ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -2
పట్టణన వర్గాలలో మధ్యతరగతి ప్రజలకష్ట నష్టాలను వర్ణిస్తూ సమర సేన్ తనకవితలలో అసహనం చూపాడు .ఈ మార్పులను గురించి కవితా అస్త్ర సన్యాసం చేయటానికి కూడా సిద్ధపడ్డాడు .విష్ణు డే కవితలలో శ్రామికవర్గం పై జాలికనిపిస్తుంది .నాటికవులు తమ వర్గ స్వభావాన్ని వదులుకోలేక పోయారు .సుభాష్ ముఖోపాధ్యాయ ,,సుకంతో భట్టాచార్య కవితల్లో ఏ కొన్నో తప్ప నిజంగా ప్రజానీకానికి చేరలేదు.ఆ రోజుల్లో కవి తనకు తానె తుది లక్ష్యం వలన ,తనకు తాను తన్మయుడై ,దాన్నికవిత్వంగా ‘’కక్కటం ‘’తప్ప ఏమీ సాధించలేక పోయాడు .ప్రజాహృదయ స్పందన కలిగించలేక పోయాడు .
విభూతి భూషణ బంద్యోపాధ్యాయ కవిత్వం లో నవలలో లాగా జీవనానంద దాస్ ప్రకృతి దృశ్యాలతో చేలూ, నదులు సామాన్యప్రజలు వారి మనోభావాల చిత్రణ ఉంది .దాస్ కూడా బంద్యోపాధ్యాయ లాగా వామ పక్ష భావ ప్రభావితుడు కాదు .ప్రముఖ బెంగాలీ చిత్ర దర్శకుడు సత్యజిత్ రే విభూతి నవలలను సినిమాలుగా మలిచాడు .చిత్రకారుడు జెమిని రాయ్ కూడా ఈ కోవలోని వాడే .ఇతడి కళాఖండాలకు అద్భుత వ్యాఖ్యాత విష్ణు డే.
టాగూర్ తర్వాత జీవనానంద దాస్ ఒక్కడే బెంగాలీ కవిత్వం లో అద్భుతాలు సాధించాడు .నజ్రులిస్లాం గొంతెత్తి దేశభక్తి గీతా గానం చేశాడు .ప్రజల్లో బ్రతుకు బాధ ఎక్కువై వాటిపై మోజు తగ్గింది .సుధీంద్ర నాథ దత్తా సంస్కృత సాహిత్య లోతులు తరచి ,సమకాలీన జీవితాన్ని సంస్కృతంలో ఆవిష్కరించాడు .విలువలను సమన్వయ పరచాడు .విష్ణు డే తన కవితా మృదు స్పర్శతో ,ఆవేశం ,అనుభూతి రంగరించి ,ప్రజలలో వైజ్ఞానిక చైతన్యం తెచ్చాడు .బుద్ధ దేవ బోస్ తన అనుభూతుల్ని ప్రజానుభూతులు చేసి ప్రజా హృదయం ఆకర్షించాడు .ప్రేమేంద్ర మిత్రా విశాల దృక్పధంతో ప్రజాహృదయాలను మీటాడు .అమీయా చక్రవర్తి రచనలలో ఆధునిక భాష, నుడికారం శైలీ చి౦దులేశాయి .సురేంద్రనాథ్ లాగా ఆజిత్ దత్తా భారతీయ భావాలకు, సమకలీనతకు పట్టం కట్టాడు .అల్పాక్షరాలతో అనల్పార్ధ రచన చేశాడు .ఇలా వీరంతా ఎవరికీ వారే తమ ప్రత్యేకతను నిల్పుకొన్నారు .కానీ వీరిలో ఎవరూ జీవనానంద దాస్ లాగా నూతనత్వం కవితాశక్తి సంమోహ గుణం ప్రదర్శించ లేకపోయారు .అందుకే రవీంద్రుని తర్వాత ఆస్థానం జీవనానంద కు దక్కింది .
వ్యక్తిత్వం
జీవితమంతా కవిత్వంలోనే మునిగి తేలినవాడు జీవనానంద దాస్ .ఏవోకొన్ని నవలు కథలు రాశాడుకానీ, కవిత్వంలోనే జీవించాడని చెప్పవచ్చు .అదే ఆయన వ్యక్తిత్వమై భాసిల్లింది .ఆయన కవిత్వం లో ఉన్న సౌందర్యం ఆయన వేష ధారణలో కనిపించదు .శైలి లో ఉన్న శోభ ఆయన ఇంట్లో ఉండదు .అంటే ఊహకూ నిజానికీ మధ్య సమన్వయము లేదు .తను నిర్మించిన కల్పనా జగత్తుకు ,సాంఘిక జీవనం లోని నిత్య జీవితానికి సంబంధం ఉండదు .తూర్పు బెంగాల్ బారిసాల్ లో పుట్టి ,కలకత్తా లో పెరిగిన దాస్ కు పల్లె సౌ౦దర్యం ,పట్టణ సౌభాగ్యం రెండూ కూడా పట్టనే లేదు .తనలోకం లో తాను ఊహా సౌధాలు నిర్మించుకొని గడిపాడు .జీవిత సమస్యలకు దూరంగా ఉన్నా , జీవితాన్ని నిశితంగా పరిశీలించే నేర్పున్నవాడు .కానీ జీవిత సమరంలో రచనలద్వారానే పాల్గొన్నకవి. ఆయన కవే కానీ మరేదీ కానివాడు .అందుకే ‘’ఒక వ్యక్తీ నిజంగా కవి అయితే ,నిత్య జీవితంలో సతమతమయ్యే లోకానికి తానిచ్చే మొదటి బహుమతి కవిత్వమే ‘’అన్నాడు .
జీవనానంద దాస్ చివరికి ట్రా౦ కారు కింద పడి మరణించటం ఆయన జీవితంలో భగవంతుడు చేసిన చమత్కారం .అయ్యో అనిపించినా ,మంచాన పడి తీసుకోకుండా హఠాన్మరణం పొందటం లో కూడా ఆయన కవితా సాహసం తొంగి చూసింది అంటారు .మరణానికి ముందే ఆయన జీవితంలో పతనావస్థ ప్రారంభమైంది .నిత్య జీవితంలో సన్నిహిత సంబంధం కల వ్యక్తిగా ఆయన్ను భావించేవారు .అందువల్ల సనాతనులు ఆధునికులు హేళన తో ఆయన్ను చూసేవారు .’’శనివారర్ చీటీ ‘’-శనివారం లేఖ అనే పత్రికలో సజనీ కాంత దాస్ ఈయన్ను దుయ్య బడుతూ ఉండేవాడు .
నిష్టాగరిష్ట బ్రహ్మ సమాజ కుటుంబం లో పుట్టిన జీవనానంద ,తండ్రి మంచి పండితుడైన ఉపాధ్యాయుడు తల్లి కవయిత్రి ..కలకత్తాలో బ్రహ్మ సమాజీయుల కాలేజిలో దాస్ ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేశాడు .ఒక కవితలో స్త్రీ వక్షోజాలను వర్ణించి నందుకు ఆయన్ను ఉద్యోగం నుంచి తీసేశారని అంటారు .జీవితమంతా ఇంగ్లీష్ లెక్చరర్ గానే గడిపాడు .ఆదాయం చాలక ,కవిత్వంతో బాగా పేరు తెచ్చుకొనే సమయంలో ఇన్సూ రెన్స్ పాలసీని అయినకాడికి అమ్మేశాడు .
ప్రజలతో మాట్లాడటానికి ఇబ్బంది పడేవాడు .టాగూర్ ప్రదర్శించిన ప్రశాంత సమైక్య సంపూర్ణ సమన్వయ భావాలకు దూరంగా జీవితం గడిపాడు దాస్ .ఆయన జీవించిన కాలానికి సంబంధించి సమస్త గుణాలు ఉన్నకాలం లో జీవితం గడిపాడు .జీవితంలో రచనలలో ఆయన టాగూర్ అనంతర కాలానికి అంకితమైన వాడు జీవనానంద దాస్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-9-22-ఉయ్యూరు