1-న్యాయవాది, చిత్తూరు జిల్లా బోర్డ్ అధ్యక్షుడు ,మద్రాస్ రాష్ట్ర ముఖ్య మంత్రి ,జస్టిస్ పార్టీ నాయకుడు ,నిజాయితీకిమారుపేరు ,జమీందారీ వ్యతిరేకి ,రావు బహద్దర్ ,దివాన్ బహద్దర్- బొల్లిన మునుస్వామి నాయుడు
బొల్లిన మునుస్వామి నాయుడు చిత్తూరు జిల్లా తిరుత్తని దగ్గర వేలాంజరి గ్రామమందు 1885లో జన్మించాడు. తండ్రి బొజ్జా నాయుడు. తల్లి అక్కమాంబ. వీరి పూర్వీకులు కార్వేటి నగర సంస్థానంలో ఉన్నత పదవులలో ఉన్నారు. మునుస్వామి రైతు కుటుంబంలో జన్మించి న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి. ప్రధానమంత్రి పదవి పొందేందుకు ముందు ఆయన ప్రభుత్వం నియమించిన అగ్రికల్చర్ కమిషన్, బ్యాంకింగ్ ఎంక్వయిరీ కమిటీ, బ్యాంకింగ్ ఎకోకొరియర్ కమిషన్ వంటి కమిటీలు, కమిషన్లలో సభ్యునిగా పనిచేశారు.
1908లో మద్రాసు విశ్వవిద్యాలయము నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా రాణించాడు. జస్టిస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ రంగంలో అడుగు పెట్టాడు. చిత్తూరు మునిసిపల్ కౌన్చిల్ సభ్యునిగా, చిత్తూరు జిల్లా బోర్డు ఉపాధ్యక్షునిగా, అనంతరం అధ్యక్షునిగా, మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా అంచలంచెలుగా ఎదిగాడు. అవిభక్త మద్రాసు రాష్ట్ర ప్రధాన మంత్రి (బ్రిటీషు వారి పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రధాన మంత్రిగా పిలచేవారు) గా 1930-1934 వరకు పదవిని అత్యున్నతంగా నిర్వహించాడు.[1]
1930ల్లో జస్టిస్ పార్టీలో నాయకునిగా ఎదిగిన మునుస్వామి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పనిచేసే జస్టిస్ పార్టీ తీరుమార్చే ప్రయత్నాలు చేశారు. స్వయంగా బ్రాహ్మణేతరుడైనా, తాను బ్రాహ్మణులను ద్వేషించడం ప్రధానాంశంగా అభివృద్ధి చెందిన జస్టిస్ పార్టీలో నాయకుడైనా ద్వేషం తగదని, బ్రాహ్మణులతో సఖ్యతగా, ప్రేమతోనే అభివృద్ధి సాధించాలని వాదులాడేవారు. బ్రాహ్మణులను కూడా జస్టిస్ పార్టీలో చేర్చుకోవచ్చన్న ప్రతిపాదనను చేసినవారు ఆయన.
మద్రాసు శాసనసభలో వివిధ కమిటీలలో సభ్యునిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాడు. ఆచార్య ఎన్.జి.రంగా గారితో కలిసి జమీందారులకు వ్యతిరేకంగా, ఎస్టేట్ లెవల్ చట్ట సవరణకు పూనుకున్నాడు. ప్రధాన మంత్రిగా ఎన్నో ప్రజాహిత, అభ్యుదయ కార్యక్రమాలు చేపట్టాడు. జమీందారులంతా కలిసి నాయుడుకు వ్యతిరేకులై గవర్నర్ పై ఒత్తిడి తెచ్చారు. అదే సమయములో తన వద్ద పనిచేసే బంట్రోతు పావలా లంచం తీసుకున్న విషయం తెలియడంతో నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ వాహనాన్ని వదలి గుర్రపు బగ్గీలో ఇంటికెళ్ళిన నిజాయితీపరుడు.
నాయుడు సేవలు గుర్తించిన బ్రిటీషు ప్రభుత్వం 1926లో రావు బహద్దర్, 1930లో దివాన్ బహద్దర్ బిరుదులను ప్రదానం చేసింది.
వీరు 8వతేదీ నుండి అస్వస్థతకు గురియై, జనవరి 13, 1935 తేదీన ఉత్తరాయణం ప్రవేశించిన పుణ్యతిథిన 50వ ఏట వైకుంఠప్రాప్తిని పొందారు.[2]
ఈయన జీవిత చరిత్ర “శ్రీయుత దివాన్ బహదూర్ మునుస్వామి నాయుడు గారియొక్క జీవిత చరిత్రము”ను ఆయన వద్ద ఆంతరంగిక సహాకుడుగా పనిచేసిన ఉమాపతి వ్రాశాడు.
2-క్విట్ ఇండియా ఉద్యమ నేత ,మద్రాస్ శాసన సభ్యుడు,27ఏళ్ళు నంద్యాలలోక్ సభ సభ్యుడు,కేంద్ర పార్లమెంటరి వ్యవహారాలమంత్రి ,వాసవీ విద్యా సంస్థ స్థాపకుడు ,వక్త ,సంజీవరెడ్డి శిష్యుడు – పెండేకంటి వెంకటసుబ్బయ్య
పెండేకంటి వెంకటసుబ్బయ్య (జ: జూన్ 18, 1921 – అక్టోబర్ 12, 1993), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. వీరు నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నియోజకవర్గం నుండి లోక్‌సభకు నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు. వెంకటసుబ్బయ్య 1980 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వములో గృహ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రిగా పనిచేశాడు. ఈయన బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు.[1]
బాల్యం, విద్య
వెంకటసుబ్బయ్య కర్నూలు జిల్లా, బనగానపల్లె సంస్థానంలోని సంజామల గ్రామంలోని ఒక సంపన్న రైతు కుటుంబంలో, 1921 జూన్ 18న జన్మించాడు. నంద్యాలలో విద్యార్థిగా ఉన్నప్పుడే జాతీయోద్యమ కార్యక్రమాల్లో జైలు శిక్షను లెక్కచేయకుండా క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఈయన కనకమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.[2]
వెంకటసుబ్బయ్య మదనపల్లె బీటీ కళాశాలలో చదువుతున్న రోజుల్లో క్విట్ ఇండియా, హోం రూల్ ఉద్యమంలో భాగంగా ఇప్పటి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీటీ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కార్యాలయాన్ని ముట్టడించి లోపలికి దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అప్పట్లో ధర్నాలంటే ఆషామాషీ కాదు. చాలా పెద్ద నేరం కింద జమకడతారు. ఆందోళన చేసే వారిపై బ్రిటీష్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేశారు. వెంకటసుబ్బయ్యతో పాటు సహ విద్యార్థులైన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, సి.దాస్, నూతి రాధా కృష్ణయ్య తదితర 40మంది విద్యార్థులను అరెస్టు చేశారు.
బనగానపల్లె సంస్థానంలో కాంగ్రేసును స్థాపించి, స్వాతంత్ర్యం తర్వాత 1948లో బనగానపల్లె సంస్థానం భారతదేశంలో విలీనం కావటానికి దోహదపడ్డాడు. 1948లో మద్రాసు శాసనసభ సభ్యుడయ్యాడు.[2] ఆ తరువాతి కాలంలో నంద్యాల లోకసభ సభ్యునిగా 27 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాడు.
ఇతర విశేషాలు
గాంధేయవాది అయిన వెంకటసుబ్బయ్య వాసవీ విద్యాసంస్థలను స్థాపించి, వాసవీ ఇంజనీరింగ్ కళాశాల[3], పెండేకంటి న్యాయ కళాశాల, పెండేకంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్[4], వాసవీ సంగీత, నాట్య కళాశాల[5] మొదలైన అనేక విద్యాసంస్థల స్థాపనకు దోహదపడ్డాడు.72వ ఏట 12-10-1993న మరణించాడు
బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నప్పుడు గురువు సంజీవరెడ్డి తో పాటు ఉయ్యూరు ఎన్నికల ప్రచారానికి వస్తే ,ట్రావెలర్స్ బంగ్లా లో ఇద్దర్నీ చూశాను .నాలుగు రోజులతర్వాత ఢిల్లీ వెళ్లి ఇందిరా కాంగ్రెస్ లో చేరి జంప్ జిలానీ అనిపించుకొన్నాడు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-22-ఉయ్యూరు