శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు

శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు

శ్రీవారు అరవదేశంలో సంచారం చేస్తున్నారు. వేసవిసెలవులలో వారి సన్నిధికి వెళ్లటం నాకు అలవాటు. ఒకనాటి సాయంత్రం వారు తమిళంలో ఉపన్యాసం ప్రారంభించారు.

”జీవులకు పుట్టుట, గిట్టుట స్వభావ ధర్మాలు.. పుట్టుకకు కారణం కాముడు, అంటే మన్మథుడు. గిట్టుటకు కారణం కాలుడు, అంటే యముడు. ఈ ఇద్దరి బాధా లేకపోతే జనన మరణాలు లేకుండా పోతాయి. జననం లేకుండా చేసుకోవాలంటే మన్మథుణ్ణి నిగ్రహించినవాని నాశ్రయించాలి. మరణం లేకుండా చేసుకోవాలంటే మరణకారకుడైన కాలుని శిక్షించిన వాని దగ్గరకు పోవాలి. ఈ రెండు పనులూ చేసిన పెద్దమనిషి ఒకరే. ఆయనే స్మరహరుడు, మృత్యుంజయుడు అయిన శివుడు. శ్రీకాంతుడంత సులభంగా దొరకడుగాని శివుడుమాత్రం సులభసాధ్యుడు. ఆయనను ఆశ్రయిద్దాం…నమః పార్వతీ పతయే హరహర మహాదేవ!” అందరితోపాటే నేనూ గొంతు కలిపాను. శ్రీవారు మరో ఘట్టం ఎత్తుకున్నారు.

ఉపన్యాసం ముగిసిన తర్వాత రాత్రి ఒక ఇంట్లో డాబామీద విశ్రమించాను. క్రింద పారా ఇస్తున్నారు. అర్థరాత్రి పన్నెండు గంటలు దాటింది. నాక నిద్రపట్టలేదు. ఆ యింటి అరుగుమీద కూర్చొని శ్రీవారి దర్శనంకోసం తహతహలాడుతున్నాను. ధైర్యంచేసి లోనికి వెళ్ళబోయాను. పారా ఇస్తున్న బ్రాహ్మణుడు ”పెరియవాళ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. పైకి పోవద్దు” అన్నాడు. నిరాశతో తిరిగి వెళ్ళి, గోపికలు కృష్ణపరమాత్మను గురించి విరహంతో అన్నమాటలు- పోతనగారి పద్యాలు చదువుకుంటూ కూర్చున్నాను. అంతలో ఏదో ప్రేరణచేత మళ్ళీలేచి డాబామెట్లు సమీపించి చటాలున అయిదుమెట్లు ఎక్కేశాను. పారాయిచ్చే బ్రాహ్మణుడు పరధ్యానంలో ఉన్నాడు. పైకిరమ్మని ఎవరో పిలిచినట్లయింది. పైకి దూకాను.

అక్కడ శ్రీవారు చేతిమీద తల ఆనించి ఓప్రక్కకు ఒదిగి పడుకొన్నారు. సడిచేయకుండా అడుగులు వేసి దూరంగా నిలిచాను. సంస్కృతంలో ‘కః?’ (ఎవరు) అని ప్రశ్నించారు.

”నేను, కల్లూరిని” అన్నాను.

వెంటనే-

”నిద్రా నాయాతా కిం? నైదాఘస్తాపో బాధతేవా?” (నిద్ర పట్టలేదా? ఎండ ఉడుకు బాధవల్లనా?) అని మళ్ళీ ప్రశ్నించారు.

”న నైదాఘస్తాపః – ఎండ ఉడుకు కాదు. నేటి ఉదయం మొదలు అయిదు నిముషాలైనా శ్రీవారి సన్నిధానం, దర్శనభాగ్యం దొరకలేదు. అందుకు తపిస్తున్నాను. శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు అయిదు నిముషాలైనా నాకు ఏకాంత దర్శనం అనుగ్రహించాలి” అన్నాను.

”త్వయి గోపికాత్వ మతి దిశ్య మయి కృష్ణత్వం సంభావ్య కిమపి సంభావితం ఖలు-” నీయందు గోపికాభావం, నాయందు కృష్ణత్వం భావించి ఏదో అనుకొంటున్నావా? – అని అడిగారు శ్రీవారు. ఎలా తెలిసిందో!

ఆ తర్వాత, ”అద్య అస్మాభి స్తమిళ భాషాయాం ప్రసంగః కృతః. త్వం భాషానభిజ్ఞః. కిం జానాసి మదుక్తం” – మేము తమిళంలో మాట్లాడాము. నీకు అర్థమైందా? అని ప్రశ్నించారు.

”శ్రీవారు నా కర్థం కావాలని సంకల్పించారు. అందుచేత అర్థమైంది” అన్నాను. శ్రీవారి నిమిత్తం కొన్ని సంవత్సరాలుగా అరవదేశం వెడుతూ వస్తున్నా. నాకు అరవభాష కొంచెంకూడా పట్టుబడలేదు. ఆరోజు… అత్యాశ్చర్యం, శ్రీవారి తమిళ ప్రసంగం బాగా అర్థమైంది. అది వారి సంకల్పం. ఉపన్యాస సారాంశం చెప్పమన్నారు. చెప్పాను. దానిని ఈ చిన్ని శ్లోకంలో ఇమిడ్చాను.

జనిమృతి విరతిర్భవేదితిత్వాం రతిపతి శాసకమీశ కాలకాలమ్‌

హిమగిరి తనయా ద్వితీయ మీడే పరమ దయారస మీశ మద్వితీయమ్‌.

తెలుగు వివరణం-

జనన కారణం మన్మథుడు. మరణకారణం కాలుడు. ఆ యిద్దరిని నిగ్రహించిన ప్రభువు ఒక్కడే. కామవైరి మృత్యుంజయుడు. చంద్రశేఖరుడు శివుడు. ఆయన హిమగిరి, మంచుకొండ కూతురికి సగము శరీర మిచ్చిన వాడు, చల్లనివాడు, దయామూర్తి. ఆయనను ఒక్కని ఆశ్రయిస్తే రెండు లాభాలు కలుగుతాయి అనివారి ఉపన్యాస సారాంశం ఈ శ్లోకంలో ఇమిడించికొన్నాను.

శ్రీవారు చిరునవ్వుతో విన్నారు. ఆ మందహాసం నాకు వెన్నెలై తోచింది.

”నా సన్నిధి రోజు మొత్తం మీద అయిదు నిముషాలైనా కావాలన్నావు కదా! ఇప్పుడెన్ని నిముషాలైంది? ప్రశ్నించారు శ్రీవారు.

”పదిహేను నిముషాలు అయుంటుం”దన్నాను.

అటుపైన, ప్రాకృతదృష్టితో వారిపై జాలితోను, శ్రీవారు కటికనేల మీద పడుకొన్నారు. హృదయం ద్రవించిపోతోంది” అన్నాను.

వెంటనే, ”కిం నశ్రుతమ్‌” – వినలేదా?

క్షితితల శయనం తరుతలవాసః

కరతలభిక్షాకౌపీనవంతః ఖలు భాగ్యవంతః

కౌపీన ధారులు, పరివ్రాజకులు భాగ్యవంతులు. కటికనేలపై పడక, చెట్టుక్రింద నివాసము, అరచేతిలోఅన్నపుముద్ద- అంతకంటె భాగ్యవంతులెవ్వరు? అన్నీ ఉన్న సంసారుల దేమి భాగ్యం – అని నన్ను ఊరడించి విశ్రమించమని పంపించారు.

పద్యపాద స్ఫురణ

నావల్లనే జ్ఞాపకం, జ్ఞానం, మరుపు కలుగుతుంటాయి అన్నాడు. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు, అర్జునుడితో. కృష్ణావతారం తరువాత జ్ఞానావతారంగా వచ్చిన ఆదిశంకరుల అనంతరం, వారి సంపూర్ణాంశంతో వచ్చిన అవతారం శ్రీవారు అన్నది నాకు స్పష్టంగా రుజువైంది. అదొక అద్భుత ఘట్టం.

శ్రీధరవారు ఆంధ్రులు. పశ్చిమ గోదావరిజిల్లా కానూరు అగ్రహారీకులు. ఆ కుటుంబం తంజావూరు జిల్లాకు వలసపోయింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన వెంకటాధ్వరి అనే మహానుభావుడు యజ్ఞాలు చేసినవారు, బ్రహ్మణ్యులు, గొప్ప అనుష్ఠాతలు, శివభక్తులు. మహా పండితుడు, మహాకవీ కూడా. ‘అయ్యవాళ్‌’ అనేది వారి గౌరవనామం. ఆయన మహిమల గురించి ఆ ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. శ్రీవారే కొన్ని కథలు నాకు చెప్పారు.

వారు సిద్ధిపొందిన తర్వాత వారి గృహం శంకరమఠంగా మారింది. శ్రీవారు ఆ ఇంటిలో మకాం చేసినప్పుడు వారి దర్శనానికి వెళ్ళాను. ఓ రోజు సాయం సమయంలో ఆ గ్రామంలోని దేవాలయాలను సందర్శించడానికి శ్రీవారు బయలుదేరారు. వారివెంట నేనూ ఉన్నాను.

ప్రదక్షిణం చేస్తూ, ‘ఇది శివాలయం. శివుని మీద నీవు చెప్పిన పద్యం చదువు’ అన్నారు. అప్పుడొక శ్లోకం చదివాను. మందస్మితంతో అనుగ్రహించి శ్రీవారు, అదే ప్రాకారంలో ఉన్న విష్ణ్వాలయానికి దారి తీశారు. అక్కడ, విష్ణువుమీద పద్యమొకటి చదవ మన్నారు. మా ఊరిలోని మా కులదైవంపై వ్రాసిన పద్యం ఒకటి చదవడం ప్రారంభించాను. మొదటి మూడు పాదాలు చదివానుగానీ నాలుగవ పాదం ఎంతకూ జ్ఞాపకం రాలేదు. గిలగిల లాడాను.

శ్రీవారు వెంటనే ”అస్య పద్యస్య కతిపాదాః” – ఈ పద్యానికి ఎన్ని పాదాలు? అని అడిగారు.

”చత్వారః” – నాలుగు పాదాలు అన్నాను. ”అయం మదనగోపాలః – ఉత వేణుగోపాలః?” అని అడిగారు మళ్ళీ.

”వేణు గోపాలః”

”వేణుః కుత్ర?” – వేణువేదీ?

”దానికోసమే వెతుకుతున్నాను. మరచి పోయాను” – అన్నాను. వెంటనే స్మృతికి తగిలింది. ఆ పిల్లనగ్రోవి –

మధుర బింబాధర సుధ దోగి తోగి యింపొలసి వేణువు దివ్యకళలు గురియ” ఇదీ ఆ పద్యపాదం. చదివాను. మొన్నమొన్న ద్వాపరంలో అవతారం చేసిన పరబ్రహ్మ వస్తువు ఆ గీతాచార్యుడు, ఇప్పుడు అవతారం చేసిన ఈ జగదాచార్యుడు ఒక్కరే అన్న అనుభూతి నాకు కలిగింది. ఆ మీద నా ‘గురుకృపాలహరి’లో శ్రీవారిని శివుడుగా శివలీలా తరంగంలోనూ, కృష్ణుడుగా హరిలీలాతరంగంలోనూ – వట్టి కవిత్వంతో గాదు – ప్రత్యక్షంగా పొందిన అనుభూతితో పెక్కు శ్లోకాలలో కీర్తించుకొన్నాను.

ప్రారబ్ధశేషం

అది నా జాతకంలో క్లిష్టమైన ఘట్టం. జీవన్మరణ సమస్య. మహాప్రస్థాన సమయం. కాలదర్శనం అయింది. దక్షిణాధీశుడు నాకై వచ్చాడు. శ్రీవారు ప్రత్యక్షమై ‘ఇప్పుడే పంపము’ అన్నారు. ఇద్దరూ ఏమో మాట్లాడుకొన్నారు. యమవాహనం గోడదూకి వెళ్ళిపోయింది. ధర్మప్రభువు నిటలాక్షుని చూసి వెనుకడుగు వేసుకొంటూ తన దిశగా వెళ్ళిపోయారు. శ్రీగురుదేవులు ఈ ఘట్టంలో మృత్యుంజయులుగా సాక్షాత్కరించి నాకు మార్కండేయునితో సామ్యం అనుగ్రహించారు. ఈ ఘట్టం నా ‘గురుకృపాలహరి’లో ఉంది. అందులో లేని తరువాతి ఘట్టాన్ని ఇప్పుడు వివరిస్తాను.

చిదంబరానికి అవతలి మజిలీ అయిన ఆనందతాండవపురంలో శ్రీవారు బసచేసి ఉన్నారు. మృత్యుముఖం నుంచి బయటపడిన నేను అక్కడకు ధర్మపత్నితో శ్రీవారి దర్శనానికి పరుగెత్తాను. పూర్తిగా కోలుకోకుండానే రైలులో దక్షిణాదికి దీర్ఘప్రయాణం చేశాను. స్నానం చేసి మడిగా శ్రీవారి దర్శనం చేద్దామని ఒక బసకు వెడుతున్నాను. శ్రీవారు స్వయంగా నాకు ఎదురు వచ్చారు. రైలు బట్టలు, స్నానంలేదు. రాత్రి నిద్రలేదు. ఈ స్థితిలో శ్రీవారికి ఎదురవడ మెట్లా అనుకొంటూ ఒక ఇంట్లోకి వెళ్ళాను. నా వెంటే వారూ అక్కడకు చొచ్చుకొని వచ్చారు. ఇక చేసేదిలేక వెనుదిరిగి సాష్టాంగ పడ్డాను.

తర్వాత కోనేటికి స్నానార్థం బయలుదేరారు. నేనూ వెంట నడిచాను. అది వేసవికాలం. నా శరీరంలో రక్తంలేదు. కాళ్ళు అంటుకుపోతున్నాయి. శ్రీవారు ఏమేమో ప్రసంగం చేస్తూ చెరువుకు తీసుకొని వెళ్ళారు. వారు నీటిలో దిగారు. నేను మెట్లమీద నిలబడ్డాను. కాళ్ళు అంటుకుపోతున్నాయి. వెళ్ళిపోదామా అంటే శ్రీవారు ఏవో మాటలు ప్రారంభించారు. ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక కాలు ఆనించి ఇంకో కాలు ఎత్తుతూ, అతికష్టంమీద ఆ వేడిని తట్టుకొంటూ వారికి జవాబులు చెబుతున్నాను.

స్నానమై వారు మఠానికి దారితీశారు. నేనూ వెంట నడుస్తున్నాను. నేను బసచేసిన ఇంటివద్ద వారు ఆగారు.

”శ్రాంతోసి. విశ్రమస్య. స్నానాదికం కురు” – చాలా అలసిపోయావు. ప్రయాణం బడలిక..విశ్రమించు. స్నానాదికం చేసుకో – అన్నారు.

బ్రతుకుజీవుడా అని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాను. అంతవరకు ఉడికిపోయిన నా పాదాలు హఠాత్తుగా పన్నీటిలో ముంచెత్తినంత చలువదనం పొందాయి. ఆ వేడి అంతా ఏమైందో! హాయి అనిపించింది.

అప్పుడు నాకు అర్థమైంది. రోగరూపంలో నేను అనుభవించవలసిన ప్రారబ్థశేషం క్షణం ముందు వరకు మిగిలిందన్నమాట. ఆ సంగతి శ్రీ గురుదేవులకు తెలుసు. ఆ కర్మ శేషాన్ని నైదాఘతాపం చేత పోగొట్టి సుఖానుభూతికి పాత్రంచేశారు. ఈ అనుభవం ద్వారా అనేక శాస్త్ర తాత్పర్యం అవగాహన చేశారు.

లీలా తాండవ పండితః

ఆనందతాండవపురంలోనే మరో అద్భుత ఘట్టం. శ్రీవారు సంధ్యా వందనానంతరం ఒక దేవాలయ ప్రాంగణంలో పండితులతో పేరోలగం చేశారు.

శ్రీవారు ధార్మిక విషయాలుగాని, వేదాంత విషయాలుగాని బహిరంగ సభలలో ముచ్చటించడం ఎన్నడూ నేను ఎరుగను. కాని ఆనాడు అద్వైతం మీద, దాని గురించిన భిన్నభిన్న ప్రస్థానములు, వాటిలోని సామరస్యం మీద వాదోపవాద సిద్ధాంత సమ్మర్ధంతో శ్రీవారు సంస్కృతభాషలో చేసిన ప్రసంగం కేవలం చిదంబరనాధుడు, నటరాజమూర్తి చేసిన ప్రదోష తాండవమే నని నాకు అనిపించింది. మైమరచి నాలో నేను,

”లీలా తాండవ పండితః”

అని శ్రీవారిని చిదంబరేశ్వరునితో పోల్చుకొని మురిసిపోతున్నాను. వేయిమందిలో నేనుండి, నాలో నేను అనుకొంటున్న మాట ఇది. కానీ, శ్రీవారు ఆలయం గోడకు జేర్లబడి, అటూ ఇటూ ఊగుతూ ”లీలా తాండవ పండితః” అని మూడుసార్లు అన్నారు. దానితో నాకు మతిపోయింది. పరుగు పరుగున వారి సన్నిధి చేరి, ఆనందబాష్పాలు కురుస్తుండగా సాష్టాంగపడ్డాను. శ్రీవారు గంభీరంగా నవ్వారు. ”ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం” అన్న గీతాశ్లోకం స్ఫురణకు వచ్చింది.

ఆ మరునాడు సోమవారం, ప్రదోష సమయంలో శివాలయంలో సభ ఏర్పాటైంది. శ్రీవారు ఆ సభకు నడిచి వెడుతున్నారు. వెనుక నేను ఉన్నాను. వారు నాకేసి తిరిగి ”అస్మిన్‌ దినే సంస్కృత భాషాయాం త్వయా ప్రసంగః కర్తవ్యః” (ఈరోజు నీవు సంస్కృత భాషలో మాట్లాడాలి) అన్నారు. ముందురోజే దాక్షిణాత్యపండితులు సంస్కృతభాషలో వీరవిహారం చేశారు. వారి ముందు ఈ శిశువు నాడించాలని శ్రీవారి కోరిక కాబోలు. ”మీ అనుగ్రహంతో లభించిన వాక్కుతో, మీ ఆజ్ఞానుసారం అలాగే ప్రసంగిస్తాను” అని వారితో అన్నాను.

సభలో దిగ్దంతులైన పండితులున్నారు. శ్రీవారు అగ్రాసనం అలంకరించారు. ఒకరిద్దరు మాట్లాడిని తర్వాత నన్ను పిలిచారు.

అప్పుడు నేను, ”ఏ బ్రహ్మవస్తువు నుండి వాక్కులు (శ్రుతులు) మరలునో, వాచామ గోచరమైన ఆ వస్తువును నిరూపించలేక వెనుదిరుగునో, అలాంటి ఒకానొక సచ్చిదానందాత్మకమైన చంద్రిక (జ్ఞాన ప్రకాశము), మౌళిగాగల (తలమానికముగా గల) పరబ్రహ్మకు, తద్రూపులైన శ్రీ చంద్రశేఖర గురుమూర్తికి నమస్కారం” అనే అర్థం కలిగిన శ్లోకంతో నా ప్రసంగం ప్రారంభించాను.

ఆ మీదట,

అభయం దత్త మేవాస్తి మృత్యుంజయ కుతో భయమ్‌

తాండవే స్థలనం క్వాపి శిశోస్తదపి మండనమ్‌

శ్రీవారు యముని తరిమినప్పుడే ”మృత్యుంజయులు”గా ఈ శిశువుకి అభయ మిచ్చారు. ఇప్పుడు సంస్కృతభాషలో మాట్లాడటమనే ఈ గెంతులలో స్థలనం (తప్పటడుగు) పడితీరుతుంది. ఇది శిశువుచేసే తప్పటడుగు గనుక లయానుగుణంగా ఉంటే అందమే లేదు. తప్పటడుగు పడితేనే అందం” – అన్నాను.

తదుపరి ”నటరాజౌ స్థితే సాక్షాద్గురు వానంద తాండవే, తండుర్యది భ##వేయంమే లీలా తాండవ మస్తుతత్‌” అనే శ్లోకం చదివాను. దీని భావం – సాక్షాద్గురుమూర్తి ఇప్పుడు నటరాజై ఆనందతాండవంలో ఉండగా, నేను శివపరివారంలోని తండువు అనే పరిచారకుడనైతే, నా యీ ఉపన్యాస రూపమైన లీల నిజంగా తాండవమే అవుగాక!

వెంటనే శ్రీవారు ”సుబ్బు శాస్త్రి! శ్రుతంవా అనేన తాండవ శబ్దస్య పరిష్కారః కృతః” – తాండవశబ్దం వ్యుత్పత్తి ఇచ్చాడు, విన్నావా?! — అన్నారు. సుబ్బుశాస్త్రిగారు సర్వశాస్త్ర పారంగతులు. ఆనందంతో తలవూపారు.

ఆపైన సుబ్బుశాస్త్రిగారు ”మీరు వ్రాసి చదివిన శ్లోకంలో మీకు తెలియకుండానే ఒక అద్భుతఘట్టం స్ఫురిస్తోంది. మీ కవిత్వం సార్థకం” అంటూ, అదే ఊళ్ళో అంతకు పదిరోజుల క్రితమే ఒక మూగ కుర్రవానికి స్వామి వాక్కును ప్రసాదించిన ఉదంతాన్ని వినిపించాను.

శ్రీవారు చిరునవ్వుతో అనుగ్రహించారు. సభ్యులు ఆనంద భరితులయ్యారు.

ఇలాంటి వినోదాల ప్రదర్శనలో శ్రీవారికి కుతూహలం ఉందా అనేది ప్రధానప్రశ్న. ఉండదు. అక్కడసలు సంకల్పమే ఉండదు. నిస్సంకల్పస్థితి వారిది. అయితే ఇవి మనకెందుకు కనిపించాయి? ఇది మన మనోవిలాసమే. దృశ్యమంతా మనస్సే. ఈ విషయాన్ని నా ”గురు కృపాలహరి”లో ”నసంకల్ప వేశోభ##వేద్వా వికల్పః” అనే శ్లోకంలో పేర్కొన్నాను.

మనకు చరిత్ర లేదా?

మనదేశానికి లిఖితపూర్వకమైన చరిత్రలేదని సామాన్యంగా అందరూ అనేమాటలు. మన పురాణాలు చరిత్ర కాదని వీరి అభిప్రాయం. క్రీస్తుశకం అనంతరం జరిగిన సంఘటనలను మాత్రమే ఆధునిక విద్యావంతులు చరిత్రగా పరిగణిస్తారు. అంతకు పూర్వం జరిగినదంతా వారి దృష్టిలో చరిత్రకాదు! ఒకవేళ పూర్వ వృత్తాంతాన్ని చరిత్రకింద అంగీకరించవలసివచ్చినా, తమ చారిత్రక పరిశోధనల ప్రకారం పురాణగాధలలో గల సత్యం అత్యల్పం. తమకు నచ్చిన సిద్ధాంతాలకు, తాము నమ్మిన సూత్రాలకు అనుగుణమైన విషయాలు మాత్రమే వారికి విశ్వసనీయాలు.

అప్రాకృతిక సంఘటన లేవైనా వారి దృష్టిలో కేవలం కట్టుకథలు. సాధారణ మానవుని అనుభవానికి, గ్రహణశక్తికి మించినదంతావారు అసత్యంగా కొట్టివేస్తారు. పురాణాల్లో మహిమలూ, అణిమాది సిద్దులూ ఉండడంచేత వాటిని ‘చరిత్ర’గా అంగీకరించరు.

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-9-22

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.