పోడూరి పేర్రాజు.
సశేషం
రేపు వినాయక చవితి శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-22-ఉయ్యూరు