మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్
ఆధారం -దేవేంద్ర నాద భట్టాచార్య రచి౦చిన వంగమాతృకకు శ్రీ ఆకురాతి చలమయ్య గారు ఆంధ్రీకరణ పుస్తకం ‘’మహర్షి దేవేంద్ర నాద ఠాకూర్ చరిత్రము ‘’.పిఠాపురం శాంతికుటీరం .ప్రచురణ .శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాల చేత ముద్రితం .1937 తృతీయ ముద్రణం .బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నం నాయుడు గారికి అంకితం .
పరిచయం
పశ్చిమ బెంగాల్ లో కలకత్తా లో ని జోరా సంకో –అంటే కలకత్తా లోని అప్పర్ చిత్ పూర్ రోడ్డులో ఉన్న ఒక ప్రదేశం లోని ఠాకూర్ వంశం లో మహా పుణ్యపురుషులు నిత్య ప్రాతః స్మరణీయులైన వారెందరో జన్మించారు .ఈ వంశంలో లక్ష్మీ సరస్వతులు ఇద్దరూ నిత్యం కొలువై ఉండటం మరొక విశేషం .సదాచారాలు సద్ధర్మా చరణ వలన వీరి వంశం వారెప్పుడూ ధనం, ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లారు .అన్ని విధాల ఉన్నత గుణ ,ఉత్తమ ప్రవర్తనలతో ఈ వంశీయులు బెంగాల్ లోనే కాక యావద్భారతం లోనూ విదేశాలలోనూ ప్రఖ్యాతులయ్యారు .ఈ వంశ స్త్రీలు కూడా మహా యశస్సు సాధించారు .కవిసమ్రాట్ రవీంద్ర నాథుడు ,ద్విజేంద్ర నాథ టాగూర్ , సత్యేంద్రనాథ ఠాకూర్ లు ఆణిముత్యాలుగా గుర్తింపు పొందారు .మహిళలలో స్వర్ణకుమారీదేవి ,సరళాదేవి వంటి వారు ఆవంశం లో పురుషులతో సమానంగా అన్నిటా రాణించారు .
ఈ వంశం లో ద్వారకా నాథ ఠాకూర్ ‘’ప్రిన్స్ ‘’బిరుదు పొంది ,మొట్టమొదటి సారిగా ఆవంశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చాడు .ద్వారకా నాథుని జ్యేష్ట కుమారుడే మహర్షి ద్దేవెంద్రనాథ ఠాకూర్ .
పరిస్థితులు
వంగ దేశ కీర్తి ప్రతిష్టలను వృద్ధి చేసినవారిలో విద్యాసాగర్ ,రామమోహన రాయ్ బంకిం చంద్ర చటర్జీ ,కృష్ణ దాసు, రమేష్ చంద్ర వంటి ప్రముఖులున్నారు .ఆంగ్లేయుల పాలనాకాలం లో క్రిస్టియన్ స్కూళ్ళు ఉండేవి అక్కడే అందరూ ఆంగ్ల విద్యనేర్చేవారు .దీనితో అక్కడ చదివిన వారికి భారతీయ సంస్కృతీ పై అభిలాష గౌరవాలు బాగా తగ్గిపోయాయి .నీతి నియమాలు దూరమయ్యాయి .కాలక్రమేణా పెద్దలు ఈ వైపరీత్యాన్ని గమనించి ,మేల్కొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు .హిందూ ధర్మం నీతినిజాయితీడైవభక్తి భారతీయ విద్య నేర్పటానికి,నాస్తికత నశింప చేయటానికి ప్రత్యెక హిందూ విద్యాలయాలు స్థాపించాలనే సంకల్పం కలిగి ,కార్యరంగం లోకి దూకారు .ఆంగ్లేయ విద్యతోపాటు ధార్మిక విప్లవం కూడా తీసుకురావాలని రాజా రామ మోహన రాయ్ సంకల్పింఛి ‘’బ్రహ్మ సమాజం ‘’స్థాపించాడు. కానీ ఆయననుధర్మద్రోహి అనీ ,సంఘద్రోహి అని పెద్దలు నిరాకరించారు .ఆయన చిత్తశుద్ధిని అర్ధం చేసుకోలేకపోయారు ఆయన బోధించిన ఏకేశ్వరోపాసన ఆనాడు పెద్దగా ఫలించలేదు .కానీ కొత్త ఆలోచనలకు దారి చూపిన మహాత్ముడిగా ప్రసిద్ధి చెందాడు .
ద్వారకా నాథఠాకూర్ కు రామమోహన రాయ్ దగ్గర బంధువే .ఆయన హృదయాన్ని అర్ధం చేసుకొని భావాలకు ఆకర్షితుడై నాడు.,రాయ్ కలకత్తా హిందూ కళాశాల స్థాపించి ,సాధారణ విద్యతోపాటు ,నీతి,ధర్మాలపై శిక్షణ ఇస్తూ విద్యార్ధుల భవిష్యత్తును తీర్చి దిద్దారు .కొంతకాలం తర్వాత హిందూకాలేజీ అధికారులు రామమోహన రాయ్ ను తమ సంఘం నుంచి ,బాధ్యతనుంచి దూరం చేసి ,కాలేజి ని నడపటం ప్రారంభించారు .దీనివలన యువక విద్యార్ధులు హిందువులు కాక ,క్రైస్తవులూ కాకుండా తమాషా వ్యక్తులయ్యారు .దీన్ని గుర్తించిన రాయ్ సాధారణ విద్యతోపాటు ,ధర్మ విద్య కూడా నేర్పటానికి స్వంత ఖర్చు తో అనేక విద్యాలయాలు నెలకొల్పాడు .
దేవేంద్ర జననం
రామమోహన రాయ్ ని లోకం దూరం చేసినా ఆయనపై అనేక ముద్రలు వేసినా ప్రిన్స్ ద్వారకా నాథ ఠాకూర్ మాత్రం ఆయనకు అన్ని విధాలా సహకరించి ఆయన ఆశయాలను ప్రచారం చేయటానికి తోడ్పడ్డాడు .తనకున్న విశాల స్థలం లో బ్రహ్మసమాజ ప్రచారానికి మొట్టమొదటిసారిగా ఒక మందిరం కట్టించి ‘’ఆది బ్రహ్మ సమాజం ‘’అని పేరు పెట్టాడు .ఈ మందిరం నుంచే రామమోహనుడు తన ధర్మ ప్రచారాన్ని విజయవంతంగా సాగించాడు .ద్వారకానాథుడు రోజూ తానూ వచ్చి పాల్గొంటూ తన పరివారాన్ని కూడా పాల్గోనేట్లుచేసేవాడు .దీనితో జోరాసంకో ఠాకూర్ వంశం బ్రహ్మసమాజ ధర్మాలను ఆచరిస్తూ’’బ్రహ్మ ధర్మ అవలంబులు ‘’అనే ఖ్యాతి పొందారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-22-ఉయ్యూరు