‘’మహా భారత తత్వ కథనం’’ రచయిత మహోపాధ్యాయ ,మహాభారత మర్మజ్ఞ -శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు. మహాభారత తత్త్వ కథనము రచించారు ..
జీవిత విశేషాలు
1894వ సంవత్సరం విజయ, మార్గశిర శుద్ధ షష్ఠి నాడు, తూర్పు గోదావరి జిల్లా, కాజులూరు గ్రామంలో తన మాతామహుని ఇంట జన్మించారు[1]. వారణాసి భావనారాయణ, కామేశ్వరమ్మ తల్లిదండ్రులు. స్వస్థలం పిఠాపురం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు జన్మించడం వల్ల ఇ సుబ్రహ్మణ్యశాస్త్రి అని పేరు పెట్టారు. తన మాతామహుడైన రేగిళ్ల కామశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలను అభ్యసించారు. పిదప పిఠాపురంలో పేరి పేరయ్యశాస్త్రి వద్ద సిద్ధాంతకౌముది చదువుకున్నారు. అనంతరం వేదుల సూర్యనారాయణశాస్త్రి వద్ద వ్యాకరణం మహాభాష్యాంతం మంజూషతో సహా చదువుకున్నారు. అక్కడ కుప్పా ఆంజనేయశాస్త్రి, దర్భా సర్వేశ్వరశాస్త్రి, వడ్లమాని వేంకటశాస్త్రి సహాధ్యాయులుగా ఉన్నారు. ఆ తరువాత సుబ్రహ్మణ్యశాస్త్రి శ్రీపాద లక్ష్మీనృసింహశాస్త్రి వద్ద న్యాయశాస్త్రము, దెందుకూరి నరసింహశాస్త్రి వద్ద వేదాంతశాస్త్రము క్షుణ్ణంగా నేర్చుకున్నారు. స్వయంకృషితో ఇతర శాస్త్రాలను కూడా అభ్యసించి సర్వతంత్ర స్వతంత్రతను సంపాదించారు. తాను నేర్చుకున్న విద్యను ఇతర ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులకు భోజనాది సదుపాయాలు కల్పించి గురుకుల పద్ధతిలో బోధించారు. వీరి వద్ద శిష్యరికం చేయడం గొప్ప విషయంగా భావించి దూరదేశాలనుండి ఎంతో మంది విద్యార్థులు పిఠాపురం చేరుకొనేవారు. ఈయన శిష్యులలో చాలామంది ప్రాచ్యకళాశాల ప్రిన్సిపాల్స్‌గా,పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా, పురాతత్త్వ శాస్త్ర పరిశోధకులుగా ఉన్నతపదవులు అలంకరించారు.
రచనలు
బాల్యం నుండే అనేక వ్యాసాలను వ్రాసి ప్రచురించేవారు. సుమారు 14 గ్రంథాలను సంస్కృతాంధ్రాలలో రచించి ప్రకటించారు. వాటిలో కొన్ని:
- చేతవనీ ఖండనం
- మహాభారత తత్త్వ దీపః
- మహాభారత తత్త్వ కథనం
- రామాయణ తత్త్వ కథనం
- ఆస్తికత్వం మొదలైనవి.
ఇంకా అనేక వ్యాసాలను విశ్వహిందూ పరిషత్తు సావనీరులోను, ఇతర పత్రికలలోను ప్రకటించారు. తెలుగులోను, సంస్కృత భాషలోను ఆకాశవాణి ద్వారా అనేక ప్రసంగాలు చేశారు. ఇతర రాష్ట్రాలలో సంస్కృతంలో, ఆంధ్రరాష్ట్రంలో తెలుగులో అనేక మహాసభలలో ఉపన్యాసాలు చేసి మంచి వక్తగా రాణించారు అష్టాదశ పురాణాలను తన పురాణపఠనం ద్వారా పిఠాపురవాసులకు వినిపించి వారిని ఆకట్టుకున్న విద్వన్ శిరోమణి .
బిరుదులు, సన్మానాలు
వీరిని అనేక బిరుదులు, సన్మాన సత్కారాలు వరించాయి.
ఇతని బిరుదులలో కొన్ని:
· వ్యాకరణాలంకార
· బ్రాహ్మీభూషణ
· వ్యాకరణస్థాపక
· మహామహోపాధ్యాయ
· మహాభారత మర్మజ్ఞ
· బాలవ్యాస
· తర్క వ్యాకరణ వేదాంత కేసరి
· జరిగిన సన్మానాలలో కొన్ని:
· విజయవాడలో జరిగిన పండితపరిషత్తులో శృంగేరీ పీఠాధిపతులచే సన్మానం
· ఆంధ్ర ప్రభుత్వాస్థాన కవి కాశీ కృష్ణాచార్యుల చే సత్కారం
· త్రిలింగ విద్యాపీఠం వారిచే సన్మానం
· ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారిచే పురస్కారం
· పిఠాపురంలో సింహతలాటంతో పౌరసన్మానం
కుటుంబం
తన మేనమామ రేగిళ్ల చింతామణి పుత్రిక సుబ్బమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు భావనారాయణశాస్త్రి, కామశాస్త్రి, చింతామణిశాస్త్రి, రాజేశ్వరశాస్త్రి అనే నలుగురు కుమారులు, కామేశ్వరి, సుబ్బలక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు.
మరణం
ప్రవచనాలు, ధర్మోపన్యాసాలు, దుర్విమర్శనా ఖండనము తన నిత్యకృత్యంగా పెట్టుకుని జీవిస్తూ తుదకు 1978, మార్చి 3వ తేదీన 84 వ ఏటమరణించారు.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-22-ఉయ్యూరు