శ్రీ రాఘవ వేంకటేశ్వర బృహత్ శతకం
శ్రీ మత్తిరుమల రాఘవాచార్య కవి ‘’పెద్దాపురీ వాస ,వేంకటేశ్వర ‘’మకుటం తో 165 సీస పద్యాలతో శ్రీ రాఘవ వేంకటేశ్వర బృహత్ శతకం రచించారు .శ్రీ ఘంటసాల పూర్ణయ్యగారు పిఠాపురం లోని శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో 1941 న ప్రచురించారు .వేల ఆరు అణాలు .
కవి గారు సీస పద్యాలలో తన తండ్రి శ్రీ తిరుమల దేశికా చార్య అనీ ,తల్లిగారు రంగాంబ అనీ ,చూడామణి తన భార్య అనీ ,కొడుకు పేరు శ్రీనివాసుడు అని చెప్పారు .తమ్ముడు సీతారామమూర్తి ,అక్కగారు నరసమాంబ .తనపేరు రాఘవాచార్య .షట్ శాస్త్ర ప్రవీణుడు చేవలి సుబ్రహ్మణ్యం గారునూనూగు మీసాల నాడే వైద్యంతో పాటు సంస్కృతం నూరి పోశారు .తమ కుటుంబానికి ఉమా మహేశ్వరం అనే అగ్రహారం ఉంది .పద్నాలుగు ఏళ్ళకే తనను కవితా కన్య పాణి గ్రహణం చేసింది .18వ ఏట భీష్మ సంభవం ,19వ ఏట పార్వతీ వల్లభ శతకం రాసి ,,ఇప్పుడు ఈ ఇరవై రెండవ ఏట ఈ రాఘవ వేంకాటేశ్వర శతకం సంతరిస్తున్నానని చెప్పుకొన్నారు ,కూచిమంచి తిమ్మన సంస్కృతంలో కుక్కుటేశ్వర శతకం ,ధూర్జటి కాళహస్తీశ్వర శతకం ,భాస్కరుడు భాస్కర శతకం రాసి వన్నె కెక్కినట్లు తానూ ‘’అనవద్యహృద్య పద్య రత్నమాలికల గూర్చంగ నూతన గతులలో ‘ఈ శతకం రాస్తున్నాని స్వామికి నివేది౦చు కొన్నారు .
గ్రుడ్డులోపల పిల్ల ఎవరి కారుణ్య౦ చక్కగా ఎదుగుతుందో ,ఆకాశం లోఎంతో ఎత్తున ఎగిరే పక్షి మళ్ళీ ఎలా భూమిని ఎవరి కరుణతో చేరుతుందో,కర్మ బంధాలు ఎవని పాద ధ్యానం వలన విచ్చిన్నమవుతాయో అలాంటి ‘’దేవాది దేవా దివ్య ప్రభావ ,ఆది మధ్యా౦తశూన్య లోకైక మాన్య ‘’అయిన వేంకటేశుని నమ్మాను అన్నారు .,లోకంలోని అన్ని విషయాలపై తన ఆవేదన వ్యక్తం చేశారు .ధర్మ దేవత నాలుగు పదాలు విరిగాయని బాధ పడ్డారుకవి .అక్క చేల్లెల్లమధ్య అన్నదమ్ముల మధ్య సఖ్యత కరువైంది .వైష్ణవంలో పుట్టి ,వగలు పోయిన నారి వేశ్యగా మాలజాతిలోపుట్టి ,అగ్రజన్మలో పేద బ్రాహ్మణుడి సొమ్ము హరించిన విప్రునిభార్య కడజాతి కాంతగా,అన్త్యకులం లోపుట్టి సార్వ భౌమి గా ప్రసిద్ధి చెందుతారేమో అని పురాణకధలు వివరించారు .ఆత్మను తెలుసుకున్నవారికి అందరూ పూజనీయులే .
విటులను తార్చే వేశ్యకు ,ఒక్క నిమిషం హరిని ధ్యానిస్తే ముక్తికలుగుతుంది .మేకల్నికోస్తూ హరినామ స్మరణ చేస్తే కైవల్యం వస్తుంది కటిక వాడికి.సంసార బంధం లో చిక్కుకున్నా చిత్తం శివునిపై లగ్నం చేస్తే జన్మ సాఫల్యం కలుగుతుంది .గోవింద స్మరణ చేసిన వారందరూ ఇహ పరసౌఖ్యాలు పొందుతారు –‘’కలదు భగవంతు డను నమ్మకంబే చాలు –ప్రజలకెల్లను భ్రుత్యుడై పరగు శౌరి’’అని గ్యారంటీ ఇచ్చారు .చక్రవర్తికి పుత్ర ప్రేమ ఎంతో ,మాలవాని పుత్ర మమత అంతే.పట్టపురాణిపై పతికి ఎంత ప్రేమో ,,నిరుపేదకు ఆలి పై ప్రేమ అంతే.సుఖభోగాలు అందరికీ సమానం .పండితుడు ఎలాంటి ఖ్యాతికోరుతాడో ,నోరులేనివాడూ అంతె.అంటూ అన్నమయ్యలాగా చక్కని వేదాంతం చెప్పారుకవి .
ఎండిన చెట్టు చిగిర్చటం ,పెద్దగా పెరిగిన వృక్షం నేలకూలటం ,పనికి రానివాడే అన్నీ సాధించటం ,మహాబలశాలి కూడా ఒక్కోసారి ఓడిపోవటం ,పండిన చేను ఒరిగిపోవటం ,మహా విద్వా౦సుడుకూడా ఒక్కోసారి కటిక నెల మీద పడుకోవాల్సి రావటం ,రారాజుకూడా చెయ్యి చాచి బిచ్చం అడుక్కోవాల్సి రావచ్చు .మహా దరిద్రుడు రాజుకావచ్చు .ఏది ఎలా జరుగుతు౦దోఎవరికే తెలీదు –‘’కాక మానదు కానున్న కర్మ ఫలము –సర్వము నీ కృతమే కదా శ్రీనివాసా ‘’అన్నారు .గయ్యాళి భార్యకు భయపడే వారు కులమతాచారాలను వదిలేసిన వారు ,అష్టకష్టాలు పడి పెంచిన తలిదండ్రుల చావు కోరేవారు ,పరము అనేదిలేదని విర్రవీగేవారు ,కుటిలమతులు ఈరోజుల్లో గడ్డాలుపెంచి సన్యాసులై,అమాయకుల్ని మోసగిస్తున్నారు .కాకిగూటిలో కొంతకాలం ఉంటె కాకి కోకిల అవుతుందా .పాము పడగ విప్పకుండా పడుకొన్నమాత్రాన వానపాము శేషభోగి అవుతుందా ?మట్టి కొట్టుకు పోయిన బొగ్గు మాణిక్యం అవుతుందా ?అని ప్రశ్నించారు .’’మానినీ మణికి మారు మనువులేదు –సతుల విడనాడు పతులకు గతులు లేవు ‘’అని ధర్మ సూక్షం చెప్పారు .
గార్ధభం అశ్వం ,కాకికోయిల ,ఉల్లి మల్లి ,సింహం నక్క ,ఆవుబర్రే ,నెమలి ఎరికోడి ,బంగారం ,కాకిబంగారం ఒక్కటికావు. దేని స్థాయి దానిదే .నువ్వు ఆకాశం అనటానికి సాక్షి దూర దృష్టికల అనంతుడివిఅవటం ,జలరూపదారి అనటానికి సాక్ష్యం గంగ నీ పాదోద్భవ .పృధ్వీస్వరూపం అనటానికి సాక్షి నీ భార్య భూదేవి కావటం .వాయు స్వరూపానికి సాక్ష్యం భూత పాలన .అగ్ని స్వరూపం అనటానికి సాక్ష్యం నీ విగ్రహం ‘’హాటక చ్ఛవి’’వెలుగు ఉండటం –‘’పంచ భూతములీవ ప్రపంచమీవ .’’అని స్వామిని పంచభూతాత్మకునిగా చక్కగా వర్ణించారు కవి .
మొదటిపద్యం –‘శ్రీ మీర తిరుపతి క్షేత్రమందు వసి౦చి –మూడులోకమూల నేలు మొదటి వేల్ప –
అజ రుద్రులను గూడ గజగజ లాడించు –దేదీప్యమాన మూర్తి ప్రభావ
పాహిమా యని వేడు ప్రజల బ్రోవగ ధాత్రి –నవతరించిన స్వయం వ్యక్తరూప
నీకు సోదరమూర్తి నీవయైద్వారకా- తిరుపతిబాలించు పరమ పురుష
తండ్రులకు దండ్రివైకుంఠ ధామ నిన్ను –బొగడ బూనితి నా పూర్వ పూజ వలన
నిహపరములిచ్చి మముగావు మి౦దిరేశ-విదిత పెద్దాపురీ వాస వేంక టేశ – తో ప్రారంభించి 165వ చివరిపద్యం –
‘’కా౦చ నోజ్వల చేల కారుణ్య మయ శీల –యఖిల కళ్యాణ గుణాల వాల
రక్షితామర గణాధ్యక్ష కౌస్తుభ వక్ష –కమలాయతాక్ష రాక్షస విపక్ష
పరమ భక్తిజ్ఞాన ,పటు నిశ్చలధ్యాన –ఘనజన ప్రత్యక్ష కల్ప వృక్ష
సకలలోకస్వామి జ౦గమమస్థావరాం –తర్యామి గరుడ పత౦గ గామి
చిన్మయానంద లక్ష్మీ విహార –పరమ గుణ సద్మ-భవదీయ పాద పద్మ
సేవకు౦డను ననుగావు దేవ దేవ –విదిత పెద్దాపురీ వాస వేంక టేశ’’అని శతకం ముగించారు శ్రీమత్తిరుమల రాఘవాచార్య కవి .
ఈశతకం లో భక్తి వెల్లువగా ప్రవహించింది .లోకోక్తి తేజస్సుతో ప్రకాశించింది .నడక కావేరీ ప్రవాహం .శైలి అద్భుతం .అత్యంత రమణీయం .ఈ శతకమూ లోకం దృష్టిలో పడ లేదని పించింది .వైష్ణవం లో ప్రచారం లో ఉందేమో ?మంచిశతకాన్ని కర్త అయిన విద్వత్ కవిని పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-22-ఉయ్యూరు