మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -2

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -2

5-శతావధాని,ఘంటా శతక ,సాంబ లక్షణ కర్త శ్రీ గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి

గాడేపల్లి వీరరాఘవశాస్త్రి గొప్ప కవి. శతావధాని.

జీవిత విశేషాలు
ఇతను తన 11వ యేట బ్రహ్మోపదేశమైన తరువాత తండ్రివద్దనే షోడశకర్మలు, యజుర్వేద సంహిత, అరుణపంచకము, ఉపనిషత్పంచకము మొదలైనవి అభ్యసించాడు. మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద కావ్యపఠనము చేశాడు. నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేశాడు. అష్టావధానాలు, శతావధానాలు అటు గద్వాల మొదలుకొని ఇటు మద్రాసు వరకు లెక్కకు మించి చేశాడు. ఇతడు గద్వాల సంస్థానంలో చాలా కాలం ఆస్థాన పండితుడిగా ఉన్నాడు. అంతకు ముందు మార్కాపురంలో ఆంధ్రపండితుడిగా కొంతకాలం పనిచేశాడు. ఇతడు వ్రాసిన వ్యాసాలు త్రిలిఙ్గ,దివ్యవాణి(పత్రిక), కల్పవల్లి, గోలకొండ పత్రిక మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

అవధానాలు
ఇతడు మొదటిసారి 1913లో తన విద్యాగురువు రాళ్ళభండి నృసింహశాస్త్రి అధ్యక్షతన ఎఱ్ఱగొండపాలెంలో అష్టావధానం నిర్వహించాడు. తరువాత 1938 వరకు 25 సంవత్సరాలు సుమారు 200 అవధానాలు చేశాడు. ఇతడు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, గుంటూరు, బళ్లారి, చిత్తూరు జిల్లాలలోను, తెలంగాణా జిల్లాలలోనూ, మైసూరు రాష్ట్రంలోను అష్టావధానాలు, శతావధానాలు ప్రదర్శించాడు. ఇతడు ఘంటాశతము అనే అవధానాన్ని అంటే ఒక గంటలో ఒక శతకాన్ని ఆశువుగా చెప్పే కార్యక్రమాన్ని నిర్వహించి మంచి పేరు గడించాడు[1].

రచనలు

 1. త్రిపురాంతక స్థల మహాత్మ్యము (3 ఆశ్వాశముల కావ్యము)
 2. సత్యవరలక్ష్మీ ధృవచరిత్రము (1947)
 3. అహోబల మహాత్మ్యము (1919)
 4. మార్కండేయ చరిత్రము (హరికథ)
 5. రామభూపతి శతకము (1914)
 6. దీనకల్పద్రుమ శతకము (1916)
 7. విశ్వేశ్వర శతకము (1916)
 8. సోమేశ్వర శతకము (1916)
 9. చెన్నకేశవ శతకము (1916)
 10. ఆర్యవిద్యా ప్రబోధిని
 11. ద్విపద భగవద్గీత
 12. ముకుందమాల(ఆంధ్రీకరణం)
 13. పింగళ హరికథ
 14. సాంబలక్షణ(శృంగారకావ్యము)
 15. హైమవతీ పరిణయము
 16. భూగంగాస్తుతి
 17. మార్కండేయ నాటకము
 18. సీతారామ కళ్యాణము(ద్విపద)
 19. సీతారామ కల్పద్రుమ శతకము
 20. వెంకటేశ్వర శతకము
 21. కుమార సుబ్రహ్మణ్య చరిత్ర
 22. మెదకు సంస్థానాధీశుల చరిత్ర
 23. హరివంశము (అసంపూర్ణము)
 24. ఐరావత వ్రతకథ
 25. చమత్కార కవిత్వము-1949[2]

రచనలనుండి ఉదాహరణలు
1.ధర మధురాధర ధర సుధారస ధారలన్ ద్వజించి యే

యిరవుననో సుధల్ దొరకు నెంతయునంచు దలంచు టెంచగా

దొరికిన పెన్ని ధానమును దొంగల కిచ్చుచు రిత్త నేల యం

దరయ ధానాప్తికై వెదకునట్టి తెరంగగుగాదె ధీమణి!

2.అన్నా!విద్దెల నెల్ల నేర్చితివె, నెయ్యం బార నీ యొజ్జలున్

సన్నాహంబున నేర్పిరే,యిపుడికే సందేహమున్ లేక నీ

విన్నాళ్ళున్ బఠియించు శాస్త్రమున నేదే నొక్క పద్యంబు సం

పన్నార్థంబుగ నీ సుధా మధుర వాక్ప్రావీణ్యతన్ చెప్పుమా!

(అహోబల మహాత్మ్యము నుండి)

3.సకల జీవులలోని చైతన్యమును గన్న

నానంద పారవశ్యంబు గాంచు

నలుసంత బాధ యేనా డెవ్వడందిన

దా బాధపడి దాని దలగ జూచు

పరుషోక్తులే పసిపాపలు పల్కిన

హరిహర యని చెవుల్ దరియ మూయు

రాజసంబన్న దొఱల జేరగా నీక

బీద సాదల మైత్రి బెం పొనర్చు

అక్షరాభ్యాస మపుడె పంచాబ్ద మాత్ర

బాలుడై కూడ నిటువంటి లీల బొదలె

నద్దిరే ధృవు విజ్ఞాన మడుగవలనె

పూవునకు తావి సహజమై పొసగుటరుదె!

(శ్రీ సత్యవరలక్ష్మీ ధృవచరిత్రము నుండి)

అవధానాల నుండి ఉదాహరణలు
· సమస్య: పతి తల గోసి వండె నొక పాంథుని నాతి మనోహరంబుగన్

పూరణ:

కుతకము మీఱ కకుంఠిత భక్తిని బోవుచుండి వి
స్తృత నవపల్లవావృత దిదృక్షుముదావహ తింత్రిణీకుజా
ప్రతిమపు నీడలో విడిసి, పప్పుడుకెత్తెడునంత నాకురు
ట్పతి తలగోసి వండె నొక పాంథుని నాతి మనోహరంబుగన్

· సమస్య: భీష్ముని పెండ్లికి ఏగిరట పిన్నలు పెద్దలు బంధులందఱున్

పూరణ:

గ్రీష్మములోన లగ్న మరిగెన్ – సమకూర్చెద నన్న బార్గవా
ర్చిష్మ దనూన కోపమతిశీతలమయ్యె బ్రతిజ్ఞ చూడగా
భీష్మముగాగ మాఱె; దలపెట్టని వన్నియు దాపురించె నా
భీష్ముని పెండ్లికి; ఏగిరట పిన్నలు పెద్దలు బంధులందరున్

పండిత ప్రశంసలు
పటుతరధారణా పటిమ పండిత మోద మెసంగు వాణి, రా

ట్చటుల సభాంతరాళ కవి సంఘ పరిస్తుత, కీర్తి, సర్వది

క్తటముల దాండవింపగను గౌరవమున్, బ్రతివాది దుర్థమ

తృటనము నిర్వహించు కొనుతోరపు శక్తియు నీకె రాఘవా!

-బుక్కపట్టణము శ్రీనివాసాచార్యులు

6- పంచభాషా పండితుడు ,మా హంపి కావ్యకర్త -భాస్కరాచార్య రామచంద్రస్వామి
కుటుంబ చరిత్ర
భాస్కరాచార్య రామచంద్రస్వామి[1] 1905లో జన్మించాడు. భాస్కరాచార్య పరంపరా పీఠానికి అధ్యక్షుడైన పట్టాభిరామస్వామికి ఇతడు దత్తపుత్రుడు. తల్లి పేరు నాగలక్ష్మమ్మ. భార్య అంబమ్మ. ఇతడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. కుమారుడి పేరు టి.బి.రామమూర్తి. కుమార్తెలు కమలమ్మ, స్వర్ణమ్మ.

విద్యాభ్యాసము
ఇతడు బళ్ళారిలో సంస్కృతాంధ్రములు అధ్యయనం చేశాడు. తరువాత విజయనగరంలోని సంస్కృత కళాశాలలో చేరి కావ్యనాటక సాహిత్యములు చదువుకున్నాడు. స్వయం కృషితో కన్నడ, మలయాళ, హిందీ, తమిళ, బెంగాలీ మొదలైన అనేక భాషలలో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. వీటితో పాటు జ్యోతిషశాస్త్రము, తంత్రశాస్త్రములలో నిష్ణాతుడైనాడు.

రచనలు
· అభిజ్ఞాన శాకుంతలము ఆంధ్రీకరణము

· బాటసారి

· మా హంపి

· యాత్రికుడు[2]

రచనల నుండి ఉదాహరణ
యాత్రికుడు కావ్యం నుండి మచ్చుకు రెండు పద్యాలు

గీ. ఎన్నఁడీ యాత్రకు మొదలొ, ఎప్పుడు తుదియొ?
బ్రతుకు నాల్గు దినమ్ముల – పాంథశాల
రస మిగిరి పోవ, శక్తి నీరసత నొందు
బాత్ర మున్నంత నింపుము ప్రాత మధువు

గీ. విందు వలదు – కపూరంపు – విడెము వలదు
వలదు కనకాభిషేక సంభావనలును
అంద అనుభవమునకు, నానందమొకఁడె
పంచిపెట్టుము – త్రావుము – ప్రాత మధువు

7-కవి ,కధకుడు,నిర్వచన వెంకట రామాయణ కర్త శారదాపుత్ర, పి.వెంకటరెడ్డి
పి.వెంకటరెడ్డి తెలుగు కథా రచయిత.[1
జీవిత విశేషాలు
ఆయన కడప జిల్లా, ప్రొద్దుటూరు తాలూకా, పర్లపాడు గ్రామంలో బాలిరెడ్డి, రామాంబ దంపతులకు జూలై 1 1922లో జన్మించారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగోతరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. వీరి గ్రామస్థులు, గురువు అయిన జీరెడ్డి చెన్నారెడ్డి కవితాభ్యసనమునకు మార్గదర్శనము చేసిరి. ఆయన తెలుగు భాషలో విధ్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు. ఆయనకు “శారదా పుత్ర” అనే బిరుదము ఉంది. వీరికి గోవిందరెద్డి, వెంకట రెడ్డి అనే సోదరులు, ఇద్దరు సోదరీమణులున్నారు. ఆయన తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర శాఖలో పనిచేసిరి.

సాహిత్య ప్రవేశం
ఆయన స్వగ్రామంలో కవిరత్న బిరుదాంకితులైన కశిరెడ్డి వెంకటరెడ్డి “బాల రామాయణము” రచించిరి. దానిని ఆదర్శంగా తీసుకొని వెంకటరెడ్డి “శ్రీమాన్ నిర్వచన వెంకట రామాయణం” పేరుతో మూడువేల పద్యములతో “రామాయణము” వ్రాసిరి. అది అముద్రితము.[1]

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.