మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు
1-కన్నడం లోనూ కవిత్వం చెప్పి ,వేదాంగ నిష్ణాతుడైన కవి సవ్య సాచి –శ్రీ కిరికెర రెడ్డి భీమరావు
కిరికెర రెడ్డి భీమరావు[1] (జూన్ 13, 1896 – మార్చి 9, 1964) తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు.
జీవిత చరిత్ర
బడగనాడు శాఖకు చెందిన బ్రాహ్మణకుటుంబంలో 1896, జూన్ 13 వ తేదీన రెడ్డి అప్పూరావు, వేంకటలక్ష్మమ్మ దంపతులకు అనంతపురం జిల్లా, హిందూపురం తాలూకా, కిరికెర గ్రామంలో జన్మించాడు. గౌతమస గోత్రుడు. మాధ్యమిక విద్య వరకు హిందూపురంలోని ఎడ్వర్డ్ కారనేషన్ స్కూలులో చదివాడు. తర్వాత బెంగళూరులో మిషన్ స్కూలులో కొంతకాలం చదివి మైసూరులో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు. మైసూరులో స్వయంకృషితో కన్నడ భాషలో ఛందోవ్యాకరణాలలో నిష్ణాతుడయ్యాడు. ఆ భాషలో కవిత్వం చెప్పనేర్చాడు. మైసూరు సంస్కృత కళాశాలలోని పలువురు విద్వాంసుల సహకారంతో సంస్కృతం నేర్చి వ్యాకరణాది అలంకార సూత్రాలను, ఆయుర్వేదము, జ్యోతిశ్శాస్త్రము, సాముద్రికము, వేదాంతము మొదలైన వేదాంగాలను నేర్చుకున్నాడు. పెనుకొండలోని అసిస్టెంట్ ఇంజనీయరు ఆఫీసులో క్లర్క్‌గా చేరి ఒక సంవత్సరం పనిచేశాడు. తరువాత తండ్రి మరణంతో వంశపారంపర్యంగా వచ్చిన మునసబు ఉద్యోగంలో చేరాడు. ఇతనికి 22వ యేడు వివాహమైంది. ఒక కొడుకు ఒక కూతురు జన్మించిన తర్వాత 32వ యేడు భార్య మరణించింది. ఇతడు తన 68వ యేట 1964, మార్చి 9 న మరణించాడు.
రచనలు
తెలుగు భాషలో
- వాయునందన శతకము
- భీమేశ్వర శతకము
- భక్తి పంచకము (ఐదు శతకములు)
- తిరుమలాంబ (నవల)
- శత్రునిగ్రహము (నవల)
- దశావతారములు
- మహేంద్రవిజయము (నాటకం)
- చంద్రమౌళి (నాటకం)
- గరుడ గర్వభంగము (హరికథ)
- సీతాకళ్యాణము (హరికథ)
- కృష్ణరాయబారము (హరికథ)
- కృష్ణగారడి (హరికథ)
- జాతక సుధానిధి (2 భాగములు)
- యోగాయుర్దాయ దర్పణము
- భీముని సాముద్రికము
- జ్ఞానవాశిష్టరత్నములు
- విజయనగర కళావిలాసము
- పితృభక్తి
- జగన్నాయక తారావళి
- యోగవాశిష్ఠము
- ఆధ్యాత్మ రామాయణము
కన్నడ గ్రంథాలు
- ಭಗವದ್ಗೀತ
- ಉತ್ತರಗೀತ
- ಗೀತಾಂಜಲಿ
- ವಿಜಯ ಗೌತಮ
- ಭೀಮೇಶ್ವರೀಯಂ
- ಪಾಂಡವಾಜ್ಞಾತವಾಸ
- ಕೃಷ್ಣ ಮಾಯಾವಿಲಾಸ
- ಯುಗಂಧರ ಪ್ರಜ್ಞೆ
బిరుదులు సత్కారాలు
· బాలసరస్వతి మండలి, పెనుకొండ బాలకవి బిరుదుతో సత్కరించింది.
· 1946లో బెంగళూరులోని విశ్వకళాపరిషత్ ఆంధ్ర కర్ణాటక కవికేసరి బిరుదును ప్రదానం చేసింది.
· బళ్ళారి ప్రముఖులు 1956లో కవిసవ్యసాచి అనే బిరుదును ప్రదానం చేసి సన్మానించారు.
2-వేదవేత్త ,శతకకర్త ,కవిచంద్ర –శ్రీ యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ
యమ్మనూరుసుబ్రహ్మణ్యశర్మ[1] అనంతపురంజిల్లా హిందూపురం తాలూకా కొండాపురం గ్రామంలో 1886, జనవరి 25కు సరియైన పార్థివ నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి నాడు శేషశాస్త్రి, వెంకమ్మ దంపతులకు జన్మించాడు. బ్రాహ్మణకులంలో ములకనాడు శాఖకు చెందిన శర్మ శౌనకస గోత్రుడు. ఇతడు చిన్నతనంలో పల్లెటూరి బడిపంతుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఉపనయనమైన తరువాత చిత్తూరు జిల్లా, మదనపల్లె తాలూకా చదుము గ్రామంలో శంకరావధాని వద్ద వేద విద్య చదువుకున్నాడు. కుందలగురికి వేంకటనారాయణకవి ఇతనికి ఛందో వ్యాకరణాలు నేర్పించాడు.
రచనలు
- శ్రీ పులివెందల రంగనాయకశతకము
- శ్రీరుక్మిణీ కళ్యాణము
- వామన చరితము
- అనసూయ
- సావిత్రోపాఖ్యానము
- కర్ణాభ్యుదయము
- శ్రీ భక్తజన మనోభిరామము
బిరుదము
గోరంట్ల గ్రామంలో జరిగిన పండితమండలి మహాసభలో చిలుకూరు నారాయణరావు ఇతనికి కవిచంద్ర అనే బిరుదును ప్రదానం చేసి సత్కరించాడు.
రచనల నుండి ఉదాహరణలు
1.శ్రీకర్ణాభ్యుదయము కావ్యములోని పుత్రునికై కుంతీదేవి విలపించే ఘట్టం
హా!యను;ముద్దుగుల్కు తనయా!యను నిర్జితసుందరాస్య చం
ద్రా! యనుఁ దాపదుఃఖ రహితా!యను నిందిత శంబరారి రూ
పా! యను దివ్యధామ దినపా!యను బంధుర భర్మవర్మ దీ
ప్తా! యనుఁగార్యమింక గలదా!యనుఁదానెనలేని వంతచేన్
తదనంతరంబ నలుదెసలం బరికించి
పుత్రుఁడా!జితకాంతి మిత్రుడా! సౌవర్ణ
గాత్రుఁడా!నీకునే శత్రునైతిఁ
జూతునా! నిన్నింక నేతీరుగానైన
బ్రీతిచేఁగనులార భూతలమున
నందనా! నినుఁబాసి యుందునా మహియందు
మందునా! నేనింక గుందువదలి
కొమరుఁడా! నాపాలి యమరుఁడా! మాముద్దు
కొమరుఁడా! యనఁదగు కొమరువాఁడ
చేతులారంగఁజేసితి పాతకంబు
నీతిదప్పితి నే పుత్ర ఘాతినైతి
భూతలంబున సత్కీర్తి వొందనైతి
వేయు నేటికి నీకునే దాయనైతి
2.శ్రీ భక్త జన మనోభిరామము కావ్యం నుండి
మోకులం బిగగట్టి మోకరించుచు లాగి
వీకతోగేకలు వేయువారు,
గోవింద!గోవింద!గోవింద! యనుచును
తేరీడ్చుటకు ముందు దెరలువారు
తేరు చక్కియలందు జేరి బారులుదీరి
బూర గొమ్ములనూది పొనరువారు
జయ వేంకటాద్రీశ! జయ శేషశైలేశ!
జయదేవ సర్వేశ! జయతు యనుచు
సొరిది కరతాళములదట్టి తిరుగువారు
చెలఁగి హరినామకీర్తనల్ సేయువారు
గ్రక్కునను శౌరినటగాంచి మ్రొక్కువారు
మొట్ట మొదలున ముడుపులు గట్టువారు
వేత్ర హస్తుల పంక్తి వేంకటేశుని మ్రోల
వ్రాలి మున్నిడి బరాబరులు సలుప
భూమీసురోత్తముల్ వేమరుస్వామికి
వింజామరమ్ములు వేయుచుండ
సాధ్వీమణులు గూడి సాగు యరదముపై
మల్లియల్ మొల్లలు జల్లువారు
వేల్పు బానిసలెల్ల చాల్పుగా నిలుచుండి
నతులొనర్చుచు నర్తనములు సలుప
వేద నాదంబుచే ద్విజుల్ విల్లసిలగ
తూర్యనినదంబులమిత సంతోషమొసగ
హారతులనెత్తి రహిజెంది యబలలలర
వేంకటేశుండు రథమున వెలుగుచుండె
3-కవిసార్వభౌమ ,కావ్యతీర్ధ ,కవితా సామ్రాజ్య స్థాపకులు ,మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ
సంస్కృతాంధ్ర కవితాసామ్రాజ్యాన్ని ఏకఛత్రంగా ఏలిన కవిసార్వభౌముడు మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ (ఆగష్టు 23, 1900 – అక్టోబరు 2, 1974) [1].
జీవిత విశేషాలు
మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ నెల్లూరు జిల్లా (ప్రస్తుతం ప్రకాశంజిల్లా) కు చెందిన పట్టాభిరామపురం అగ్రహారం లో స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో 1900 ఆగష్టు 23వ సంవత్సరంలో జన్మించాడు. తండ్రి నృసింహ సిద్ధాంతి జ్యోతిష పండితుడు. ఇతడిది పండితవంశము. ముత్తాత, తాత, పినతండ్రి అందరూ పండితులే. సింగరబొట్లపాలెం అగ్రహారంలోని వేదపాఠశాలలో కృష్ణయజుర్వేదం చదువుకున్నాడు. కడపలో జనమంచి శేషాద్రిశర్మ వద్ద నాటకాలంకారము, సాహిత్యము నేర్చుకున్నాడు. 1923లో కలకత్తా నుండి కావ్యతీర్ధ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. 1930లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఉభయభాషాప్రవీణ ఉత్తీర్ణుడయ్యాడు. 1937లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పట్టా పొందాడు. 1924లో మద్రాసులోని వావిళ్ల ప్రెస్‌లో ఆంధ్రపండితునిగా, 1925-1959ల మధ్య కాలంలో నంద్యాల మునిసిపల్ హైస్కూలులో అధ్యాపకుడిగా, 1960-1961ల మధ్య కర్నూలు సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హైస్కూలులోను, సాంస్క్రిట్ ఓరియెంటల్ హైస్కూలులోను తెలుగు పండితునిగా పనిచేశాడు.
…