మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -4(చివరిభాగం )
7-శ్రీ మర్ల అప్పయ్య శాస్త్రి
ఒక రోజు రాత్రి 7-30కి నాలుగు లారీలతో యాభై మంది పోలీసులు శ్రీ మర్ల అప్పయ్య శాస్త్రి గారింటిపై దాడి చేశారు .అప్పుడాయన భోజనం భోజనం చేస్తున్నారు .అయ్యే దాకా ఆగకుండా ఆయనపై విచక్షణా రహితం గా లాఠీలతో పోలీసులు విపరీతంగా కొట్టారు .ఆయన స్పృహతప్పి కూలి పోయారు .తలమీద, ఒంటి నిండా గాయాలై రక్తం ప్రవహించింది .ఆయన కుటుంబ సభ్యులను దొడ్లోకి గెంటేసి ,ఇంట్లో ఉన్న 1500రూపాయలు దోచుకు పోయారు .బీరువాలలో ఉన్న ఔషధాల సీసాలు బద్దలుకొట్టి వీధిలో పారేశారు .
అప్పయ్య శాస్త్రి గారిని అరెస్ట్ చేసి ,రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో పెట్టి ,చాలా రకాలుగా హింసించారు .కనీసం మంచి నీళ్ళు తాగటానికి కూడా వీల్లేకుండా ,ఆయన నోటిలో గుడ్డలు కుక్కారు .కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి కొట్లో పడేశారు .ఇలా మూడు రోజులు ఆయన్ను బాధించారు .ఈయన సోదరులను బంధువులపై కూడా లాఠీ చార్జి చేశారు .
8-శ్రీ సామవేదం అచ్యుత రామయ్య
రాజమండ్రి వాస్తవ్యులైన బ్రాహ్మణులు శ్రీ సామవేదం అచ్యుత రామయ్య
గారు .1932లో కర్కోటకుడు ముస్తఫా ఈయనపై చేసిన లాఠీ చార్జి వలన ఆయన చెయ్యి విరిగి పోయింది .
9-శ్రీ వల్లూరి సూర్యనారాయణ రావు
కొవ్వూరులో ప్లీడరయిన శ్రీ వల్లూరి సూర్యనారాయణ రావుగారు సద్గుణ సంపన్నులు .1932లో వీరు రాజమండ్రిలో నెత్తిపై గాంధీ టోపీ పెట్టుకొని వెడుతుంటే ,నర రూప రాక్షస పోలీస్ ఆఫీసర్ ముస్తఫా ఎదురై , టోపీలాగి పీకిపారేశాడు .దీనిపై సూర్యనారాయణ రావు గారు కోర్టుకు వెళ్లి ,మూడు కోర్టులు తిప్పించి ముస్తాఫాను మూడు చెరువుల నీళ్ళు తాగింఛి ,మొగాడు అనిపించారు .
వినాయక చవితి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-22-ఉయ్యూరు