మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ,ఆపద్ధర్మగవర్నర్,చతుర్భాషా పండితుడు ,నాటకకర్త ,సంగీత నాటక అకాడెమి అధ్యక్షుడు -పాకాల వెంకట రాజమన్నార్
— పాకాల వెంకటరమణారావు రాజమన్నార్ (మే 1, 1901 – అక్టోబర్ 1, 1979) న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. 1948 నుండి 1961 వరకు మద్రాసు రాష్ట్రపు ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[1] అప్పటి మద్రాసు రాష్ట్ర గవర్నరు ఏ.జె. జాన్ మరణించడంతో హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా ఉన్న రాజమన్నారు 1957 నుండి 1958 వరకు మద్రాసు రాష్ట్ర ఆపద్ధర్మ గవర్నరుగా పనిచేశాడు[2][3]
జననం
రాజమన్నార్ 1901లో మద్రాసులో జన్మించాడు. ఈయన తండ్రి వెంకట రమణారావు నాయుడు అప్పటికే ప్రముఖ న్యాయవాది. ఆ తర్వాత మద్రాసు హైకోర్టులో న్యాయధిపతిగానూ, ప్రధానన్యాయాధిపతిగానూ పనిచేశాడు. రాజమన్నార్ కూడా తండ్రిబాటలోనే న్యాయవాదిగా 1924లో బార్ లో చేరాడు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ 1944లో అత్యున్నత పదవైన అడ్వకేటు జనరల్ అయ్యాడు.[4]
రాజమన్నార్ తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, ఫ్రెంచి భాషలలో పాండిత్యం సంపాదించాడు. తెలుగులో విప్లవాత్మక నాటకాలెన్నో వ్రాశాడు. సమకాలీన నాటకరంగాన్ని, సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విమర్శకునిగా కూడా పేరుతెచ్చుకున్నాడు. కొంతకాలం లలితకళకు సంబంధించిన తమిళ మాసపత్రిక “కళ”కు సంపాదకత్వం వహించాడు.[5] ఈయన ఫోటోగ్రఫీ ఒక హాబీ. రాజమన్నార్ వ్రాసిన నాటకాలెన్నో రేడియోలో ప్రసారమయ్యాయి. వాటిలో చాలా అనేక భాషలలోకి అనువదించబడ్డాయి. ఈయన బళ్ళారి రాఘవతో కలిసి “తెగని సమస్య” అనే నాటకాన్ని రచించాడు. తెలుగులో ఏకాంకికలు వ్రాసిన ఆద్యులలో ముద్దుకృష్ణ, చలంలతో పాటు రాజమన్నారు కూడా ఒకడు.[6] ఈయన వ్రాసిన నాటకాలలో తప్పెవరిది?,[7] ఏమి మగవాళ్లు, నిష్ఫలం, విముక్తి, వైకుంఠాచార్యులు, దెయ్యాలలంక, నాగుపాము, వృథాయానం, సంకల్పం, కఠినమార్గం, పరకీయ, నందిని, వెర్రిముండ, బంధాలు, భార్యాభర్తలు ముఖ్యమైనవి. “శృతితప్పిన సజీవన రాగం” అనే నవలను కూడా రచించాడు. నీడలేని ఆడది అనే సినిమాకు కథను అందించాడు[8]. ఇతడు ఈయన కళలకు, సాహిత్యానికి చేసిన సేవకు తగ్గట్టుగా భారతీయ సంగీత నాటక అకాడెమీకి అధ్యక్షునిగా నియమితుడయ్యాడు.
రాజ్‌మన్నార్ కమిటీ
1969లో అప్పటి తమిళనాడు డి.ఎం.కె ప్రభుత్వం కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై సమీక్షకు పి.వి.రాజమన్నార్ అధ్యక్షతన ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. ఇది రాజ్‌మన్నార్ కమిటీగా ప్రసిద్ధిచెందినది. రాజ్‌మన్నార్‌తో పాటు మద్రాసు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఏ.లక్ష్మణస్వామి ముదలియార్, ఆంధ్రరాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రారెడ్డిలు ఈ కమిటీలో సభ్యులు.[9] సమాఖ్య ప్రభుత్వంలో కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై సమీక్షించి విలువైన సూచనలిచ్చింది. ఈ కమిటీ ఇచ్చిన సూచనలలో ముఖ్యమైనది “అంతర్రాష్ట్ర మండలి”ని ఏర్పాటుచేయడం.i
మరణం
రాజమన్నారు 1979, అక్టోబర్ 1 న 78 వ ఏట మద్రాసులో మరణించాడు.
మీ గబ్బిట దుర్గాప్రసాద్-14-9-22-ఉయ్యూరు