మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-2
దేవేంద్ర జననం,విద్యాభ్యాస౦
ద్వారకానాథుడు తన కుటుంబం లోనిస్త్రీలను కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించాడు .అందరిలో ఒకకొత్త వెలుగు ఆశాజ్యోతి కలిగించాడు రామమోహనుడు తన సకలకళా పా౦డిత్యాలచేత .ఈ కుటుంబం లోని వారంతా అన్నిటా అద్వితీయ పండితులయ్యారు .ద్వారకానథుని భార్య గర్భం దాల్చింది .ఆమెకు పుట్టేబిడ్డ మహా మహిమాన్వితుడు అవుతాడని రాయ్ చెప్పేవాడు .1818 మే నెలలో ఆమెకు దేవెంద్రనాథుడు జన్మించాడు .అతడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు ముఖం లో దివ్య తేజస్సు ఉట్టి పడేది .రాయ్ కు ఈ బాలుడు దైవాంశ సంభూతుడు అనిపించాడు. ఆయన దృష్టి అంతా దేవేంద్రునిపైనే ఉండేది.ఇంట్లో వారంతా ఆయన్ను ఎందుకు ఈబాలుడిపై అంత ఆపేక్ష అని అడిగితె ‘’యితడు అపూర్వ శిశువు .నాకార్యక్రమాలన్నిటికి తోడ్పడే మహానుభావుడు అవుతాడు ‘’అని చెప్పాడు .’
దేవేంద్రనాథ ఠాకూర్ బాల్యం నుంచి శాంతచిత్తుడే .ప్రసన్న స్వభావుడే .అతనిది స్థిర చిత్తం .దేనినీ కోరేవాడుకాడు .దేన్నీ నిర్లక్ష్యం చేసేవాడు కాదు .పూజలో కూర్చుంటే ఐహిక స్మృతి ఉండేదికాదు .విద్యలలో నేర్పరి .రాయ్ గారి విద్యాలయం లో చేర్పించారు .14వ ఏట అన్ని విద్యలలో ఆరితేరి హిందూ కాలేజిలో చేరాడు .రామమోహనుడు విదేశాలకు వెడుతూ దేవేంద్రుని దగ్గరకు పిలిచి అతని చెవిలో యేవో కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోయాడు .ఆమాటలతో అతడు ధర్మ పిపాసి అయి నడవటం ప్రారంభించాడు .బ్రహ్మ సమాజ వ్యాప్తికోసమే తహతహలాడేవాడు .తనకు కనిపించిన వారందరి బ్రహ్మజ్ఞానం బోధించేవాడు .ఎక్కడైనా అశాంతి ,కల్లోలాలు ఏర్పడితే వెంటనే వెళ్లి శాంతి నెలకొల్పేవాడు .ఏవిషయం లోనైనా అనుమానం వస్తే బ్రహ్మ సమాజ ఆచార్యుడుపండిత రామచంద్ర విద్యా వాగీశుని దగ్గరకు వెళ్లి సందేహ నివృత్తి చేసుకొనే వాడు .ఆనాటి దార్మికపండితులు కూడా ఆయన ప్రజ్ఞా పాటవాలకు అబ్బురపడుతూ ఆశ్చర్యపొయెవారు .ఎంతజటిల మీమాంసా విషయమైనా యిట్టె పరిష్కరించేవాడు .పండితుల వాచాలత కు అడ్డు కట్ట వేసేవాడు. సూక్ష్మ దృష్టి అతని ప్రత్యేకత .గడ్డాలు మీసాలు పెంచి ఘోరతపస్సు చేసే మహర్షులకు లభించే విజ్ఞానం కంటే దేవేంద్రుని విజ్ఞానం సహస్ర రెట్లు ఎక్కువ అనే వారు .అతని ఆచార్యులు ప్రకృతి దేవి ,అనంత విశ్వ క్షేత్రాలే .
ఉపనిషత్తులు అధ్యయనం చేసేటప్పుడు సర్వభూతాతీత పరమాత్మను లోపల జ్వాజ్వల్యమానంగా దర్శించేవాడు .అప్పుడు పిచ్చివాడులాగా పరిగేట్టేవాడు .ధర్మశాస్త్రాలు తర్కమీమా౦సలు చెవి ఒగ్గి వినేవాడు .తాను అజ్ఞాని అని తనకేమీ తెలియదని అనేవాడు .చీకటిలో తిరిగేవాడు .భేదభావం అతనికి లేనేలేదు పరమహంస ప్రవర్తన లాగా ఉండేది అతిని తీరు .అనుకోకుండా ఆయనకు ఒక ఉపనిషత్ గ్రంథం లోని ఒక చికి కాగితం కంట పడింది .అది చదివి అర్ధం చేసుకొన్నాడు .వెంటనే ఆయన హృదయం లో ఒక అపూర్వ తేజస్సు ప్రాడుర్భవించింది .మధుర రస తరంగిణి గట్లను ఒరుసుకొంటూ ప్రవహించింది .ఆకాగితాన్ని తీసుకొని వెళ్లి తనగురువు వాగీశుని అందులోని భావతాత్పర్యాలు పూర్తిగా తెలియజేయమని కోరాడు .అప్పటి నుండి ఆయన బ్రహ్మ విద్యోపాసకుడు అయ్యాడు .
హిందూ కాలేజిలో చేరిన దేవేంద్రుడు విద్యలో అఖండుడు అయ్యాడు .అధ్యాపకులు అతడు మహా పండితుడు అవుతాడని భావించి దీవించారు .ఎంత చదివినా తృప్తి తీరటం లేదు .కొత్త విషయాలు తెలుసుకోవాలనే తహ తహ ఎక్కువైంది .కాలేజిలోధర్మ విషయ చర్చకు అధికారులు అంగీకరించకపోవటం ఆయన్ను బాధించింది .తోటి విద్యార్ధులతో ఈవిషయం పైన మాట్లాడుతుంటే వారిలోకూడా ధర్మ జిజ్ఞాస ఉన్నట్లు తెలిసింది .కాలేజి విద్యార్ధులు 200మంది కలిసి ‘’సాధారణ జ్ఞానోపార్జని ‘’సభ ఏర్పరిస్తే , అందులో దేవేంద్రుడు కూడా చేరాడు .కానీ వీరుదార్మిక విషయాలు చర్చించరాదని యాజమాన్యం షరతు పెట్టింది .కాలేజిలో ఏదో ఒక రూమ్ లో సభజరిపి ఎవరికీ అభిమాన విషయం పై వారు మాట్లాడేవారు .కానీ దేవేంద్రునికి ఇది నచ్చలేదు .లోకజ్ఞానం వారికి లేదని బాధ పడ్డాడు .పుస్తక జ్ఞానం తో పురోభి వృద్ధి ఉండదని భావించాడు .తీవ్ర అసం తృప్తిలోనే కాలేజి జీవితం గడిపాడు .
హిందూకాలేజీ చదువు పూర్తీ చెసి ,ఇంటికి వచ్చి తమ జోరా సంకో గృహం లో ఖాళీ ఉన్న ఏకాంతమైన చోట కొంతమంది సాధారణ వ్యక్తులతో కలిసి ‘’తత్వ బోధినీ ‘’సభ స్థాపించాడు .దీనిలో విద్యావంతులు పట్టభద్రులు ఎవరూ లేరు .నిరాశ పడక ప్రతినెలా క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ ,ఎవరో ఒకరు తనకు తెలిసిన తత్వ విషయం పై రాసిన వ్యాసం చదివటం దానిపై మిగిలినవారు చర్చాప చర్చలు జరిపేవారు .సంఘం పేరు సార్ధకం చేసేవారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-22-ఉయ్యూరు