ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్
చిదానంద దాస్ గుప్త ఆంగ్లం లో రాసిన పుస్తకానికి కుందుర్తి చేసిన అనువాదం జీవనానంద దాస్ .కేంద్ర సాహిత్య అకాడెమి 1979లో ప్రచురించింది. వెల –రూ-2-50.హుమాయున్ కబీర్ కు స్మృత్య౦జలి గా అంకితం చేశారు .
కవి కాలాదులు
రవీంద్రుని ప్రతిభ ఉత్కృష్టంగా వెలుగు తున్నప్పుడే జీవనానంద దాస్ కవితా ప్రతిభ కూడా వెలుగు లీనింది .అర్ధ శతాబ్దం టాగూర్ బెంగాలీ సాహిత్యాన్ని ప్రభావితం చేశాడు .ఆనాటి కవులంతా ఆయన దారి తొక్కి ఆమర్గం లో నడిచారు. అదే శైలి అనుసరించారు .ఆయన చూపిన సమన్వయ దృక్పధం అందరికీ ఆరాధనం అయింది .ఆయన్ను దాటి అలోచి౦చటం సాధ్యమా ?అనే స్థితిఏర్పడింది .అన్నిటా ఆయన శిఖరాయ మానుడు .టాగూర్ సాహిత్య సంస్కృతీ బెంగాల్ లో ఇప్పటికీ జీవించే ఉంది .1937లో టాగూర్ ‘’ప్రాంతిక్ ‘అనే కవితా సంపుటిరాసి విడుదల చేశాడు .పెద్ద జబ్బు చేసి మరణావస్థ నుంచి కోలుకొని ,ఆనాటి బెంగాలీ సమకాలీనతను ఆకవిత్వం లో ఆవిష్కరించాడు .యుద్ధ కారణ శక్తులను తీవ్రంగా ఖండించాడు .సమాజం వింతపోకడలు ,దిగజారుడు లను కళ్ళకు కట్టించాడు .తన ఆవేదనను ఒకకవితలో ఇలా అన్నాడు –
‘’బుసకొట్టే సర్పరాజులు విషం కక్కు తున్నాయ్ –నా చుట్టూ ఉన్న గాలిలో –శాంతి ప్రవచానాలన్నీ శక్తి హీనమైపోయాయి-పెద్ద వాణ్ని అయిపోయాను –పోయే లోగా ఒక విజ్ఞప్తి-ఈ రాక్షసిని తుద ముట్టిద్దాం .-అందరూ దీనికోసం సర్వ సన్నద్ధులు కావాలి ‘’
1930వ తరానికి చెందిన కవులంతా రవీంద్రుని ప్రభావం నుంచి బయట పడాలనే కాంక్ష ,కృషీ మొదలయ్యాయి .బుద్ధ దేవ బోస్ దీనికి ప్రధాన పాత్ర పోషించాడు .టాగూర్ మరణానికి 15ఏళ్ళ ముందునుంచి ‘’కల్లోల్ సాహితీ బృందం ‘’దీనికి తోడ్పడింది .ఆ కాలం లో నిరాశా నిస్పృహలతో ఉన్నవారు ,మార్క్సిస్ట్ ప్రభావితులైన వారు ,,ఈ రెండిటికీ మధ్యగా ఉన్నవారు అందరూ కలిసే ఉండేవారు .వీరంతా టాగూర్ తర్వాత రానున్న ఆలోచనా ధోరణుల గురించే బాగా ఆలోచించారు .కల్లోల్ బృందమేకాదు ‘’విష్ణు డే’’కూడా –‘’టాగూర్ చెట్టు పేరు చెప్పికాయలమ్మే గతి –ఇక మనకు వద్దు –జటాజూటపు మెలికల్లో గంగను ఇరికి౦చుకొని –శాశ్వతంగా నిలపటానికి ఇక వీల్లేదు –ఆత్మ భావ గంగా ప్రవాహాన్ని –విచ్చల విడిగా వదుల్తున్నాం –పాటల పడవల మీదెక్కి –జలధి వైపుకు కదుల్తున్నాం –కొత్తదారి ,కొత్తనడక –కొత్త రంగులు ,కొత్త చిత్రాలు –కొత్త గొంతుల కోలాహలం తో –నవ్యకవితా ప్రవాహాలు పారిస్తాం –ప్రజల మనస్సులు పాలిస్తాం ‘’అంటూ వైశాఖ 25 కవిత్వంతో ముందుకు దూకాడు విష్ణు డే.
ఇలాంటి సమయంలో కూడా జీవనానంద దాస్ టాగూర్ పై ధ్వజమెత్తి కవిత్వం రాయలేదు .ఆయన కవితా వస్తు ప్రదర్శనం టాగూర్ లో వచ్చిన పరిణామ దశల్లో ప్రయాణం చేసి బలపడింది .టాగూర్ అనంతర కవులలో జీవనానంద దాస్ లో అందరికంటే ఎక్కువగా ఈ పరిణామం చోటు చేసుకొన్నది .ఇది ఆయన గమనించి ఇలా అన్నాడు –‘’తమకంటే ముందున్న మహాకవులను పడ త్రోసే ప్రయత్నం లో, కవులు తమ స్థానాన్ని నిలబెట్టుకో లేరు .ఒకరిద్దర్ని మినహాయిస్తే ఆధునిక బెంగాలీ కవితారంగం అంతా టాగూర్ ప్రభావమే కనిపిస్తుంది .ఆధునిక కవితలను ఆయన కవిత్వంతో పోలిస్తే ,ఆయనలో ఎంత వైవిధ్యం ఉందొ అర్ధమౌతుంది .ఆయన అడుగు జాడల్లోనే ఆధునిక బెంగాలీ కవిత్వం ఇప్పుడే కొత్తగా ప్రారంభించింది .టాగూర్ ప్రతిపాదించిన విలువలకు ఎన్నటికీ భంగం కలగదు ‘’అన్నాడు .టాగూర్ కవితా సంప్రదాయానికి ఎదురు తిరక్కుండా ,దాన్ని కొత్తతరంలోని భావాలతో ,భాషా నుడికారాలతో మేళవించి ముందుకు తీసుకు వెళ్ళటమే ధ్యేయంగా జీవనానంద దాస్ కృషి చేశాడు .’’సంప్రదాయం –వ్యక్తి ప్రతిభ ‘’లో ఆంగ్లకవి టీఎస్ ఇలియట్ రాసిన వ్యాసం లో ఈ రెండిటికి ఉన్న సంబంధాన్ని వివరించినట్లుగా జీవనానంద దాస్ కవిత్వం రాశాడు .
బెంగాలీ సాహిత్యం లో పశ్చిమ దేశాల హవా బాగా ఉన్న రోజులవి .రెండు ప్రపంచ యుద్దాలఫలిత౦ గా ‘’వేస్ట్ లాండ్ ‘’గా మారిన భూగోళం మీద వీచిన గాలి ,బెంగాలీ నేలనూ తాకింది .విక్టోరియాకాలపు నైతిక విలువలు పతనమై ,అణుయుగం లో మానవ జీవితం లో సందిగ్ధ పరిస్థితులేర్పడి ,ప్రపంచమంతా ఎర్రజండాలు ఎగురుతున్న రోజులవి .వీటన్నిటి ప్రభావం బెంగాలీ సాహిత్యంపై బలంగానే పడింది .
టాగూర్ యుగం చివర్లో ,టాగూర్ తర్వాత బెంగాలీ సాహిత్య నిర్మాతలలో చాలామంది ఆంగ్ల భాషా నిష్ణాతులవటం విశేషం .అలాంటి వారిలో బుద్ధ దేవ బోస్, అమియా చక్రవర్తి, విష్ణు డే,సమర్ సేన్ ,జీవనానంద దాస్ ముఖ్యాతి ముఖ్యులు .ఇంగ్లీష్ జర్నలిస్ట్ లుగా ఉంటూ ఇంగ్లీష్ సాహిత్యాన్ని మధించినవారూ ఉన్నారు .పాశ్చాత్య దేశాల కళా సాహిత్యాలలో ,పురాతన ,అధునాతన గాధలతో ఉన్న పద చిత్రాలు వారికవితల్లో కో కొల్లలు .ఇలియట్, వెబ్స్ ,యేట్స్,కాల్డ్వెల్ ,రజనీ పామీదత్ ఆస్వాల్డ్ స్ప్లేన్గ్లార్ ల వివిధ సాహిత్య ప్రక్రియలను బెంగాలీ సాహిత్యం లో దిగుమతి చేసి దారీ గమ్యం లేకుండా చేశారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-22-ఉయ్యూరు