మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-3
దేవేంద్ర సంసారం
దేవేంద్రుని తత్వ బోధినీ సభ క్రమ౦గా ఎందఱో మహనీయులను ఆకర్షించి సభ్యులుగా చేర్చి బహుళ వ్యాప్తమైంది .అందులో అప్పటి రాజు మహతాబ్ చ౦ద్ బహదూర్ ,ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజెంద్రలాల్ మిత్ర ,రాం గోపాల్ ఘోష్ ,శంభూనాథ పండిట్ ,శ్రీశ చంద్ర రాయ్ మొదలైన మహానీయులెందరో సభ్యులైనారు .నూనూగు మీసాల నూత్న యవ్వన వయసులో దేవేంద్రుడు ఈ అద్భుతం సాధించి లోక ప్రశస్తి పొందాడు .తండ్రి ద్వారకా నాథుడు రాజకీయాలు వదిలేసి వాణిజ్యం లో దిగాడు .’’కార్ ఠాకూర్’’అనే సంస్థ నెలకొల్పాడు .
దేవేంద్రుడువివాహమాడి చదువుతో పాటు సంసారం ,జమీందారీ కార్యక్రమాలు నిర్వహించటం ప్రారంభించాడు .అన్నిటా నైపుణ్యం పొంది తండ్రికి తగిన కుమారుడు అనిపించాడు .అయితే సంసార జీవితం మాత్రం తామరాకు పై నీటి బొట్టుగా చూశాడు .తత్వ బోధిని సంస్థ చేత కలకత్తా లో ఒక కొత్త విద్యాలయం నెలకొల్పాడు .ఇందులో ఉపనిషత్తులు శాస్త్రాలు స్వధర్మ విద్య నేర్పారు .పాఠ్య గ్రంధాలు ఆంగ్లేయ వాసన తో ఉండటం గ్రహించి ,అక్షయకుమార దత్తు మొదలైన పండిత ప్రకా౦డులతో వాటిని రాయించి తేలికగా బోధించే వీలు కల్పించాడు .దీని వలన వంగ సాహిత్యం యొక్క గొప్పతనం యువత తెలుసుకోవటానికి వీలు కలిగింది .ప్రజాబాహుళ్యం లో భాషా వ్యాప్తికి ‘’తత్వ బోధిని మాస పత్రిక ‘’కూడా స్థాపించి నిర్వహించాడు .ఇది గొప్ప మార్గ దర్శనం చేసి బహుళ ప్రచారమైంది .ఇందులో వేద, వేదాంతాలు సకల హిందూ ధర్మ శాస్త్రాలలోని మర్మాలను సూక్ష్మగా గ్రహించే వీలు కల్పించాడు .పుస్తకాలు దొరకటం కష్టమైన ఆకాలం లో తత్వ బోధిని సభ చేత ఒక గ్రంథసభ ,పుస్తకాలయం కూడా ఏర్పాటు చేయించి అందుబాటు లోకి తెచ్చాడు .ఇది ఏషియాటిక్ సోసిటీకి అనుబంధంగానడుస్తుంది .తర్వాత దీన్ని ‘’ఆది బ్రాహ్మసమాజ పుస్తకాలయం ‘’గా మార్చారు .ఇక్కడ దొరికినట్లుగా అతి ప్రాచీన గ్రంథాలు ఇంకెక్కడా దొరికేవి కావు .
విద్యావంతులైన పెద్దలతో తరచూ సమావేశాలు జరుపుతూ దేశీయులకు ఉపయోగపడే మహా విద్యాలయం ఒకటి స్థాపించాలని చెప్పేవాడు .దీనికోసం కలకత్తా లోని సిమ్లా భవనం లో ఒక సభ ఏర్పాటు చేశాడు .దీనికి పండితులు విద్యావంతులు గృహస్తులు చాలామంది వచ్చారు .వీరందరిఏకాభిప్రాయంతో 1845లో ‘హిందూ హితార్ధి విద్యాలయం ‘స్థాపించాడు .వెంటనే దీనికి 40వేల రూపాయల మూల దనం ఏర్పడింది .సుప్రసిద్ధ కర్మవీరుడు ,మహా పండితుడు భూదేవ ముఖోపాధ్యాయుడిని దీనికి అధ్యక్షునిగా ఎన్నుకొన్నారు .తండ్రి ద్వారకా నాథుడు రెండు సార్లు ఇంగ్లాండ్ వెళ్లి విక్టోరియా రాణి ,పోప్,ప్రష్యా ప్రిన్స్ ,ఫ్రాన్స్ బెల్జియం ప్రభుత్వాల చేత సత్కరి౦పబడ్డాడు .1845లో రెండోసారి వెళ్లి ,అక్కడే 1846ఆగస్ట్ 1 న 51వ ఏట మరణించాడు .అంతకుముందు రామమోహన రాయ్ కూడా అక్కడే చనిపోయాడు .
సంసారభారం జ్యేష్ట పుత్రుడైన దేవేంద్రునిపై పడింది . ధర్మ వీరుడు కర్మవీరుడు కనుకఏమాత్రం కలత చెందకుండా మునిలాగా మహర్షిలాగా తనకార్యకలాపాలు నిర్వహించాడు .ద్వారకానాథుడు చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసేవాడు .అందువలన అప్పులు చేయాల్సి వచ్చేది .ఆ అప్పులతో తనకు సంబంధం లేదని బాకీదార్లకు చెప్పమని బంధువులు స్నేహితులు దేవేంద్రునిపై ఒత్తిడి తెచ్చారు .కానీ దేవేంద్రుడు ధర్మ బద్ధుడు కనుక తండ్రి చేసిన రునణాలన్నిటికి తానే బాధ్యత వహిస్తానని తెలియజేయగా మూర్ఖుడు పిచ్చివాడు ఆర్ధిక న్యాయం తెలియని వాడు అని ఆక్షేపించారు .ఆ రోజు నుండి దేవేంద్రుడు బీద దరిద్ర వేషంతో గడుపుతూ అతి తక్కువవ్యయంతో సంసారం గడుపుతూ ,కొద్దికాలం లోనే తండ్రి రుణాలన్నీ అణాపైసలతో సహా తీర్చి సెభాష్ బేటా అని పించుకొన్నాడు .ఆయన సత్య ధర్మ నిష్టను మెచ్చిన భగవంతుడు ఆయనకు క్రమంగా మళ్ళీ అష్టైశ్వర్యాలను అందించాడు .
ఈసారి ధర్మ సంస్కారం ,సంఘ ఉన్నతి కార్యక్రమాలపై దేవేంద్రుడు దృష్టి పెట్టాడు .బ్రహ్మ సమాజానికి రామమోహన రాయ్ ఏర్పరచిన నియమాలు చాలాకఠినంగా ఉన్నాయని గ్రహించి దేవేంద్రుడు ,ఆయన ఆశయ ప్రచారానికి నడుం కట్టి అనేక చోట్ల బ్రహ్మ సమాజ శాఖలు స్థాపించాడు .బ్రహ్మ సామాజికులకు నియమాలను సులభంగా ఆచరించే ప్రణాళిక రూపొందించి ఎక్కువ మంది ఆకర్షితులయేట్లు చేశాడు .హిందువులతో బ్రహ్మ సమాజీయులకు భేదాలు ఏర్పడినప్పుడు తీర్చటానికి సమర్ధులైన బ్రహ్మ పండితులు లేకపోవటంతో వంగ దేశం నుంచి నలుగురు మహా పండితులను కాశీకి వేద వేదాంతాలు క్షుణ్ణంగా నేర్చుకొని రావటానికి పంపించాడు .ఒక ఏడాది వారు అక్కడ గడిపివచ్చి దేవేంద్రుడు చెప్పిన విషయాలన్నీ ధర్మ వేద సమ్మతాలే అని సప్రమాణంగా తెలియ జేశారు .దీనితో మతభేదాలు సమసిపోయాయి .ఆ నలుగురు పండితులలో ‘’వేదాంత వాగీశ ‘పట్టాన్ని పొందిన ఆనంద చంద్రుడిని దేవేంద్రనాధ ఠాకూర్ బ్రహ్మ సమాజ ఆచార్యుని చేశాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-22-ఉయ్యూరు